పత్రికలు..పాఠకులు..రచయితలు
ఒకప్పుడు పత్రికల్లోని కథలు..సీరియల్స్ కోసం పాఠకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసేవారని చెబితే ఇప్పటి తరానికి విడ్డూరంగా ఉండొచ్చు. ఛానల్ టీ వీలు, ఎఫ్ ఎం రేడియోలు తామరతంపరగా పెరిగిన ఈ రోజుల్లో అసలు చదవడం అన్నది తగ్గిపోయిందన్న అపోహలో ఉంటారు, కాని ప్రతి సంవత్సరం హైద్రాబాదు బుక్ ఫెయిర్ లో తమకు కావలసిన పుస్తకాలను పాఠకులు కట్టలు కట్టలుగా మోసుకెళ్లడం చూస్తే అలా ఆలోచించే వాళ్లకి తమ అభిప్రాయం ఎంత తప్పో అర్థమవుతుంది. ఎన్నారైలు కూడా తమవాళ్లతో పుస్తకాలు కొనిపించుకుని మనదేశానికి వచ్చి తిరిగి వెళుతున్నప్పుడు తమతో తీసుకెళుతున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో కూడా ఒక ప్రముఖ సంస్థ పెద్దల కోసం ఒకటి, పిల్లల కోసం మరోటి మాస పత్రికలు స్థాపించి విజయవంతంగా మార్కెట్ చేయగలుగుతోందంటే పాఠకులకు పుస్తకాలంటే ఎంత అభిమానం ఉందో తేట తెల్లమవుతుంది. పాఠకులకూ పత్రికలకూ ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది.
రచనలు చేయడం తమ మానసిక తృప్తికే తప్ప, వాటిని వృత్తిగా చేసుకుని బతికిన రచయితలు దాదాపు లేరనే చెప్పాలి. ప్రతి నలుగురిలో ఒక రచయిత ఉంటారని అప్పట్లో ఎవరో అన్న గుర్తు. సరైన సబ్జెక్ట్ ఎంచుకుని, కుదురైన పదాల ఎంపికతో వాక్య నిర్మాణం చేసి పత్రికలకు పంపితే, అక్కడ పరిశీలించబడి, ఎంపికవడం దగ్గర్నుంచి అచ్చులో తమ రచన, పేరు చూసుకుని మురిసిపోవడం ప్రతి రచయితకూ అనుభవైకవేద్యమే. పత్రికలో ఎంపికైందీ లేనిదీ తెలియడానికి దాదాపు మూణ్నెళ్ల నుంచి ఆర్నెళ్ల సమయం పడుతుంది. ప్రచురణ సంగతి ఇహ చెప్పనక్కరలేదు. ఇదంతా చాలా క్లిష్టమైన ప్రక్రియ. కొన్ని పత్రికలు కథలు రిజెక్ట్ అయితే సెల్ఫ్ అడ్రెస్స్డ్ కవర్లో తిప్పి పంపడం, అలాగే రచన ఎంపికైతే తెలియజేయడం, ప్రచురించిన రచనతో ఉన్న పత్రికను కాంప్లిమెంటరీ కాపీగా అందజేయడం ఇవన్నీ ఒక నిబద్ధతతో చేస్తాయి(ఇలాంటి సంస్థలు చాలా చాలా తక్కువ). మరికొన్ని ఇలాంటి విషయాల్లోచాలా ఉదాసీనంగా వ్యవహరిస్తాయి. పారీతోషికం సంగతి సరేసరి(పారితోషికం పంపే విషయంలోనూ కొంతమంది పత్రికాధిపతులు అంకిత భావంతో ఉంటారు),
రచయితలు రచనలు చేసే కొత్తలో పత్రికల్లో పేరు చూసుకుని మురిసిపోతారు గాని ఏటెళ్లగాలం అలాగే అంటే కుదరదు కదా! రచయితకూ బాదరబందీలు, ఆర్థిక బాధలు ఉంటాయి. ‘రచనలకు వినియోగించే కాలాన్ని మరే పనికి వినియోగించినా నాలుగు రాళ్లు సంపాదించుకోవచ్చు’ అన్న భావన రచయితలకు కలిగితే సమాజానికి దిశానిర్దేశం చేసే రచయిత కలం ఆగిపోవచ్చు. పత్రికాధిపతులు రచనలను ఊరకే వేయరు. ఎంపికలో చాలా కసరత్తు చేస్తారు. మరి అంత ఎక్సర్సైజ్ చేసి ఎంపిక చేసిన రచనకు పారితోషికం ఇవ్వడానికి అంత బాధెందుకో అర్థం కాదు. సాహిత్యం అనే పెద్ద పదం పక్కనబెడితే. పత్రికలు వ్యాపార ప్రక్రియలో భాగమన్నది నిర్వివాదాంశం. ‘రచయితల విషయం వచ్చేసరికి సాహిత్య సేవ, పత్రికాధిపతుల విషయంలో మాత్రం వ్యాపారం’ అన్న ధోరణి విడనాడాలి. తెలుగుభాష పతనావస్థవైపు జారిపోతూండడానికి ఇదీ ఓ కారణమే! రచయితలు ఎంతగా ప్రోత్సహించబడితే అంత మంచి రచనలు వారి మస్తిష్కాలను దాటి ఎన్నో మస్తిష్కాలకు వెలుగును పంచుతాయి.
కలం కదలకపోతే కాలం కదలదు. కలం బలం అసామాన్యం. ఆది నుంచి సమాజ పోకడకు, ఉద్యమాలకు కలాలు ఎంతో అవసరమయ్యాయి.
విచిత్రం ఏంటంటే ప్రింట్ మీడియా రచనలతో వ్యాపారం చేస్తూ పారితోషికం ఇవ్వడానికి రిక్త హస్తం చూపిస్తుంటే, కొన్ని అంతర్జాల పత్రికలు మాత్రం తమదైన రీతిలో పారితోషికాలు ఇస్తూ రచయితలను ఎంకరేజ్ చేస్తున్నాయి. ఎటువంటి వ్యాపార దృక్పథం లేని గోతెలుగు పత్రిక ప్రారంభ సంచిక నుంచి ఇప్పటిదాకా ప్రచురించిన ప్రతి రచనకు పారితోషికం నగదు రూపంలో ఇస్తోంది. అచ్చంగతెలుగు మంచి మంచి పుస్తకాలను బహూకరిస్తోంది. అక్షర, మాలిక, కెనడ తెలుగుతల్లి లాంటి పత్రికలూ పోటీలు పెట్టి బహుమతులు ఇస్తున్నాయి. వీటిలోనూ కొన్ని లబ్ద ప్రతిష్ఠ పత్రికలు..పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా.. పారితోషికాల విషయంలో రచయితలను అంతగా ప్రోత్సహించడం లేదన్నది సాహిత్య జగమెరిగిన సత్యం.
కొసమెరుపు: చాలా ఏళ్ల కిందటిమాట. చాలా పత్రికలు రచనలు వేయడం తప్ప, అసలు పారితోషికం పంపేవారు కాదు. నేను బాలభారతిలో జోక్స్ రాసేవాణ్ని. ప్రచురించిన ప్రతి జోక్కు ఐదు రూపాయలు (అప్పట్లో అది ఎక్కువే)పారితోషికం పంపేవారు. కొంతకాలం తర్వాత ఆగిపోయింది. ఓహో వీళ్లూ పారితోషికం ఇవ్వని పత్రికల దారి పట్టారన్నమాట! మనసులో అనుకున్నాను అయినా జోక్స్ పంపుతుండేవాణ్ని. సుమారు రెండేళ్ల కాలం తర్వాత ఎడిటర్ గారి ఉత్తరంతో ఒక చెక్ అందింది. అందులో ‘తను అనారోగ్యంతో చాలా సతమతమయ్యానని, కొన్నాళ్లు మంచం పట్టానని, ఇప్పుడు కొద్దిగా కోలుకోంగానే రచయితలకు డబ్బులు పంతున్నానని, దయచేసి స్వీకరించవలసింద’ని కోరుతూ సాగిందా ఉత్తరం. నా కళ్లలో నీళ్లు నిలిచాయి. ఆయన నిబద్ధత ఇప్పటికీ కళ్లు చెమర్చేలా చేస్తుంది.
పత్రిక పెట్టంగానే సరిగాదు. పుత్రికలా చూసుకోవాలి. రచయితలను మనసుతో (ఆ)కట్టేసుకోవాలి. అప్పుడే పత్రిక చరిత్రలో స్థానం సంపాదిస్తుంది. వేనోళ్ల కొనియాడబడుతుంది.
***
|