Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
varalakshmi vrata vidhanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

నేనూ నా బాస్ లు! - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

I'm also my boss!

నా నలభై ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఎంతోమంది బాస్ లతో పని చేశాను. కొంతమంది పనిలో మెళకువలు నేర్పి నన్ను చిత్రిక పడితే, మరికొంతమంది తమ శాడిజంతో పని మీద విసుగు చిరాకు కలిగేలా చేశారు. ఏదేమైనా బాస్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అని ప్రవర్తించేవాడిని. అందుచేత నేను వారికి ప్రియమైన ఉద్యోగిగానే పేరు తెచ్చుకున్నాను.

మొదట్లో ఎమ్ ఎస్ రావ్ అనే బాస్ (జీ ఎం)తో పనిచేశాను. ఆయనదో ప్రత్యేకమైన  శైలి. ఒకసారి నాకో పని చెప్పారు. ఇప్పుడంటే ప్రతి డిపార్ట్ మెంట్ లో ప్రతి వ్యక్తి దగ్గరా కంప్యూటర్ ఉంటోంది కాని అప్పట్లో నాలుగొందల మంది ఉద్యోగులు, పదిహేను సెక్షన్లు ఉన్న మా సంస్థలో నాలుగంటే నాలుగు కంప్యూటర్లు ఉండేవి. ఒకసారి ఆయన నన్ను పిలిచి నాకో వర్క్ అప్పగించి, సాయంత్రం అయిదుకల్లా (మా ఆఫీసు టైం అప్పటిదాకానే!) కంప్యూటర్లో ఎంటర్ చేసి ప్రింటు తీసి చూపించమన్నారు. నేను ఆ నాలుగు కంప్యూటర్ల దగ్గరకు వెళ్లి చూశాను. అన్నీ బిజీగానే ఉన్నాయి. ‘హమ్మయ్యా ఇవాళ్టికి ఇంక అవదు, రేపు చూసుకోవచ్చు’ అని వర్క్ వాయిదా వేశాను.

సరిగ్గా అయిదు గంటలకు ఇంటికెళదామని సెక్యూరిటీ గేట్ దగ్గరకు చేరగానే రావ్ గారు అక్కడున్న సెక్యూరిటీకి ఫోన్ చేసి నన్ను లైన్ లోకి తీసుకుని నన్ను తన క్యాబిన్ లోకి రమ్మన్నారు. నేను ‘హతోస్మి’ అనుకుని వెళ్లాను.

"నేనిచ్చిన డాటాని ఎంటర్ చేసి ప్రింట్ తీసే ఉంటావు. ఇలా ఇవ్వు రాయుడు" అన్నాడు కొద్దిగా హడావుడిగా డెస్క్ లో ఏదో వెదకుతూ.

నేను కంప్యూటర్ లు ఫ్రీగా లేని విషయం చెప్పి, పని రేపు చేస్తానని తాపీగా చెప్పాను.

దానికాయన "రేపటి దాకా ఎందుకమ్మా, ఇప్పుడు ఆఫీసు టైం అయిపోయింది కాబట్టి దాదాపు కంప్యూటర్లు అన్నీ ఫ్రీగానే ఉంటాయి. వెళ్లి చేసేయ్"అన్నారు.

నేను ఈసురో మంటూ ప్యాకింగ్ సెక్షన్ లోని కంప్యూటర్ ముందు కూర్చుని పని పూర్తి చేసి ఆయనకు చూపించే సరికి రాత్రి ఎనిమిదిన్నరైంది. ప్రింట్ చూసిన ఆయన శాటిస్ ఫై అయి తన కారులో నన్ను ఇంటిదాకా డ్రాప్ చేశారు. ఆ తర్వాత ఆయన చెప్పిన పని ఏదీ వాయిదా వేయలేదు. ‘ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయవలెను’ అన్న పాఠం ఉద్యోగ జీవితంలో అక్కడే, ఆయన దగ్గరే నేర్చుకున్నాను.

ఒకసారి అదే కంపెనీ చాలా డౌన్ ట్రెండ్ లోకి వెళ్లింది. ఫైనాన్స్ అడ్జస్ట్ చేయలేక కంపెనీకి సంబంధించిన (ఎక్యూప్ మెంట్, ఎలెక్ట్రిసిటీ, మెషిన్స్ లాంటి ఆఫీసు వర్క్ లు కాకుండా) కొన్ని పనులు రావ్ గారు మా మెయింటెనెన్స్ డిపార్ట్ మెంట్ వాళ్ల చేతే చేయించేవారు. దానికి వాళ్లు ఆయన పరోక్షంలో "ఏం మనిషిరా ఈయన, అన్నీ మన చేతే చేయిస్తున్నాడు? ఈసారి మనం అలాంటి పనులు చేయొద్దు" అని తీర్మానించుకున్నారు.

కొంత సేపటి తర్వాత రావ్ గారు హడావుడిగా వాళ్ల దగ్గరకు వచ్చి "నాకో పేద్ద కర్ర కావాలమ్మా" అన్నారు. వాళ్లు గబుక్కున లేచి ఒక పొడవాటి కర్ర వెతికి ఆయనకు ఇచ్చి ‘దేనికి సార్..’ అని అడుగుతుండగానే ఆయన పెద్ద పెద్ద అడుగులేసుకుంటూ బయటకెళ్లిపోయారు. చేసేదేం లేక వాళ్లూ ఆయన్ను అనుసరించారు.

ఆయన సరాసరి ఆఫీసు ప్రాంగణంలో వాసనతో పొంగి పొరలుతున్న డ్రైనేజీ మ్యాన్ హోల్ దగ్గరకు చేరి "చూశారా..ఇది ఎలా పొర్లుతోందో, మనింట్లో అయితే మనం చేసుకోమా?బయట వాళ్లని పిలిస్తే బోలెడంత అడుగుతారు."అని మూత తీసి కర్రతో క్లియర్ చేయసాగారు. అంతటి ఆయనే అలాంటి పని చేస్తుంటే చూడలేక వాళ్లు బలవంతంగా ఆయన చేతిలోని కర్ర తీసుకుని క్లియర్ చేయసాగారు. అలా ఆయన అందరిలో కలిసిపోయి, అందరితో పనిచేయించేవారు. బాస్ అన్న ఆయన నేను మీలోని భాగమే అన్న భావం ఎంప్లాయిస్ లో కలిగిస్తే ఏ పనైనా ఇట్టే జరిగిపోతుంది. ఇది నిజం.

*****

మరిన్ని శీర్షికలు
weekly horoscopeaugust 24th to august 30th