Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscopeaugust 17th to august 23rd

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

మనిషి సరీగ్గా చూడాలంటే కళ్ళు ముఖ్యం అంటారు..అలాగని మిగిలినవి అవసరం లేదనికాదు. దేని  importance  దానిదే.. ఒకానొకప్పుడు ఆడపిల్లలకి పెళ్ళిచేయాలంటే, ఆ పిల్ల కళ్ళజోడు వాడుతూంటే అంతగా సంబంధాలు వచ్చేవి కావు.. ఏదైనా దృష్టిలోపం ఉందేమో అనే భయంతో. అందుకనే ఏమో ఆరోజుల్లో, దృష్టి మాటెలా ఉన్నా, ఓ వయసొచ్చేదాకా కళ్ళజోళ్ళు కనిపించేవి కావు.
మరీ అంత అత్యవసరమైనా ఏ  contact lense  లాటిదో వాడేవారు.. పనికి పనీ అవుతుందీ, వీధినా పడక్కర్లేదు.  ఒకానొకప్పుడు, కళ్ళజోడొచ్చిందంటే, ఏదో “ అతి మేధావి “ ( intellectual touch )అనుకునేవారు.

ఏ కంటి ఆపరేషనో జరిగితే, మరీ ఎక్కువ వెలుగు చూడకూడదని నల్లద్దాల కళ్ళజోళ్ళు వాడేవారు… కొంతమంది ప్రముఖ జాతీయనాయకులు—రాజగోపాలాచారి,  కరుణానిధి లాటివారిని, వారు నిత్యం వాడే  నల్లద్దాల ధర్మమా అనే గుర్తిస్తారు. అలాగే నల్లకళ్ళద్దాలు పెట్టుకునే వారికి చేతిలో ఓ కర్ర కూడా ఉందంటే, ఆవ్యక్తికి రోడ్డుమీద ఎవరో ఒకరు సహాయం చేయడం ఇప్పటికీ చూస్తూంటాం… చెప్పొచ్చేదేమిటంటే ఈ నల్లకళ్ళద్దాలకి చరిత్రలో ఓ ఉన్నతమైన స్థాయి ఉంది.

అలాగే దేశంలో ప్రముఖ వ్యక్తుల పక్కనా, వెనక్కాలా వెళ్ళే సెక్యూరిటీ వారు కూడా ఈ నల్లకళ్ళద్దాలధారులే…. వారు ఏం చూస్తున్నారో, ఎవరిమీద నిఘా పెట్టారో ఛస్తే తెలియదు. అలాగే సంఘంలో గొప్పవారు, ఎవరైనా మరణిస్తే, వారిని పరామర్శించడానికి వచ్చినవారి ముఖాలమీదా వీటిని చూస్తూంటాం.. అధవా కన్నీళ్ళు పెట్టుకున్నా ఎవరికీ కనిపించకుండా ఉండడానికై ఉంటుంది… అలాగే సినిమాల్లో చూపించే మాఫియా డాన్లకీ, విలన్లకీ కూడా, ఈ నల్లకళ్ళద్దాలే ఓ గుర్తింపు… అంత కథుంది ఈ నల్లకళ్ళద్దాల వెనక్కాల.

ఎప్పుడు వచ్చిందో కానీ ప్రపంచంలో ఓ పెద్ద మార్పు.. ఓ వరసావావీ లేకుండా, ఎవణ్ణి చూసినా ఈ నల్లకళ్ళద్దాలతోనే—ఒకానొకప్పుడు పగలు మాత్రమే వాడే వీటిని, చీకటి పడ్డ తరవాతకూడా వాడడం ఓ ఫాషనైపోయింది…ఉదాహరణకి   Cricket  తీసుకోండి—అప్పుడెప్పుడో  ఆస్ట్రేలియా కెప్టెన్ మైదానంలో నల్లకళ్ళజోడు పెట్టుకుని ఆడ్డం చూడ్డం తరవాయి, ప్రపంచంలో   Cricket  ఆడేప్రతీవాడూ మొదలెట్టేసాడు… పగటిపూట సరేసరి, ఆ  Day/Night matches  లోకూడా ఇదేరంధి..

అందుకేనేమో కొన్నిసార్లు  catches  పట్టడం కుదరదు. వారికి దృష్తిలోపం ఉందని కాదు, కానీ ఈ నల్లకళ్ళద్దాలు అడ్డొస్తాయేమో. ఏది ఏమైనా ఈరోజుల్లో Cricket  లో ప్రతీ ఆటగాడూ, ఓ గెడ్డం, జుట్టుపోలిగాడిలా బారెడు జుట్టూ, కళ్ళకి నల్లద్దాలూనూ…

వాళ్ళెవరో వాడుతున్నారని, ప్రతీవాడూ  ఈరోజుల్లో నల్లకళ్ళద్దాలే.. చిత్రం ఏమిటంటే అవి రోడ్డుపక్కనుండే ఫుట్ పాత్ లమీదా దొరుకుతాయి, పెద్దపెద్ద  Brands  కూడా ఉంటాయి.. ఎవడి తలరాతనుబట్టి వాడు కొనుక్కుంటాడు… గమనించేఉంటారు, దురదృష్టవశాత్తూ, ఎవరో  visually challenged  ( అంధత్వం ) గా ఉన్నవారు, నల్లకళ్ళద్దాలతో, చేతిలో  ఒక మడతపెట్టిన కర్రతో , రోడ్డుదాటాలని ప్రయత్నించినప్పుడు , ఎవరో ఒకరు సహాయం చేస్తూంటారు. ఈరోజుల్లో నల్లకళ్ళద్దాలతో తిరుగుతూండేవారు, వర్షాకాలమైనా, వేసంకాలమైనా సరే కనిపిస్తూంటారు. ఎవడో, చేతిలో ఓ గొడుగుపెట్టుకుని నడుస్తూన్నా, వీళ్ళని కూడా చెయ్యిపట్టుకుని రోడ్డు దాటించడం ఖాయం.. ఇదేదో ఎగతాళిచేయడానికి కాదు రాస్తూంట, ఉన్నమాటేదో చెప్పాను.

ఈ  ఫాషను చివరకి చిన్నపిల్లలకికూడా అలవాటు చేస్తున్నారు, అదేదో   status symbol  అనుకుని. కళ్ళకి ఏదైనా అంటురోగం లాటిది ఏ కళ్ళకలకో, లేకపోతే ఇంకోటేదో వచ్చినప్పుడు చూస్తూంటాం – అవతలివారికి అంటుకోకూడదని , ఓ నల్లద్దాల కళ్ళజోడు పెట్టుకుని.  ఒకలా తీసుకుంటే, నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని, ప్రముఖులని ఆహ్వానించడం , ఓ తప్పుగా భావిస్తూంటారు.. గుర్తుండే ఉంటుంది, అప్పుడెప్పుడో ఓ  I A S  Officer,  నల్లకళ్ళద్దాలతో ఆయనెవరో  ఓ పెద్ద  V I P  కి స్వాగతం చెప్పాడని, ఆయనమీద నానా గొడవా అయింది...
 ఇంక వీళ్ళుకాకుండా కొంతమందిని చూస్తూంటాం – రోడ్లమీద, స్కూటరో,  బైక్కో నడిపేవాళ్ళు,  అదీ  night time  లో, ఆ బండికి లైటులేకుండా, కళ్ళకి నల్లద్దాల కళ్ళజోళ్ళతో … మరి అలాటప్పుడు రోడ్లు దాటేటప్పుడు నడిచేవాళ్ళకి  accidents  అయాయంటే అవవు మరీ ?
 ఊరికే నల్లకళ్ళద్దాలు పెట్టుకుంటే గొప్పవారైపోరు… అంతా ఒఠ్ఠి భ్రమ…

సర్వేజనా సుఖినోభవంతూ ….

మరిన్ని శీర్షికలు
kanakadharastotram