Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sira chukkalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

మృత్యుకేళి - లక్ష్మి పాల

mrutyukeli

రవీంద్రనాథ్ బాత్రూమ్ లో షవర్ క్రింద నిలబడ్డాడు. “హే... భగవాన్... ఆ అబ్బాయి ఆత్మకు శాంతిని చేకూర్చు తండ్రీ...!” కళ్ళు మూసుకుని ప్రార్ధించాడు అంతకు క్రితం ముందే చూసి వచ్చిన ఒక మరణాన్ని తలచుకుని. తలపై  ఫోర్స్ గా పడుతున్న నీరు... అప్పటివరకూ కంటిద్వారా గుండెలోకి ప్రవేశించి, ఓ భయంకర జ్ఞాపకంలా ప్రవహించి, అంతిమంగా... మస్తిష్కపు పొరలలోకి పాకి అక్కడే నిక్షిప్తమై ఉన్న ఓ బాధాకరమైన సంఘటనను కరిగించి, కడిగేస్తున్నంతగా రిలీఫ్ ఇస్తోంది.

స్నానానంతరం... పొడి బట్టలతో పూజగదిలోకి వెళ్ళి దేవుడి విగ్రహం ముందు పద్మాసనంలో కూర్చున్నాడు. చాలాసేపు ధ్యానం చేస్తూ కూర్చుండిపోయాడు.టంగ్...టంగ్...టంగ్...” హాలులోని గోడగడియారం అర్ధరాత్రిని సూచిస్తూ పన్నెండు గంటలు కొట్టింది. నెమ్మదిగా కళ్ళు తెరచి, లేచి పూజగదినుండి బయటకు వచ్చాడు రవీంద్రనాథ్. హాలు మధ్యలో సోఫాలో కూర్చుని ఎదురుగా ఉన్న టీపాయ్ పైని చదరంగం బోర్డు లోని పావులను తదేకంగా చూస్తూ ఉన్నాడతను.అతడిని చూడగానే, పట్టరాని ఆవేశం వచ్చింది రవీంద్రనాథ్ కి. కోపంగా అతనివద్దకు వెళ్ళి, “మళ్ళీ ఎందుకొచ్చావు...? ఇంకెవరి ప్రాణాలు హరించడానికి వచ్చావు...??” కోపంగా అరిచాడు.అతని నుండి సమాధానం లేదు. వంచిన తల ఎత్తనేలేదు. చదరంగం పావులపైని అతని దృష్టి కదల్లేదు.రవీంద్రనాథ్ కి దు:ఖం వచ్చింది. అతని ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. రెండు చేతులూ జోడించి, “ప్లీజ్... నన్ను ఒదిలేయ్... నీ మృత్యుకేళిలో నన్ను భాగస్వామిని చేయకు.” దీనంగా వేడుకున్నాడు.అతడు ఎలాంటి సమాధానము ఇవ్వలేదు. నిశ్శబ్ధంగా ఆట ప్రారంభించాడు. రవీంద్రనాథ్ కి ఆటలో పాల్గొనక తప్పలేదు. మనసు స్థిమిత పరచుకుని ఆటపై దృష్టి పెట్టాడు. ఈ రాత్రి అతడిని ఎలాగైనా ఓడించాలి. ఒక్కటి... ఒక్కటంటే... ఒక్క మరణాన్నైనా ఆపాలి తను. తెల్లని పావులను రణరంగంలోకి దించాడు  రవీంధ్రనాథ్. నల్లని పావులన్నీ... నలుపు రంగు దుస్తులతో... చీకటికి ప్రతిరూపమై కనబడుతున్న“అతడివి.”

బోర్డు వంకే తీక్షణంగా చూస్తూ చక చకా పావులను కదుపుతున్నాడతను. నల్లసముద్రపు నిలువెత్తు ఉప్పెనలా, ఆకాశాన్ని కమ్ముకుంటున్న కారు మేఘంలా, కదనరంగాన దూకుతున్న కాలయముళ్ళలా  చదరంగం బోర్డుపైన నల్లని పావులు వేగంగా ముందుకు కదులుతున్నాయి. ముందుకు దూసుకొస్తున్న నల్లని పావులను తప్పుకుంటూ... తెలివిగా... లోపలికి చొచ్చుకుపోతున్నాయి తెల్లని సైనికులు.

ఆట... మంచి రసపట్టు మీద ఉంది.  రాజు, మంత్రి, గజబలం, అశ్వబలం, శకటం, బంట్లు...హోరా హోరిగా పోరాడుతున్నాయి. మృత్యువును ఓడించాలని... రవీంద్రనాథ్ ఆట. యుగయుగాలుగా గెలుస్తూనే ఉన్న ఆటలో మరో మరణాన్ని విజయచిహ్నంగా కైవసం చేసుకోవాలనేది “అతడి”.తూరుపు తెల్లవారుతోంది. “చెక్” చెప్పాడు అతడు. అతని పెదవులమీద విజయగర్వాన్ని సూచించే ఓ వికృతమైన చిరునవ్వు.  
ఎప్పటిలాగే... రవీంధ్రనాథ్  “అతడి” ముందు ఓడిపోయాడు. నిస్సత్తువగా తలపట్టుకు కూర్చుండిపోయాడు."అతడు” అతడి నోటిలో ఎడమవైపున ఉన్న దంతాన్ని ఒకటి పీకి, రవీంద్రనాథ్ చేతిలో పెట్టాడు. నిస్సారమైన చూపుతో దాన్నే చూస్తూ ఉండిపోయాడు రవీంధ్రనాథ్... అది “మృత్యువు పన్ను”

******

సమయం తెల్లవారిఝామున నాలుగు గంటలు. రాఘవేంద్రస్వామి 4వ నంబరు వీధి. ఇంటి నెంబరు 101. రవీంద్రనాథ్ ఆ ఇంటిముందు ఆగాడు. నాలుగు గదుల స్లాబ్. ఒక సామాన్యుడి ఇల్లు అది. వాళ్ళెవరో తనకు తెలియదు. కానీ, ఈ ఇంటిలోనుండి రేపు సాయంత్రం లోపు ఒక శవం లేవబోతుంది. అందుకు తనే కారకుడు. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. వెంటనే వాటిని తుడుచుకుంటూ చుట్టూ చూసాడు. ఆ వీధి నిర్మానుష్యంగా ఉంది. గబ గబా తన బుజానికి వ్రేళ్ళాడుతున్న పొడగాటి సంచిలోంచి ఒక కాగితపు పొట్లాన్ని బయటకు తీసాడు. అటూ ఇటూ చూస్తూ, ఎవరూ అటువైపుకు రావడం లేదని నిర్ధారించుకున్నాక, ఆ కాగితపు పొట్లాన్ని తెరచాడు. అందులోంచి తలుక్కుమని మెరిసింది. రాత్రి “అతడు” ఇచ్చిన దంతం.గాఢంగా నిశ్వసిస్తూ... దాన్ని ఎడమచేతిలోకి తీసుకుని ఆ ఇంటి ఆవరణలోని మొక్కల మధ్యలోకి విసిరేసాడు. “ఈ ఇంటి మనుష్యుల్లారా... నన్ను క్షమించండి”  ఆ ఇంటికి అభిముఖంగా నిలబడి రెండు చేతులెత్తి నమస్కరించి, వెనుతిరిగి చీకటిలో కలిసిపోయాడు.

******

 “నేనీరోజు ఈ ఆట ఆడటం లేదు.” స్పష్టంగా, మొండిగా చెప్పాడు రవీంద్రనాథ్. “అతడు” నిశ్శబ్ధంగా విన్నాడు. ఎందుకని అడగలేదు. ఆడమని శాసించనూ లేదు. మౌనంగా, దీక్షగా టేబిల్ పై చదరంగ బోర్డు మీద పావులను అమర్చుతున్నాడు. “మీకే చెపుతున్నాను. ఈ రోజుతో ఈ ఆటకు ముగింపు చెప్పండి. నేను ఈ ఆట ఆడను. మీరు ఆడే ఈ మృత్యుకేళిలో నేను ఇక పాలు పంచుకోను”. గట్టిగానే చెప్పాడు.
“అతడు” వింటున్నట్లుగా లేదు. అతని పని అతడు చేసుకుపోతున్నాడు. “మిమ్మల్నే....” గట్టిగా అరుస్తూ విసురుగా లేచి, రెండు చేతులతో టేబిల్ పైని చదరంగం పావులను చెల్లాచెదరుగా తోసేసాడు.“అతడు” నవ్వాడు.  నెమ్మదిగా లేచి, క్రిందపడిన పావులన్నింటినీ జాగ్రత్తగా ఏరుకొచ్చి, మళ్ళీ చదరంగం బోర్డుపైన పేర్చసాగాడు.రవీంద్రనాథ్ చేసేదేం లేక నిస్సత్తువగా సోఫాలో కూలబడిపోయాడు.“ముందుగా నాకీ విషయం చెప్పండి. మీకెందుకు ఈ మనుషులమీద కక్ష? ఎందుకు పుట్టించినట్లు... తిరిగి ఎందుకు చంపుకుని తీసుకుపోతున్నట్లు...?”
“అతడు” నోరు విప్పాడు. “మనుషుల జననమరణాలలో నా ప్రమేయం లేదు. పుట్టిన ప్రతి ఒక్కరు పుట్టుకతోనే మరణాన్ని రాసిపెట్టుకుంటారు. ఒక మనిషి మరణాన్ని నిర్ధారించేది అతని బుద్ది, శరీరమే! ఆ అంతిమ సమయం ఆసన్నమైనపుడే నా ఆగమనం...!  నేను, వారు విసర్జించిన  ప్రాణాలను ’మృత్యువు’ అనే పల్లకిలో మోసుకుపోయే బోయిని మాత్రమే. శుష్కించిపోయి అవసానదశకు చేరుకున్న శరీరాలకు మరణమనే లేపనం పూసి, శాశ్వత విశ్రాంతిని చేకూర్చే సేవకుడిని మాత్రమే...!” వెంటనే రవీంద్రనాథ్ ఆవేశంగా అడిగాడు. “అబద్ధం చెపుతున్నారు. వయసుడిగిపోయి మరణించే వారి గురించి కాదు. వాటిని ఎవరూ  ఆపలేరు. కానీ, ఈ అకాల మరణాలేమిటి...? ఆత్మహత్యలు, హత్యలు, యాక్సిడెంట్లు... ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి...? నూరేళ్ళు బ్రతికి చివరి దశలో మరణించాల్సిన మనిషిని ఇలా అర్ధాంతరంగా ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారు...?”

“బుద్ధి కర్మాను సారిణి...! నీవు చెపుతున్న ఇటువంటి ప్రతి మరణాన్ని తర్కించి చూడు. ప్రతి చావు వెనుక... మానవుడి తప్పిదం తప్పక తెలుస్తుంది. తనంతట తానుగా నన్ను ఆహ్వానిస్తుంటే... నేనెందుకు ఆగిపోవాలి...? ఒక్కసారి... ఈ రోజు ఉదయం నువ్వు వెళ్ళిన ఇంటికి మళ్ళీ వెళ్ళు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకుని రా...” చెప్పాడతను.

*******

రాఘవేంద్రస్వామి 4వ నంబరు వీధి. ఇంటి నెంబరు 101 లో విషాధచాయలు అలుముకుని ఉన్నాయి. కాలింగ్ బెల్ కొట్టి లోపలికి వెళ్ళాడు. కార్యక్రమం అంతా అయిపోయినట్లుంది. అందరు ఉదయం నుండి ఏడ్చి ఏడ్చి... అలసిపోయి ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చుండిపోయి ఉన్నారు. వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు ఏవేవో మాటలు చెప్పి వారిని ఓదార్చుతున్నారు.కార్యక్రమానికి వెళ్ళి వచ్చిన అందరూ చూడటానికి వీలుగా హాలులో నేలమీద ఒక పెద్ద ఫోటో పెట్టి దానికి పూలమాల వేసి, ఎదురుగా చిన్న దీపం పెట్టి ఉంచారు. ఆ ఫోటోను చూసాడు రవీంద్రనాథ్. దాదాపూ పద్దెనిమిది ఏళ్ళుంటాయేమో...! చిరునవ్వులు చిందిస్తూ ఓ అందమైన అమాయకమైన యువతి. “ఈ అమ్మాయికేనా... రాత్రి తను చావు ముహూర్తం పెట్టి వెళ్ళింది”. బాధగా అనుకున్నాడు.“ఎలా జరిగింది...?” అక్కడే ఉన్న ఓ పెద్దావిడను అడిగాడు.“ఏం చెప్పమంటారండీ... ఉదయం బాగానే ఉంది.  తల్లి దండ్రులను ఆఫీసులకు పంపింది. మధ్యాహ్నం వాళ్ళకు ఫోన్ చేసి, లంచ్ కి వస్తున్నారా ? అని అడిగింది. వాళ్ళు వచ్చేలోపే... ఆ ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయింది. ఎందుకో, ఏమిటో ఎవరికీ తెలియదు.” కొంగుతో కళ్ళు తుడుచుకుంది. “అదేమిటో... రెండు మూడు నెలల ముందునుండే తల్లిదండ్రులతో అంటోందిట... మీరు ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి, నేనీ ఫ్యాన్ కి ఉరేసుకుని చచ్చిపోయి కనబడితే... మీరెలా ఫీలవుతారమ్మా...? అని. సరదాకే చేసిందో... మనసులో ఏదైనా పెట్టుకునే చేసిందో... మొత్తానికి ప్రాణాలొదిలింది పిచ్చి పిల్ల...!” మళ్ళీ కళ్ళు తుడుచుకుంది.“తనంతట తానుగా నన్ను ఆహ్వానిస్తుంటే... నేనెందుకు ఆగిపోవాలి...?” చప్పున “అతడు” అన్న మాటలు గుర్తొచ్చాయి రవీంద్రనాథ్ కి. అందుకే పెద్దలు అంటారు. మన నోటినుండి పలికే ప్రతి మాటకు శక్తి ఉంటుంది. అందుకే, మంచి పలుకకపోయినా ఫర్వాలేదు.  చెడు మాత్రం ఎప్పుడూ పలకవద్దు. ముఖ్యంగా మరణానికి సంబంధించి. ఇంక అక్కడ ఉండలేకపోయాడు. లేచి బయటకు వచ్చాడు. వస్తూంటే రాత్రి తను ఆ ఇంటి ఆవరణలోకి విసిరేసిన “మృత్యువు పన్ను” గుర్తొచ్చింది. అతడి కళ్ళు ఆత్రంగా చుట్టూ వెతికాయి. ఇంటిముందు ఉన్న క్రోటన్ మొక్కల మొదలులో కనబడింది మెరుస్తూ...
“హు...” విరక్తిగా చూసాడు. ఈ ఇంటిలో మరణం సంభవించబోతుందని తెలిపే గుర్తు అది...!     

రాత్రి చదరంగం ఆటముందు కూర్చున్నారు ఇద్దరు.  “ప్రతిరోజూ సరదాగా, క్యాజువల్ గా ఎన్నో మాటలు మాట్లాడుతాం. ఉదాహరణకు, పవిత్రమైన దేవాలయంలోకి వెళ్ళి భగవంతుడి ముందు నిలబడి. నేను ధనవంతుడిని కావాలి, లక్షల ఆస్థి నాకు సంక్రమించాలి. అని కోరుకుంటాం. అవి జరుగవు. ఓ నిరుద్యోగి తనకు ఉద్యోగం రావాలి. జీవితంలో తను స్థిరపడిపోవాలి అని చేతులెత్తి మ్రొక్కుతాడు. అవేవి జరుగవు. కానీ, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. చచ్చిపోతాను అంటూ పలికే మాటలు మాత్రం ఎందుకు నిజమవుతున్నాయి...? యముడు స్పందించినంత త్వరగా దేవతలెవ్వరూ స్పందించరా...?” వెటకారంగా అడిగాడు రవీంద్రనాథ్.అతడు నవ్వాడు. “మంచి జరగాలనే కోరిక తీరడానికి యోగం ఉండాలి. ఆ కోరిక కోరుకునే హృదయం పరిశుద్ధంగా ఉండాలి. అతడి వాక్కు శుద్ధిగా ఉండాలి.  స్వార్ధంతో కోరుకునే ఏ కోరికా త్వరగా నెరవేరదు.  చెడు కోరుకోవడానికి ఇవేవి అక్కరలేదు. మనసు, దృష్టి చెడువైతే చాలు. మనిషి మంచివాడైనా సరే... కోరుకుంటున్న సమయం దుర్ఘడియ అయితే చాలు.  మంచికన్నా... చెడు ప్రయాణం అతి వేగం.” ధీర్ఘంగా నిట్టూర్చాడు రవీంద్రనాథ్.
“చెక్” అతడు గెలిచాడు. వెగటుగా నవ్వాడు రవీంద్రనాథ్. అతడు నోటిలోనుండి తీసి ఇచ్చిన దంతాన్ని చేతిలోకి తీసుకుని బయటకు నడుస్తూ ఓసారి వెనక్కి తిరిగి అడిగాడు. “ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఈ పనికి నన్నే ఎందుకు ఉపయోగించుకుంటున్నారు...?”
అతడు మళ్ళీ నవ్వాడు. “నీ జన్మనక్షత్రంలోనే పుట్టిన నీవంటి ప్రాణి ఒకరు నీ రాకకోసం ఎదురుచూస్తున్నారు... వెళ్ళిరా...! నీ తదనంతరం..... అతని మాటలను  సగంలోనే విని  జవాబు అందింది అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు రవీంద్రనాథ్.

******

ఆరండల్ వీధి, ’హృదయవిహారి’ అపార్ట్ మెంట్. నాలుగవ ఫ్లోర్. 412 నెంబరు ప్లాట్. తలుపులు మూసి ఉన్న ఆ గుమ్మం ముందు నిలబడి ఉన్నాడు రవీంద్రనాథ్. “భగవాన్... ఈ పాపంలో నాకు భాగం లేదు. నేను కేవలం నిమిత్తమాత్రుడిని. నువ్వు ఆడుతున్న మృత్యుకేళిలో నేను ఒక పావును మాత్రమే... నన్ను క్షమించు.” భుజానికి ఉన్న సంచిలోని కాగితపు పొట్లాన్ని తెరిచాడు. తెల్లగా మెరుస్తూ... “మరణదంతం”. దాన్ని నిశ్శబ్ధంగా గుమ్మం ముందు వదిలి వెనుతిరిగాడు. మెట్లవరకూ వచ్చాక గుర్తొచ్చింది.  “నీ జన్మనక్షత్రంలోనే పుట్టిన నీవంటి ప్రాణి ఒకరు నీ రాకకోసం ఎదురుచూస్తున్నారు... వెళ్ళిరా...!” ఎవరు నా రాకకోసం ఎదురుచూస్తున్నది...? అనుమానంగా వెనక్కి చూసాడు. 412 ప్లాట్ డోర్ తెరచుకుంది. ఓ ఎనిమిదేళ్ళ పిల్లాడు బయటకు వచ్చాడు. వస్తూనే వాడి దృష్టి మెరుస్తున్న పన్ను మీద పడింది. “హే...ఇదేంటీ... భళేగా ఉంది...” చటుక్కున వంగి దాన్ని తీసుకుని, తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకున్నాడు.“ఇంత ఉదయాన్నే వీడెందుకు నిద్రలేచాడో.... హు... కాలం... అంటే ఇదే...!”రవీంద్రనాథ్... భారంగా నిట్టూర్చాడు. అంటే, తన తర్వాత... ఈ డ్యూటీ చేసేవాడు ఈ ఇంట్లో పెరుగున్నాడన్నమాట...! నిస్సత్తువగా ఒక్కోమెట్టే దిగుతూ సాంతం క్రిందకి వచ్చేసాడు.మధ్యాహ్నం... గం.2.00లు. 412 ప్లాట్ నుండి హెల్మెట్ తీసుకుని బయలుదేరింది ఊర్మిళ. వైట్ చుడీదార్, రెడ్ చున్నీ మీద చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. “సోనూ బేటా... తలుపేసుకో... అమెరికన్ కౌన్సిలేట్ ఆఫీస్ కి వెళ్ళి, మనిద్దరికీ వీసా తీసుకుని వచ్చేస్తాను. నేను వచ్చేవరకూ ఆడుకోవడానికి బయటకు వెళ్ళకు...” జాగ్రత్తలు చెప్పి బయలుదేరింది.క్రిందకి వచ్చి, కారు ఉన్నా... ఇక్కడివరకే ఎందుకులేమ్మని, టూవీలర్ తీసుకుని మెయిన్ గేట్ దాటి రయ్యిన దూసుకెళ్ళింది. ఊర్మిళ భర్త అరుణ్ అమెరికాలో మంచి ఫామ్ లో ఉన్న డాక్టర్.  తను మాత్రం కొడుకుతో ఆ అపార్ట్ మెంట్ లో ఉంటోంది. చేతికి కావలసినంత డబ్బు. ఫ్రెండ్స్... పార్టీలు, జల్సాలు... ఏ చీకు చింతా లేని జీవితం. ఉన్న సిటీలోనే అమ్మానాన్న, తమ్ముడు ఉంటున్నారు. అప్పుడప్పుడూ కొడుకుతో తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోతుంది. ఒక్కోసారి, వాళ్ళే ఊర్మిళ దగ్గరకు వచ్చి ఉంటుంటారు.
తెల్లవారితే భర్త అరుణ్ అమెరికా నుండి సెలవుపై వస్తున్నాడు. ఓ నెల రోజులు ఇండియాలోనే ఉండి, ఈ సారి భార్యాకొడుకును తనతో తీసుకెళ్ళిపోతాడు. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటొంది.

అరగంటలో వెళ్ళిన పని పూర్తయ్యింది. ఇంకా, టైలరింగ్ షాప్ లో తన బట్టలు తీసుకోవాలి. అట్నుంచి, గీతా ఆంటి వాళ్ళింటికి వెళ్ళి, రేపు తెల్లవారుఝామున అరుణ్ రిసీవ్ చేసుకోడానికి ఎయిర్ పోర్టుకు రమ్మని చెప్పాలి. బండి అటువైపుకు తిప్పింది.ఆమె ముఖంలో ఆనందం తొణికిసలాడుతోంది. మనసంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంది.  సంవత్సరం తరువాత సెలవులో వస్తున్నాడు అరుణ్. చూసి చాన్నాళ్ళయింది. ఈ నెలరోజులూ అరుణ్ ని వదిలిపెట్టేదే లేదు. అతడు వచ్చేలోపు చాలా చాలా ప్లాన్స్ చేసి సిద్ధంగా ఉంచింది. అతడు వచ్చిన రెండో రోజే... ఫ్రెండ్స్ ని, బంధువులను పిలిచి గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేయాలి. మళ్ళీ నెలాఖరులో సెండాఫ్ పార్టీ ఉంటుంది.  సెకండ్ వీక్ ఫ్యామిలీ అంతా కలిసి తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి. అటునుంచి అటే శ్రీ కాణిపాకం...  ఇక అమెరికా వెళ్ళిపోతే, మళ్ళీ ఎప్పటికి రావడమో...! షాపింగ్స్, గోల్డ్ పర్చేజ్....ఇవన్నీ షరా మామూలే...! వీటన్నిటికీ అరుణ్ ఎప్పుడో పర్మీషన్ ఇచ్చేసాడు.
బండి ఎన్.టి.ఆర్. రింగ్ రోడ్ కి చేరుకుంది.

ఆమె ఆలోచనలింకా కొనసాగుతున్నాయి. హృదయవిహారి అపార్టుమెంట్ లోని తమ 412 ప్లాట్ అమ్మకానికి పెట్టారు. ఈ నెలాఖరులోగా ఆ అమౌంటు వచ్చేస్తుంది. వాటిని సోనూ పేరు మీదకు బ్యాంకులో డిపాజిట్ చేసేయాలి. అమెరికా వెళ్ళాక, రెండో బిడ్డకోసం ట్రై చేయాలి. ఈ సారి ఖచ్చితంగా పాప కావాలి. సోనూకి తోడుగా...! అమెరికాలో పుట్టే పాప, అక్కడి వాతావరణానికి తగినట్లుగా ఫారిన్ బేబిలా ఉంటుందా...? ఆమె పెదవులమీదకు చిరునవ్వు వచ్చి చేరింది. ఆమె కళ్ళముందు, గోల్డ్ హెయిర్, మిల్క్ స్కిన్...పింక్ లిప్స్... పసిపాప కదలాడింది.
రింగ్ రోడ్ లో బండిని కుడివైపుకు తిప్పింది. అటునుండి ఎడమవైపుకు వెళ్ళే స్ట్రెయిట్ రోడ్ లో వెళ్ళాలి తను.ఎనిమిది సంవత్సరాల గ్యాప్ తరువాత ప్రెగ్నెన్సీ వస్తే... తను కనగలదా...? తండ్రి డాక్టరే కదా... అన్నీ ఆయనే చూసుకుంటాడు నవ్వుకుంది.ఆలోచిస్తూనే... బండిని ఎడవైపు రోడ్డులోకి మళ్ళించింది. అక్కడే తను తప్పు చేసింది. తన ధ్యాసలో తనుండి, ఎడమవైపునుండి రింగ్ రోడ్డులోకి వస్తున్న హెవీ లారీని చూడలేదు తను. అప్పటికే అతడు హారన్ ఇస్తున్నా... తీయని కలలో తేలుపోతున్న ఊర్మిళ చెవులకు అవి చేరలేదు.
అంత దగ్గరగా వచ్చేసిన తరువాత... లారిని బ్రేక్ వేసి కంట్రోల్ చేయడం సాధ్యం కాలేదు డ్రైవర్ కి. అంతే.... లారీ... ఊర్మిళ టూవీలర్ ని గుద్దేసింది. ఆ తాకిడికి ఊర్మిళ అంతెత్తున ఎగిరి... రోడ్డుపై పడిపోయింది. పడటమే...  వెనుకనుండి వస్తున్న మరోలారీ ఊర్మిళ శరీరంపైనుండి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా... ఊర్మిళ నడుము భాగం శరీరం నుండి పూర్తిగా వేరైపోయింది. కలలు కంటున్న ఆమె అందమైన కళ్ళు శాశ్వతంగా నిలబడిపోయాయి.

******

“నో... నో... నా వల్లకాదు ప్రభూ... నన్నొదిలేయండి. ఈ ఆట ఆడటం నా వల్ల కాదు. ఇంత భయంకరమైన మరణాలకు నన్ను పాత్రధారిని చేయకండి. దీనికన్నా... నన్ను చంపేయండి. ప్లీజ్... ప్లీజ్...” చేతులు జోడించి గట్టిగా ఏడ్చేసాడు రవీంద్రనాథ్.“అతడు” నవ్వాడు. “సరే... నువ్వు చెప్పినట్లే ...” అని, “ఇది ఆఖరు ఆట... నువ్వు గెలిస్తే... నేను నీ ఇంటిలోంచి పూర్తిగా వెళ్ళిపోతాను. ఓడిపోకుండా స్ట్రాంగ్ గా ఆడు.” చెప్పాడు.

రవీంద్రనాథ్ ఆశగా కూర్చున్నాడు. ఆట ప్రారంభమైంది. అతడు కదుపుతున్న పావులను జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఎత్తుకు పై ఎత్తు వేస్తూ... జాగ్రత్తగా ఆడుతున్నాడు. ఎక్కడికక్కడ అతని ఎత్తులను చిత్తు చేస్తూ... చెక్ చెపుతున్నాడు.  అతని పావులు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వెళుతుంటే... రవీంద్రనాథ్ కళ్ళల్లో మెరుపు.ఎప్పుడూ లేని ఆనందం పాలపొంగులా పైకి  పెళ్ళుబుకుతుంది. చాలా రోజులుగా బాధతో ముడుచుకుపోయిన హృదయం ఒక్కసారిగా పొంగుతున్న ఆనందాన్ని తట్టుకోలేకపోతుందేమో... గుండెలో ఎక్కడో ఓ మూల సన్నని నొప్పి సూది మొనలా గుచ్చుకుంటున్నట్లు అనిపించింది. అదేమీ పట్టించుకోలేదు రవీంధ్రనాథ్.అతని ధ్యాస అంతా... ఈ ఆఖరు ఆటలో తను గెలవాలి. మృత్యువు నీడను తన ఇంటినుండి తరిమేయాలి. “అతడికి” శాశ్వత ఉద్వాసన పలకాలి. తన చేతుల మీదుగా జరుగుతున్న ఈ మృత్యుకేళికి ఈ రోజుతో చెక్ పెట్టేయాలి.

చదరంగం బోర్డు మీద ఉన్న నల్లని పావులు అన్నీ అయిపోయాయి.  రవీంద్రనాథ్ రాజు, మంత్రి... ముందుకు కదిలి, ఆఖరుగా మిగిలి ఉన్న అతడి రాజును చంపేసాయి.“చెక్...” ఆనందం పట్టలేక గట్టిగా అరిచాడు రవీంద్రనాథ్. అతని కేక... ఆ హాలులో ప్రతిధ్వనించింది. గుండెలో సన్నని నొప్పి, ఈ సారి బలంగా వచ్చింది. గుండెపై చేయి గట్టిగా అదిమిపట్టి, సోఫాలో కూర్చుండిపోయాడు. అయినా... అదేమీ రవీంద్రనాథ్ ని బాధించడం లేదు.“అయిపోయింది. మీరు ఓడిపోయారు ప్రభూ... ఇంక వెళ్ళిపోండి. ఇంకెప్పుడూ రావద్దు. నాకీ మృత్యుకేళి నుండి శాశ్వత విముక్తిని ఇవ్వండి. వెళ్ళండి... దయచేసీ వెళ్ళిపోండి...”  గుండెపై అరచేతితో రాసుకుంటూ ఆయాసంగా అన్నాడు.
అతడు నవ్వాడు.”అవును. అయిపోయింది. వెళ్ళిపోతున్నాను. ఇంక ఇక్కడికి రావాలసిన అవసరం నాకు ఇంకెప్పటికీ ఉండదు. ఈ మృత్యుక్రీడ... ముగిసింది.” చెప్పి, లేచి బయటకు నడిచాడు.గుమ్మంలోంచి  వెళ్ళిపోతున్న “అతడి” వైపు సంబరంగా చూసాడు రవీంద్రనాథ్. ఆయాసపడుతూనే... పైకి లేవబోయి తూలి తిరిగీ సోఫాలోనే కూలబడిపోయాడు. ఎమౌతుంది తనకు...? ఎప్పుడూ లేనిది ఇలా గుండెల్లో నొప్పి ఎందుకొస్తుంది...? మంచినీళ్ళు త్రాగాలి... ఎదురుగా ఉన్న టీపాయ్ మీది వాటర్ బాటిల్ ని తీసుకోబోతూ... అప్పుడు చూసాడు. “మృత్యువు పన్ను”  తళ తళ మెరుస్తూ... అతడి కళ్ళు పెద్దవయ్యాయి.అతడి చెవుల్లో... ఆరోజు తను వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నపుడు తన చెవివరకూ వచ్చి మెదడును చేరుకోని “అతడు” మాటలు ఇప్పుడు స్పష్టంగా వినబడసాగాయి. “.....నీకోసం ఎదురుచూస్తున్నాడు వెళ్ళిరా...! నీ తదనంతరం... అతడే నా వారసుడు. ఈ బృహత్కార్యానికి నేను మృత్యువుకు దగ్గరగా ఉన్నవాళ్ళనే ఎంచుకుంటాను.”  అవేకాదు... గంట క్రితం తను అన్నమాటలు... దానికి అతడు ఇచ్చిన జవాబు కూడా మారుమ్రోగసాగాయి.
“ఇంత భయంకరమైన మరణాలకు నన్ను పాత్రధారిని చేయకండి. దీనికన్నా... నన్ను చంపేయండి. ప్లీజ్... ప్లీజ్...” “సరే... నువ్వు చెప్పినట్లే ...ఇది ఆఖరు ఆట...”రవీంద్రనాథ్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అతడు వెళ్ళిన వైపు చేతులు జోడించి. “ప్రభూ... ఇలా నిర్ధారించావా...? అవును ప్రభూ మీరన్నదే నిజం... మా అంతట మేము ఆహ్వానిస్తుంటే... మీరెందుకు ఆగుతారు...?” ఆయాసపడ్డాడు. మరోసారి గుండెలో గట్టిగా నొప్పి. రవీంద్రనాథ్ ఊపిరి ఆగిపోయింది. అతడి  ముఖంలో చిరునవ్వు మిగిలిపోయింది.
***************

 

మరిన్ని శీర్షికలు
poems