Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Vankaya Kodiguddu (Brinjal-Egg Curry)

ఈ సంచికలో >> శీర్షికలు >>

నాట్యరాజు-నటరాజు - -ప్రతాప వెంకట సుబ్బారాయుడు

natyaraju - nataraju

శివ భక్తులందరికీ శివుడు తాండవం చేస్తాడని తెలుసు. అసలు ఆకారమే లేని శివుడు తన ఆనందం కోసం, భక్తులను ఆనందపారవశ్యంలో ముంచెత్తడం కోసం నటరాజు రూపాన్ని ధరించి నృత్యం చేస్తాడని కాకతీయుల కాలంలోని జాయన రచించిన నృత్తరత్నావళి ద్వారా మనకు తెలుస్తుంది. పరమశివుడు ఎల్లప్పుడూ ప్రదోషకాలం(సూర్యుడు అస్తమించే సమయంలో తిథి మారితే అది ప్రదోషకాలం) లో, హిమాలయాల్లో, కొన్ని ప్రాచీన శైవక్షేత్రాల్లో నృత్యం చేస్తుంటాడు. శివుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆనందతాండవం చేస్తాడు. గజాసురుడు, అంధకాసురుడులాంటి దుష్టులను సంహరించేటప్పుడు భైరవరూపంలో ప్రళయ భీకర నృత్యం చేస్తాడు.

సృష్టి, స్థితి, లయల కారకంగా కనిపించే నటరాజ విగ్రహాన్ని మనం పరిశీలనగా చూసినట్టయితే-

స్వామి నాలుగు చేతులతో, జడలు కట్టిన జుత్తుతో, జడల్లో ఒక సర్పం, ఒక కపాలం, జటాజూటంలో గంగాదేవి,  ఎడమ వైపున నెలవంక, కుడిచెవికి కుండలం, ఎడం చెవికి తాటంకం, కంఠహారాలు, నూపురాలు, కేయూరాలు, యజ్ఞోపవీతం, కుడిచేతిలో ఢమరుకం, మరో కుడిచేతితో అభయముద్ర, ఒక ఎడమ చేతిలో అగ్ని, మరో ఎడంచేతిలో సర్పం కలిగి ఉంటాడు.

నటరాజ భంగిమలో ఢమరుకాన్ని పట్టుకున్న హస్తం సృష్టికి ఆధారమైన ఓంకారాన్నీ, శబ్దాన్ని సూచిస్తుంది.

ఎడమ చేతిలోని అగ్ని వినాశనాన్ని అంటే ప్రళయాన్ని సూచిస్తుంది. ఆ రెండు చేతులూ ఒకే రీతిగా ఉండడం ఈ ప్రపంచంలో సృష్టి, వినాశనాలు ఎల్లప్పుడూ సమానంగా కొనసాగుతాయని స్పష్టం చేస్తుంది.

రెండు బాహువుల మధ్య ఉన్న నిర్వికారమైన నటరాజు ముఖం సృష్టి, వినాశనాలు రెండింటినీ సమన్వయించుకున్న, ఆ రెండిటికీ అతీతమైన స్వామి స్థితిని సూచిస్తుంది.

నటరాజు కుడి పక్కన ఉన్న రెండో బాహువు అభయ ముద్ర ద్వారా స్థితి, పాలనలను సూచిస్తుంది. ఎడమ ప్రక్కన ఉన్న రెండో బాహువు పైకెత్తిన ఆయన పాదాన్ని చూపుతూ మాయాజాలం నుంచి విముక్తిని సూచిస్తుంది.

నటరాజు అపస్మార పురుషుడు (ములయక రాక్షసుడు) అనే ఒక రాక్షసుడి దేహంపై నృత్యం చేస్తూ ఉంటాడు. ఆ రాక్షసుడు మానవునిలోని అజ్ఞానానికి ప్రతిరూపం. దానిని నశింపజేస్తేనే ముక్తి సాధ్యం.

చుట్టూ ఉన్న చక్రం మాయ. చక్రాన్ని స్పృశించిన చేయి మాయను తొలగిస్తుంది.

శివుడి "ఆనంద తాండవం" లేదా "లాస్యం" - ప్రళయం తర్వాత తిరిగి ఏర్పడే సృష్టిని సూచిస్తుంది. శివుడు పరబ్రహ్మానికి సంకేతం. ఆయన మెడలోని సర్పం ప్రతీ జీవుడిలో ఉండే కుండలినీ శక్తికి సంకేతం. వెన్నులోని ఏడు చక్రాలను మేల్కొల్పడమే కుండలినీ శక్తిని మేల్కొల్పడం. శివుడి 'రుద్ర తాండవం' ఈ జగతి నాశనానికి సంకేతం.

శివుడి మూడో కన్ను జ్ఞానానికి సంకేతం.

చేతిలోని పుర్రె మృత్యువుపై విజయానికి సంకేతం.

దట్టమైన శివుని జటాజూటం ప్రళయకాలంలో అన్ని వైపులా వ్యాపించి తుఫానులు,సునామీల వంటి ఉత్పాతాలను సృష్టిస్తుంది. శివుడు మూడో నేత్రం తెరవడంతో దాని నుంచి వెలువడే అగ్నిశిఖలు విశ్వమంతా దావానలంలా వ్యాపించి, దానిని నాశనం చేస్తాయి.

శివుడి ఈ రెండు తాండవాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. శివుడి ఈ రెండు రకాల నృత్యాలు 'చిదంబరం' అంటే - హృదయమనే ఆకాశంలో - చైతన్యానికి కేంద్రమైన చిదాకాశంలో జరుగుతాయి.

పరబ్రహ్మ స్వరూపుడైన శివుడు సర్వరూపాల్లోనూ ఉంటాడు కాబట్టి, తాండవం చేసే విశ్వమే శివుడు. ఆధునిక భౌతిక శాస్త్రం చెప్పినట్లు ఈ తాండవం నిత్యమూ జరిగేదే. శివతాండవం బ్రహ్మాండాల సృష్టి లయలకే కాక, నిత్యమూ కొనసాగే జనన మరణాల వంటి ప్రకృతి క్రియలకు కూడా సంకేతం.

వివిధ రూపాలుగా మనకు కనిపించేదంతా నిజానికి అశాశ్వతం, భ్రాంతి మాత్రమేనని శివుడు సదా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. బ్రహ్మ రాత్రిని అనుభవించినప్పుడు ప్రకృతి అచేతనంగా ఉంటుంది. శివుడు సంకల్పించేంత వరకు ప్రకృతి నృత్యం చేయజాలదు. ఆయన ఆత్మానందం నుంచి మేలుకొని, తన నృత్యం ద్వారా జడమైన ప్రకృతిని మేల్కొలిపేలా శబ్దం (డమరుక ధ్వనిగా సూచితం) చేస్తాడు. ఇలా తన నృత్యం ద్వారా పదార్థ రూపంలో వివిధ ప్రకృతి క్రియలను కొనసాగిస్తాడు. కాలాంతరంలో ఆయన తన నృత్యం ద్వారానే నామరూపాలన్నింటినీ నశింపజేసి, ప్రకృతికి విశ్రాంతినిస్తాడు.

బ్రహ్మకు రాత్రి అయి నిద్రలోకి వెళ్ళినపుడు శివుడు రుద్ర తాండవం మొదలుపెడతాడు. అప్పుడు ఈ విశ్వం నాశనమై, కుంచించుకు పోయి, శూన్య స్థితికి చేరుతుంది. బ్రహ్మకు పగలు అయి, మేలుకున్నప్పుడు శివుడు ఆనంద తాండవం మొదలుపెడతాడు. అప్పుడు బ్రహ్మ సృష్టిని ప్రారంభిస్తాడు.

ఈ చరాసర సృష్టిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ నటరాజును శ్రద్ధగా గ్రహించి, అసలు తత్త్వాన్ని అర్థం చేసుకోగలిగితే ఈ అనిపించేదంతా మాయ అని పెద్దలు ఎందుకన్నారో అవగతమవుతుంది.

***                  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మరిన్ని శీర్షికలు