Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
prema ishq kaadal movie review

ఈ సంచికలో >> సినిమా >>

ప్రశంసలు వేరు... విజయం వేరు

Interview with Sundeep Kishan

నవతరం నటులు ఎందరో వున్నారు. మరెందరో వస్తున్నారు. కానీ తామేంటో ప్రూవ్ చేసుకోవాలని మాత్రమే కాకుండా, తాను మాత్రమే చేయగల పాత్రలను వెదికి చేసేవారు కొందరే వుంటారు. అసలు తెరపైకి రావడమే కాస్త విలక్షణమైన పాత్రతో వచ్చిన నటుడతను. ఇప్పటివరకు చేసినవి అరడజనకు పైనే అయినా, వాటిలో గుర్తుండిపోయేవే ఎక్కువ. నిజానికి అయిదేళ్ల క్రితం స్నేహగీతంతో ముఖానికి రంగేసుకున్నా, ప్రస్థానంతో అందరి దృష్టిలో పడ్డ కుర్రాడు. అతగాడే సందీప్ కిషన్. ఇటీవల ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తో మాంచి హిట్ కొట్టిన సందీప్ తో చిట్ చాట్ ఇది.

సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారా?
- మరి అంతేకదా... విజయం తెచ్చేఆనందం ఎప్పుడూ వేరుగా వుంటుంది.

విజయమే కొలబద్ద అంటారా...నటుడికి.
- అలా అని కాదు. కానీ ఎంత మంచి పాత్ర పోషించినా, అది ప్రేక్షకులకు రీచ్ కావాలి. వారు గుర్తించాలి. ఈ రెండు జరగాలంటే సినిమా విజయం సాధించడం కూడా ముఖ్యం కదా.

తొలి సినిమా స్నేహగీతం సంగతి పక్కన పెడితే, ఆ వెంటనే ‘ప్రస్థానం’లాంటి నెగిటివ్ రోల్ ఎంచుకోవడం వెనుక.
- పెద్దగా రీజన్ ఏమీ లేదండీ. నా మటకు ఓ ఐడెంటిటీ, నటనకు స్కోప్ వుంటూ, కాస్త కమర్షియల్ ఔట్ లుక్ వున్న సినిమాలు చేయాలని అనుకుంటాను. కేవలం రొటీన్ పాత్రలయితే, ప్రేక్షకలకు ఎన్నాళ్లు గుర్తుంటాం. నిజానికి ‘ప్రస్థానం’ వల్లే నేను హిందీ సినిమా కూడా చేయగలిగానుగా.

కానీ మీ ప్రయోగాలు కొన్ని సార్లు వికటిస్తున్నాయేమో? మహేష్ ఫలితం చూసారుగా?
- నిజమే కానీ మహేష్ సినిమా నేను తెలుగు కోసం చేయలేదు. అది తమిళ ప్రేక్షకుల కోసం తయారుచేసిన సినిమా. అయినా కూడా మీరు చెప్పినట్లు అది ఓ లెసన్ అనే అనుకోవాలి. అయితే ఇక్కడ ఓ విషయం కూడా వుంది. హీరో క్యారెక్టరైజేషన్ ను జస్టిఫై చేసే కొన్ని సీన్లున్నాయి ఆ సినిమాలో. వాటిని తెలుగులో ఎందుకునో తొలగించారు. దాంతో కాస్త తేడా వచ్చేసింది.

సరియైన సోలో పాత్రలు ఇప్పుడిప్పుడే దొరకుతున్నాయనుకుంటా?
- ఎంతయినా సినిమా కమర్షియల్ మీడియా కదండీ..నిర్మాత తన సేఫ్ కూడా చూసుకోవాలి కదా..నా మీద భరోసా పడొచ్చు అన్న అభిప్రాయం ఇప్పుడిప్పుడే కలుగుతోంది. ఇకపై దాదాపు చేస్తున్నవన్నీ సోలో సినిమాలే. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చూసారుగా.

అవును ఈ సినిమా కాన్సెప్ట్ మీకు చెప్పినపుడు ఎలా అనిపించింది.
- మరో మాట చెప్పకుండా ఓకె అనేలా. దర్శకుడి నెరేషన్ అలా వుంది. అసలు ఆ కాన్సెప్టే చాలా ఆసక్తికరం అనిపించింది. రన్..రన్..రన్ టైపు సినిమాలు యూత్ కు సహజంగా నచ్చుతాయి. వారి వర్కింగ్ స్టయిల్ కు కూడా దగ్గరగా వుంటాయి కదా.

గుండెల్లో గోదారి లాంటి జోవియల్ కుర్రాడి పాత్రలు మీకు బాగా నప్పుతాయినిపిస్తుంది. కానీ మీరు ఫేస్ లో కాస్త సీరియస్ నెస్ వున్న పాత్రలే చేస్తున్నట్లు కనిపిస్తుంది.
- అదేం లేదండీ... వీలయినంత వరకు సరదా పాత్రలే చేయాలని వుంది. కానీ అదే తరహా పాత్రలైతే బోర్ కొట్టేస్తుంది కదా. సందీప్ అన్ని రకాల పాత్రలు చేయగలడని అనిపించుకోవాలన్నదే నేను కోరుకునేది. ఓ క్యారెక్టర్ అన్నాక చాలా రకాల షేడ్స్ వుంటాయి. ఇకపై చేయబోయేవి దాదాపు సరదా, సీరియస్, యాక్షన్ ఇలా అన్ని కలసి వున్నవే.

ఒకేసారి మూడు నాలుగు సినిమాలు సిద్ధం అవుతున్నట్లున్నాయి.
- యా. డికె బోస్, డి ఫర్ దోపిడి, రారా కృష్ణయ్యా... అన్నీ విభిన్నమైన సబ్జెక్ట్ లే. రారా కృష్ణయ్య అయితే రొమాంటిక్ కామెడీ ప్లస్ యాక్షన్ కూడా.

యాక్షన్ అంటే గుర్తొచ్చింది వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో ఫైట్లకు రెస్పాన్స్ ఎలా వుంది.
- చాలా బాగా. ఒక విధంగా మీరన్న సోలో హీరోగా నాపై భరోసా పడేందుకు ఆ ఫైట్లు కూడా సహకరించాయి.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కు మామయ్య ( చోటా కె నాయుడు ) పనిచేయడం ఎలా అనిపించింది.
- మామయ్య చేస్తానంటేనే, ఆ సినిమా చేయాలని సినిమా దర్శక నిర్మాతలు ముందే డిసైడ్ అయిపోయారు. ఆయన ఓకె అన్నాక, అది కూడా ఆయన మాకోసం చాలా రోజులు కేటాయించాకే పని ప్రారంభించాం. ఫలితం మీరే చూసారుగా. ఆయన పనితనం అన్నిటా కనిపించింది. పాటలు, ఫైట్లు ఈ తేడాను స్పష్టంగా చూపిస్తాయి.

హిందీ సినిమా మళ్లీ చేయలేదు.
- చేయాలనే వుంది. కానీ కానీ అక్కడి వాతావరణం, వ్యవహారం వేరు. ఏదో చేసామంటే చేసామని అనిపించుకోవడానికి లేదు. అయితే ఇప్పుడున్న వాతావరణంలో అన్నీ కలిసి వచ్చే సూచనలు తక్కువ.

ఇక్కడ మీ జెన్ యూత్ స్టార్స్ ఎక్కువే వున్నారు. మరి ఈ కాంపిటీషన్ ఎలా వుంది.
- అవకాశాలు అందరికీ దొరుకుతాయండీ. కావాల్సనంత స్కోప్ వుంది. ఎటొచ్చీ మనం ప్రూవ్ చేసుకోవాలి. అదృష్టం కలిసిరావాలి. ఎందుకంటే అప్లాజ్ వేరు. విజయం వేరు. అప్లాజ్ మనపై ఆధారపడి వుంటుంది. విజయానికి అదృష్టం కూడా కలిసిరావాలి.

ఇప్పుడు ఒప్పుకున్నవి అన్నీ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ విజయానికి ముందు. ఇకపై, అంగీకరించే సినిమాలకు ఏమన్నా తేడా వుంటుందా?
- అదేమీ లేదండీ. కాస్త కమర్షియల్ వాల్యూ వున్న సబ్జెక్ట్, మరి కాస్త ప్రాధాన్యత వున్న పాత్ర. వీలయినంత వరకు సోలో హీరో గా చేయాలని చూస్తున్నా. అలా అని మల్టీస్టారర్ చేయనని కాదు. సబ్జెక్ట్ డిమాండ్ చేయాలి. దాని ప్రాధాన్యత దానికి వుండాలి.

ఓకె..మీ గమ్యంలో మీరు ముందుకిలాగే సాగిపోవాలి
- థాంక్యూ అండీ.

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
cini churaka by cartoonist bannu