Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

వరలక్ష్మి వ్రత విధానం - ..

varalakshmi vrata vidhanam

వరలక్ష్మి వ్రతం స్త్రీలకు  అతి ముఖ్యమైన వ్రతం. పవిత్రమైన శ్రావణమాసంలో అతి ముఖ్యమైన రెండు వ్రతాలు చోటుచేసుకుంటాయి. వాటిలో కీలకమైన వ్రతం వరలక్ష్మి వ్రతం. శ్రావణమాస శుక్లపక్షంలో పున్నమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీవ్రతంగా జరుపుకుంటాం. ఇది ప్రతి ముత్తయిదువ తమ కుటుంబ సౌభాగ్యం కోసం విధిగా ఆచరించాల్సిన వ్రతం. ఈ వ్రతం వెనుక ఎన్నో పురాణ గాధలు మనకు కనిపిస్తాయి.

స్కంద పురాణంలో శివుడు ఈ వరలక్ష్మీవ్రతం గురించి పార్వతీదేవికి వివరించినట్లుగా తెలుస్తోంది. ఈ వరలక్ష్మీవ్రతం రోజున ముఖ్యంగా శ్రీ వరలక్ష్మి అయిన లక్ష్మీదేవిని సర్వమంగళ సంప్రాప్తి కోసమే కాక, పుత్ర పౌత్రాదులను, ఆరోగ్య ఐశ్వర్యాలను కలిగింపుమని ప్రార్థిస్తూ పూజిస్తాము. ఈ వ్రతాన్ని నిత్యసుమంగళిగా ఉండాలని కోరుతూ పుణ్యస్త్రీలు జరుపుకుంటారు. తమ భర్తలు ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాంతం అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని స్త్రీలు కోరుకుంటారు. అంతే కాకుండా లక్ష్మీదేవి ధనము, భూమి, విద్య, ప్రీతి, కీర్తి , శాంతి, తుష్టి, పుష్టి మొదలైన అష్టైశ్వర్యాలకు ప్రతీక. అందుకే ఈ సంపదలన్నీ కలుగజేయమని ఆ మహాలక్ష్మిని వేడుకుంటాం. అష్టైశ్వరాలను కలుగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మిగా కొలుస్తాం.

వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికి ముందు రోజు ఇల్లు అంతా శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి గడపకు పసుపు రాసి బొట్లు పెట్టి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి పూజకు సిద్ధం కావాలి. ఈ వ్రతాన్ని ఈశాన్యంలో చేసుకోవాలి. ఈశాన్యంలో ముగ్గు వేసి మండపం ఏర్పాటు చేసుకోవాలి. శ్రావణ మాసం అంటే లక్ష్మి దేవికి చాలా ఇష్టం. ఎందుకంటే మన పురాణాల ప్రకారం శుక్రవారం శుక్రాచార్యుని పేరు మీద ఏర్పడిందని చెపుతున్నాయి. శుక్రాచార్యుని తండ్రి భృగు మహర్షి. ఈ భృగు మహర్షి బ్రహ్మ కుమారుల్లో ఒకరు. లక్ష్మి దేవి తండ్రి భృగు మహర్షి. ఈ లెక్కన చూస్తే లక్ష్మి దేవికి శుక్రాచార్యుడు సోదరుడి వరుస అవుతారు.

అందువల్ల లక్ష్మి దేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం. అందువల్ల శ్రావణ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాల్లోనూ పూజ చేసుకుంటారు. అయితే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు.

వరలక్ష్మీ వ్రతం విధానం

వరలక్ష్మీ వ్రతాన్ని దక్షిణభారతదేశంలో ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా జరుపుకుంటారు. కానీ ఏ పద్ధతులు పాటించినా ఆ మహాలక్ష్మిని కొలిచే, సేవించే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారపు శుభదినాన వేకువనే లేచి ఇంటిని శుభ్రపరిచి, గుమ్మాలకు పచ్చని తోరణాలను కట్టి స్నానాదులను ముగించి, పసుపు, కుంకుమ,  పుష్పాక్షతలచే దేవిని పూజించాలి.

లక్ష్మీదేవిని పూజకు స్థాపించే ప్రదేశంలో పిండితో నేలపై పద్మాన్ని వేయాలి. బంగారు, వెండి, లేదా ఏదైనా లోహపు కలశానికి పసుపురాసి, గంధము పూసి ఆపై కుంకుమబొట్టు పెట్టాలి. కలశాన్ని నీటితో నింపి, దానిలో మామిడాకులు, అక్షతలు ఉంచి పైన కొబ్బరికాయను పెట్టి పిండితో వేసిన పద్మంపై కొత్త రవికలగుడ్డను పరిచి బియ్యంపోసి, దానిపై కలశాన్ని స్థాపించాలి.

కొందరు కొబ్బరికాయకు పసుపురాసి, పిండితో ముక్కు, చెవులను, కాటుకతో కళ్ళను దిద్ది, బొట్టుపెట్టి కలశంలో వరలక్ష్మీ దేవి విగ్రహాన్ని స్థాపిస్తారు. ఈ విగ్రహాన్ని బంగారు, వెండి ఆభరణాలతో అలంకరిస్తారు. అలాగే మరికొందరు కొబ్బరికాయకు బంగారు లేదా వెండి ముఖాన్ని అమర్చి శుభ్రమైన పువ్వులతో, ఆభరణాలతో అమ్మవారిని అలంకరిస్తారు. ఏవిధంగా అయినా యధా శక్తి అలంకరించుకోవచ్చు.

ముందుగా ఒక రాగిపళ్ళెంలో బియ్యంపోసి దానిపైన ఒక తమలపాకులో పసుపు వినాయకుని ప్రతిష్టించి విఘ్ననాయకుడైన ఆ విఘ్నేశ్వరునికి పూజ చేయాలి. తరువాత వరలక్ష్మీదేవిని ఆహ్వానించి శోడషోపచారాలతో అమ్మను పూజంచాలి. తొమ్మిది పోసలు వేసి, తొమ్మిది గ్రంధులతో కూడిన తోరాన్ని దేవికి సమర్పించాలి.


వరలక్ష్మీ వ్రతం కథ

వరలక్ష్మీ వ్రతం కథను స్వయంగా ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించినట్లు స్కందపురాణంలో చెప్పబడింది. లోకంలో స్త్రీలు అష్టైశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలైన ఒక వ్రతాన్ని తనకు వివరించమని పార్వతీదేవి కోరగా, ఆ మహాశివుడు వరలక్ష్మీవ్రతాన్ని చేయమని చెప్పాడు. ఈ సందర్భంలో ఆ మహాశివుడు పార్వతీదేవికి చారుమతీదేవి కథను వివరించాడు. ఆ చారుమతీదేవి గయ్యాళికాక, పెనిమిటిని పూజిస్తూ, అత్తమామలకు సర్వోపచారములను అందిస్తూ ఉండేది.

ఆ మహాపతివ్రతయందు వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నమున వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై శ్రావణ శుక్లపూర్ణిమకు ముందు వచ్చే శుక్ర వారాన తనను పూజించినట్లయితే కోరిన వరములను ఇచ్చెదనని చెప్పి మాయమయ్యెను. ఆ చారుమతి అట్లే ఆచరించి సకలైశ్వర్యములను పొందెనని, అప్పటి నుంచీ ఆ వరలక్ష్మీవ్రతము చారుమతీ మొదలగు స్త్రీలందరూ ఆచరిస్తున్నట్లుగా ఈ కథ తెలియచెప్తుంది. కావున ప్రతివారూ ఈ వరలక్ష్మీవ్రతమును చేస్తే సర్వ సౌభాగ్యములను, పుత్ర పౌత్రాదులను పొంది సుఖముగా ఉంటారు. శ్రావణ మాసం శుక్ల పక్షంలో పొర్ణమి ముందు వచ్చే శుక్రవాతం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు.తొమ్మిది రకాల పిండివంటలు వండి షడ్రసోపేతంగా మహానైవేద్యాన్ని సమర్పించాలి. ముత్తయిదువులకు తాంబూలాదులు సమర్పించి వారి దీవెనలను అందుకోవాలి. అనంతరం అమ్మవారిని కొలుస్తూ మంగళహారతి పాటలతో మంగళహారతులు అర్పించాలి. వరలక్ష్మి వ్రతం చేసుకున్న ఆ కథను విన్నా శుభం కలుగుతుంది.

మరిన్ని శీర్షికలు
I'm also my boss!