ఒకానొకప్పుడు నెలసరి జీతాల్లాటివుంటేనే సంసారాలు నడపగలరనుకునేవాళ్ళం. ఉద్యోగం పురుష లక్షణం అనేవారు. ఆరోజుల్లో, చదువెంతైనా ఉండనీయండి, ఆస్థి ఎంతైనా ఉండనీయండి, ఉద్యోగమనేది లేకపోతే, పెళ్ళి సంబంధాలు కూడా వచ్చేవి కాదు. వ్యాపారాలైతే ఆదాయం అంతా దైవాధీనంగా ఉంటుందీ, అదే ఏ ఉద్యోగమైనా అయితే, నెల తిరిగేసరికి జీతంలాటిది చేతికొస్తుందనయుండొచ్చు. పైగా ప్రభుత్వోద్యోగాలైతే, పెన్షను కూడా వస్తుందనో భరోసా… వ్యాపారాలమాటెటున్నా, ప్రత్యేక వృత్తుల్లో అంటే డాక్టర్లూ, లాయర్లూ లాటివారున్నారూ, కానీ వాటిలో కొంత వెనక్కాల ఆస్థిపాస్థులుండడం ముఖ్యం… రోగాలూ, కోర్టువ్యవహారాలూ ఏడాదంతా ఉండవుగా… ఒకలా చెప్పాలంటే వీటిమీద ఆదాయంకూడా గాలివాటుగానే. అలాగే చిన్నచిన్న వృత్తుల్లో ఉండేవారి పరిస్థితి కూదా అలాగే ఉండేది. అందుకే చదువవగానే, ఏదో ఒక ఉద్యోగంలో చేరడమే పరమావధిగా ఉండేది… కానీ అవన్నీ పాతరోజులూ, పాత అభిప్రాయాలూనూ..
ఈరోజుల్లో అసలు ఏదో ఒక కళలో ప్రావీణ్యం సంపాదించాలే కానీ, డబ్బు సంపాదనకి లోటేమీ లేదు. ఒకానొకప్పుడు పౌరోహిత్యం నేర్చుకున్నవారు మహ అయితే, ఊళ్ళో ఉండే ఏ గుడిలోనో పూజారిగానో, ఊళ్ళోవారందరికీ ఇంటి పురోహితుడిగానో ఉండాల్సొచ్చేది. కానీ ఈరోజుల్లోనో, దేశవిదేశాల్లో ఉండే దేవాలయాల్లో పూజా పునస్కారాలు చేయిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. అందుకే, వేద పాఠశాలల్లో ఆగమన శాస్త్రాలు నేర్చుకోడానికి కూడా చాలామంది మొగ్గు చూపుతున్నారు..
ఒకానొకప్పుడు కులవృత్తులకి ఎంతో ప్రాముఖ్యం ఉండేది… కాలక్రమేణా వాటికి ఆదరణ తగ్గడంతో, చాలామంది, ఉపాధికోసం, గ్రామాలు వదిలి, పట్టణాలవైపు రావడం మొదలెట్టారు… చిత్రం ఏమిటంటే, పట్టణాల్లోనూ, మహానగరాల్లోనూ, వీళ్ళకి వారివారి కులవృత్తులకి ఆదరణ లభించడం… ఈరోజుల్లో ప్రతీ విద్యకీ ఓ గుర్తింపు లభిస్తోందనడంలో సందేహం లేదు… తనకొచ్చిన విద్యని సరైన మార్గంలో ఉపయోగించుకోగలిగితే సంపాదనకేమీ లోటుండడం లేదు ఈ రోజుల్లో… అలా ఉపయోగించుకోడమనేదే తెలియాలి.. వాటిలో Training ఇవ్వడానిక్కూడా ఈ రోజుల్లో రకరకాల ఏజన్సీలూ, Consultants కూడా కోకొల్లలు… ఉదాహరణకి ఇదివరకటి రోజుల్లో, పిల్లకో పిల్లాడికో పెళ్ళిచేయాలంటే , ఏ తెలిసినవారి ద్వారానో, లేదా ఏ పెళ్ళిళ్ళపేరయ్యనో అడగాల్సొచ్చేది. కానీ ఈ రోజుల్లో, TV లో వివిధరకాల సంస్థలూ దర్శనమిస్తున్నాయి.. పైగా ఇంట్లో కూర్చుని online లోనే నిర్ణయించుకునే సదుపాయం కూడానూ.. చెప్పులరిగేలా తిరగాల్సిన అవసరంకూడా లేదు.
అలాగే , మనకి అవసరమైన చిన్న చిన్న రిపేరీలకి కావాల్సిన వడ్రంగులూ, ప్లంబర్లూ, ఎలెక్ట్రీషియన్లూ.. అలా ఎవరు కావల్సొస్తే వారికోసం , ఓ నెంబరుకి ఫోనుచేస్తే, పనైపోతోంది ఈరోజుల్లో. కారణం—ఇలాటివారందరికీ ఉపాధి కలిపించడానికి , ఎవడో ఒకడు ఓ ఏజెన్సీ మొదలెట్టడం… ఇవే కాకుండా ఇళ్ళల్లో ఉండే Electronic Item ల కంపెనీలవాళ్ళకి Servce Centres అని ఉండడంతో, ఆ పని నేర్చుకున్న ప్రతీవారికీ, ఏదో ఒక కంపెనీలో , పని దొరుకుతోంది…అంతదాకా ఎందుకూ, ఒకానొకప్పుడు ఊళ్ళో కొంతమందే వంటలు చేయడం వచ్చేవారే ఉండేవారు, కానీ ఈరోజుల్లో హొటల్ ఎండ్ క్యాటరింగ్ లలో ప్రత్యేకంగా డిగ్రీలు తెచ్చుకుని, ఫైవ్ స్టార్ హొటళ్ళలో లక్షల్లో జీతాలు తెచ్చుకునేవారెందరో. అలాగే, చాలా చోట్ల “ కర్రీ పాయింట్ల “ పేరుతో , రోజూ భోజనంలోకి అవసరమైన కూర, పప్పు, పులుసు లలాటివి తెచ్చేసుకుంటే, హాయిగా ఇంట్లో వీటిని తయారుచేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధంగా, చేతిలో అసలంటూ ఏదైనా విద్య ఉంటే, వారికి ఎలాగోలాగ ఉపాధి దొరుకుతోందే. అలాగే ఈ రోజుల్లో పాటలు పాడడం వచ్చిన చిన్న, పెద్ద గాయకులకి కూడా ప్రోత్సాహం లభిస్తోంది.
ఇంకో చిత్రమేమిటంటే, దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూల్స్ లో చదివిన చాలామంది, ఓ పదేళ్ళపాటు, ఏ ప్రముఖ కంపెనీల్లోనో పనిచేసి, డబ్బు కూడబెట్టి , ఆ తరవాత, ఈ అనుభవంతో స్వంత కన్సల్టెన్సీలు ప్రారంభించేయడం.
ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే, అలనాటి “ ఉద్యోగం పురుష/ స్త్రీ లక్షణం “ అన్న నానుడి మారిపోయింది. ఈ రోజుల్లో ప్రభుత్వం లోనో, ప్రెవేటు కంపెనీలోనో నౌకరీ చేయడమే ఓ పరమావధిగా పెట్టుకోవడం లేదు. పైగా వీటిలో రిటైర్మెంటనేది కూడా లేదు. ఓపికున్నంత కాలం చేసుకోవడమే… దీనివలన తమ పిల్లల ఆలనా పాలనా తామే స్వంతంగా చూసుకోవడం. వీటికి సాయం Work from Home ద్వారా కూడా, బాగానే సంపాదించగలుగుతున్నారు…
సర్వేజనా సుఖినోభవంతూ…
|