Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

శైలజారెడ్డి అల్లుడు చిత్రసమీక్ష

shailaja reddy alludu movie review

చిత్రం: శైలజారెడ్డి అల్లుడు 
తారాగణం: అక్కినేని నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్‌, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్‌, నరేష్‌, మురళీ శర్మ, రఘుబాబు, పృధ్వీరాజ్‌, శరణ్య ప్రదీప్‌ తదితరులు. 
సంగీతం: గోపీ సుందర్‌ 
సినిమాటోగ్రఫీ: నిజార్‌ షఫీ 
నిర్మాతలు: నాగవంశీ ఎస్‌, పిడివి ప్రసాద్‌ 
దర్శకత్వం: మారుతి 
నిర్మాణం: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
సమర్పణ: రాధాకృష్ణ (చినబాబు) 
విడుదల తేదీ: 13 సెప్టెంబర్‌ 2018 
క్లుప్తంగా చెప్పాలంటే 
తాను చెప్పిందే జరగాలనే అహంతో వుండే వ్యక్తి (మురళీశర్మ). అతని కుమారుడు చైతన్య (నాగచైతన్య) మాత్రం పాజిటివ్‌ యాటిట్యూడ్‌తో వుంటాడు. చైతన్య జీవితంలోకి వస్తుంది అను (అనూ ఇమ్మాన్యుయేల్‌). తండ్రి అహం ఓ వైపు, అను అహం ఇంకో వైపు. ఈ రెండు సమస్యల మధ్యా పాజిటివ్‌ యాటిట్యూడ్‌తోనే వుండే చైతన్య ఎలాగైతేనేం, ప్రియురాలు అనుని తన దార్లోకి తెచ్చుకుంటాడుగానీ, తనకు కాబోయే అత్త శైలజారెడ్డితో చైతన్యకు మరో చిక్కు వచ్చిపడుతుంది. అదేంటి? శైలజారెడ్డి అల్లుడిగా చైతు ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొన్నాడు, ఆ సమస్యలకు పరిష్కారం ఎలా వెతుక్కున్నాడు? అన్నది తెరపై చూడాల్సిందే. 
మొత్తంగా చెప్పాలంటే 
నటుడిగా నాగచైతన్య గురించి కొత్తగా చెప్పేదేముంది? చలాకీగా కన్పించాడు. స్పాంటేనియస్‌గా హ్యూమర్‌ పండించేందుకు ప్రయత్నించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో రాణించాడు. ఓవరాల్‌గా చైతన్య పాత్రలో నాగచైతన్య ఒదిగిపోయాడంతే. ఎమోషనల్‌ సీన్స్‌లో డైలాగ్‌ డెలివరీ మీద నాగచైతన్య ఇంకాస్త ఫోకస్‌ పెట్టాల్సి వుంది. 
అందాల భామ అనూ ఇమ్మాన్యుయేల్‌ తన అందంతో మరో మారు కట్టి పడేసింది. క్యూట్‌గా కన్పిస్తూనే, 'ఇగో'ని అదనపు అలంకరణగా మార్చేసుకుంది. నటనతోనూ మెప్పించింది. రమ్యకృష్ణ పాత్ర ఈ సినిమాకి మెయిన్‌ పిల్లర్‌ అనొచ్చేమో. శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణ దర్పం ప్రదర్శించారు. ఆమె కన్పించినంతసేపూ సినిమాకి ఓ ఊపు వస్తుందనడం అతిశయోక్తి కాదు. వెన్నెల కిషోర్‌, పృధ్వీ కామెడీ బాగానే పండించారు. మురళీ శర్మ ఆకట్టుకున్నారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర అలా అలా చేసుకుపోయారంతే. 
కథ కొత్తదేమీ కాదు, కథనం పరంగా కూడా కొత్తదనం కన్పించదు. డైలాగ్స్‌ ఓకే. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ బావుంది. ఎడిటింగ్‌ ఇంకాస్త అవసరం అన్పిస్తుంది. నిర్మాణపు విలువలు బావున్నాయి. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఓకే. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. 
మారుతి సినిమాలంటే హాస్యానికి పెద్ద పీఠ వేస్తాడని అందరం ఆశిస్తాం. ఈ సినిమాలోనూ ఆ కామెడీకే పెద్ద పీఠ వేసినా, కామెడీ పాళ్ళు కాస్త తగ్గిన ఫీలింగ్‌ కలుగుతుంది. రొటీన్‌ కథ కావడం, ఆ రొటీన్‌ కథని ఇంకా రొటీన్‌గా చెప్పడం బోరింగ్‌గా అన్పిస్తుంది. కామెడీ పూర్తిస్థాయిలో ఆకట్టుకోకపోవడం ఆ బోరింగ్‌ ఫీలింగ్‌ని పెంచుతుంది. రమ్యకృష్ణ, నాగచైతన్య నటన, అనూ ఇమ్మాన్యుయేల్‌ క్యూట్‌ అందం ఎట్రాక్ట్‌ చేస్తాయి. సినిమాలో ప్రతి ఫ్రేమ్‌ రిచ్‌గా వుండడం పెద్ద ఊరటే. పెద్దగా ట్విస్ట్‌లు లేకపోవడం నిరాశపర్చుతుంది. ఓవరాల్‌గా సినిమా ఫర్వాలేదన్పిస్తుంది. 
ఒక్క మాటలో చెప్పాలంటే 
శైలజారెడ్డి అల్లుడు జస్ట్‌ ఓకే 
అంకెల్లో చెప్పాలంటే 2.75/5 

మరిన్ని సినిమా కబుర్లు
churaka