Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine pichi

ఈ సంచికలో >> శీర్షికలు >>

పుస్తక సమీక్ష: శ్రీ రమణ పేరడీలు - సిరాశ్రీ

Book Review - Sri Ramana Paradeelu

పుస్తకం: శ్రీ రమణ పేరడీలు
రచన: శ్రీ రమణ
వెల: 70/-
ప్రతులకు: విశాలాంధ్ర

ఎప్పటినుంచో పరిచయం చెయ్యాలనుకుంటున్న పుస్తకాల్లో ఇదొకటి. ఇప్పటికే సాహితీ ప్రియులు చాలా మంది చదివే ఉంటారని తెలిసినా, చదవని వారి చేత చదివింప చేయలనే ఈ ప్రయత్నం.

పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్, హర్షవర్ధన్, శివా రెడ్డి వంటి సుప్రసిధ్ధ మిమిక్రీ కళాకారులు జాతీయ నాయకుల్ని, సినిమా తారల్ని అనుకరించడం అందరికీ తెలిసిందే. కానీ ప్రముఖ రచయితలు, కవుల శైలుల్ని అన్నీ ఒక చోటకి చేర్చి నవ్వులు పండించడం మామూలు వ్యవహారం కాదు. సుమారు పదేళ్ల క్రితం ఒక సాహిత్య పత్రిక కోసం శ్రీ రమణ గారిని ఇంటర్వ్యూ చెయ్యాలని "నవ్య" ఆఫీసుకు వెళ్లాను. అప్పుడాయన "నవ్య" ఎడిటర్. ఇంటర్వ్యూ కి బయలుదేరే ముందు ఒక మిత్రుడు చెప్పాడు, "అయన ముందు కాస్త "మిథునం" నవల్ని పొగడితే చాలు.. మనసు విప్పి చాలా విషయాలు చెప్తారు" అని. కానీ అప్పటికి నేను "మిథునం" చదవలేదు. ఏమని పొగడాలి? అందుకే "అసలు అందులో కథేవిటి?" అని అడిగాను. చెప్పాడు. విన్నాను. ఇక డైరెక్టుగా శ్రీరమణ గారి దగ్గరికెళ్ళి "మీ "మిథునం" అభిమానిని అండీ" అన్నాను కరచాలనం చేస్తూ. కనీసం నవ్వు కూడా లేకుండా "అలాగా" అనేసి ఊరుకున్నారు. "వచ్చిన పని కానివ్వండి" అన్నట్టు చూసారు. రాసుకెళ్లిన ప్రశ్నలు ఆయనను అడిగాను. సమాధానాలు మాత్రం ఓపిగ్గా చెప్పారు. ఆ తర్వాత ఆ ఇంటర్వ్యూని కంపోజ్ చేసుకోవడం, ఎడిటర్ కి పంపడం, అచ్చవ్వడం అయిపోయాయి.

నిజానికి తనికెళ్ల భరణి గారి "మిథునం" చూసే దాకా ఆ నవల నేను చదవలేదు. సినిమా చూసి నవల కొన్నానుగాని ఇప్పటికీ అట్ట తెరవలేదు. కానీ ఇంటర్వ్యూ చేసిన రెండు మూడు నెలలకి "శ్రీ రమణ పేరడీలు" చదివాను. ఆయనలో అంత హాస్య చతురత, అంత మంది రచయితల్ని, కవుల్ని అనుకరించన తీరు చూసి శ్రీరమణ గారి అభిమానినయ్యాను. ఈ పేరడీ పుస్తకం చదవడం వల్ల ఒక ఉపయోగం ఉంది. రకరకాల కవులు వారి శైలీ విన్యాసం పరిచయం కావడంతో ఆయా రచయితల పట్ల ఆసక్తి పెరిగి వారి రచనలు చదివే ప్రయత్నం మాత్రం చేస్తాం. నా వరకు నేను ఈ పుస్తకం చదివాకే విశ్వనాథ సత్యనారాయణ, చలం రచనలు చదవడం మొదలుపెట్టాను.

పేరడీ ప్రక్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు కనుక నేరుగా ఈ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన అంశాలు చెప్తాను.

"వెళ్తున్న రైలు- ఫస్ట్ క్లాస్ భోగీలో అతడేదో ఆలోచిస్తూ ప్రయాణం చేయడం" ఇదీ సన్నివేశం.

ఈ సన్నివేశాన్ని ఎవరెవరు ఎలా రాస్తారో ఆయా రచయితల రచనాశైలిని పరిచయం చేసి శ్రీ రమణ ఇలా అనుకరించారు.

విశ్వనాథ సత్యనారాయణ: రెండు మూడు పదాలతో వాక్య నిర్మాణం చేయడం భాషా శైలిలో, ఆలోచనా వైఖరిలో ప్రాచీనతపై మోజు విశ్వనాథ వారి రచనలో కనిపిస్తుంది. సందర్భాన్ని వదిలి పక్కకు వెళ్ళడం వీరికి పరిపాటి. ఇక సన్నివేశ వర్ణన:

"అది ధూమశకటము. అభిముఖముగ బోవుచున్నది. అతడు మొదటి తరగతి పెట్టెలోనాసీనుడయ్యెను. ప్రధమ శ్రేణి మంజూషము సువిశాలముగనున్నది. ..అతడు గంభీర ముద్ర దాల్చి బాహ్య ప్రకృతిని వీక్షించును. అతడేదియోనాలోచించుచున్నట్లగుపడును. ఆలోచన యనగానేమి? అదియొక మానసిక వ్యాపారము. అతీంద్రియము, తాత్వికుడు ఆలోచన సేయును...ఇంతకూ అతని మనమందున ఏమి కలదు? మనకు తెలియదు.." ఇట్లా సాగుతుంది వారి వచన స్రవంతి

సంజీవ్ దేవ్: తర్కము, గంభీరమైన సంస్కృత పదాలను సామాన్య వాక్యాల్లో పొదగడం వీరి ప్రత్యేకత.

"రైలు జడమే అయినా అది కదులుతుంది. చెట్టు చేతనమే అయినా అది కదలదు. ..నిత్య జీవితంలొ కదలిక సజీవమైన ప్రాణస్పందనకు గతిశీల చిహ్నం. రైలు చేస్తున్న శబ్దం లయాత్మకంగా తట్టసాగింది ఫస్ట్ క్లాస్లో కూర్చున్న అతనికి...అభివ్యక్తపరచబడని భావాలేవో అతని మానసాకాశంలో వుండి వున్నాయి"..ఇదీ వరస.

కొడవటిగంటి కుటుంబరావు:  మధ్య తరగతి జీవితాలకు అద్దం పడ్తాయి వీరి రచనలు.... వారి పోకడ చూడండి.

"రైలు ఆగడం, సుందరం ఫస్ట్ క్లాస్ కంపార్టుమెంటులో కూర్చోవడం- ఏది ముందా అన్నంతగా జరిగిపోయాయి. సుందరం మొదట ప్రెస్ బాయ్ గా చేరి, కంపోజిటరై, ట్రెడిల్ మ్యాన్ అయి, అలా అలా పైకొచ్చి ప్రెస్ ఓనరైపోయాడు. ఫస్ట్ క్లాస్ లో తప్ప ప్రయాణం చేయడు. ఇంత గొప్పవాడైనా తన పాత జీవితాన్ని మర్చిపోకూడదని ఖరీదైన డ్రెస్ మాత్రం వేసుకోడు.."

వార్తా శైలి: పాత్రికేయుడు భోగట్టా మాత్రమే ఇస్తాడు. క్లుప్తత అతనికి ముఖ్యం. చూడండి:

"నిర్ణీతవేళకు నిర్దేశించబడిన ప్లాట్ ఫారం పైకి రైలు రాగానే ఫస్ట్ క్లాస్ కంపార్టుమెంటులో తన రిజర్వుడు బెర్త్ పై కూర్చున్న అతని వయసు 35 సంవత్సరాలు ఉండొచ్చు. అతను ఆలోచిస్తున్న మాట నిజమే కావొచ్చు. కాగా, ఏమి ఆలోచిస్తున్నది తెలియరాలేదు. పోతే పధ్నాలుగు భోగీలు, ఒక ఇంజను గల ఆ రైలు బయలుదేరే ముందు కూత వేసింది".

ఇవి స్థలా భావం వల్ల ఇచ్చిన కొన్ని మచ్చుతునకలని కూడా పూర్తిగా రాయట్లేదు ఇక్కడ.

అలాగే జాతీయ పక్షిగా నెమలిని ఎంపిక చేసినప్పుడు కవి సమ్మేళనం పెడితే ఎలా ఉంటుందో అనే సన్నివేశాన్ని కల్పించి అందులో దేవులపల్లి, సినారె, బాలగంగాధర్ తిలక్, శ్రీశ్రీ, కుందుర్తి మొదలైన వారందర్నీ అనుకరించిన తీరు అమోఘం.

ఉదాహరణకి అందులో కొన్ని..
అంశం: జాతీయ పక్షిగా నెమలి ఎంపిక. కవి సమ్మేళనం.

శ్రీ శ్రీ:
నట్టడివిలోంచి 

నయాదిల్లీకి
మహాప్రస్థానం-
మర్చిపోకు నేస్తం
నీ వాణ్ణి నేను
మనిషిని;
అక్బర్ నామా,
పికాక్ త్రోన్,
బ్రిటీష్ రాణి,
గతం గతః.
పక్షులు,
అక్షులు,
కుక్కలు,
రుక్కులు,
అన్నీ వొకటే రష్యాలో-
ఇక్కడ మాత్రం ఒకటొకటే!"

దేవులపల్లి:
"శిశిర శిశిర బందు
మధుర వేదన రగిలి
సోలియున్నది మనసు
చూపకే నీ వింత సొగసు
ఏలనే నీకంత అలుసు?
కరిమబ్బు మేనితో స్వామి వచ్చే వేళ
చివురాకు జంపాల పురివిప్పి ఆడేవు
భ్రమసిపోతివో ఏమొ అలసిపోదువొ ఏమొ?
బృందావనమ్మెల్ల నీ మాటె, నీ ఆటె
ఏ నాటి పుణ్యమో ఏ నోము ఫలమొ?"

ఇంకా ఇలా పుస్తక పీఠికలు, సినీ సమీక్షలు, ప్రేమలేఖలు..వేరు వేరు సుప్రసిధ్ధ రచయితలు ఎలా రాస్తారో అనుకరించన వైనం చాలా బాగుంటుంది.

సాహిత్యంతో పరిచయం ఉన్నవారికి నవ్వులు తెప్పిస్తూ, లేని వారికి సాహిత్యంతో పరిచయం పెంచుకోవాలనే ఆసక్తి రప్పిస్తూ చదివించి మెప్పిస్తుంది ఈ "శ్రీరమణ పేరడీలు".
మరిన్ని శీర్షికలు
our relation with pins