చిత్రం: చిత్రలహరి
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్, సునీల్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్ తదితరులు.
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై రవి శంకర్, మోహన్ (సివిఎం)
విడుదల తేదీ: 12 ఏప్రిల్ 2019
రేటింగ్: 2.75/5
కుప్లంగా చెప్పాలంటే..
పేరులో వున్న విజయం, జీవితంలో లేకపోవడంతో తీవ్రంగా నిరాశ చెందుతుంటాడు విజయ్ కృష్ణ (సాయి ధరమ్ తేజ్). విజయ్ కృష్ణ, లహరి (కళ్యాణి ప్రియదర్శన్)తో ప్రేమలో పడతాడుగానీ, ఆ ప్రేమకు స్వేచ్ఛ (నివేదా పేతురాజ్) కారణంగా తూట్లు పడతాయి. మరి, జీవితంలో విజయ్ కృష్ణని విజయం వరించిందా? లేదా? ప్రేమ సంగతేంటి? స్వేచ్ఛ ఎవరు? లహరి - విజయ్ కృష్ణల ప్రేమకు స్వేచ్ఛ ఎందుకు ఎలా అడ్డు తగిలింది? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
మొత్తంగా చెప్పాలంటే..
నో డౌట్, నటుడిగా ఈ సినిమా హీరో సాయి ధరమ్ తేజ్‌కి చాలా ప్రత్యేకం. నటుడిగా తానేంటో నిరూపించుకునేందుకు వచ్చిన మంచి అవకాశాన్ని సాయి ధరమ్ తేజ్ నిరూపించుకున్నాడు. ఈ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ తన పేరులోని 'ధరమ్'ని కూడా కట్ చేసేసి, జస్ట్ 'సాయి తేజ్'గా టైటిల్ కార్డ్స్‌లో వేయించుకున్న సంగతి తెల్సిందే. నటన పరంగా కొత్త సాయిధరమ్ తేజ్‌ని ఇందులో చూస్తాం. సినిమా మొత్తాన్నీ తన భుజాల మీద మోసేందుకు ప్రయత్నించిన తేజుని అభినందించి తీరాల్సిందే. తేజు కొంచెం తన ఫిజిక్ మీద దృష్టి పెడితే మంచిది. గెటప్ పరంగా తీసుకున్న కేర్ ఓకే.
కళ్యాణి ప్రియదర్శన్ క్యూట్ అప్పీల్‌తో ఆకట్టుకుంటుంది. నటన పరంగా ఆమెకు మంచి మార్కులు పడతాయి. సహజమైన అందం, సహజమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వగలగడం ఆమె ప్రత్యేకతలు. నివేదా పేతురాజ్ కూడా అందంగా కనిపించింది. నటనతోనూ ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాలు ఆమె నటన కారణంగా హైలైట్ అయ్యాయి కూడా.
సునీల్, వెన్నెల కిషోర్ కావాల్సినన్ని నవ్వులు పూయించారు. పోసాని కృష్ణమురళి నటన ఈ సినిమాకి మరో మేజర్ ప్లస్ పాయింట్. మిగతా పాత్రధారులంతా తమ తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.
కథ పరంగా మరీ కొత్తదేమీ కాదు, అలాగని పరమ రొటీన్ కథ కూడా కాదు. కథనం పరంగా ఓకే. ఇంకాస్త వేగంగా కథనాన్ని నడిపించి వుండాల్సింది. ఎడిటింగ్ ఓకే, అక్కడక్కడా కత్తెరకు ఇంకొంచెం పదును పెట్టి వుంటే బావుండేది. పాటలు వినడానికే కాదు, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బావుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి అడిషనల్ బోనస్ అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సీన్స్ ఇంకా బాగా ఎలివేట్ అయ్యాయి. నిర్మాణపు విలువల పరంగా చూస్తే ఎక్కడా రాజీ పడని తత్వం కనిపిస్తుంది. కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ తమవంతు సహకారాన్ని అందించాయి.
మాటలతో మాయ చేద్దామనుకున్న దర్శకుడు, కథ విషయంలో ఇంకాస్త బాగా వర్కవుట్ చేసి వుండాల్సింది. కథనాన్ని వేగంగా నడిపించడంలోనూ దర్శకుడు శ్రద్ధ సరిగ్గా పెట్టలేదేమోనన్న భావన కలుగుతుంది. దానికి తగ్గట్టే కొన్ని సన్నివేశాలు కన్విన్సింగ్‌గా అనిపించవు. అయితే భావోద్వేగాలు పండించే క్రమంలో డైలాగ్స్‌ని దర్శకుడు బాగా వాడుకోవడం కలిసొచ్చింది. ఎమోషనల్ జర్నీ అనిపించినా, ఎంటర్‌టైన్‌మెంట్‌తోనూ ఆకట్టుకున్నాడు. ఓవరాల్‌గా ఓ మంచి ఔట్‌పుట్ ఇచ్చే ప్రయత్నంలో దర్శకుడు, తన బలాల్ని ఎలివేట్ చేసకున్నాడుగానీ, బలహీనతలపై ఫోకస్ పెట్టలేకపోయాడు. సాయిధరమ్ తేజ్ మేకోవర్, అతని నటన ఈ సినిమాకి మేజర్ హైలైట్స్. హీరోయిన్స్ మరో అదనపు ఆకర్షణ. సునీల్, వెన్నెల కిషోర్ కామెడీ బాగా రిలీఫ్ ఇస్తుంది. కథనాన్ని ఇంకాస్త వేగంగా నడిపించి వుంటే, రిజల్ట్ నెక్స్‌ట్ లెవల్‌లో వుండేది.
అంకెల్లో చెప్పాలంటే..
2.75/5
ఒక్క మాటలో చెప్పాలంటే
చిత్రలహరిలో.. కొంచెం వేగం తగ్గింది
|