Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sirachukalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

మహామాయాబజార్ - -సరసి

maha mayabazar

అం...అహ...ఇం...ఇహి...ఉం...ఉహు...!! పేద్ద మెరుపుతో శబ్దం !! అద్భుతం ! దేదీప్యమానంగా బంగారు రంగులో వెలిగిపోతూ దివ్యమైన భవంతులు ఎదురుగా ప్రత్యక్షమయ్యాయి! వాటిచుట్టూ విశాలమైన పచ్చికమైదానాలు...క్రీడాప్రాంగణాలు...జలపాతాలు...వివిధ ఫలపుష్ప జాతుల వృక్షాలు, తోటలు, పక్షుల కిలకిలారావాలు! ఓహ్..ఏమిటిది? ఏమిటీవింత? చూడడానికి కళ్ళు చాలట్లా! వర్ణించడానికి భాష చాలదు!! ఏమిటిది??

ఇదే ' మాయాబజార్ ! ' నభూతో నభవిష్యతి అనదగ్గ గొప్ప నిర్మాణం !!

ఏళ్ళతరబడి తెలుగు చదువరులు ప్రతిరోజూ దినపత్రికలు చదవడానికి అలవాటు పడ్డారు. వీక్లీలు, పక్ష,మాస పత్రికలూ వచ్చేవరకూ ఆగి, వాటిని చేతుల్లోకి తీసుకుని తీరిగ్గా వీలున్నప్పుడు చదువుతూ తలగడల కింద పెట్టుకుని నిద్రపోయేవారు. ఆర్తులకు అరువిచ్చేవారు. తిరిగిరాకపోతే తిట్టుకునేవారు.' పుస్తకం వనితా విత్తం...' నీతిపద్యం చెప్పి కోంబడేవారు. బీరువాల్లో వరసాగ్గా పేర్చిన పుస్తకాలు! వాటిపక్కనే చోటు కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్న పుస్తకాల గుట్టలు. ' మీరు చదవరు, ఇంకోళ్ళకివ్వరు, కొంప ఎప్పటికైనా ఖాళీ అవుతుందా అసలూ?! ' అని ప్రశ్నంచి ' నాకు తెలుసు, ఈ జన్మక్కాదు '  అంటూ తామే జవాబు కూడా చెప్పుకునే ఇల్లాళ్ళ అరుపులు. ఖాళీ గోనెసంచి, తక్కెడ వెనకన పెట్టుకుని " పాత పుస్తకాలూ, పేపర్లూ కొంటాం " అని అరుస్తూ సైకిల్ మీద వెళ్ళే పిలగాళ్ళు..పాత పుస్తకాలు అమ్ముతున్న రోడ్డుపక్క ఆసామీల వద్ద ' కొంపదీసి నా పుస్తకాలు లేవుకదా వీటిల్లో '  అంటూ ఆందోళనగా వెతుక్కునే రచయితలూ, కవులూ...ఇలా అనేక దృశ్యాలు తెలుగునాట నిత్యం కనిపించి, వినిపించే రోజుల్లో ఒకనాడు...వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడింది ఆశ్చర్యంగా...

ఆరోజు "  అం అహ..ఇం ఇహి...ఉం ఉహు...!" అంటూ ఓ మంత్రం గట్టిగా వినబడింది.

తెలుగు చదువరులంతా తలలు, తరువాత ఒళ్ళు తిప్పి అటువైపు చూసారు. ఆ మంత్రం వినిపించిన కొద్ది క్షణాల్లో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఓ పెద్ద హర్మ్యం అక్కడ వెలిసింది.!

 

ఒకాయన ఆ భవనంలో లోపలికి పరుగెత్తుకెళ్ళి చూసాడు ఆత్రుత పట్టలేక.

అక్కడ అతని మనసు దోచుకునే అందమైన చిత్రాలు ఎన్నో వేళ్ళాడదీసి ఉన్నాయి. ఆ పక్కనే రసవత్తరమైన కథలు, కవితలు, వ్యాసాలు, కార్టూన్లు, సినిమా కబుర్లు..వంటలు, వార్పులు, ఆటలు, పాటలు!!

ఏం లేవా అని చూస్తే అన్నీ ఉన్నాయి అక్కడ. చేత్తో తాకి చూసాడు. ఏమీ తగల్లా...మాయ!

కంటికి మాత్రం కనిపిస్తోందే! ' ఏమిటీ మాయ ?" అన్నాడు తెలుగాయన. " అవునండీ ఇది మాయే ! దీనిని ' ఆన్ లైన్ ' అంటారండీ అని ఒక శబ్దం వినపడింది. ఎవరది....చుట్టూ చూసాడు..ఎవరూ కనబళ్ళా, అశరీరవాణా?

మళ్ళీ ఆశ్చర్యపడి, లేచి ' మరి ఈ అందమైన సంపద అంతా మాయ అయితే తరవాత మాయం అయిపోతుంది కదా? మనకిక మిగల్దా?"

" ఎందుకు మిగల్దూ? వద్దనుకుంటే మాయం అయిపోతుంది. కావాలనుకున్నప్పుడు ప్రత్యక్షమవువుతుంది!"

" అంటే మోసుకెళ్ళడాలు, బీరువాల్లో సర్దడాలూ, ఎవరైనా అడిగితే ఇవ్వకపోవడాలూ, ఇంట్లో చోటు లేదని శ్రీమతి తిట్టడాలూ, బూజు పట్టడాలూ, చిరిగిపోడాలూ, తడిసిపోడాలూ, చెదలు పట్టడాలూ...ఉండవా? "

" అవును. ఈ ' డా ' లే కాదు, మరే ' డా ' లూ కూడా ఉండవు. హాయిగా చేతులు ముడుచుక్కూచుని, టీ చప్పరిస్తూ, చూస్తూ చదువుకోవడాలే ! "

" వార్నీ ఏమిటీ నరమాయ ?! భలేగా ఉందే!!'

బయటికొచ్చి ఆ భవనం ఏమిటా అని చూసాడు. సిణ ద్వారం మీద అందంగా దేవుడే చెక్కేడా అన్నట్టు తెలుగులో ' గోతెలుగు డాట్ కాం ' అని బంగారు అక్షరాలు కనిపించాయి.

అతని మనసు తెలుసుకుని " అవును దేవుడే ' బాపు ' రూపంలో వచ్చి చెక్కి వెళ్ళిపోయాడు!" అంది అశరీరవాణి. దణ్ణం పెట్టాడు తెలుగాయన కళ్ళుమూసుకుని.

తరవాత, ఆ మంత్రం చదివి ఆ భవనాన్ని సృష్టించిన ఆ మాంత్రికుడు ఎవరా అని అతని కళ్ళు అటూ ఇటూ చూసాయి ఆత్రుతగా.

పొట్టిగా వుండి, పొడుగ్గా నిలువు నామం పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ ఓ చిన్నాయన కనిపించాడు సిగ్గుపడుతూ. ' ఆయనే ' చిన్నమయ ' అలియాస్ ' మాధవ్ ' !

' వార్నీ నువ్వా? ఇంత లేవు అంతపని చేసింది నువ్వా?" అడిగేడు తెలుగాయన.

' కాదు నేను ఊరికే అం అహ..అంతే. అసలాయన అడుగో ' అంటూ తల తిప్పకుండా వేలుతిప్పి చూపించాడు చిన్నమయ.

అక్కడొకాయన పొడుగ్గా నిలబడి ఉన్నాడు. ' ఆయన పేరు ' బన్ను'  అలియాస్ 'ఘటోత్కచుడు ' !!" అంది అశరీరవాణి.

' చేతికి తగలకుండా, కాగితం, కలం లేకుండా పత్రికా ? ఈ అద్భుతం మీ సృష్టేనా బన్నోత్కచా? కాదు...ఘటోత్కబన్నూ...సారీ మతిపోయి నాలిక తిరగబడుతోంది..ఏవనుకోకండి ' అన్నాడు తెలుగాయన.

ఆయన ఏమీ అనుకోలేదు. ' నేను నిమిత్తమాత్రుడిని. అంతా ఆయన మాయ!" అంటూ వేరేవైపు చూపించాడాయన నవ్వుతూ. " ఇంకొకాయనా? ఆయనెవరూ?"

ఆ వేలు సింగపూర్ వైపు చూపిస్తోంది, అటు చూస్తే...

అక్కడొక నల్లనయ్య వేణువు పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఈయనేనా కథంతా నడిపించేది? ముందుకెళ్ళి చూసాడు తెలుగాయన.

ఆశ్చర్యం!!! ఆయన కూడా ఘటోత్కచుడిలాగానే ఉన్నాడు. ' మళ్ళీ ఇదేం మాయ?! కృష్ణుడు, ఘటోత్కచుడు ఇద్దరూ ఒకరేనా?

' ఇండియాలో ఉంటే ఘటోత్కచ రూపం, సింగపూర్ లో ఉంటే శ్రీకృష్ణ రూపం! అటునేనే...ఇటునేనే...చిరంజీవ చిరంజీవ...సుఖీభవ సుఖీభవ " అంటూ రాగయుక్తంగా చెప్పేడాయన.

" ఆహా దివ్యోపదేశం....దివ్యోపదేశం !!" అంటూ తెలుగాయన మురిసి పోయాడు. ఇప్పుడాయనకి సందేహాలన్నీ తీరిపోయాయి.! తెలుగు చదువరులందరినీ వెంటబెట్టుకుని ఆ భవనంలోకి తీసికెళ్ళాడు. తనే ' గయుడు ' గా మారి, అన్నీ వివరించి చెప్పసాగేడు.

' నాయనలారా! తెలుగు సాహితీ వినీలాకాశంలో ' గోతెలుగు డాట్ కాం ' వారపత్రిక ఒక ధ్రువతారగా వెలుగుతుంది. ఇది 300సంచికలే కాదు 3 లక్షల సంచికల వరకూ కూడా అదే కాంతితో ప్రకాశిస్తుంది. ' అంటూ అశరీరవాణి ' వాణి ' అంతర్ధానం అయిపోయింది.

మరిన్ని శీర్షికలు
golden words