అతి పిన్న వయసులోనే పెద్ద మనసుతో ఆలోచించగల మంచి మనసు జానీ భాషా చరణ్ తక్కెడశిలది. మానవత్వపు మూలలను తడిమే రచనలు చేయడంలో తనదైన అభివ్యక్తితో చక్కని, చిక్కని భావాలను కవితలుగా, దీర్ఘ కావ్యాలుగా, కథలుగా, వ్యాసాలుగా, బాల సాహిత్యపు కథలు, గేయాలు, విప్లవ గేయాలు, నానోలు, నానీలు, మినీలు మొదలైన సాహిత్యపు ప్రక్రియల్లో అఖిలాశ, లై అన్న కలం పేరుతో తెలుగు,హింది, ఆంగ్ల సాహిత్యాలలో విరివిగా రచనలు చేస్తూ ఎన్నో సాహితీ పురస్కారాలు, సన్మానాలు పొందుతున్న జాని రచనల్లో వై.. అన్న దీర్ఘ కావ్యం అరుదైన కవితా వస్తువు.
మనిషి తనంతో విధి ఆడుతున్న వింత నాటకాన్ని మనసుతో అక్షరీకరించిన "వై..." అన్న దీర్ఘ కావ్యం చదవడం పూర్తి చేసిన తరువాత కొన్ని రోజుల వరకు ఓ బాధా వీచిక మనల్ని వెంటాడుతుందనడంలో ఎట్టి సందేహమూ లేదు. జాని ఎంచుకున్న కవితా వస్తువే వైరుధ్యమైనది. ఎవరు సాహసించని కవితా వస్తువుతో అదీ దీర్ఘ కావ్యం రాసి మెప్పించడం కష్టమైన పనే. ప్రతి పదంలోనూ ఆ మూడో మనిషి మనసు పడే బాధ, రోదన, కోపం, ఆవేశం, ఆక్రందన, తమకంటూ ఓ గుర్తింపు కోసం వారి మది పడే తపన ఇలా ఎన్నో మనకు తెలియని వైవిధ్యమైన కోణాలను మనకు, మన మనసులకు దగ్గరగా చూపించడంలో కృతకృత్యులైయ్యారు. జన్యు లోపం కారణంగా ఈ మానవ సమాజంలో తమకంటూ గుర్తింపు లేకుండా సమాజ బహిష్కరణకు గురైన ఈ అర్ధనారీశ్వరుల వేదన వర్ణనాతీతం. పుట్టుకలో లోపానికి తమ తప్పేమీ లేకపోయినా కన్నవారితోను, తోడబుట్టిన వారితోనూ, ఈ సభ్య సమాజంతోనూ ప్రతిక్షణం ఛీత్కారాలకు గురౌతూ బతుకులు వెళ్లదీస్తున్న వారి మనసులను అక్షరాల్లో అద్దంలా పరిచి వారి సమస్యలకు సమాధానం కావాలని ఈ ప్రపంచానికి వారి గొంతుకను వినిపించి తన దొడ్డ మనసును చాటుకున్నారు.
పుట్టుక ఒకటే అయినా ఆడ, మగ, పేద, గొప్ప తేడాలున్నట్లే పుట్టుక మగతనం, కాలక్రమంలో ఆడదనపు లక్షణాలతో సగం ఆడ, సగం మగ మనిషిగా బతకడం ఎలానో తెలియక ఇంతా బయటా అవమానాలు, చీదరింపులు ఎదుర్కొంటూ బతుకు వెళ్లదీయడం ఎంత దుర్లభమో ఈ" వై..." చదువుతుంటే తెలిసింది.
"కొన్ని సమూహాలు
కాలపు పై కొనలో
ఒత్తులై వెలుగొందుతున్నారు...
మరికొన్ని సమూహాలు
కాలం పాదాల కింద
పాతివేయబడుతున్నారు...
మరి మేమూ
గగనానికి.. పుడమికి మధ్య
వేలాడుతున్నాము...!!"
అంటూ అటూ ఇటూ కాని మూడో మనిషి అంతర్నేత్రాన్ని విప్పి చూపిస్తారు.
"మాలో మేము తొంగి చూసుకున్నప్పుడు తనువులోని ఆణువణువూ మగాడిదే కానీ హృదయపు సంద్రంలో ఆలోచనలన్నీ స్త్రీతనం వైపు పరుగులిడుతుంటే అప్పుడే మాకర్థమౌతుంది మేమొక చీకటి ఆడపిల్లలమని.." అంటూ చెప్పడంతోనే జాని ఎంత బాగా వారి మానసిక స్థితిని ఆవిష్కరించారో మనకు అర్ధమౌతుంది. అయినవారు, సమాజం వెకిలి మాటలతో, చూపులతో హింసిస్తుంటే..
"మగతనాన్ని గుమ్మాన వదిలేసి
ఆడతనాన్ని ఆవహించుకున్న శరీరాలతో
సమాజంలోకి అడుగుపెట్టాము..." అని తమ అడుగులు ఈ సమాజంలో ఎలా పడ్డాయో చెప్తారు. కన్నవారు అసహ్యించుకుంటే తమలాంటి వారే తమను అక్కున చేర్చుకుని ఆదరించారని చెప్తూ, చదువుకోవడానికి కూడా తమకెదురైన వివక్షను గురించి వీణావాణినే ప్రశ్నిస్తారు. మూడవతనంతోనున్న తమని సమాజపు కర్కశ కోరలతో కాటేస్తుంటే తమకోసం పోరాడుతున్న కొన్ని గొంతుకలు నేడో రేపో తమకు ఓ స్థానాన్ని కల్పిస్తాయన్న ఆశకు జీవం పోస్తున్నాయంటారు. తమను మనుషులుగా గుర్తించక కొందరు చిన్నచూపు చూడటాన్ని నిరసిస్తారు. అక్షరాలు నేర్వకపోయినా తమ ఆశీస్సులు ఈ మానవ సమాజానికుంటాయని తమ మంచితనపు మనసుని చాటుకుంటారు. తల్లిదండ్రులు తమను కాలపు అంచున నిలబెట్టి సమాజపు శూన్యానికి ఉరి వేస్తే ఈ బతుకుల రాజ్యాంగం తమకు మూడో అంకె కేటాయించిందని వాపోతూ, హృదయం గాయపడిన తాము ఎదురైతే నిండు మనసుతో ఆత్మీయంగా పలకరించమంటూ వేడుకుంటారు. తమ ఒంటరి పాదముద్రలఉహా పయనం అనురాగపు గమ్యానికేనంటారు. వారి చేతి చప్పుళ్ళు ఆకలి కడుపు నింపుకోవడానికంటూ చిందరవందరైన జీవితాలతో చీకటి మేఘాల్లా కదులుతూ, శూన్యంలోకి విసిరేయబడ్డ నక్షత్రాల్లా స్నేహానికై ఎదురుచూస్తున్న లోపల అంగవైకల్యులమే కానీ మనసు కోవెలకు ఏ వైకల్యమూ లేదంటూ తమ విశాల హృదయాన్ని చాటుతారు. దైవం విసిరినా దుఃఖపు పోగులతో గుండె అడ్డం ముక్కలైనా, ఆ ముక్కల్లో మానవత్వపు మనిషి కోసమే తమ అన్వేషనంటారు. వర్తమానం తెలియని చీకటి దుప్పటిలో కప్పెట్టిన తమ జీవితాలను ఛీత్కారాల నుండి, చీదరింపుల నుండి, సమాజపు విషపు కోరల నుండి బయటకు తీయాలని, రాతి శరీరం నుండి పుట్టలేదు, తల్లి గర్భం నుండే మేము పుట్టినా మాపై ఎందుకీ వివక్ష అంటూ సూటిగా మనసులను తాకుతాయి వారి ప్రశ్నల శరాలు. సమాపు చెట్టు నుంచి రాలిన విషాదపు ఆకులమంటూ, మీ ఆపన్న హస్తాలు అందించి చేయూతనివ్వండి. మేము విశ్వా విజేతమై నిలుస్తామని తమ ఆత్మ విశ్వాసాన్ని వినిపిస్తారు. త్రిసంధ్యా కాలాలోనున్నా ఆధునిక ముసుగేసుకున్న కోరికల కామాంధులకన్నా తామే మేలని నవ్వుకుంటున్నామంటూ సమాజపు నీచపు మనస్తత్వాలపై చురకలు వేస్తారు.
ఆకలికి తట్టుకోలేక బతకాలన్న కోరిక బలంగా ఉండి, సిగ్గు విడిచి స్త్రీతనపు వాంఛను ఎరగా వేసి శరీరాన్ని అమ్ముకుంటూ, మదమెక్కిన మృగాల కామవాంఛకు, పైశాచికత్వానికి బలౌతు, రోజూ చస్తూ బతుకుతున్నామంటారు. తమని తాము చూసుకున్న ప్రతిసారి వెక్కిరించే రాతి ప్రతిబింబాన్ని చూస్తూ మగ శరీరంలో ఆడతనాన్ని అంగీకరించలేక, వ్యర్ధ పదార్ధాన్ని తీసేసే శిల్పి కావాలని నిస్సహాయంగా వాపోతుంటారు. తాము యాచించేది ఆత్మీయ స్పర్శ కోసమని కన్నీటితో చెప్తారు. ఆకాశం ఆశయమని, జీవితమే యుద్ధమని భయపడకుండా నిస్సహాయతను చంపి, చీకటి పేజీలను చింపేసి, ఈ సమాజానికి ప్రతినిధులుగా మారి, అవకాశాలు లేని తామే ఒకరికి అవకాశమై నిలుస్తామనడంలో ఎంత ఆత్మ విశ్వాసం. చిన్నప్పటి అమ్మ చేతి గోరుముద్దలు, ఆసరాగా నిల్చిన నాన్న చేతి చిటికెన వేలు, అనుబంధాల ఆత్మీయతలు, ఆ పిలుపుల కోసం తపిస్తూ ఆదరించి అక్కున చేర్చుకునే ఆప్తుల ఎదురుచూస్తున్నామంటారు. స్త్రీ కి అన్యాయం తిరిగితే ఎన్నో వేల గొంతులు తోడుంటాయి.
అదే స్త్రీతత్వాన్ని మా శరీర గర్భంలో నింపుకున్న మాకు న్యాయం జ్జరగడం లేదని ఆక్రోశిస్తున్నారు. స్త్రీ పురుషులతో మాకేవి సమన హక్కులంటూ,మేము ఈ దేశపు పౌరమే అయినా ఏ ప్రభుత్వమూ మా కడుపు నింపడం లేదు. అందుకే మా దేహాలను చీకటి అంగట్లో అమ్మేసామంటారు. అసహజ శరీర మార్పులను అర్ధం చేసుకోకుండా, అసలు పేరున్నా తమకు ఈ సమాజం తగిలించిన పేరుతో, అయినవారే ఆవలి వారై అడుగడుగునా అవమానాలనెదుర్కుంటూ ఛిద్రమైన మనసులను సరి చేసే విశ్వకర్మ కావాలని వేడుకుంటున్నారు. చిట్లిన బంధాల వేర్లు అతికిస్తే వంటరితనాన్ని వదిలేస్తామంటారు. ఈ అనైతిక శక్తుల మధ్యన అస్తవ్యస్తమైనా సహజ పంచభూతాల మధ్యన సేదదీరుతున్నామంటున్నారు. తమ అవస్థలను, తమకు కావాల్సిన పరిష్కారాలను సూచిస్తూ దిగంబర అక్షరాలకు జీవం పోసి మౌనాన్ని స్మశానంలో దాచేసి, గళాలను సమాజంలోకి విసిరి, నేడో రేపో గెలుపు కోసం ఎదురుచూస్తున్న ఆశావాదులుగా చిత్రీకరించి, అద్భుతంగా ఈ మూడో తనాన్ని అవహేళన చేసే వారికి, అసలు మానవత్వాన్ని చెప్పి, మనదే కాదు సమాజం మనతోనున్న మరో తత్వానిది కూడా అని నొక్కి వక్కాణించి, వారి సమస్యలను, వేదనలను చెప్తూ, వారికి పరిష్కార మార్గాలను చూపిస్తూ, తన మనసుని ఈ " వై... " అన్న దీర్ఘ కావ్యంలో పరిచి ఎవరు చేయని సాహసాన్ని చేసిన జాని భాష చరణ్ తక్కెడశిలకు హృదయపూర్వక అభినందనలు.
|