Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sira chukkalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

మృత్యుకేళి - లక్ష్మి పాల

కర్కశమైన కారుమేఘంలా... నిశిరాత్రి, నల్లటి మంచులా మారి నిశ్శబ్ధంగా పాకుతూ ఆకాశాన్ని ఆక్రమించుకుంటుంది. సీతారాములు కొలువైన భద్రాచలం పట్టణమంతా పగలు కురిసిన వర్షంతో తడిసి, వెచ్చని దుప్పట్లలో దూరి, నెమ్మదిగా నిద్రకుపక్రమిస్తుంది. గోదావరి బ్రిడ్జి పై వాహనాల రద్దీ తగ్గుతుంది. బ్రిడ్జి క్రింద గోదారమ్మ, వానల వలన తనలో చేరుతున్న కొత్తనీటితో పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహిస్తుంది. సారపాక నుండి భద్రాచలం పట్టణంలోకి ప్రవేశించే ఆ బ్రిడ్జికి ఎడమవైపు ఉన్న ఎత్తైన,  25 వ విధ్యుద్దీపపు స్థంభం చివరన కూర్చుని ఉంది ఆ పక్షి. అది ఏ జాతికి చెందిన పక్షి, ఎలా ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే, దాన్ని ప్రత్యక్షంగా చూసిన వారిలో ఎవరో ఒక్కరిద్దరు తప్ప... ఇంకెవరూ సజీవులై లేరు...!

గుడ్లగూబ జాతికి చెందిన డేగలాంటి అతి పెద్ద శరీరం...  మృత్యురూపంలా భయపెట్టే నల్లటి రంగు... వాడి గోళ్ళు, వంపు తిరిగిన పదునైన వంకి కత్తిలాంటి ముక్కు... ఆయువుతీరిన మనుషులను నోటకరచుకు పోడానికా అన్నట్లు... తీక్షణంగా, పరిశీలనగా చూస్తున్న అగ్నికణికల్లాంటి ఎర్రని కళ్ళతో ఉండే, ఆ పక్షి ఎప్పుడూ అక్కడికి రాదు. అక్కడికి వచ్చిందంటే... ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక అవాంఛనీయ ఘటన సంభవిస్తుందని అందరూ అంటారు.

అది సంచరించని ప్రదేశమంటూ ఉండదు. కానీ, ఎప్పుడో... అరుదుగా అది పట్టణంలో ప్రవేశిస్తుంది. ప్రస్తుతం ఫారెస్టు ఆఫీస్ నడుపుతున్న ఒక పాత బంగ్లాను పూర్వం “ఏనుగుల బంగ్లా” అని పిలిచేవారు. పూర్వాశ్రమంలో ఎప్పుడో... ఆ బంగ్లా లో ఏనుగులను కట్టి ఉంచేవారట. అందుకే దానిని ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తారు. తరచూ ఆ పక్షి, ఆ ఏనుగుల బంగ్లా పైన వచ్చి వాలేది. అది అర్ధరాత్రి వరకూ వేచివుండి... ఆ తరువాత ఒక భయంకరమైన వింత శబ్ధం చేస్తూ అరిచేది. ఆ రోజు తప్పక ఆ పట్టణంలో ఎవరో ఒకరు మృత్యువాత పడేవారు.
ఇప్పుడా పక్షి... ఓపికతో తన సమయం కోసం నిరీక్షిస్తూ...  పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉంది. వాస్తవంగానే ఆ 25 వ విధ్యుద్దీపపు స్థంభం చాలా ప్రమాదకరమైన చోటు. వరదలు ఉన్నా లేకపోయినా... అక్కడ గోదావరి నది ఎప్పుడూ, చాలా లోతుగా ఉంటుంది. పైగా రాళ్లతో ఉంటుంది. అక్కడినుండి ఎవరైనా దూకితే, మరణం తధ్యం. నీటి లోతులో కాకపోయినా ఆ రాళ్ళకి కొట్టుకుని అయినా మరణం తప్పక సంభవిస్తుంది. ఆ ప్రదేశంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన పదిమందిలో ఏ ఒక్కరో మృత్యుంజయులు అవుతారనేది అందరూ చెప్పుకునే మాట.

*******

గోపాలకృష్ణ థియేటర్ లో సినిమా విడిచి పెట్టగానే, ఒడిలోనే నిద్రపోయిన పిల్లలనిద్దరినీ భుజంపై వేసుకుని పార్కింగ్ లో ఉన్న కార్ దగ్గరకు వచ్చారు త్రివేణి, నాగేంద్ర. “నేను అదే చెప్పాను. పిల్లలతో సినిమా ప్రోగ్రాం ఎందుకు అని... అందునా సెకండ్ షో.  ఇప్పుడు చూడు, ఇద్దరూ నిద్రపోతున్నారు. వాళ్ళిద్దరూ సినిమా చూసింది లేదు. డబ్బులు వేస్టు, అదనంగా ఈ మోతకోలు. అయినా ఆరేడేళ్ళు నిండలేదు. ఇంత చిన్న వయసులో వీళ్ళకి సినిమాలు ఏమిటీ...? కాస్త పెద్దవాళ్ళయ్యాక తీసుకెళ్ళలేమా...? అప్పటివరకూ సినిమాలు చూడకపోతే చచ్చిపోతారా...? ఇంట్లో  వదిలేసి, వదినకు అప్పగించేస్తే, ఈ బాధ ఉండేది కాదుగా...” విసుగ్గా అన్నాడు నాగేంద్ర.
త్రివేణి ఏమీ మాట్లాడలేదు. “వదిలి రావడానికి వీలు కాకపోవడం వల్లనే కదా... ఈ సమస్య. పగలంతా ఇద్దరూ ఆఫీసుకు, పిల్లలు స్కూలుకు వెళతారు. ఫస్టు షో సమయానికి పిల్లలిద్దరికి ట్యూషన్లు. పోనీ, ఇంట్లోనే వదిలేద్దామంటే, అర్ధరాత్రి మెలకువ వస్తే, వాళ్ల  అల్లరికి అక్కాబావలకు నిద్రాభంగం. అయినా... పిల్లలకు మాత్రం సినిమా చూడాలని ఉండదా...?” లోలోపలే సణుక్కుంది.
ఇద్దరూ పిల్లలను బ్యాక్ సీట్ లో పడుకోబెట్టి, ముందుకొచ్చి కూర్చున్నారు. “ఇంకెప్పుడూ... ఇలాంటి రాత్రి ప్రోగ్రామ్స్ పెట్టకు. అంతగా కావాలంటే, ఆఫీస్ కి సెలవు పెట్టి, పిల్లలను సినిమాకు తీసుకెళ్ళు.  అంతేగానీ, నన్ను నీ ప్రోగ్రాం లోకి లాగొద్దు.” సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి, కారు స్టార్ట్ చేసాడు.

త్రివేణి ముఖం చిన్నబోయింది. ఎన్నాళ్ళయిందో బయట సినిమాకి వెళ్ళి... ఇంట్లో మినీ థియేటర్ ని తలపించే 50 inches 4K smart android led T.V. ఉన్నా... ఇలా తనతో, పిల్లలతో కలిసి బయట  సినిమాకి వెళితే ఉండే ఆనందం వేరు. తనకన్నా... అమ్మా,నాన్నలతో బయటికి వెళుతున్నామంటే... పిల్లలు పొందే సంబరానికి ఎంత మూల్యం చెల్లించినా సరిపోదు. ఇదంతా ఆయనకు ఎప్పటికీ అర్ధం కాదు. ఆయనగారి కోపానికి, ఆకాస్త ఆనందం కూడా హరించుకు పోయింది. నాగేంద్ర ఎప్పుడూ ఇంతే...! ప్రతి చిన్నదానికీ చిరాకు పడుతూ ఉంటాడు. ఏ కొంచెం అసౌకర్యం కలిగినా అసహనంతో చిర్రుబుర్రులాడుతూ ఉంటాడు.

ఆయనకు తగినట్లుగానే, పిల్లలుకూడా...! ఇంటిదగ్గరున్నంత సేపు, “మేము సినిమా చూస్తాము మమ్మీ... అస్సలు నిద్రపోమూ” అంటూ ప్రామిస్ చేసి... ఆట మొదలవడమే నిద్రలోకి జారిపోయారు. సినిమా అంతా వాళ్ళను ఒడిలో పెట్టుకుని వృధాగా మోయవలసి వచ్చిందే అని అతని బాధ. పిల్లలన్నాక ఇంతే మరి...! అయినా నిద్రపోయిన పిల్లలను కన్న తల్లిదండ్రులు కాక, పక్కసీటు వాళ్ళు ఒళ్ళొ పడుకోపెట్టుకుంటారా...?

కారు సినిమాహాలు దాటి... మెయిన్ రోడ్డు వైపుకు తిరిగింది. విండో నుండి తేమతో కూడిన చల్లటి గోదావరి గాలి... ముఖాన్ని వచ్చి తాకుతోంది. వర్షం వలన రోడ్డు తడిసి, అదో గమ్మత్తైన వాసన వస్తోంది. ఏదేమైనా... అర్ధరాత్రి నిర్మానుష్యంగా ఉన్నవిశాలమైన రోడ్డుపైన ప్రయాణం చాలా బాగుంటుంది.  ఒకసారి తలతిప్పి నాగేంద్రవైపు చూసింది త్రివేణి. ఆయన ముఖంలో ఇంకా అసహనం కనబడుతోంది. “హూ... ఈయన ఎప్పుడూ ఇంతే...!” ముఖాన్ని కిటికీలోకి పెట్టి బయట పరిసరాలను చూస్తూ కూర్చుంది.

********

మెయిన్ రోడ్డు మీదకు వచ్చి, కుడివైపుకు దారి తీసాడు నాగేంద్ర. యధాలాపంగా కుడివైపు మిర్రర్ లోకి చూసిన త్రివేణి, ఏదో అనుమానమొచ్చి మళ్ళీ స్పష్టంగా చూసింది. తనకు కనబడినది నిజమే. ఎవరో ఒక స్త్రీ... కుడివైపునుండి ఎడమవైపుకు రోడ్డు దాటుతోంది. అది పెద్ద వింతేం కాదు. కానీ, ఆమె నడుస్తున్న విధానం కొంచెం తేడాగా అనిపించింది. ఆమె నడుస్తున్నట్లుగా లేదు పరుగెడుతుంది. ఇంత అర్ధరాత్రి... ఒంటరిగా... ఎందుకలా పరుగెడుతుంది...? కిటికీలోంచి తల బయటకు పెట్టి వెనక్కి చూసింది.  రోడ్డు మీద లైట్ల వెలుతురులో ఆమె చాలా స్పష్టంగా కనబడుతుంది... చీరకొంగుతో కళ్ళు, ముక్కూ తుడుచుకుంటూ... పరుగులాంటి నడకతో గోదావరి బ్రిడ్జివైపు వెళుతోంది ఆమె. పరిస్థితి అర్ధమైంది.  కుటుంబ సమస్యలకు, భార్యాభర్తల కలహాలకు మనస్థాపం చెందిన ప్రతి గృహిణికీ గోదారమ్మ చల్లని ఒడే స్వాంతన. అలా ఎందరు పడుచులు... ఆ తల్లి ఒడిలో తలదాచుకున్నారో...!

“ఏమండీ... ఒకసారి అటుచూడండి...!” భయం భయంగానే నాగేంద్రకు చూపించిందామెను.

“ఏమిటీ...?” తలతిప్పి వెనక్కి చూసిన నాగేంద్ర సడెన్ బ్రేక్ వేశాడు. “ఈ టైమ్ లో ఎక్కడికెళుతుందామే...?” విసుగ్గా అంటూనే... ఏదో అర్ధమైనట్లు..”మైగాడ్... ఆమె సూసైడ్ చేసుకోడానికి వెళుతున్నట్లుంది త్రివేణి...!” కంగారుగా అన్నాడు.

“ఆపుదాం...!” త్రివేణి మాట నోటిలో ఉండగానే, కారు లెఫ్ట్ కి టర్న్ చేసి, ముందుకు ఉరికించాడు.

ఆ స్త్రీ రాకకోసమే కళ్ళు వాల్చి దీక్షగా ఎదురు చూస్తున్న ఆ పక్షి దృష్టి... దూరం నుండి వస్తున్న త్రివేణి,నాగేంద్రల కారు వైపు తిరిగింది. ఆకలి కడుపుకు మృష్టాన్నభోజనమేదో లభించినట్లు... నెమ్మదిగా కళ్ళు రెప్పవేసి తెరచింది.

“కొంచెం త్వరగా పోనీవ్వండీ... మనం వెళ్ళేలోపే దూకేసేలా ఉంది” తొందర చేసింది త్రివేణి.

అప్పటికే... ఆమె బ్రిడ్జి మీద బాగా లోతుగా నీళ్ళుండే వైపు నిల్చుని ఉంది...వీళ్ళిద్దరికీ కంగారు ఎక్కువైంది. ఆమె దృష్టిని మరల్చడం కోసం  ఆమెను డిస్టర్బ్ చేయడానికి హారన్ మ్రోగిస్తూ...కారుని ఇంకాస్త స్పీడ్ గా పోనిచ్చాడు. ఆమె తలత్రిప్పి వీళ్ళవంక చూసింది. కనీసం... ఒక్క క్షణం ఆలస్యమైనా చాలు. ఆమెను మరణం నుండి ఒక్క ఇంచయినా దూరం చేయడానికి. ఇంకొంచెం స్పీడ్ పెంచి హెడ్ లైట్స్ ఆమె మీద ఫోకస్ చేసారు. ఆమె తొందరపడాలనుకుంది. వెంటనే, చీర ఎగదోసి గబ గబా... బ్రిడ్చి సైడ్ వాల్ ఎక్కడానికి ప్రయత్నిస్తోంది.
“అయ్యయ్యో... ఆమె దూకేసేలా ఉందండీ...”  కెవ్వుమని అరచింది త్రివేణి.

“హే... నువ్వు అరవకు. పిల్లలు నిద్రలేస్తారు...!” కంగారుగా చెప్పి, బ్రిడ్జి ఎక్కడానికి ప్రారంభంలో ఉన్న రోడ్డు  ఎక్కించేసాడు.
త్రివేణి దృష్టి, ఆ 25వ పోల్ మీద పడింది. “జీవితంలో కష్టాలనుండి గట్టెక్కడం కన్నా... ఇక్కడనుండి దూకి ప్రాణాలు తీసుకోవడం తేలిక అని అందరికీ తెలిసిపోయింది తిక్కల మొహాలు” లోలోపలే తిట్టుకుంటూ యధాలాపంగా పోల్ పైకి చూసింది. ఆమె చూపు అక్కడ కూర్చుని ఉన్న ఆ పక్షి పై పడింది. ఇదేంటీ ఇలా ఉంది...? చీకటిలో అది ఓ పక్షిలా కాదు. ఓ మనిషి పొందిగ్గా స్థంభం చివరన ముడుచుకు కూర్చున్నట్లుగా కనబడుతుంది. అది ఏమిటై ఉంటుంది. ఆలోచించేలోపే, ఆ పక్షి మరోసారి తలత్రిప్పి వీళ్ళవైపు చూసింది. అంత చీకటిలోనూ ఎర్రగా మెరిసిన దాని కళ్ళు చూసి, ఒక్కసారిగా ఉలిక్కిపడింది త్రివేణి.

కారు ఆమెకు దగ్గరగా వెళ్ళిపోయింది. అంతలో... అప్పటివరకూ నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్డుపైన హఠాత్తుగా బీటు కానిస్టేబుల్ ప్రత్యక్షమై, బ్రిడ్జి ఎక్కి దూకబోతున్న ఆమెను బుజం పట్టి బలవంతంగా ఆపేసాడు. ఆ పక్షి... కొంచెంగా కదిలి అసహనపూరితమైన విచిత్ర శబ్ధం చేసింది.
“వదలమన్నట్లుగా” ఆమె బీటు కానిస్టేబుల్ చేతుల్లో గింజుకుంటుంది. అతను లాగిపెట్టి చెంపపై ఒక్కటిచ్చాడు. ఏదో తిడుతున్నాడు. ఆమె బ్రిడ్జి ఫుట్ పాత్ పై కూర్చుని ఏడుస్తోంది.

అది చూసి, వాళ్ళకు కొంచెం దూరంలో కారు ఆపేసాడు నాగేంద్ర. కారు ఫ్రంట్ మిర్రర్ లోంచి ఇదంతా చూస్తూ కూర్చున్నారు.  కానిస్టేబుల్ ఆమెను చేయిపట్టి పైకి లేపి తమ కారు పక్కనుండే ఊళ్ళోకి తీసుకుని వెళ్ళిపోయాడు.

ఇద్దరికీ మనసు కుదుటపడింది. “హమ్మయ్య...” భార్యాభర్తలిద్దరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

“ఇంకేం పద వెళ్ళిపోదాం...” కారు స్టార్ట్ చేసాడు.

స్థంభంపై కూర్చుని ఉన్న ఆ పక్షి...  కోపంగా రెక్కలను టపటపలాడించింది.

“సారపాక వరకూ వెళదామా...?” అడిగింది. సాధారణంగా బ్రిడ్జినుండి రివర్స్ చేసుకోవాలంటే, సారపాక వరకూ వెళ్ళి, కారును టర్న్ చేసుకుని రావడమే తనకు తెలుసు.

“ఎందుకు...? ఇక్కడే టర్న్ చేసుకుని వెళ్ళిపోదాం...!”  ఫస్టు గేర్ వేసి, కాస్త ముందుకు పోనిచ్చి, రివర్స్ గేర్ వేశాడు.  వాస్తవానికి ఆ స్థలంలో కారు టర్న్ చేసుకోవడం సాధ్యం కాదు. ముఖ్యంగా పగలు బ్రిడ్జి రద్దీగా ఉండటం వలన అస్సలు వీలుపడదు. రాత్రి కాబట్టి, వెహికిల్స్ ఏవీ రావడం లేదు కనుక, కాస్త ట్రై చేస్తే ఇక్కడే వెనక్కి తిప్పుకుని వెళ్ళిపోవచ్చని నాగేంద్ర ఆలోచన. ఆ రోడ్డుకు ఇరువైపులా లోయ ఉండటం వలన... ఏ కాస్త అజాగ్రత్తగా ఉన్నా... కారు, కారుతో పాటు తమ ఫ్యామిలీ లోయలో పడిపోతారని నాగేంద్రకు తెలుసు.

అందుకే, జాగ్రత్తగా గేర్లు మారుస్తూ... కారును కొంచెం వెనక్కి పోనిచ్చి, మళ్ళీ కాస్త ముందుకు జరిపి స్టీరింగ్ ని తిప్పుతూ, టర్న్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఆ పక్షి... కాస్త నెమ్మదించి వాళ్ళనే చూడసాగింది.

సరిగ్గా... అప్పుడు జరిగింది... చీకటిలో సరిగ్గా చూసుకోకపోవడం వలన వెనకకి టర్న్ చేయడంలో కారు వెనక టైరు... రోడ్డు అంచుకు దిగిపోయింది. ఇంకో టైరు రోడ్డు చివరన సగానికి నిలబడిపోయి ఉంది. ఆక్సిలేటర్ తొక్కినా... కారు ముందుకు జరుగకపోగా... వర్షంతో మెత్తబడిన నేల జారి, బండిని వెనక్కి లాగేస్తుంటే... అప్పుడు అర్ధమైంది నాగేంద్రకి తను చేసిన తప్పేమిటో...! వెంటనే.... బ్రేక్ పై కాలు వేసి తొక్కిపట్టాడు. కారు ప్రమాదం అంచుల్లో ఉందని తెలిసిపోయింది. ఏ క్షణమైనా... జారిపోయి, లోయ అడుగుభాగంలోకి దొర్లుకుంటూ పడిపోయే పరిస్థితి.

ఒక్కసారిగా కళ్ళు భైర్లు కమ్మాయి. తమాయించుకుంటూ... కారులో ఉన్న భార్యవంక పిల్లలవంకా తలతిప్పి చూసాడు. అమాయకంగా నిద్రలో జోగాడుతున్న పిల్లలు, “ఏమైంది...?” అన్నట్లుగా ప్రశ్నార్ధకంగా చూస్తున్న భార్య...

వెనుకకు తిరిగి చూసాడు. లోతైన లోయ... చేతులు చాచి... “రారమ్మని” ఆహ్వానిస్తున్నట్లు. చిమ్మచీకటి, మృత్యువులా నాళుక చాపి వాళ్ళను కారుతో సహా అందుకోబోతున్నట్లు... నాగేంద్రకు చెమటలు పట్టేశాయి. అరికాళ్ళల్లో వణుకు. ఎంత పెద్ద తప్పు చేసాడు తను... పగలే అక్కడ టర్న్ తీసుకునే ప్రయత్నం చేయరెవరు. ఈ చీకటిలో తను నిర్లక్ష్యంతో తీసుకున్న ఓవర్ స్టెప్... ఇంతటి ధారుణానికి దారితీస్తుందని ఊహించలేదు. ఇప్పుడెలా...???

అతని తల బ్రద్ధలవుతుంది.ఎవరివో ప్రాణాలు కాపాడాలని వచ్చిన తను, తన కుటుంబం ప్రాణాలను రిస్క్ లో పెట్టుకున్నాడు. చుట్టూ చూసాడు.... అది అర్ధరాత్రి అవడంతో అటుగా వెహికిల్స్ ఏవీ రావడం లేదు.

ఒక్క ఇంచు వెనక్కి కదిలినా.... కనీసం ముందుకు కదల్చడానికి ప్రయత్నించినా కారు లోయలోకి పడిపోతుంది. అతనికి ముచ్చెమటలు పోస్తున్నాయి. కార్ బ్రేక్ పై కాలును తొక్కిపట్టి....ఇంజన్ ఆన్ చేసి అలాగే కూర్చుండి పోయాడు.. ఇప్పుడు తన ప్రాణాలు, తన కుటుంబం ప్రాణాలు... కారు బ్రేక్ పై ఉన్న అతని పాదాలలో ఉన్నాయి. రెండు కాళ్ళూ భయంతో వణకి పోతున్నాయి.
లాభం లేదని... వెంటనే త్రివేణితో అన్నాడు... "నువ్వు అర్జంటుగా క్రిందకి దిగి... పిల్లల్ల్నిద్దరినీ కారులోంచి దింపేసి దూరంగా వెళ్ళి నిల్చో" అన్నాడు.

“ఎందుకూ...?” భయంగా అడిగింది.

“మనం ప్రమాదంలో ఉన్నాము. కారు వెనుక టైర్లు రెండూ... రోడ్డు అంచున దిగబడిపోయాయి. ఎంత ప్రయత్నించినా... పైకి తీసుకురాలేము. వదిలేస్తే... అందరమూ లోయలో పడి చచ్చిపోతాము. ప్లీజ్... నువ్వయినా క్రిందకి దిగి, నీ ప్రాణాలు, పిల్లల ప్రాణాలు కాపాడుకో...” నెమ్మదిగా చెప్పాడు.

త్రివేణి భయంతో బిగుసుకుపోయింది. చేష్టలుడిగి అలాగే చూస్తుండిపోయింది.

“ఏమైంది... దిగు...!” తొందర చేసాడు.

“ఊహు...” తల అడ్డంగా ఊపింది. “వెళ్ళను... నేనూ, పిల్లలూ నీతోనే..." స్థిరంగా అంది ఏడుస్తూ. అతనికి కన్నీళ్ళు వస్తున్నాయి.... రామయ్యా... ఇప్పుడు నా భార్యా పిల్లలను ఎలా బతికించుకోనూ...???

ఏదో అయిడియా వచ్చి..... ముందు ఇంటికి ఫోన్ చేసింది త్రివేణి. అవతలనుండి ఎవరూ లిఫ్ట్ చేయలేదు.  వెంటనే భద్రాచలంలో కొలిగ్స్ అందరికీ ఫోన్స్ చేయడం మొదలెట్టింది.  అందరూ మంచి నిద్రలో ఉన్నారేమో... ఎవ్వరూ ఫోన్ ఎత్తడం లేదు. అయినా... ప్రయత్నించడం మానేయలేదు. కొంచెం సేపు చూసి, “ఎవ్వరూ ఫోన్ ఎత్తడం లేదండీ...!” ఏడుస్తూ చెప్పింది త్రివేణి.

ఏవైనా వెహికిల్స్ వస్తాయేమో అని చుట్టూ చూస్తున్నాడు నాగేంద్ర... దాదాపూ పదిహేను నిమిషాలు గడిచాయి. ప్రయోజనం శూన్యం...
అరచేతుల్లో... చమటలు పట్టి, స్టీరింగ్ పై గ్రిప్ జారిపోతుంది. కాళ్ళల్లో వణుకుతో బలం సన్నగిళ్ళుతుంది. ఎక్కడ బ్రేక్ పై కాలు తేలికైపోతుందా అని టెన్షన్ పడుతున్నాడు.

ఏదైతే అది అవుతుంది..... మరోసారి గట్టిగా ప్రయత్నించాలా... ఆలోచిస్తున్నాడు. 

ఆ పక్షి.... వాళ్లనే చూస్తోంది. దాని కళ్ళల్లో... క్రూరమైన ఆకలి.

“పక్కనే పార్క్ లో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం చూసి మనసులోనే మొక్కుకున్నాడు... భగవాన్... ఈ పరిస్థితినుండి రక్షించు...” దిక్కు తోచనట్లుగా చూస్తోంది త్రివేణి...

ఆఖరుసారిగా అభ్యర్ధనగా అడిగాడు... “త్రివేణీ... ప్లీజ్..... పిల్లల్ని తీసుకోని క్రిందకి దిగిపో...!”

“ఊహూ....కావాలంటే బ్రేక్ వదిలేయండి...!” తల అడ్డంగా ఊపి, చేతుల్లో ముఖం దాచుకుని బిగ్గరగా ఏడ్వసాగింది త్రివేణి. దాంతో పిల్లలకు మెలకువ వచ్చి, తల్లిని చూసి వాళ్ళూ ఏడుపందుకున్నారు.

నాగేంద్ర గుండెలవిసిపోయాయి.

“క్రీం... క్రీం....” అప్పుడు మ్రోగింది......సెల్ ఫోన్....

ఒక్కసారిగా... ప్రాణాలు లేచొచ్చాయి ఇద్దరికీ....

చప్పున ఫోన్ ఎత్తి...అవతల ఎవరో కూడా చూడకుండా... “హెలో... హెలో.... నేను...!” అరిచేసింది త్రివేణి.

అవతలనుండి నాగేంద్ర స్నేహితుడు సుధాకర్. గుక్కతిప్పుకోకుండా అతనికి విషయం చెప్పేసింది.

********

అయిదు నిమిషాల్లో ఇంకో ఫ్రెండ్ ని తీసుకుని బండి మీద ఆ స్థలానికి పరుగెత్తుకొచ్చాడు సుధాకర్.  అప్పటికే బ్రిడ్జి మీద ఓ రెండు ఫోర్ వీలర్స్ ఆగి ఉన్నాయి. ఒకటి రెడ్ మారుతి, రెండవది తెల్లని అంబాసిడర్.  మోతుగూడెం వాటర్ ఫాల్స్ చూడడం కోసం హైదరాబాదు నుండి వస్తున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్లంతా. బ్రిడ్జి మీదకి వస్తూనే... నాగేంద్ర వాళ్ళ వెహికిల్ ఏదో ప్రమాదంలో ఉందని దూరంనుండే గ్రహించేసారు. గబ గబా కార్లు ఆపి, ముందుగా త్రివేణిని, పిల్లలను క్రిందకి దింపి, అందరూ కలిసి, ఎలాగోలా కష్టపడి కారును ముందుకు తోసి, వాళ్లని కాపాడారు.

త్రివేణి దు:ఖంతో వాళ్లందరికీ చేతులెత్తి మ్రొక్కేసింది. “అక్కా... నో... ప్లీజ్...” వారించారు వాళ్ళంతా. వెళుతున్నామంటూ... “టా టా” చెప్పి, బయలుదేరి వెళ్ళిపోయారు.

ఆ పక్షి... రెక్కలను టపటపలాడిస్తూ... ఒక్కసారిగా పైకి ఎగిరి, బయలుదేరి పోతున్న మారుతి, అంబాసిడర్లను అనుసరించింది.
నాగేంద్రను పక్కకు జరిపి, సుధాకర్ కారు డ్రైవ్ చేసుకొని వచ్చి భార్యాభర్తలను, పిల్లలను ఇంట్లో దించి వెళ్లాడు. పీఢకలలా గడచిన ఈ రాత్రిని తలచుకుంటూ అంతా కలత నిద్రలో ఉండిపోయారు.

********

తెల్లవారుతూనే... సుధాకర్ నుండి ఫోన్ వచ్చింది. “బావా.... పేపర్ చూసావా...?” నాగేంద్ర నిద్రలోనుండి కళ్ళు తెరచి, “లేదు... ఏం...?” అడిగాడు.

“నిన్న మీ మీదనుండి తప్పిపోయిన చావు... వేరే వాళ్లని బలితీసుకుంది.”

నాగేంద్రకు అర్ధం కాలేదు. “అర్ధమయ్యేలా చెప్పు...”

“నిన్న రాత్రి, మిమ్మల్ని సేవ్ చేసిన హైదరాబాదు స్టూడెంట్స్...కార్లు రెండూ చింతూరు ఫారెస్టులో ఓ వాగులో పడిపోయాయి. వాటిల్లో ఉన్నవాళ్ళంతా చనిపోయారు.” చెప్పాడు.

దిగ్గున మంచం మీదనుండి లేచి, పక్కనే ఉన్న పేపర్ తీసి చూసాడు. నీళ్ళల్లో మునిగిపోయిన రెండు కార్లను క్రేన్ సహాయంతో బయటకి తీస్తున్న ఫోటోలు. అప్పటికే,  టి.వి.లో వస్తున్న న్యూస్ చూసి పరుగు పరుగున బెడ్ రూమ్ లోకి వచ్చిన త్రివేణి, “ఏమండీ....!” అని ఏదో చెప్పబోయి, భర్త పేపర్ చూస్తుండడంతో... ఆగిపోయింది. వాళ్ళిద్దరి కళ్ళముందు... ““అక్కా... నో... ప్లీజ్... అలా చేయొద్దు...” నవ్వుతూ వారిస్తూ... టాటా చెప్పి వెళుతున్న వాళ్ళ  లేత నవ్వులే కనబడుతున్నాయి.

నాగేంద్రకు, సుధాకర్ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి....

“నిన్న మీ మీదనుండి తప్పిపోయిన చావు... వేరే వాళ్లని బలితీసుకుంది.”

అంటే.... అంటే...... ఒకరికోసం వచ్చిన మృత్యుదేవత... ఆఖరు నిమిషంలో వారు గాని తప్పిపోతే... దొరికిన ఇంకెవరినైనా
తీసుకెళ్ళిపోతుందన్నమాట....! ఆ ఆలోచనకే... ఒళ్ళు జలదరించింది.

సరిగ్గా అదే సమయంలో... చింతూరు వాగులో జరిగిన యాక్సిండెంట్ స్పాట్ వద్ద ఉన్న ఫారెస్టు లోని ఓ ఎత్తైన చెట్టుమీద కూర్చున్న ఆ పక్షి... తన పని ముగిసినట్లు... అక్కడినుండి లేచి ఎక్కడికో ఎగిరిపోయింది.

మరిన్ని శీర్షికలు
poems