Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
betala prashna

ఈ సంచికలో >> శీర్షికలు >>

తమిళనాడు తీర్థయాత్రలు / విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

( కాంచీపురం లోని శైవ క్షేత్రాలు )

శివకంచినే ప్రస్తుతం కాంచీపురం అని అంటారు .

కాంచీపురంలో శైవమందిరాలగురించి తెలుసుకునే ముందు శైవం గురించి కాస్త అంటే ముఖ్యంగా నా వ్యాసాలలో వచ్చే కొన్నింటిని గురించి తెలుసుకుందాం . శివ కోవెలలో అర్చనలు నిర్వహించే అర్చకులను శివాచార్యులని అంటారు , అలాగే విష్ణుమందిరాలలో  ఆళ్వారుల విగ్రహాలు వున్నట్లు శివకోవెలలో ‘ నాయనార్ల ‘ విగ్రహాలు వుంటాయి . ఈ నాయనార్ల పరమశివభక్తులు , వారి జీతమంతా శివ సన్నిధిలో గడిపి , శివునిపై అనేక కావ్యాలు రాసినవారు , శివుని దర్శన భాగ్యం పొందినవారు , వీరు మొత్తం అరవై ముగ్గురు . తమిళనాడు మందిరాలను గురించి చర్చించుకొనేటప్పుడు యీ ‘ నాయనార్ల ‘ గురించిన ప్రస్తావన వస్తూవుంటుంది . వీరు సుమారు 9 వ శతాబ్దం నుంచి సుమారు 13 వ శతాబ్దం వరకు వున్నట్లుగా తెలుస్తోంది .

అలాగే  పాదల్ పేత్ర స్థలాలు 275 గా నాయనార్లువర్ణించేరు . వాటిలో 265 తమిళనాడుల వున్నట్లు 2 తెలుగు జిల్లాలలోనూ , 1 కేరళలోనూ , 1 కర్నాటక లోనూ , 2  ఉత్తరాఖండ లోనూ , 2 శ్రీలంకలోనూ , 1 నేపాలులోనూ ఆఖరుది కైలాశపర్వతం గా నాయనార్లు వర్ణించేరు .    కాంచీపురంలో లెక్కకు మించి చిన్నా పెద్దా మందిరాలు వున్నాయి . కొంతమంది ఔత్సాహికులు కాంచీపురంలో  పదికిలోమీటర్ల పరిధిలో వున్న శివమందిరాలను 108 గా లెక్క పెట్టేరు . ఆపైనవున్న వాటిని లెక్కించ లేకపోయేరు .

ప్రతీ వీధిలోనూ ఒకటికి మించి మందిరాలు వుండడం గమనించవచ్చు . సాధారణంగా ఈ మందిరాలపేరులోనే వాటిని నిర్మించిన వారి పేరు వుండడం కనిపిస్తుంది .

ఈ మందిరాలను చూడాలనుకునేవారు ఓ పదిరోజులు కాంచీపురంలో మకాం వేసినా పూర్తి కావేమో ? .

మనం ముఖ్యమైన పురాతన మందిరాలను గురించి చెప్పుకుందాం .

ముందుగా మనం పంచబూతలింగమైన ఏకాంబరేశ్వర మందిరం గురించి చెప్పుకుందాం . దీనిని పృధ్వీ లింగమని అంటారు .      ఏకాంబరేశ్వరమందిరం కామాక్షి అమ్మవారికోవెలకి ఆనుకొని వుంటుంది , ముఖ్యద్వారం పక్కవీథిలో వుంటుంది . అక్కడకి చేరుకోవాలంటే నాలుగు వీధులు దాటి వెళ్లాలి లేకపోతే కైలాశ్ నాథ్ కోవెలలోంచి కూడా వెళ్లొచ్చు . స్థానికుల ప్రకారం కైలాశ్ నాథ్ మందిరం లోంచి వెళితే త్వరగా వెళ్లొచ్చు అంటారు కాని నాకు మాత్రం కోవెలలోంచి కోవెలకు ఓ కిలోమీటర్లు పైనే దూరం వుండొచ్చని అనిపించింది , అదీ కాక జోళ్లులేని కాళ్లతో కంకర , రాతి నేలల మీద నడవడం అంత సుఖంగా కూడా వుండదని అనిపించింది . రోడ్డుమీంచి అయితే యే ఆటోలోని చేరుకోవచ్చు అని అనిపించింది . ఈ వ్యాసం రాస్తున్నప్పుడు యీ మందిరం యొక్క కొలతలు తెలుసుకుంటే ఒక కిలోమీటరు కాదు యింక యెక్కువే నడిచామని తెలిసింది .

సుమారు 25 యెకరాల విస్తీర్ణంలో యీ మందిర నిర్మాణం జరిగింది . ముఖ్య గోపురం 194 అడుగుల యెత్తులో 11 అంతస్థులలో నిర్మింపబడింది . మిగతా గోపురాలు సుమారు 180 అడుగుల యెత్తులో నిర్మించేరు . చరిత్ర కు దొరికిన ఆధారాల ప్రకారం తొమ్మిదవ శతాబ్దంలో పల్లవులచే ఈ మందిరం నిర్మింబడింది . తరువాత రాజ్యానికి వచ్చిన చోళులు , విజయనగర రాజులు యీ మందిరానికి చాలా మాన్యాలిచ్చి , కొత్తకట్టడాలను నిర్మించేరు . 

ప్రధాన ద్వారం లోంచి లోపలకు వెళ్లగానే చొరో పక్కా వినాయకుడు , కుమారస్వామి మందిరాలు వుంటాయి . తరువాత పెద్దపెద్ద మంటపాలు రెండువుంటాయి , ఒకటి వాహనమంటపము , రెండవది ‘ సరబేస ( శర నవరాత్రుల) మండపం . వాహన మండపంలో వెండి నంది , మయూరం , వెండి రధం మొదలయినవి వున్నాయి . ఇంకా ముందుకు అంటే గర్భగుడి వైపుగా వెళ్తే ‘ అయిరామ కాల మంటపం ‘ అంటే వెయ్యి స్థంభాల మంటపం వస్తుంది , దీనిని విజయనగర రాజులు కట్టించేరు . నాలుగవ ప్రాకారంలో కొలనులో వున్న వినాయకుడిని చూడొచ్చు . మూడవ ప్రాకారంలో చిన్నచిన్న మందిరాలు , గర్భగుడిలోకి ప్రవేశద్వారం , పుష్కరిణి , ‘ తిరుకచ్చి మయనం ‘ , ‘ కళ్యాణ మంటపాలు ‘ వున్నాయి . గర్భగుడికి నాలుగు వైపులా ‘ తిరుకచ్చి మయనం ‘ , ‘ వలీసం ’ , ‘ ఋషబేశ ‘ , ‘ సత్యవనీసం ‘ వున్నాయి . గర్భగుడి స్థంభాలపై శివుని అవతారాలను చూడొచ్చు . స్థంబాలపైని శిల్పకళ కళ్లు తిప్పుకోనివ్వదు . 63 నాయనార్ల విగ్రహాలను యిక్కడ చూడొచ్చు . మందిరంలో యెన్నో శివలింగాలు వరుసగా ప్రష్టించి వుంటాయి , అందులో 1008 లింగాలు ఒకే లింగంలో చెక్కిన లింగం చూడదగ్గది .గర్భగుడిలో శివలింగం శివుని విగ్రహం రెండు వుంటాయి . ఈ కోవెలలో అమ్మవారికి మందిరం లేదు . ఏకాంబరేశ్వరుడు కామాక్షి అమ్మవారికోసం వచ్చేడు కాబట్టి కామాక్షి దేవియే అతని ధర్మపత్ని అంటారు అందుకే అమ్మవారికి యిక్కడ మందిరం లేదని అంటారు .     ఈ మందిరంలో స్థలపురాణానికి సంబంధించిన కధనం తెలియజేసే విగ్రహాలు కోవెల గోడలమీద వున్నాయి .

ఇక్కడ వున్న ఉప మందిరాలలో ఒకటైన ‘ తింగళ్ తుండధన్ పెరుమాళ్ ‘ వైష్ణవుల 108 దివ్యదేశాలలో వొకటి వుంది . ఈ మందిరంలో దీపధూప నైవేద్యాలు శివాచారులే జరపడం ఓ విశేషమనే చెప్పుకోవాలి .

ఈ కోవెలలో రోజూ ఆరు నిత్య పూజలు , సోమవారం , శుక్రవారం జరిపే వారపూజలు , ప్రదోషం , అమావాస్యలకు జరిపే పక్ష పూజలేకాక ప్రతీ సంవత్సరం ఆరు ఉత్సవాలు నిర్వహిస్తారు , అందులో తమిళ ఫాల్గుణ మాసం అంటే యించుమించుగా మార్చి 15 నుండి ఏప్రెల్ 15 లోపల జరిపే పదిరోజుల ఉత్సవాలు చాలా ప్రసిధ్ద పొందేయి .

ముఖ్యంగా అయిదవ రోజున ప్రొద్దుట స్వామివారిని వెండినంది వాహనం మీద సాయంత్రం రావణవాహనం మీద ఊరేగిస్తారు . ఆరవ రోజున 63 నాయనార్లను వూరేగిస్తారు , సాయంత్రం వెండి రథం మీద స్వామిని ఊరేగిస్తారు . తొమ్మిదవరోజున ‘ మావడి సేవ ‘ జరుపుతారు . పదవరోజున స్వామి వారి కళ్యాణం చేస్తారు . ఆరోజున దేశం నలుమూలల నుంచి వందల సంఖ్యలో వచ్చిన వధూవరులు అదే ముహూర్తంలో దండలు మార్చుకొని వివాహం చేసుకుంటారు . ఈ వేడుక చాలా విశేషంగా జరుగుతుంది , యిది చూడడానికి వేలసంఖ్యలో భక్తులు తరలి వస్తారు .

ఇక స్థలపురాణం తెలుసుకుందాం .

శివుని కోపానికి గురైన పార్వతి కైలాస ప్రవేశం పోగొట్టుకొని భూలోకం చేరుతుంది . శివుని తిరిగి పొందాలనే వాంఛతో విష్ణుమూర్తిని విముక్తి మార్గం చెప్పమని కోరగా విష్ణమూర్తి శివుని కై తపస్సాచరించమని చెప్తాడు . పార్వతీ దేవి కాంచీపురంలో ఓ మామిడి చెట్టుకింద అక్కడ వున్న మన్నుతో శివలింగాన్ని చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఘోర తపస్సాచరిస్తుంది . పార్వతీదేవి తపస్సుతో ముల్లోకాలు కల్లోలమవసాగేయి , శివుడు పార్వతీ దేవి తపస్సును భంగ పరిచేందుకు అగ్నిని పంపి మామిడి చెట్టును దగ్దం చెయ్యమని కోరుతాడు . శివునాజ్ఞతో వచ్చిన అగ్ని మామిడి చెట్టును దహిస్తూ వుండగా పార్వతీ దేవి విష్ణుమూర్తి సహయం కోరుతుంది . విష్ణుమూర్తి శివుని శరశ్సుపైనున్న చంద్రవంకను తెచ్చి అగ్నిని చల్లారుస్తాడు . అందుకే యీ కోవెలలో వున్న ‘ తింగళ్ తుండధన్ పెరుమాళ్ ‘ మందిర ప్రాంతం లోనే విష్ణుమూర్తి శివుని శిరశ్సునుంచి చంద్రుడిని తెచ్చి అగ్నిని చల్లార్చేడని అంటారు . 

పార్వతీదేవి తపస్సు భంగం చెయ్యడానికి శివుడు గంగను పంపగా పార్వతీదేవి పరిపరి విధాలుగా గంగను శాంతపరచడానికి ప్రయత్నిస్తుంది , కాని గంగ పార్వతీదేవి మాటలను చెవిన పెట్టక వేగావతి నదిలో కలిసి ప్రవాహాన్ని వుదృతపరచగా మన్నుతోచేసిన లింగం కరిగిపోతుందనే భయంతో లింగాన్ని కౌగలించుకుంటుంది . పార్వతీదేవి స్పర్శ తగలగానే శివుడు పార్వతి ముందు ప్రత్యక్షమై ఆమెను శాపవిముక్తను చేస్తాడు . పార్వతీ దేవికోసం పరమశివుడు ప్రత్యక్షమైనప్రదేశం యిది .

తరువాతి కాలంలో 63 నాయనార్లలో ఒక నాయనారు వృత్తిరీత్యా రజకుడు . ఊరివాళ్ళ బట్టలు వుతికి ఆరవేస్తూ వారించిన దానితో జీవనం సాగిస్తూ వుంటాడు . సర్వావస్తలలోనూ అతను శివనామ స్మరణ చేస్తూ వుండడంతో ఓ నాడు శివుడు అతనిని పరీక్షింప నిశ్చయించుకొని వృధ్ద శివాచారి రూపంలో వచ్చి తన మురికి బట్టలు సూర్యాస్తమయ సమయానికి యివ్వాలనే షరతుమీద శుభ్రపరిచేందుకు యిస్తాడు . రజకుడు శివనామం లో మునిగి సమయం యెంతగడచినదీ గమనించడు . శివుడు మాయమబ్బులచే సూర్యుని మూసివేస్తాడు .

రజకుడు సూర్యాస్తమయమైందని శివాచార్యులకు యిచ్చిన మాట నిలబెట్టుకోలేక పోయినందుకు చింతించి తలను రాతికి బాదుకున ప్రాణాలు విడవాలని తలచి తలను రాతికోసి కొట్టుకోగా శివుడు ప్రత్యక్షమై అతనిని కరుణిస్తాడు . రజకుడు శివుని గురించిన యెన్నో తమిళ ప్రబంధాలు రచించి నాయనార్లలో ఒకనిగా కీర్తి పొందేడు .

 

           చెన్నైకు చెందిన పచ్చియప్ప మొదిలియార్ అనే వ్యాపార వేత్త యేకాంబరేశ్వరునికి పరమభక్తుడు , అతను చెన్నై నుంచి వచ్చి యీ మందిరంలో కాలంగడుపుతూ వుండేవాడట , యితను కూడా యీ మందిరంలో యెన్నో మరమ్మత్తులు మంటపాలు కట్టించేడట , అతని జ్ఞాపకార్దం గుర్రంపై స్వారీ చేస్తున్న పచ్చియప్పన్ విగ్రహాన్ని మందిరంలోని స్థంభం పై చూడొచ్చు .  1905 ప్రాంతం లో ‘ నట్టుకొట్టి చెట్టియార్ ‘ దక్షిణాన వున్న 16 స్థంబాల మంటపాన్ని నిర్మించేడు .

            ఏకాంబరేశ్వరునికి నిర్వహించే అభిషేకాదులు శివలింగం వున్న గట్టుకి నిర్వహిస్తారు , యెందుకంటే శివలింగం మన్ను తో చేసినది కావడం వల్ల . 

     2) కైలాశనాధ మందిరం

             ఇంతవరకు మనం తెలుసుకున్న మందిరాలు అన్నీ ఒక యెత్తైతే యీ కైలాశమందిరం ఒకయెత్తు . ఇలాంటి మందిరాన్ని యింతవరకు మరెక్కడా నేను చూడలేదు .

         ఈ మందిరం చరిత్ర ప్రకారం సుమారు క్రీస్తుశకం 670 ప్రాంతాలలో కాంచీపురాన్ని పరిపాలించిన నరసింహవర్మ -1 చే నిర్మింపబడింది . ద్రవిడ శిల్పకళతో నిర్మింపబడింది . మందిర విమానగోపురం తంజావూరులోని ‘ బృహదీశ్వరాలయాన్ని గుర్తుకు తెస్తుంది . శిల్పులు బృహధీశ్వరాలయాన్ని దృష్టిలో పెట్టుకొని చెక్కినట్లు కనబడుతుంది . సాధారణంగా ప్రహారీ గోడ మందిరం చుట్టూ వుండడం చూస్తాం కాని యీ మందిరానికి ప్రహారీగోడగా చిన్నచిన్న మందిరాలు వుండడం కనిపిస్తుంది . ఇవి మొత్తం 58 మందిరాలు వున్నాయి . ఈ మందిరాలు శిల్పకళలోని శాల , కూట , పంజర విభాగాలను వుపయోగించి కట్టేరు . ఈ మందిరాలలో పార్వతీ పరమేశ్వరులు నాట్యభంగిమలలో కనిపిస్తారు . 

         ఈ మందిరం పునాది రాతితో కట్టినా లోపల మందిరం , శిల్పాలు అన్నీ యిసుక రాతి నిర్మాణాలు .

           ఈ మందిర స్మార్త సాంప్రదాయం లో నిర్మించేరు , దీనిని పంచాయతన మందిరం అని కూడా అంటారు . గర్భ గుడిలో శివలింగం తో పాటు పార్వతీదేవి , సూర్యుడు , విష్ణుమూర్తి , వినాయకుడు , కుమారస్వామి వుంటే దానిని పంచాయతన మందిరం అని అంటారు . 

         గర్భగుడిలో శివలింగం 16 ముఖాలతో వుంటుంది . పాదభంద అధిష్టానంలో వివిధ దేవతామూర్తులు నంది విగ్రహాలు వుంటాయ .గర్భగుడికి దక్షిణ గోడకి లింగోదభవం , దానిని వీక్షిస్తున్న విష్ణుమూర్తి , బ్రహ్మ , దేవతలు , ఉమా మహేశ్వరుల విగ్రహాలు చెక్కబడ్డాయి . పడమట వైపున సంధ్య తాండవ మూర్తి , ఉద్ధవ తాండవ మూర్తి , గణాలు , బ్రహ్మ , విష్ణు , పార్వతి , నంది విగ్రహాలు చెక్కబడ్డాయి . ఉత్తరాన వున్న గోడకి త్రిపురాంతక మూర్తి మూడు గణాలతో కూడి , దుర్గాదేవి మూడు గణాలతో , భైరవ దేవి , కౌశిక , జ్యేష్టాదేవిల విగ్రహాలను చూడొచ్చు . విమాన గోపురం మీద శివుని భిక్షాటన , సోమసుందర సంహార తాండవరూపాలలో దర్శమిస్తాడు . 

        కైలాశనాథ మందిరం గురించిన మిగతా వివరాలు వచ్చే సంచికలో చదువుదాం , అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
weekly horoscopeaugust 17th to august 23rd