గోతెలుగు 300
గోతెలుగు ఒక బంగారు నాణెం . ఆ నాణేనికి బొమ్మ గోతెలుగు , బొరుసు బన్ను. మూడువందల సంచికల క్రితం బన్నుకి, బాపూ గారు ఒక వరం ఇచ్చారు. అదే గోతెలుగు లోగో. అంతర్జాల పత్రిక నడిపే అనుభవం అప్పటికే నిండుగా అబ్బివున్నందువల్ల ఆలస్యం చేయకుండా బన్ను "గో" అనుకున్నాడు. జేబులోంచి నాణెం తీసి గాల్లోకి విసిరాడు. బొమ్మయినా , బొరుసైనా టాస్ గెలిచినట్లే లెక్క. పత్రిక కి మెరుపులు దిద్దాడు. పాఠ కుల ముందుంచి సెభాస్ అనిపించుకున్నాడు.
బన్ను ని నాలుగు దశాబ్దాలుగా నేనెరుగుదును. ఇంజనీరింగు పట్ట భద్రుడు. అసలు సిసలు తెలుగు కార్టూనిస్టు. తెలుగు భాష అభిమాని. తెలుగు గడ్డ బిడ్డ. తెలుగుకి తనవంతు సేవ చేయాలన్న ఆకాంక్ష తోనే పత్రికారంగం లో రంగప్రవేశం చేసిన సాహసవంతుడు.
పత్రిక నడపడం తేలికైన పని కాదు. ఒక్కడివల్లే సాధ్యమూ కాదు. అనేకమంది మేధావుల ను తనకి తోడుగా, అంతర్జాల పత్రిక ను సజావుగా నడపగలిగే సాంకేతిక నైపుణ్యం కలిగిన సిబ్బంది అండగా పెట్టుకుని, ధైర్యంగా తన స్వంత డబ్బు ఖర్చు తో ,గోతెలుగు వార పత్రికను నిరావధికంగా నడిపిస్తున్నాడు. ప్రతి శుక్రవారం మధ్యాన్నం ఠంచను గా మన ఫొనులో, టాబ్లో , కంప్యూటరులొ గోతెలుగు ప్రత్యక్ష మవుతుంది. కం వాట్ మే!
ఆ మధ్య బన్నూని అడిగాను.ఇన్నేళ్ళుగా పత్రిక కి ఖర్చవుతోంది కదా. బ్రేక్ ఈవెన్ వచ్చిందా అని. సమాధానం గా, 'వచ్చింది', 'లేదు'అంటాడేమో అనుకున్నా. తడుముకోకుండా 'రాదు'అన్నాడు.
అవును , 'సేవ ' చేయాలన్న ఆకాంక్ష వున్న వాడు ఖర్చే చేస్తాడు. సెభాస్ బిడ్డా అనుకున్నాను.
అలా అని డబ్బును వెదజల్లే దుబారా వ్యక్తి కాడు బన్ను. కష్టమెరిగిన వాడు. వ్యాపారంలో నష్టాలని చవిచూసిన వాడు.
నన్ను ఎంతో గౌరవంగా గురువు గారూ అని పిలుస్తాడు. ప్రేమతో పుత్రవాత్సల్యం తో తరచూ పలకరిస్తాడు. నేనూ, నా సతీమణి , హైదరాబాదు వస్తే తన స్వగ్రుహంలోనే బస ఏర్పాటు చేసి మాకు అన్ని సౌకర్యాలూ తనూ , అతడి భార్య శ్రీమతి పద్మ, స్వయంగా చేసి పెడతారు. నామీద ఇంతటి అభిమానం ఎందుకు అని ఆశ్చర్య పోతుంటాను. నేను అతడికి విద్య నేర్పించిన గురువునా ..కాను. కార్టూనింగులో అతడే కావలసిన మెళకువలను అభ్యసించి నిలదొక్కుకున్నాడు. మరి? ఏదైనా సలహాలడిగితే నాకుతోచినది చెబుతానంతే. ఆ మాత్రం అతడికి చాలు. వయసు మల్లినవాడికి మర్యాదివ్వాలని అతడి తల్లి తండ్రులు ,అత్త మామలు నేర్పించిన ధర్మ సూత్రాన్ని పాటిస్తున్న మంచి బాలుడు.
చిరంజీవి బన్ను, అతడి కుటుంబ సభ్యులు ఆయురారోగ్య అయిశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలనీ, గోతెలుగు పత్రిక అశేష తెలుగు పాఠకుల మన్ననలను పొంది మరో వెయ్యిన్ని మూడువందల సంచికల మహొత్సవం జరుపుకోవాలని సర్వేశ్వరుడిని ప్రార్ధిస్తాను.
- కార్టూనిస్ట్ జయదేవ్.
************
' వెబ్ ' పత్రికల వెలుగు-గోతెలుగు
సుదీర్ఘ్ ప్రస్థానంలో పత్రికలు దాటిన మైలురాళ్ళెన్నెన్నో...చేరుకున్న మజిలీలెన్నెన్నో....ఎగరేసిన విజయపతాకాలెన్నెన్నో....కాలం, పాఠకుల అభిరుచులను సమాదరిస్తూ పత్రికలు తొక్కుతున్న కొత్తపుంతలెన్నో...ఎన్నెన్నో....అత్యాధునిక సాంకేతికతను అందుపుచ్చుకుని మరీ ముద్రణారంగం నుంచి ప్రగాఢ ముద్ర వేసే దిశగా వెబ్ ప్రపంచంలో దూసుకుపోతున్న పత్రికల ప్రయాణం ఆద్యంతం సమ్మోహనం. వెబ్ ప్రపంచానిదే భవిష్యత్ అన్న సత్యాన్ని ముందుగానే ఊహించిన ప్రముఖ కార్టూనిస్ట్ బన్నుగారు ప్రారంభించిన వెబ్ మాగజైన్ 'గో-తెలుగు ' వత్సరాలు గడుస్తున్నకొద్దీ నవ్యచరిత్ర లిఖిస్తూ పత్రికల సరికొత్త ప్రయాణానికి దిక్సూచిలా నిలిచిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇంటింటికీ ఇంటర్నెట్ విస్తరించిన ప్రస్తుత తరుణంలో అభిరుచిగల పాఠకులకు ఒక్కక్లిక్ దూరంలో ' గో-తెలుగు ' అందుబాటులో ఉంది. అంతేన, ప్రింట్ మాగజైన్ లు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైతే..వెబ్ మాగజైన్ ల విస్తృతి ప్రపంచవ్యాప్తం. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఉన్న తెలుగువారినైనా పలకరించి అక్షరమైత్రినందించే మాగజైన్ గా ' గోతెలుగు ' కీరిపతాక దిగంతాలనంటింది. అవును, ఇండీవుడ్ ప్రొఫెషనల్ ఎక్సలెన్సీ అవార్డుని సైతం బన్నుగారు అందుకున్నారంటే గోతెలుగుని బన్నుగారు ఎంత అంకితభావం, నిబద్ధతతో తీసుకొస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కథలు, సీరియల్స్, కార్టూన్లు, వివిధ శీర్షికలు, తీర్థయాత్రలు, సినీవినోదాలతోబాటు కొత్తగా ఈమధ్యే మనమధ్యకొచ్చిన కవితల శీర్షిక కూడా గోతెలుగుకి వన్నెతెచ్చింది. కవితాప్రియుల్ని అలరిస్తోంది.
గోతెలుగుతో నా సాహితీ అనుబంధం ప్రగాఢమైనది. నడిచేనక్షత్రం, డెత్ మిస్టరీ సీరియల్స్తో బాటు ఎన్నో కథలు గోతెలుగు ద్వారా వెలుగు చూసాయి. గోతెలుగు త్రిశత సంచిక గొప్పమైలురాయి. ప్రపంచవ్యాప్తంగా వారంవారం ఎంతోమందిని అలరిస్తున్న ఈ పత్రిక ' వెబ్ ' పత్రికలకే వెలుగు. ఈ వెలుగు దారిలో ఇలాగే ప్రయాణిస్తూ మరిన్ని సంచలనాలు నమోదు చేసుకోవాలనీ, సంబరాలు జరుపుకోవాలనీ మనస్పూర్తిగా కోరుకుంటూ, గోతెలుగు విజయసారథి, ఆత్మీయులు, శ్రీ బన్ను గారికీ, వన్నెతెచ్చే బొమ్మలతో కథలకు కొత్తసొగసులద్దే చిత్రకారులు, మాధవ్ మరియు రాం గార్లకూ, సహ రచయితలకు, కార్టూనిస్ట్ లకు ప్రతి ఒక్కరికీ అభినందనలతో....
పి.వి.డి.ఎస్. ప్రకాష్.
జర్నలిస్ట్, రైటర్.
**********
సారథికి, వారథికి నమస్సులు!
ముందుగా గోతెలుగుకు, బన్నుగారికి, ఎడిటర్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!
గోతెలుగు 300వ సంచిక. ఇది కేవలం ఒక సంఖ్య కాదు సమిష్టి నిబద్ధతకు నిదర్శనం. ఈ సందర్బంగా వ్యవస్థాపకుడు (సారథి)బన్నుగారికి, సంపాదకుడు (వారథి)మాధవ్ శుభాభినందనలు! మన తెలుగువాళ్లకి ఒక గుణం ఉంది. మధురానుభూతుల్నిచ్చే ప్రతిదాన్నీ మనసులో నిక్షిప్తం చేసుకుంటారు. మననం చేసుకుని మురిసిపోతుంటారు. కొండొకచో అక్కడక్కడా ఉదహరిస్తుంటారు కూడా! ఓ రవివర్మ చిత్రం, బాపూ బొమ్మ, విశ్వనాథ్ సినిమా ఇలా బోలెడన్ని చెప్పుకోవచ్చు. ఆ కోవలోకి చేరేదే గో తెలుగు. దేనికైనా ఆరంభం ఆడంబరంగానే ఉంటుంది. ఆరంభం నాటి స్ఫూర్తి కొనసాగించాలనీ ఉంటుంది. కానీ మధ్యలోనే తుంచుకుపోతుంది. గోతెలుగు ప్రారంభ సంచిక నుంచి 299వ సంచిక వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం గుబాళించే కొత్తదనమే. ఒకప్పుడు ప్రింట్ వార పత్రికల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుండేవాళ్లు, ఇప్పుడు అంతర్జాల పత్రిక గోతెలుగు కోసం అలాగే ఎదురు చూస్తున్నారు. ఎప్పటికీ ఎదురు చూస్తారు (మీ కమిట్ మెంట్ మీద నమ్మకంతో).
నా వరకు వస్తే మొదటి సంచికలోని కవిత మొదలు ఈనాటి కాత్యాయని సీరియల్ దాకా నా ప్రతిభ కన్నా వారి ప్రోత్సాహమే ఎక్కువని చెప్పొచ్చు. ఒక్క గోతెలుగులో నా కథలు వంద దాటాయంటే రచయితలకు ఎలాంటి స్థానాన్నిస్తారో ఊహించుకోవచ్చు. అలా అని నేను పంపిన ప్రతిదీ సెలెక్ట్ అయి ప్రచురించబడలేదు, నేపథ్యంలో నిర్ద్వందంగా తిరస్కరించడాలు, మార్పులు చేర్పులు అన్నీ జరిగాయి. ఎడిటర్ ప్రతిసారీ నా రచనా పటిమకు ఛాలేంజే! ప్రతాప భావాలు రెగ్యులర్ ఫీచర్ విజయవంతమైందంటే దాని వెనక మాధవ్ గారి కృషి ఎనలేనిది, ఎందుకంటే అలా ఒక ఫీచర్ రాయమని ప్రోత్సహించింది ఆయనే. ఇలా చెప్పుకుంటూపోతే ఇదీ ఓ సుదీర్ఘ వ్యాసం అవుతుంది.కొత్తవాళ్లని ప్రోత్సహించడం, రచనల విషయంలో రాజీపడక పోవడం, పత్రిక విడుదల విషయంలో కచ్చితత్వం పాటించడం, రచయితలతో సంబంధబాంధవ్యాలు ఇలా ఎన్నో ప్లస్ లు గోతెలుగును ఈ స్థాయికి చేర్చాయి. ఇవి చాలు 1000వ సంచికకు పునాదిగా నిలవడానికి. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ!
- ప్రతాప వెంకట సుబ్బారాయుడు , రచయిత
*****
గో-తెలుగు.కాం వారికి శుభాభినందనలు.. అందంగా ముస్తాబైన వారపత్రిక ద్వారా వైవిధ్యం ఉన్న శీర్షికలు, వ్యాసాలూ, కథలు, ధారావాహికలని క్రమం తప్పకుండా అందిస్తున్న సంపాదకులు బన్ను గారికి, వారి సంపాదక వర్గానికి శుభాకాంక్షలు. మేలైన సాంకేతిక, సాహిత్య విలువలతో గో-తెలుగు పత్రిక ప్రపంచవ్యాప్తిగా తెలుగువారిని అలరించడం ముదావహం. ప్రచురణకి వారు ఎన్నుకునే కథానికలు, శీర్షికలు, నవలాంశాలు ప్రత్యేకంగా ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు.. ప్రతి ప్రచురణని అత్యుత్తమ స్థాయిలో తీర్చిదిద్దాలన్న వారి తపన హర్షణీయం.
నా కథానికలు, ‘వేదిక’ నవల, ‘నాట్యభారతీయం’ శీర్షిక కూడా ప్రచురించడం ద్వారా నాకు ఎనలేని ప్రోత్సాహాలని అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంతున్నాను. ఈ మధ్యనే అవార్డు ఇండీవుడ్ మీడియా ఎక్స్లెన్స్ అవార్డుల కేటగిరీలో ప్రొఫెషనల్ ఎక్స్లెన్స్ అవార్డు గెలుచుకున్నందుకు వారిని అభినందిస్తూ..మరిన్ని విజయాల్ని అందుకోవాలని, పత్రిక ..వేలవేలు ప్రచురణలతో ముందుకు దూసుకు పోవాలని కోరుకుంటున్నాను..
ఉమాభారతి,
రచయత్రి, నాట్యగురువు - హ్యూస్టన్-U.S.A
*****
ఓహ్ 300 వ సంచిక , యెంత అపురూపం , యెంత ఆనందకరమైన విషయం . ఒకప్పుడు గొప్పకాకపోవచ్చు , కాని యీ రోజులలో , ప్రింట్ పత్రికల మధ్య ఒక అంతర్జాల పత్రిక సమర్ధవంతంగా 300 సంచికలను వెలువరించింది అంటే అధ్భుతం క్రిందే లెక్క . ఎన్ని పేరున్న పత్రికలు మూసుకుపోయి , పాఠకులలో పఠానా శక్తి తగ్గిపోయి రచయితలలో నిరాశ పేరుకుపోతున్న తరుణంలో అంతర్జాల పత్రికగా వచ్చి దేశవిదేశాలలో పాఠకులకు సంపాదించుకొని ముందుకు దూసుకు పోతున్న గోతెలుగు కలకాలం యిలాగే వుంటూ మంచిమంచి శీర్షికలను మా కందించాలని ఓ పాఠకురాలిగా కోరుకుంటున్నాను .ఈ పత్రికతో నా అనుబంధం చెప్పుకోవాలంటే రచయిత్రిగా నన్ను ప్రోత్సహించిన పత్రిక అని చెప్పుకోవాలి తప్పదు .2013 లో అనుకుంటాను , మొదటిసారి ట్రావెలాగ్ రాసి గొతెలుగుకి పంపేను . వెంటనే ప్రచురించి ప్రోత్సహించేరు . దాంతో నేను రాయగలనన్న నమ్మకం యేర్పడి యెన్నో రచనలు చెయ్యగలిగేను . సుమారు 250 ట్రావెలాగ్స్ ప్రచురింపబడ్డాయి , అలాగే లెక్కపెట్టలేదుగాని సుమారు ఓ పాతిక దాకా కథలు ప్రచురింప బడ్డాయి , అలా నన్ను రచయిత్రిని చెయ్యడమేకాక యెందరో అభిమానులను కూడా యిచ్చింది .
ఒక అంతర్జాల పత్రికను నిర్వహించాలి అంటే యెంతో పట్టుదల , ఓర్పు ముఖ్యంగా సాహిత్యాభిలాష వుండాలి , యివన్నీ కూడా ‘ బన్ను ‘ గారిలో వున్నాయి కాబట్టే యీ పత్రిక యింత పేరు సంపాదించుకొంది . పత్రిక ముఖ చిత్రం నుంచి ఆఖరు పేజీ వరకు గోతెలుగు సంపాదకవర్గం తీసుకొనే శ్రద్ద కనిపిస్తుంది .ఓ చిన్న జ్ఞాపకం యీ పత్రిక గురించి చెప్పక తప్పదు , మొదటిసారి నాకథ రాబోతోందని శుక్రవారం కోసం యెదురు చూసి గోతెలుకు సంచికలో నాకథ చూసుకోగానే ఆశ్చర్యం కథకి వేసిన ముఖచిత్రం మొత్తం కథ చెప్పెస్తోంది . అప్పటినుంచి ముందు ముఖచిత్రం చూసి కథ వూహించుకోడం ఓ అలవాటైంది .మరొక పెద్ద విషయం చెప్పక తప్పదు . రచనలకు పారితోషకం యిచ్చే మంచి అలవాటుని యిప్పటికీ కొనసాగిస్తున్న గొప్ప పత్రిక , మనసున్న పత్రిక .
పారితోషికం అన్నది రచయితలకు టానిక్ లాంటిది .గో తెలుగు మరెన్నో మైలు రాళ్లు దాటుతూ నిరాటంకంగా ముందుకు దూసుకు పోవాలని కోరుకుంటూ , యీ పత్రికని సమర్ధవంతంగా నడుపుతున్న సంపాదక వర్గాన్ని మరోమారు అబినందిస్తూ శలవు .
-కర్రా నాగలక్ష్మి, రచయిత్రి
*************
***********
గో తెలుగు డాట్ కామ్ అంతర్జాల పత్రిక అంతర్జాతీయ ఖ్యాతి నొంది ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగు వాళ్ల అంతరాంతరాల్లో అంతులేని ఆదరణని పొందిందనడానికి ఈ మూడొందల సంచికే నిధర్సనం. 42వ సంచికలో నేను రాసిన సీరియల్ "ఏజెంట్ ఏకాంబర్" ఆరంభమయింది. 46 వారాలు అంటే 88వ సంచిక వరకూ ధారావాహికగా వెలువడింది. ఇప్పుడు "అన్వేషణ" నా రెండో సీరియల్ మీ అందరి ఆదరాభిమానాలతో దూసుకుపోతోంది.
గోతెలుగు లాంటి ప్రపంచ పాఠకుల ప్రజాధరణ పొందిన అంతర్జాల పత్రిక ద్వారా మీకు నేను పరిచయం కావడం నా అదృష్టం గా భావిస్తున్నాను. మన ఈ గోతెలుగు డాట్ కామ్ పత్రిక 3000 సంచిక దాటి మరింత ముందుకు సాగాలని ఆశిస్తూ...ఆ సంచికలో కూడా నా సీరియల్ ఉండాలని...ఆశ పడుతూ... ఈ సంధర్భంగా ప్రధాన సంపాదకులు "బన్ను" గారికి... మాధవ్ గారికి అభినందనలు అందజేస్తున్నాను
-ఇందూ రమణ , రచయిత
**************************
గోతెలుగు.కామ్ వ్యవస్థాపకులు, ప్రధాన సంపాదకులు అయిన శ్రీ బన్నూ గారికి, సంపాదకులు శ్రీ మాధవ్ గారికి నమస్కారములు. గోతెలుగు.కామ్ 300 వ సంచిక విడుదల సందర్భం గా మీకు నా హృదయపూర్వక అభినందనలు. గోతెలుగు ప్రారంభం అయిన కొత్తల్లో కొన్ని వారాలు(అంటే సుమారు సంవత్సరం పాటు) నేను మిస్ అయినా, 49 వ సంచిక నుండి నేటివరకూ నేను కార్టూన్లు, కొన్ని కధలు పంపడం ద్వారా, గోతెలుగులో వచ్చిన రచనలపై నా స్పందన తరచూ తెలియచేయడం ద్వారా నేనూ గోతెలుగు.కామ్ టీం లో ఒక సభ్యుణ్ణి అనే భావన నాలో కలిగింది.
నా కార్టూన్లు సుమారు 200 పైగా, అందులో సరసదరహాసం శీర్షిక క 10 కార్టూన్ల వరకు, 6 వరకు కధలు గోతెలుగు లో ప్రచురించి నాకు ఎంతో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించిన గోతెలుగు కి నేనెప్పుడూ ఋణపడి ఉంటాను.ప్రచురించిన రచనలకి సముచిత పారితోషికం అందించడం కూడా సామాన్య విషయం కాదు. నేను నా రచనలు గోతెలుగులో చూసుకోవడం వరకే పరిమితం కాకుండా, ఇతరుల రచనలు దాదాపు గా చదువుతూ, నా స్పందన తెలియచేయడం కూడా ఒక అలవాటుగా పెట్టుకున్నాను. ఇటీవలప్రవేశపెట్టిన "ఉత్తమ కామెంట్ కి బహుమతి" అన్న శీర్షిక లో నాకు 14 సార్లు ఉత్తమ కామెంట్ కి ఇన్స్తంతనెఔస్ బహుమతి పయ్త్మ్ ద్వారా లభించింది అన్నది నాకు గర్వకారణం.నేను గోతెలుగు కి ఏక్టివ్ పాఠకుణ్ణి అనడానికి ఒక ఉదాహరణ. మూస పద్ధతి లో ఒకే రకం శీర్షికలునిర్వహిస్త్రూ పోవడం కాకుండా, వివిధ రకాల కార్టూన్ శీర్షికలు,జోక్స్ నిర్వహణ, కధా సమీక్షలు, సీరియల్స్ లో వైవిధ్యాలు, యువతరం వంటివెన్నో సమయానుకూలం గా మారుస్తూ, చేరుస్తూ, ప్రతీ వారం ఒక కొత్తదనం తో ఒక అంతర్జాల వారపత్రిక ని ఒక్క వారం కూడా ఆలస్యం అని గాని, రాకపోవడం అనేదిగానీ లేకుండా నిర్వహించడం అన్నది ఒక గొప్ప యజ్ఞం. దానిని అద్భుతం గా సాధించారు కనుకనే ఇటీవల "ఇండివుడ్ మీడియా ఎక్సెలెన్స్" అవార్డుల కేటగిరి లో గోతెలుగు నిర్వహణ కు గుర్తింపు గా "ప్రొఫెషనల్ ఎక్సెలెన్స్" అవార్డ్ శ్రీ బన్ను గారికి లభించింది.
అందుకు వారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇటీవల ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ జయదేవ్ గారి నిర్వహణ లో ఆయన ఇచ్చే ఏదో ఒక అంశం పై పలువురు కార్టూనిస్టులు తమ ప్రతిభ ని సానపెట్టుకున్నారు. అట్టి వారి కార్టూన్లని గోతెలుగు లో ప్రచురించి వారిని ప్రోత్సహించడం ఒక కార్టూనిస్ట్, రచయిత శ్రీ బన్ను గారి ఉత్తమాభిరుచి కి నిదర్శనం. ఇటీవల ప్రారంభించిన "గోతెలుగు గ్రంధాలయం" పాఠకులకు, రచయితలకు గొప్పవరం. గత సంచికలో ని తమ తమ రచనలు వెతికి పట్టుకోవడం, దాచుకోవడమే కాకుండా, చదవాలనుకుని చదవలేక పోయిన ఇతరుల రచనలు కూడా ఇందులో దొరకడం గొప్ప విషయం. సంచిక లేఔట్ నుండి, కధలకు బొమ్మలు వేయడం, సంపాదకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ మాధవ్ గారికి నా హృదయ పూర్వక అభినందనలు.అయితే ఒక
సూచన: ప్రతీ శీర్షిక, కధ, కార్టూన్ వంటి వాటి క్రింద విడి విడి గా ఉండే కామెంట్ బాక్స్ తో పాటు, సంచిక మొదటి పేజీ లో కూడా మొత్తం సంచిక పై ఒక కామెంట్ క్లుప్తం గా వ్రాయడానికి వీలుగా ఒక "ఘెనెరల్ చొమ్మెంత్ బాక్స్" కూడా అందుబాటులోకి తెస్తే బాగుంటుందేమో నని నా అభిప్రాయం.ఇంతకు మించి గోతెలుగు లో ఎటువంటి ఇబ్బందులు లేవు.సునాయసం గా 300 సంచికలు, 300 వారాలు పూర్తి చేసుకున్న గోతెలుగు ఇంకా బహుళ ప్రాచుర్యం, జనాదరణ పొందాలని మనస్పూర్తి గా ఆశిస్తూ, మరొక్కమారు గోతెలుగు టీం కి అభినందనలు.ఉజ్వల భవిష్యత్ కై ప్రార్ధనలు.
-పి. వి. రామశర్మ కార్టూనిస్ట్, రచయిత
************************
గో తెలుగు తో నా అంబంధం అక్షర రూపంలో వ్యక్తీకరించడం అసాధ్యమైన విషయం.
గోతెలుగుతో నా అనుబంధం నా కధా ప్రపంచానికే స్వర్గ లోకం.ఎన్నో కధలు
ప్రచురించారు..ప్రతి ప్రచురణకు ఎన్నెన్నో విశ్లేషణలు.రచయితకు విస్లేషణలే
అమూల్యమైన శక్తి .రచయిత రాసినా ,ప్రచురించినా ,విశ్లేషణ లేకపోతె ఆరచన
వ్యర్ధమే అని నా అభిప్రాయం .ఎంతోమంది రచయితలూ ,పాఠకులు ,గోతెలుగును
అభిమానించే అభిమానులు కలిగిన పత్రిక గోతెలుగు మాత్రమె.గోతెలుగు
ఎడిటర్,కధలకు రంగులద్ది సర్వాంగ సుందరముగా తీర్చి దిద్దే ఆర్టిస్టులకు
,సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షల తో బాటు కృతఙ్ఞతలు
తెలియజేస్తున్నాను.ఇటువంటి అరుదైన అవకాశము కల్పించిన గోతెలుగు వారికి
ధన్యవాదములు సమర్పించుకుంటున్నాను.....
- సుంకర వి హనుమంత రావు, రచయిత
****************************
మేము కర్ణాటక రాష్ట్రానికి బెంగుళూరు వచ్చాక,ఇక్కడ తెలుగు పత్రికలే లేక చాలా ఇబ్బందిపడుతున్న సందర్భంలో ఒక స్నేహితురాలి ద్వారా వెబ్ మ్యాగజైన్ గోతెలుగు ' పత్రిక ను పరిచయం చేసుకున్నాను. చిన్న రచనల ద్వారా తెలుగు రచయితగా చేరి ఇప్పటివరకూ కొన్ని రచనలు గోతెలుగువారి సహకారంతో ప్రచురితమయ్యాయి. చివరి రోజు పంపి నా ప్రచురించి ప్రోత్సహించారు. ప్రపంచంలో వున్న తెలుగు వారందరి చెలియ గోతెలుగు. అమేరికాలోనూ గోతెలుగు పత్రిక చదువుతూ, చిన్న అంశాల గురించీ ,కధలు వ్రాస్తూ కాలం గడిపాము. గోతెలుగులో ప్రచురితమైన 9 హాస్యకధలను ఒక 'హాస్యకధా మాలిక 'పేర కినిగె లో ఒక స్వయం ప్రచురణా పుస్తకంగా ప్రచురించాను. గోతెలుగు కొత్త రచయితలందరికీ ఒక నూతన వేదికగా ఎందరినో ప్రోత్సహించి సాహితీ ప్రపంచానికి , తెలుగు వారికీ సేవలను అందిస్తున్న పూర్వ పత్రిక. ఇంకా ఇంకా ఎదిగి ' ఇంతింతై వటు డింతై అన్నట్లుగా 300 నుంచీ 3,000 సంచికకు ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను.
-ఆదూరి.హైమావతి, రచయిత్రి
******************
మన గో తెలుగు 300వ సంచిక ప్రత్యేకంగా రాబోతోందని తెలిసి చాలా సంతోష మయింది. రచనా సామర్థ్యం చాలామందిలో అంతర్గతంగా ఉంటుంది. అది సరి అయిన సమయంలో సరి అయిన ప్రోత్సాహం ఉంటె బయట పడుతుంది. డబ్బై సంవత్సరాలుగా లోపల ఉన్న ఉన్న కొన్ని ఊహలకి అక్షర రూపం కల్పించాలనే తపన, నా విషయం లో గో తెలుగు గురించి నాకు ఫణిబాబు గారు యాదృచ్చికంగా చెప్పక పోయినా, గో తెలుగు నా మొదటి కథ ని ప్రచురించక పోయినా బయటికి వచ్చేవి కావు. కొత్త రచయితలని ప్రోత్ససహించాలనే గో తెలుగు నిర్ణయం సర్వదా అభినందనీయం. నా లాగే ఎందరో రచయితలు వెలుగు చూడడానికి కారకమయింది.
గో తెలుగు అనగానే ముఖ్యంగా గుర్తుకువచ్చేవి గో తెలుగు కార్టూనులు, మాధవ్ గారు, రామ్ గారి వంటి వారు వేసే చిత్రాలు. తక్కువ నిడివి లో ఎక్కువ మంది అభిరుచులకు అనుగుణంగా తీర్చుదిద్దుతున్న బన్ను గారు, మాధవ్ గారు ఇతర బృందానికి నా మనఃపూర్వక అభినందనలు, వందనాలు
- పోడూరి వెంకట రమణ శర్మ, రచయిత
*************
గోతెలుగుకు ప్రారంభ సంచికనుంచీ నేను అభిమాన పాఠకురాలిని. ఎంతో చక్కని కుటుంబ పత్రిక మన గోతెలుగు. ఈ పత్రికలో నావి చాలా కథలు, ఒక నవల ప్రచురింపబడ్డాయి. ఒక రచయిత్రిగా నాకెంతో గుర్తింపునూ, మంచి పేరునూ తీసుకువచ్చాయి. మంచి అభిరుచి కల్గిన సంపాదకుని నేతృత్వంలో హాయిగా పారే సెలయేరులా గోతెలుగు అందరినీ అలరిస్తోంది. బంగారానికి తావి అబ్బినట్టుగా భావం పలికే మాధవ్ గారి చిత్రాలు కథలకూ, రచనలకూ మరింత సొగసును పెంపొందింపజేస్తున్నాయి. చక్కగా చైతన్య స్రవంతిలా సాగిపోయే మన గోతెలుగు 300వ సంచికకు ప్రేమపూర్వక సుస్వాగతం, అభినందనల సుమ హారం!
- నండూరి సుందరి నాగమణి, రచయిత్రి
****************
గోతెలుగు తో నా అనుబంధం 2014 వినాయకచవితి సంచిక తో మొదలై ఇప్పటికీ సాగుతోంది .ఇప్పటిదాకా 150 కి పైగా వేసుంటాను .మా ఇంట్లో, భందువుల్లో దాదాపు ఇంటికొకరు,ఇద్దరు చొప్పున విదేశాల్లో ఉండటం వల్ల ,గోతెలుగు వెబ్ మగజినె కావటం వల్ల నా కార్టూన్లు చూస్తుండటం ,వారి విదేశీ స్నేహితులకు,స్నేహితురాళ్లకు ఇది మా ఫలానా రెలతివె వేసిందని చూపించటం ..అలా గోతెలుగు ద్వారా విదేశీ అభిమానులను సంపాదించటం నిజంగా నాకు ఆనంద దాయకం..దానికి గోతెలుగు కు రుణపడి వున్నాను...అందర్నీ ప్రోత్సహిస్తూ అవకాశం కలిగిస్తున్న గోతెలుగు యాజామాన్యానికి కృతజ్ఞుడిని ...
మన గోతెలుగు ఇలాగే దిన దిన అభివృద్ధి చెందుతూ పాఠకులకు నిరంతరము అలరిస్తూ సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ..
- మోహన్ కుమార్ , కార్టూనిస్ట్
*******************
చెన్నై లో వుంటున్న తెలుగువాణ్ణి నేను.ఈ రోజు కథా రచయితగా నాకూ ఓ గుర్తింపు వచ్చిందంటే అది మీ/మా గో .తెలుగు వెబ్ పత్రిక ద్వారానే!నేను దిన,వార,మాస పత్రికలకు ఎన్నో కథలను రాశాను.తద్వారా పాఠకులకు కాస్త దగ్గరయ్యానే తప్ప పెద్దగా గుర్తింపు రాలేదు.అయితే 2016 సంవత్సరం నుండి మన గో. తెలుగు వెబ్ పత్రికకు కథలను రాయడం ప్రారంభించిన తరువాత నాకంటూ గుర్తింపు వచ్చి వందల్లో పాఠకులను సంపాయించుకున్నానన్నది వాస్తవం.వారి ఆదరభిమానాలతో,విశ్లేషణతో కూడికున్న విమర్శలతో కథలను మెరుగ్గా రాయగలుగుతున్నాను.ఇందుకు కారణం మీ/మా గో.తెలుగు వెబ్ పత్రికేనని గొప్పగా చెప్పుకొక తప్పదు.అంతేకాదు వెబ్ పత్రికలు ఎన్ని వున్నాయో నాకు తెలియదు కాని గొప్పగా, తెరుచుకొనుటకు సులువుగా వుండి, అందరిని ఆకట్టుకునే మంచి /చక్కటి శీర్షికలతో లక్షల మందకి చేరువవు తున్న మీ/మా పత్రిక 'గో.తెలుగు.కాం .వెబ్ పత్రిక' మాత్రమే ! నేను ఇష్టపడేది,నా రచనా జగత్తులో నిత్యం నా అభివృధ్ధిని కాంక్షించే నాకు ప్రియమైది మీ/మా గో.తెలుగు వెబ్ పత్రికని సగర్వంగా చెప్పుకొంటాను,
చివరిగాపత్రిక యాజమాన్యం,బన్ను,మాధవ్ గార్లు సర్వదా ఆయురారోగ్యాలతో వుండాలని, పత్రిక వారిరువురి కృషితో ఇంకా ఇంకా అభివృధ్ధి పథంలో సాగి వున్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తూ, ఆ దిశగా భగవంతుణ్ణి వేడుకొంటూ ....
- బొందల నాగేశ్వరరావు, రచయిత
|