Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
adigedimeere answericchedi meere

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఎందరో మహానుభావులు – అందరికీ వందనాలు - భమిడిపాటిఫణిబాబు

endaro mahanubhavulu andarikee vandanaalu

జయంతులు

మే 4

త్యాగరాజు :  కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన  త్యాగరాజు, మే 4, 1767 న, కాకర్ల గ్రామంలో జన్మించారు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి.   త్యాగయ్యవారు 24000 రచనల వరకు రచించిరి. "దివ్యనామ సంకీర్తనలు", "ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు" అను బృంద కీర్తనలు కూడా రచించెను. "ప్రహ్లాద భక్తి విజయము", నౌకా చరిత్రము అను సంగీత నాటకములు కూడా రచించిరి.

శ్రీ దాసరి నారాయణరావు : వీరు, మే 4, 1942 న , పాలకొల్లు లో జన్మించారు. ప్రసిధ్ధ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు, రచయిత.  అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్‌ పుటలకెక్కారు.. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు.. 53 సినిమాలుస్వయంగా నిర్మించారు.. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశారు.

మే 6

శ్రీ మల్లాది వెంకట సత్యనారాయణ రావు : వీరు, మే 6, 1932 న దాక్షారామం లో జన్మించారు. ప్రముఖ సంగీత విద్వాంసులు, రేడియో ఆర్టిస్టు, సంగీత కళానిధి బిరుదాంకితులు, దేవీ ఉపాసకులు సుమారు 45 సంవత్సరాలుగా వయోలిన్ వాద్య కళాకారులుగా సంగీత ప్రపంచానికి చిరపరిచితులు..

మే 7

శ్రీ  కిళాంబి వెంకట నరసింహాచార్యులు :  “ ఆత్రేయ : గా ప్రసిధ్ధి చెందిన వీరు, మే 7, 1921 న  మంగళంపాడు లో జన్మించారు.  తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత మరియు దర్శకులు. దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన గొప్పకవి. వీరు తాత్విక ధోరణితో రాసిన సంభాషణలు జీవిత తత్వాన్ని గుట్టువిప్పుతాయి. జీవితాన్ని కాచి వడబోసిన నగ్నసత్యాలు. ప్రతి వ్యక్తి జీవితానికి మార్గ దర్శకాలు… “ మనసు కవి “ గా పేరుపొందిన వీరు, ఎన్నోఎన్నెన్నో పాటలు రాసారు.. ఇప్పటికీ  వాటిని గుర్తుచేసుకుంటాము.

మే 9

తాళ్ళపాక అన్నమాచార్యులు  :  “ అన్నమయ్య “ గా ప్రసిధ్ధి చెందిన వీరు, మే 9, 1408 న  తాళ్ళపాక లో జన్మించారు. సాధారణ భాషలో గేయాలు  రచించి, తెలుగులో మొదటి వాగ్గేయకారుడి గా పేరుపొందారు. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి,  పదకవితాశైలికి ఆద్యుడు.. 32 వేలకు పైగా కీర్తనలు రచించారు. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.

 

వర్ధంతులు

మే 4

శ్రీ గుడిపాటి వెంకట చలం :   చలంగా ప్రసిద్ధుడైన గుడిపాటి వెంకట చలం సుప్రసిద్ధ తెలుగు రచయిత, వేదాంతి మరియు సంఘసంస్కర్త. ఆధునిక తెలుగు సాహిత్యాన్నిప్రభావితం చేసిన అతి ముఖ్య వ్యక్తుల్లో చలం ఒకరు.వీరి రచనలు చాలా వరకు స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో వారికి ఎదురయ్యే శారీరక మరియు మానసిక హింసలు, వాటిని వారు ఎదుర్కొనే విధానాలను చర్చించారు. చలం రచనలలో ఇతివృత్తమూ, తాత్వికతా, రచనాశైలీ ఆయనకు ఆధునిక తెలుగు రచనా రంగంలో అనన్యమైన స్థానాన్ని సంపాదించిపెట్టాయి.

వీరు మే 4, 1979 న స్వర్గస్థులయారు.

మే6

శ్రీ  కోకా సుబ్బారావు:  వీరు  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి మరియు, తొమ్మిదవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి.  వీరు ఎన్నో కీలకమైన తీర్పులు ఇచ్చారు. న్యాయశాస్త్రానికి సంబంధించిన కొన్ని పుస్తకాలు కూడా రాసారు.

వీరు మే 6, 1976 న స్వర్గస్థులయారు.

శ్రీ బలివాడ కాంతారావు :   సుప్రసిద్ధ తెలుగు నవలా రచయిత..  38 దాకా నవలలు రాశారు. ఇంకా 400 దాకా కథలు, 5 నాటికలు, రేడియో నాటికలు రచించారు.. ఏ దశలోనూ ప్రమాణాలపై రాజీపడలేదు.ఆయనకి తెలుగుఇంగ్లీషే కాక బెంగాలీఒరియా కూడా వచ్చు.

వీరు మే 6, 2000  న స్వర్గస్థులయారు.

మే 7

శ్రీ అల్లూరి సీతారామ రాజు :  ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నారు.

వీరు మే 7, 1924 న స్వర్గస్థులయారు.

 

మే 9

శ్రీమతి దుర్గాబాయ్ దేశ్ ముఖ్  :   ప్రముఖ  తెలుగు స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త మరియు రచయిత్రి. చెన్నైహైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఈవిడే స్థాపించారు. ఎన్నో సామాజిక కార్యక్రమాలలో తన వంతు సహాయం చేసారు. భారతప్రభుత్వం వీరిని 1975 లో  “ పద్మ విభూషణ్ “ తో సత్కరించారు.

మరిన్ని శీర్షికలు
Excitement