Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Jandhyavandanam - Jandhyala Biography

ఈ సంచికలో >> శీర్షికలు >>

శ్రీ స్వామి వివేకానంద - సుధారాణి మన్నె

swami vivekananda biography

వివేకానంద స్వామి ఉపదేశాలు
సమైక్యతా భావాన్ని పెంపొందించుకొని మానవసేవ చెయ్యడం నేర్చుకోండి.

లోకానికి ఉపకారం చేయదలచిన వారు తమపేరు ప్రతిష్టలనూ - కష్ట సుఖాలనూ - కట్టకట్టి సముద్రంలో విడిచిపెట్టి తర్వాత పరమేశ్వరుని సన్నిధికి రావాలి. మహా పురుషులంతా చేసిందీ - బోధించినదీ యిదే.

పాపకార్యాలన్నిటికీ పక్షపాతమే మూలకారణమని తెల్సుకొనండి.

దయా భావంతో యితరులకు ఉపకారం చేయడం మంచిదే కాని జీవులన్నిటినీ భగవత్స్వరూపులుగా భావించి సేవ చేయటం యింకా గొప్పది.

కాటకం - అంటు రోగాలూ మొదలైనవి ఎక్కడ వ్యాప్తి చెందుతాయో అక్కడకు మీరంతా వెళ్ళి ప్రజాసేవ చెయ్యండి. ఆ మహాత్కార్యంలో ఒకవేళ మీరు మరణించినా నష్టం లేదు. ప్రతిరోజూ మనవంటి వారు చాలామంది జన్మిస్తున్నారు. మరణిస్తున్నారు. ఒక ఉన్నత ధర్మం కోసం మరణించడం మంచిదే కదా? ఈ ఆదర్శాన్ని మీరు ప్రతి ఇంటిలోనూ బోధించండి. దానివల్ల దేశానికి ఉపకారం చేసినవారే కాక మీరూ ఉపకారాన్ని పొందినవారవుతారు. మన దేశాభ్యున్నతి యావత్తూ మీ మీదనే ఆధారపడి ఉన్నది. మీరు నిర్వ్యాపకంగా కాలం గడపక కార్యదీక్ష వహించండి. మీరు కార్యరంగంలోకి దూకిన రోజు మీకు బలమూ - శక్తీ వాటంతట అవే వస్తాయి.

మానవసేవ - అదెంత గొప్పదంటే ఆఖరుకు హుక్కా త్రాగే వానికి పొగాకు చిల్లం తయారుచేసి యీయడమైనా లక్షలాది ధ్యానాలకంటే శ్రేష్టమైనది. ప్రతివ్యక్తీ ఈ విషయాన్ని గ్రహించే సమయం వస్తుందని ఆశిస్తున్నాను.

నీ తోడ్పాటు లేనినాడు ఒకచిన్న చీమ అయినా చావగలదని నీవు అనుకుంటే అది మహాపచారం. ప్రపంచానికి నీతోపనిలేదు. భగవత్కార్యం చేసే మహాభాగ్యం నీకు ప్రసాదించబడటం వల్ల నీవే ధన్యుడవు కాగలవు.

తన భావమే సరి అయినదనే పట్టుదల కార్య సాధకమని నేను చిన్నతనంలో భావించేవాడిని. కానీ పెద్దవాడయిన కొద్దీ నా అభిప్రాయం తప్పు అని తెల్సుకున్నాను.

మానవుని యోగ్యతను అతని కర్మముల స్వభావాన్ని బట్టి నిర్ణయించరాదు. ఆ కర్మములను అతడుచేసే విధానాన్ని బట్టి నిర్ణయించాలి. తొందరగా ఒక మంచి చెప్పుల జతను
కుట్టగల వ్యక్తి, అతని వృత్తిని బట్టి - కర్మను బట్టి వ్యర్ధ వాదనలతో కాలం గడిపే పండితుని కన్నా యోగ్యుడు.

మీలో మీరు సంభాషించుకునేటప్పుడయినా యితరులను గురించి నిందా వాక్యాలు పలకడం పాపమని గ్రహించండి.

వ్యర్ధ వాగ్వాదాలు నిమిత్తం మీవద్దకు ఎవరైనా వస్తే మర్యాదగా మీరు తప్పుకోండి.

నిరాశ ఆస్తిక ధర్మం కాజాలదు. నిరంతరం ప్రార్ధనలు చేసే వ్యక్తికన్నా ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉండే వ్యక్తి తేలికగా పరమేశ్వర సాన్నిధ్యాన్ని చేరగలడు.

మన శరీరం కార్య సాధనకు ఉపకరించడానికి ఉద్దేశించబడినది. దీనిని నరకకూపంగా మార్చేవాడు అపరాధి. ఉపేక్షించేవాడు నిందార్హుడు.

ప్రతి వ్యక్తిలోని లోపాలపట్ల సహనబుద్ధిని వహించండి. కోట్లకొద్దీ నేరాలనైనా క్షమించండి.

సుఖం దుఃఖమయ కిరీటాన్ని ధరించి మానవుని యెదుట ప్రత్యక్షం కాగలదు. సుఖానికి స్వాగతమిచ్చేవ్యక్తి దుఃఖానికి కూడా స్వాగతమిచ్చి తీరాలి.

మానవుడు రాజకీయ - సాంఘిక స్వాతంత్ర్యాన్ని పొందవచ్చు. కాని కామ క్రోధాదులకు లోబడి వున్నంతవరకూ నిజమైన స్వాతంత్ర్యం వల్ల లభ్యమయ్యే ఆనందాన్ని పొందుతాడు.

ఎటువంటి మూర్ఖుడైనా తనకిష్టమైన పనిని చేయగలడు. కానీ ప్రతీపనిని తన కిష్టమైన దానినిగా మార్చుకోగలవాడే ప్రతిభాశాలి.

మానవునికి ప్రకృతితో పోరాడటం వల్లనే మానవత్వం లభిస్తుంది గాని, దానికనుకూలంగా నడుచుకొనడం వల్ల కాదు.

నీవుచేసిన కార్యాలను - అవి మంచివైనా - చెడ్డవైనా - మళ్లీ దాని గురించి ఆలోచించవద్దు - జరిగింది జరిగిపోయింది.

మహాకార్యాలు మహాత్తర త్యాగం వల్లనే సాధించవచ్చు. ఇతరులకు మోక్షాన్ని లభింపచేయడం కోసం నీవు నరకానికి పోవడం అవసరమైనా సందేహించవద్దు. సర్వస్వాన్నీ ఇతరులకు విడిచిపెట్టేవానికే మోక్షం లభిస్తుంది.
                                                                                                      

(... వచ్చేవారం మరిన్ని ఉపదేశాలు)

మరిన్ని శీర్షికలు
weekly horoscope janaury 10- janaury 16