ద్వంద్వం
ఇద్దరమూ ఒకరినొకరు
విడిచి ఉండలేనంత చేరువగా
ఉన్న ఏకాంత సమయంలో
జ్ఞాపకాలు కలబోసుకున్నాం
ఒకరికొకరం కళ్ళలో కాంతులు చూశాం
నవ్వుల పరిమళాలూ అద్దుకున్నాం
మోహపరవశాల ఫలాలకు
మా కలలను జోడించి
ఆపేక్షగా పెంచుకున్నప్పటి
ముద్దుమురిపాల్ని
జతగా పంచుకున్నాం
అయినా ఇంకా ఏదో మిగిలేఉంది
ఆలోచనలు కలివిడి కాలేదు
ఇద్దరమూ ఎంత ఒక్కటిగా ఉన్నా
రెండు విడివిడి శరీరాల్లా
రెండు మనసుల మధ్య ఘర్షణ
కొనసాగుతూనే ఉంది
బహుశా ఇది ఎప్పటికీ రహస్యమే
కవితా శీర్షికలా ద్వంద్వమే
|