ఆశ ఆవిరైపోయింది
నా మనసు
వెలిసిపోయిన వానలాంటిదే కావొచ్చు
అయినా ..
ఎక్కడో ఒక్క చినుకు తడి
గుండె గదిలో మిగిలిపోయిందనుకుంటా ..
అందుకే కళ్ళు పదేపదే
చెమర్చుతున్నాయి !
నిండు పున్నమిలో
కురిసే వెన్నెలలా ..
కలకాలం నీతో ఉండాలనే
ఆశ ఆవిరైపోయింది !
నువ్వు మోసం చేశావనే బాధ
గుండెను పిండేస్తోంది ..
మంచుకొండవై ..
అమావాస్యపు నిశీధిలో
సమిధవై ...
గ్రీష్మంలో సేదతీర్చే
అమృత ధారవై ...
నా తోడువై ...నీడవై
నిరంతరముంటావనే
అభిలాష అశనిపాతమైపోయింది !
నన్ను నింగిలో ఒంటరి తారని చేసి
ఆ కాంతి వెలుగులో
నువ్వు కరిగిపోతూ ఆనందిస్తున్నావా !?
***********
ఎంత కాలం ఈ నిరీక్షణ
నేను కోరుకున్నది నిన్నేనని
నిన్ను చూశాకే తెలిసింది!
ఊహించని అద్భుతం
ఉన్నట్టుండి నాకై ఎదురొచ్చినట్టుంది!!
నీ రాక నన్ను పూర్తిగా మార్చేసింది
నిజ్జంగా.... నిజం
నిన్నటిదాకా నా మనసు మహా ఎడారే..!
ఆప్యాయతానురాగాలు ఎండమావులే!!
నీ చెలిమితో నీటి చెలమలు కనిపించినాయి
నీ మంచితనం మల్లెల పరిమళాలు వెదజల్లింది
నీ పలకరింపులో జలపాతాల హోరు వినిపించింది
అమావాస్యలో కూడా పున్నమి కాంతి కనిపించింది
నీ ప్రేమతో వీచే గాలి నన్ను స్పృశించగానే
నా శ్వాస మరింత అహ్లాదాన్నిస్తోంది
ఇంత వింత ఎలా జరిగిందో అంతు చిక్కడం లేదు..!!
నా మనసు అనుక్షణం నీతోనే మాట్లాడుతోంది
నా చూపు నీతో పెనవేసుకు పోయింది!!
ఇప్పుడు నాకే నేను కొత్తగా కనిపిస్తున్నాను
నాకు నువ్వున్నావనే భావనే
నా హృదయం నిండా నిండుంది
నాలోని ప్రతి అణువు గర్వంలో ఉప్పొంగుతోంది.
***********
పరిపూర్ణం
చీకట్లో విశ్రమిస్తేనే
వెలుగులో పని చేసుకోగలం..
అభివృద్ధికి బాటలు వేసుకోగలం..
బాధల్లో రాటుతేలితేనే
సుఖాలను సొంతం చేసుకోగలం..
మనసు పొరల్లో భద్రపరుచుకోగలం...
ఏ గ్రంధాల్లో చదివినా ..
ఏ మహానుభావుడు చెప్పినా ..
అదే కదా అసలు విషయం !!
జీవితమంటేనే నవరసాల పోషణo
షడ్రుచుల సమ్మేళనం
అవి అందరూ అనుభవించాల్సిందే ..
కాకపోతే నిష్పత్తులు మారతాయి
కాలం కాస్త కలిసొస్తే
దానికి పూర్వ జన్మ సుకృతమని ..అదృష్టమని
అనుకుంటాం
కష్టకాలం వస్తే కర్మఫలం అనుకుంటాం
గెలుపు, ఓటములేవీ
మన చేతుల్లో లేవు
గీత -రాత అనుకున్నప్పుడు
యధాతథ జీవితాన్ని
'పరిపూర్ణం' గా అనుభూతించగలం ..!
***********
పరిహాసం
మనసింకా నీ చుట్టూ విహరిస్తూనే వుంది
ఆనంద తీరాలవెంట పరుగులు తీస్తూనేవుంది
ఇంత కాలం నీ సాన్నిహిత్యంలో
పరిమాళాలు వెదజల్లిన విరులు
కాలం పెట్టిన పరీక్షలో
వాడిపోతాయేమోనని భ్రమ పడ్డాను కానీ...
ఆ సుమాలు సుగంధాలను
నేటికీ వెదజల్లుతూనే నన్ను
పరవశింపజేస్తూనే ఉన్నాయి
నీ మాటలు తలిచిన ప్రతిసారీ
చేతన్య దృక్పథం నాలో
కొత్త ఆశలని చిగురింపజేస్తుంది
నా హృదయంలో ఎంతో కాలంగా
నెలకొను ఉన్న శూన్యన్ని
నీ ప్రేమామృత ధారలతో నింపేశావు
మనని విడదీయాలని చూసిన విధికి
నా మదినిండా కొలువై వున్న
నిన్ను చూపించాలని వుంది
నా అంతరంగం నుండి నిన్ను
వేరు చెయ్యలేని దాని
దుర్బలత్వాన్ని పరిహసించాలని ఉంది...!
***********
స్వేఛ్చగా విహరిస్తున్నా..
కొత్తగా విచ్చుకున్న రెక్కలతో
ఇన్నాళ్ళకి వినీలాకాశంలో విహరిస్తున్నా
రకరకాల మనుషులు.. మనస్తత్వాలు
పైపై పొగడ్తలు..
లోలోపల తెగడ్తలు..
వివక్ష చూపే కపట ప్రేమలు
ఎప్పటికప్పుడు నన్ను అగాధంలోకి
పడదోయాలనే అహంకారపు
మాటల్ని ఎదిరించి..
ఇప్పుడిప్పుడే ఎదిరిస్తున్నా
భావోద్వేగాలతో బంధించి
నా సామర్ధ్యాన్ని కట్టడి చెసే
ఆంక్షలని ధైర్యంగా ఛేదిస్తున్నా
నన్ను ఓటమిపాలు చెయ్యాలని
నా పతనాన్ని కనులారా చూడాలని
ఆరాటపడే వారితో..
అక్షరమనే ఆయుధంతో యుధ్ధం చేస్తూ
నా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ
స్వేఛ్ఛగా విహరిస్తున్న.
సుజాత పి.వి.ఎల్
|