రోడ్డు మీద పుష్పక విమానాలు..షేర్డ్ ఆటోలు!
మనం పుష్పక విమానాల గురించి పురాణాల్లో వినుంటాం. ‘అందులో ఎంతమంది కూర్చున్నా ఇంకొకరికి చోటుంటుంది’ అని విని ఆశ్చర్యపోతాం. ‘అరే..అంత గొప్ప సాంకేతికతను కళ్లారా చూడలేకపోయామే’ అన్న బాధ మనసును మెలేస్తూంటుంది. సరిగ్గా మనలాంటి వారికోసమే భగవంతుడు ఈ కలియుగంలో మాడర్న్ పుష్పక విమానాలను షేర్డ్ ఆటోలుగా సృష్టించి (కనుక్కున్నది మనమే అయినా అవుడియా ఆయనదేగా) రోడ్లమీద తిరిగేలా చేశాడు.
మీరెప్పుడైనా షేర్డ్ ఆటోలో ‘స్థలం లేదని’ డ్రైవర్ అనడం విన్నారా? వినరు గాక వినరు. గజానికోసారి..కొండొకచో మూరకోసారి ఎవరు చెయ్యి చాపినా ఆపుతూ వాళ్లను ఎక్కించుకోవడం మనకు సర్వ సాధారణ విషయమే!
నిజానికి షేర్డ్ ఆటోలవల్ల ఉపయోగం ఉంది కాబట్టే, మనం ప్రోత్సహిస్తున్నాం. అదేంటంటే- ఇందాక చెప్పినట్టు ఎక్కడబడితే అక్కడ చేయి చూపించి ఆపి ఎక్కొచ్చు. అలాగే ఎక్కడ కావాలిస్తే అక్కడ దిగొచ్చు. మరే ప్రయాణ సాధనంలో ఇంతటి వెసులుబాటు ఉండదు. ముఖ్యంగా బస్సుల్లాగా ‘స్టాపులోనే ఆగుతాయి’ అన్న మాట ఉండదు. మన బద్ధకానికి మనం బస్టాప్ దాకా నడవగలమా? బస్సొచ్చేదాకా ఎదురుచూడగలమా? నెవర్. అలాగే గాలాడకపోయినా, కదిలే స్థలం లేకపోయినా ఇరుక్కుని కూర్చుంటాం.
కాకపోతే నెగటివ్స్ (నష్టాలు) ఏంటంటే- ఎక్కడ చేయి కనబడితే అక్కడ ఠపుక్కున ఆపడం వలన వెనకాల వచ్చేవాటికి తెగ ఇబ్బంది. ఒక్కోసారి యాక్సిడేంట్లు అవుతున్నాయి. అధికారుల చెకింగ్స్ (నాకు తెలిసి) లేకపోవడం వల్ల ఆటో లోని పార్ట్స్ ఊగిపోతూ..ఊడిపోతూ లోపలకూర్చున్నవాళ్లని భయపెడుతూ ఉంటాయి. ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళన తప్పదు.
డ్రైవర్ కు అటో ఇద్దరు, ఇటో ఇద్దరు కూర్చునే సౌలభ్యం ఉంటుంది. అతను ఇరుక్కుని అలా కూర్చునే, నిష్ణాతుడిలా అలవోకగా డ్రైవ్ చేసిపడేస్తాడు. ఆటో ముందు భాగంలో ఎవరూ కూర్చోరు గాని (ఎందుకనో అంత ఇంప్రూవ్ కాలా) ఆ పక్కా, ఈ పక్కా, మధ్యలో, వెనుకా..మనం సరిగ్గా గమనిస్తే వేళ్లాడే మనుషులతో ఆటో నడుస్తున్న మనుషుల గుత్తిలా ఉంటుంది.
రోడ్ మీద ద్విచక్ర వాహన చోదకులకు హెల్మెట్ ఉండాలి, కారు నడిపే వాళ్లకు సీట్ బెల్ట్ ఉండాలి, బండికి ఫిట్ నెస్ ఉండాలి, లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ ఉండాలి ఇత్యాది ఎన్నో రూల్స్ ఉంటాయి కదా! మరి సర్వీస్ ఆటోలకు అవుంటాయో లేదో తెలీదు. ఎక్కడా చెకింగ్ జరగడం చూడలేదు.
దేవుళ్లు కూడా ఒక్కసారి ఎక్కి తరించాలనుకునే ప్రయాణ సాధనం.
ఏదేమైనా షేర్డ్ ఆటో రోడ్డు మీద తిరిగే ఓ సాంకేతిక అద్భుతం. ప్రయాణికుల పాలిట వరం. ఎక్కి..ఎంజాయ్ చేయండి గాని అనవసర ఆలోచనలు పెట్టుకోకండి.
***
|