Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahaasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

తమిళనాడు తీర్థయాత్రలు - - కర్రా నాగలక్ష్మి

tamilnadu

ఈ క్షేత్రం నీదమంగళం రైల్ స్టేషన్ నుంచి 7 కిమీ దూరంలోను ,  కుంభకోణం నుంచి మన్నార్ గుడి వెళ్ళే దారిలో  కుంభకోణం రైల్ స్టేషన్ నుంచి 17 కిమీ ల దూరంలో వుంది . యీ ప్రదేశం పచ్చని వరిపోలాలతోను , అరటి , కొబ్బరి , చెరకు పొలాలతోనూ ,పంట కాలువలతోను కొనసీమను తలపిస్తూ వుంటుంది . కుంభకోణం లో మన్నార్ గుడి బస్సు యెక్కితే వో అరగంటలో ఆలంగుడి  చేరుకోవచ్చు  .          ఆలంగుడి బస్టాండుల అరకిలోమీటర దూరంలో వుంటుందన మందిరం.

ఆలంగుడి లో గ్రహాలలో అయిదవది , ముఖ్యమైనదిగా చెప్పుకొనే బృహస్పతి కోవెల వుంది .

గురుగ్రహం అనుగ్రహం వుంటే అన్నిటా విజయం సిద్దిస్తుంది .ఈ వూరు తిరువారూర్ జిల్లలో , వెళంగిమాను తాలుకాలో వెళంగిమాన్ ఊరికి 9 కిమీ దూరంలో  వుంది . చోళదేశంలో వున్న 274 పుణ్య స్థానాలలో కావేరీ నదీ దక్షిణ తీరాన  127 పుణ్యస్థానాలున్నాయి . వాటిలో 98వ పుణ్యస్థానం గా గుర్తించబడింది ఆలంగుడి . శైవ నవగ్రహ కొవెళ్లలో మూలవిరాట్టు శివుడు , వాస్తు శాశ్త్రాన్ని అనుసరించి ఏ గ్రహం ఎటు వైపు వుండాలో అటువైపు ఆ గ్రహం మండపం లో కొలువై వుండి  పూజలు అందుకుంటూ వుంటారు .

ఈ మందిరంఅయిదంతస్థుల రాజగోపురంతో రెండు ప్రాకారాలలా నిర్మింపబడింది .ముఖ ద్వారం లోంచి లోపలి రాగానే ఎదురుగా చక్ర పుష్కరిణి వుంటుంది . దీన్ని విష్ణుమూర్తి తన చక్రం తో సృషించినట్లు చెప్తారు దానికి యెదురుగా వినాయకుని గుడి  వుంటుంది . ఈవినాయకుని కలంగమల్ కట్ఠ  వినాయకుడు అని అంటారు .

ఈ కోవెల నిర్మాణం యెప్పుడు జరిగిందీ అన్నదానికి చరిత్రలో ఆధారాలు దొరకలేదు కాని చోళులు , పల్లవులు యీ మందిరానికి మరమ్మత్తులు చేయించినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది .

కోవెల అమృత పుష్కరిణి మధ్యలో వున్నట్లు చెప్పబడింది . కాని యిప్పుడు యీ కోవెల చుట్టూ ఎటువంటి పుష్కరిణి కనబడదు .  కావేరి , కోలిదాం , వెన్నారు నదులు సంగమించిన పరమ పవిత్ర మైన ప్రదేశంగా పురాణాలలో చెప్పబడింది .

ఇక్కడ మూలవిరాట్టు శివుడు ఆపత్సహాయేశ్వరుడు అనే పేరుతొ కొలువై వున్నాడు .

అమృతమంథనం జరుగినప్పుడు పుట్టిన హాలాహల ప్రభావంతో స్వర్గలోకం  , భులోకం  , పాతాళ లోకాలు కంపించి పోగా పరమ శివుడు దేవతల కోరికని మన్నించి హాలాహలాన్ని మింగిన ప్రదేశం యిది అని అంటారు . తమిళం లో " ఆలం " అంటే విషం " కు(గు)డి " తాగటం అని అర్ధం . అందుకు యీ వూరికి ఆలంగుడి అనేపేరొచ్చింది . ఆపత్సమయంలో ఈశ్వరుడు ఆదుకున్నాడు కాబట్టి యిక్కడ ఈశ్వరునికి ఆపత్సహాయేశ్వరుడు అనే పేరొచ్చింది . ఇది స్వయంభూ లింగం , నాయనార్ల ద్వారా పేర్కొనబడ్డ 275 పాతాళపేత్ర స్థలాలలో ఒకటి .
    నవగ్రహ స్థలాలలో ముందుగా ములవిరాట్టుని దర్శించుకొని తరువాత అమ్మవారిని దర్శించు కున్న తరువాతే అక్కడ వున్న గ్రహాధిపతిని దర్శించుకోవాలి . ఇక్కడ అమ్మవారిని ఉమామ్మై లేక శుక్రవార అమ్మ అని అంటారు . పేరులో ఉన్నట్లే యీ అమ్మ వారికి యిక్కడ శుక్రవారం నాడు పూజ చేస్తే ఉమాదేవి ప్రసన్న మౌతుందని యిక్కడి నమ్మకం . అందుకే స్తానికులు యీమెని " శుక్రవార అమ్మ " అనికూడా అంటారు .

ఈకోవెల ముందుగా ఎవరు నిర్మించేరు అనేదానికి ఆధారాలు లేవు , కాని శుకుడు , విశ్వామిత్రుడు , అగస్త్యుడు మొదలయిన పురాణపురుషులు , ఆది శంకరాచార్యులు  యీ ఆపత్సహాయేశ్వరుడు ని పూజించి తరించేరని గ్రంధస్థం చెయ్యబడింది .


' గు ' అంటే చీకటిని 'రు' అంటే పోగొట్టేవాడు అని అర్ధం . బృహస్పతిని 'గురువు' అజ్ఞానంధకారాన్ని పోగొట్టే వాడు అని పిలుస్తారు .   ఆంగీరస మహామునికి అతని భార్య శ్రద్దకి బృహస్పతి జన్మించేడు . ఇతనికి శుభ , తార అని యిద్దరు భార్యలు . ఈ గ్రహం అనుకూలంగా వుంటే విద్య , జ్ఞానం , విజయం , ఆధ్యాత్మికత వుంటాయని పెద్దలు చెప్తారు . ఇతని వాహనం ఏనుగు , యిష్థ మైన పువ్వు తామర పువ్వు , రంగు పసుపు , లోహం బంగారం , రత్నం జాతి పచ్చ ( సఫైర్) , నక్షత్రాలు పునర్వసు , విశాఖ , పూర్వాభాద్ర లకు అధిపతి .

కోవెలలో ఆపత్సహాయేశ్వరుని మందిర ప్రాకారం గోడలపైన వుంటుంది బృహస్పతి విగ్రహం . ఇక్కడ బృహస్పతి గ్రహ అనుకూలార్ధం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ,  మందిరంలో అడుగడుగునా లంచగొండితనం కనిపిస్తుంది , మిగతా కోవెలలో మాకు యిలాంటి అనుభవం యెదురుకాలేదు . కోవెల ప్రదక్షిణ చేసేటపుడు ప్రతీవారూ చెయ్యజాచడమే .

ఇక్కడ దక్షిణామూర్తికి పూజలు చేస్తూ వుంటారు . నాయనార్ల విగ్రహాలతో పాటు దుర్గ , లింగోద్భవం , వల్లిదేవసేన సమేత కుమారస్వామి మొదలైన దేవతలను దర్శించుకోవచ్చు .
ఈ పుణ్య ప్రదేశాన్ని కాశి అరణ్యం , తిరుయేరుంపూలై అని కుడా అంటారు .స్థలపురాణం తెలుసుకుందాం .

  సుందరమూర్తి స్వామి అనే భక్తుడు ఆపత్సహాయేశ్వరుని దర్శించు కోడాని కి కావేరి నదిని దాటే క్రమంలో వరదలో చిక్కుకు పోతాడు , ఈశ్వరుడు పడవవానిగా వచ్చి సుందరమూర్తిని కావేరి ప్రవాహం నుంచి కాపాడేడుట . ఈ కోవెలలో సుందరమూర్తి దక్షిణామూర్తి ని దర్శించుకోగానే అతనికి జ్ఞానోపదేశం కలిగిందట .  అందుకే యీ మందిరంలో దక్షిణామూర్తికి జ్ఞాన ప్రధాతగా పూజిస్తారు , ఇక్కడే దక్షిణామూర్తి బృహస్పతిని దేవతలకు గురువుగా నియమించేడు .ఈ కోవెలలో సుందరమూర్తి స్వామి విగ్రహం వుంది దాని పై మసూచి మచ్చలుంటాయి అందుకు యీ క్రింది కధ చెప్తారు . తిరువారూర్ ని చోళరాజులు పరిపాలించే కాలం లో వో రాజు ( పేరు తెలీలేదు ) ఆలంగుడి కోవేలని దర్శించుకొని అక్కడ వున్న సుందరమూర్తి అందమైన విగ్రహాన్ని చూసి మనసు పడి తిరువారూర్ తీసుకొని వెళ్తాడు . ప్రధాన పూజారి తిరిగి విగ్రహాన్ని ఆలంగుడి తెచ్చేందుకు మారు వేషంలో తిరువారూర్ వెళ్లి సుందరమూర్తి విగ్రహాన్ని వస్త్రాలలో చుట్టి వుయ్యాలలో  తీసుకోని వస్తుండగా రాజబటులు తనిఖీ చేస్తూ వుంటే పూజారి తన బిడ్డకు మసూచి సోకిందని అందుకు బిడ్డను కప్పి అరణ్యం లోకి తీసుకొని పోతున్నానని చెప్తాడు . మసూచి ( స్మాల్ పాక్స్ ) అంటురోగం కాబట్టి రాజభటులు విగ్రహం వున్న ఉయ్యాలను తనిఖీ చెయ్యకుండా పంపించేస్తారు . పూజారి ఆలంగుడి కోవేలకి చేరిన తరువాత వస్త్రములు తొలగించి చూడగా విగ్రహానికి మసూచి మచ్చలు వుండటం చూచి ఆశ్చర్య పడతాడు , యిప్పటికి విగ్రహం పైన యీ మచ్చలు  చూడొచ్చు .

ఈ కోవెల గురించిన మరో కధ
పూర్వం ముచుకంఠ చక్రవర్తి దగ్గర అముదాకరుడు మహా మంత్రి గా వుండేవాడుట , ఆతను పూనుకొని యీ కొవెల కట్టించి అనంతమైన పుణ్యం సంపాదించెనట , అది తెలుసుకున్న ముచుకంఠ చక్రవర్తి ఆ పుణ్యం లో సగం తనకు ధార పొయ్యమని కోరగా అముదాకరుడు అంగీకరించలేదు . ఆగ్రహించిన చక్రవర్తి మహామంత్రిని హతమారుస్తాడు . చక్రవర్తి ననే అహంకారంతో వున్న చక్రవర్తికి ప్రతీ రోజు యీ కోవెల లోంచి ' అముదాకరా ' అనే పిలుపు ప్రతిద్వనించేదిట , ఆ ప్రతిద్వనితో భయకంపితుడైన చక్రవర్తి ఆపత్సహాయేశ్వరుని శరణు వేడుకొని అతని భక్తుడుగా మారుతాడు , తరువాత ఆ  ధ్వనులు వినిపించలేదుట .
కలంగమల్ కట్థ వినాయకుని కధ
వినాయకుడు  యీ ప్రదేశంలో గజముఖాసురుడిని వధించెనట అందుకు యీ వినాయకుడిని కలంగమల్ కట్థ వినాయకుడు అని అంటారు యిక్కడ పార్వతీ దేవి శివుని వివాహం చేసుకోవాలనే సంకల్పం తో తపస్సునాచరించి శివుని మెప్పు పొందిందిట . అందుకని యిక్కడ పుణ్య స్త్రీ లు శుక్రవారము నాడు తమ మాంగల్యానికి వుండే పసుపు తాడును మార్చుకుంటే వారికి అఖండ సౌభాగ్యం కలుగుతుంది అని పార్వతీదేవి వరమిచ్చిందిట .ఈ  కోవెల ప్రాంగణం లో యివి కాక , సప్తలింగాలు , వీరభద్రుడు , ముచుకంఠుడు , కాశీవిశ్వనాథుడు , విశాలాక్షి , కుమారస్వామి , తిరువక్కరసు , చంద్రుడు , సూర్యుడు మొదలయిన దేవతా మూర్తులు వున్నాయి .
పునర్వసు నక్షత్ర జాతకులు వొక్కసారైనా వచ్చి యీ కోవెల ప్రాంగణంలో కనీసం రెండు నుంచి మూడు గంటల పాటు గడపితే బృహస్పతి యెల్లకాలం అనుకూలంగా వుంటాడట  .ఇక్కడ ముఖ్యం గా జరిగే వుత్సవాలు

1) గురుగ్రహం గడి  మారినప్పుడు 2) చైత్ర పూర్ణిమ  3) తైపూసం 4) మహా మాఘి ( మాఘ పూర్ణిమ 5) ఫల్గుణ ఉత్తరం 6) రధా యాత్ర 7) 1008 శంఖ తీర్ధ స్నానం

ఈ ఉత్సవాలు అత్యంత భక్తి  శ్రద్దలతో జరుపుకుంటారు .
ఉత్సవాలు జరిగే రోజులలో కోవెల యిరవైనాలుగు గంటలు భక్తుల కొరకు తెరిచే వుంటుంది .

మరిన్ని శీర్షికలు
weekly-horoscope 4th january to 10th january