Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
shopping

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఆరోజులు వెళ్ళిపోయాయి - భమిడిపాటిఫణిబాబు

days

సాధారణంగా కొందరిని చూస్తూంటాము, జంతువులనో పక్షులనో పెంచుకోవడం, విదేశాల్లో అయితే పులిపిల్లలని కూడా పెంచుకుంటారుట. ఎవరిష్టం వారిదీ.. ఒకలా తీసుకుంటే మనకి పాలిచ్చే ఆవు, గేదె కూడా పెంపుడు జంతువుల కోవలోకే  వస్తాయి కదా.. అదృష్టమేమిటంటే, మరీ ఏనుగు ని పెంచుకునేవారిని గూర్చి వినలేదింకా. ఎంతైనా దాన్ని పోషించడానికి కొంచం ఖర్చెక్కువనేమో.. ఈ పెంపుడు జంతువులని తమ స్వంత పిల్లల్లా చూసుకుంటారు..ఒక్కోప్పుడు పిల్లలకంటే ఎక్కువగా, బహుశా నోరులేని జీవాలనేమో.. అందులో తప్పేమీ లేదు.
  సాధారణంగా తమ పిల్లలకి క్రమశిక్షణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.. వాళ్ళుకూడా తల్లితండ్రులు చెప్పిన మాట వినేరకమే.. ఇదివరకటి రోజుల్లో ఎప్పుడైనా చిన్న పిల్లలు మితిమీరి అల్లరి చేస్తే, తల్లో తండ్రో ఒక్కసారి గుడ్లెర్రచేసో, చేత్తో చూపిస్తేనో, అల్లరి ఆపేసేవారు. కానీ ఈరోజుల్లో పరిస్థితులు మారిపోయాయి.

గారం అనండి, తల్లితండ్రుల్లో మొలకెత్తిన అబధ్రతా భావం అనండి, చిన్న పిల్లల  I Q  కూడా మోతాదెక్కువే…  ఆరోజుల్లో, చిన్నపిల్లలు ఏడిస్తే, ఏ ఆటబొమ్మో ఇస్తే ఊరుకునేవారు, ఆరోజులు వెళ్ళిపోయాయి. ఇప్పుడంతా మొబైల్, రిమోట్ల యుగమాయె. ఏదో ఒకటిస్తేనే కానీ పేచీ ఆగదు. తల్లితండ్రులుకూడా దానికి అలవాటైపోయారు.. పోనిద్దురూ ఎవరి సావకాశం వారిదీ. కానీ వీళ్ళెవరింటికైనా వెళ్ళినప్పుడు, కొంతమంది పిల్లలకి, ఆ ఇంట్లో ఉండే, మొబైల్, రిమోట్లమీదే కళ్ళుపడతాయి.. ఇంక ఊరుకోవడమంటూ ఉండదు, వెంటనే అదేదో చేతిలోకి తీసుకుని కెలికేదాకా ఊరుకోడు. ఇదిమాత్రం, కొందరికి ఇబ్బందిగా ఉంటుంది, పోనీ ఆ పిల్లాడి పేరెంట్స్ ఏమైనా కలగచేసుకుని, కంట్రోల్ చేస్తారేమో అని చూద్దామా అంటే, అబ్బే వాళ్ళు తమ “ ఆంఖోకా తారా “ తెలివితేటలు చూసి మురిసిపోతారు తప్ప, “ కాదమ్మా అలా ప్రతీదీ తీసేయకూడదు “ అని మాత్రం ఛస్తే చెప్పరు.. ఇక్కడ ఈ గృహస్థు మాత్రం కంగారుపడిపోతూంటాడు, అసలే ఈ వచ్చినవాళ్ళు , తమని చూడ్డానికి వచ్చినవాళ్ళాయె, ఏ మొబైల్లో తగలేస్తే, కొడుకూ కోడలూ ఏమంటారో ఏమో. ఎరక్కపోయి పిలిచానురా బాబూ అనుకోవడం తప్ప చేసేదీ లేదు. పోనీ తనే చొరవ చేసి, ఆ మొబైలేదో ఆ పిల్లాడి చేతులోంచి తీసేసుకుందామా అంటే, ఆ వచ్చిన వాళ్ళ  so called  మనోభావాలు ఏమైనా  hurt  అవుతాయేమో అని భయం.. ఆ దేవుడిమీద భారం వేయడమే. ఇవి పిల్లల సంబంధిత సమస్యలు. ప్రాణాంతకం  కాకపోయినా, ఎవరింటికైతే వెళ్ళేరో వాళ్ళకి సమస్యలు తెస్తూంటాయి.

గదిలోకి వెళ్ళి తలుపు భళ్ళున వేసేసికోవడం ఓ పిల్లాడికి ఆటగా ఉంటుంది. వాళ్ళింట్లో అయితే, తాళాలు బయటే ఉంటాయికాబట్టి ఫరవాలేదు… కానీ అదే ఇంకోరి ఇంటికి వెళ్ళి చేస్తే,  తలుపులు బద్దలుకొట్టాల్సొస్తుంది. కొంతమంది తల్లితండ్రులు, ఎవరైనా వారింటికి వచ్చినప్పుడు, ఆటవస్తువులు దాచేస్తూంటారు… అదే తల్లితండ్రులు ఎవరింటికైనా వెళ్ళి, అక్కడి ఆటవస్తువులు తగలెట్టినా, పిల్లల్ని కంట్రొల్ చేయరు.

పిల్లల్లాగే కొంతమంది కుక్కలూ, పిల్లులూ కూడా పెంచుతూంటారు. వాళ్ళింట్లో వాళ్ళిష్టమే.. కానీ ఆ కుక్కని, కాలకృత్యాలు చేయించడానికి వీధిలోకి తీసికెళ్ళినప్పుడు, దాని మెడకు ఓ గొలుసు వేయాలని ఎందుకు గుర్తుండదో?  చాలామంది వేస్తూంటారు, కానీ వందలో పదిమందికి, వాళ్ళ కుక్కని వదిలేయడం ఓ దౌర్భాగ్యపు అలవాటు..కొత్తగా ఎవరినైనా చూస్తే,  అరవడం, వాళ్ళమీదకి ఎగరడం చూస్తూనే ఉంటారు పక్కనుంచి.. అయినా సరే “ ఏమీ చేయదండీ..” అంటారే కానీ దాన్ని కంట్రొల్ మాత్రం చేయరు… కొంతమందికి కుక్కలంటే భయం, అలాటివారు కుక్కలున్న ఇంటికి వెళ్తే నరకమే.. దాన్ని కట్టేస్తే దాని మనోభావాలు దెబ్బతింటాయట.. అందుకోసం, మనతోనే ఉంటుందిట. ఇవేం ప్రేమాభిమానాలో? పైగా ఆ కుక్కకి “ అంకుల్ వచ్చారు హలో చెప్పమ్మా.. “ అంటూ కబుర్లోటీ.. ఇక్కడ ఆ వెళ్ళినతనికి  B P  పెరిగిపోతూంటుంది. అలాగే  ఎపార్ట్మెంట్లలో పెంపుడు పిల్లుల్ని వదిలేస్తూంటారు.. రాత్రిళ్ళు బయట  పెట్టిన చెత్త బుట్టలన్నిటినీ బలవంతంగా పీకి పరిసరాలు ఖరాబు చేస్తూంటాయి. అయినా సరే, ఈ పెంపుడుపిల్లి యజమాన్లకి ఏమీ పట్టదు.

కుక్కల్నీ, పిల్లుల్నీ పెంచుకోవడం వద్దనడం లేదు, కానీ వాటిని బయట వదిలినప్పుడే అసలు గొడవంతానూ.. కొద్దిగా బయటివారి గురించికూడా ఆలోచించే సంస్కారం కూడా ఉంటే, అందరికీ బావుంటుంది…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
weekly horoscope16th november to 22nd november