సినిమాల్లో ముఖ్యమంత్రి పాత్ర యంగ్ హీరో రానా దగ్గుబాటికి కొత్తేమీ కాదు. తొలి సినిమాతోనే ఈ రేర్ ఫీట్‌ని సాధించేశాడు. ఆరడుగుల పైన ఎత్తు, కండలు తిరిగిన శరీరం బాహుబలి సినిమాలో రానా ఎలా కనిపించాడో తెలుసు కదా. ఒక్కో సినిమాకి గెటప్ ఒక్కోలా మార్చేస్తుంటాడు. ఇప్పుడు 'ఎన్టీఆర్' సినిమా కోసం కొత్త గెటప్‌లోకి మారిపోయాడు రానా. తెలుగుదేశం పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వయసులో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో, రానా తాజా లుక్‌ని అచ్చంగా అలాగే తీర్చి దిద్దాడు దర్శకుడు క్రిష్. 'ఎన్టీఆర్' బయోపిక్ కోసమే ఇదంతా. క్రిష్ ఆలోచన, రానా కష్టం వెరసి 'రానా చంద్రబాబు నాయుడు అనే నేను' అన్నట్లుగా లుక్ మారిపోయింది.
స్వర్గీయ ఎన్టీఆర్ అల్లుడైన నారా చంద్రబాబు నాయుడులా గెటప్ వేసుకోవడమంటే ఆషా మాషీ విషయం కాదు. గెటప్‌తో పాటుగా ఆహార్యం కూడా అలాగే ఉండాలి. అందుకే రానా క్రిష్ నేతృత్వంలో చాలా కష్టపడ్డాడు. ఆ కష్టమంతా తాజా లుక్‌లో కనిపిస్తోంది. కండలు కరిగించేసి సన్నగా, రివటలా తయారైపోయాడు రానా. ఇదేదో అనారోగ్య సమస్య అని కొంత దుష్ప్రచారం జరిగింది. కానీ హి ఈజ్ స్పెషల్.. అంటూ ఇప్పుడు అందరూ రానా దగ్గుబాటిని అభినందించకుండా ఉండలేకపోతున్నారు. 2018 సంక్రాంతికి ఈ 'ఎన్టీఆర్' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న చిత్రమిది.
|