Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Samskarana

ఈ సంచికలో >> శీర్షికలు >>

భోగి మంటలెందుకు? - వి. మూర్తి

bhogi mantalu

నిజంగా ఒక్కోసారి మన పండుగలను రూపొందించిన మహానుభావులను తలుచుకుంటే శత సహస్రవందనాలు అర్పించాలనిపిస్తుంది. ఎందుకంటే వారి ముందు చూపు, ఆలోచనలు అలాంటివి మరి. ధనుర్మాసం, భోగి, సంక్రాంతి, కనుమ లాంటి వ్యవహారాల వెనుక వున్న లాజిక్ లను చూస్త ముచ్చటేస్తుంది. శీతాకాలపు వాతావరణణ వేరు. వాతావరణం మొత్తం పొడిబారిపోతుంది. ఆకులు నేల రాలుతుంటాయి, దుమ్ము తెగరేగుతుంటుంది. పైగా ధాన్యం ఆరబోతలు, కోతలు వగైరాలతో ఊరు,వాడ మరింత దుమ్ము కొట్టుకుపోతుంది.  అలాంటపుడు ఇంటి ముందు నిత్యం కళ్లాపి జల్లి ముగ్గు పెట్టమని చెప్పడంలో ఎంతటి పరమార్థ ముంది. ఇలాంటి వ్యతిరేక వాతావరణంలో కూడా ఇంటి ముందు, వీధి లోపల, ఊరిలో అందాలు చెడకుండా మరింత ద్విగుణీకృతం చేయడానికేగా ఈ ఏర్పాటు? కాదనగలమా? పైగా పేడ కలిపి కళ్ళాపి జల్లడం, బియ్యం పిండి ముగ్గుగా పెట్టడం వల్ల చిన్న చిన్న పురుగులకు ఉపకారం, పైగా అవి ఇంట్లోకి వచ్చి మనకు అపకారం చేయకుండ బ్రేకేయడం. రథం ముగ్గు తాడు అలా అలా ఎక్కడికో తీసుకుపోవడం కూడా ఇందుకేనా.. పురుగులను ఆ తాడు వెంట అలా ఊరి బయటకు పంపేయడమేనా? ఆలోచించండి.

అప్పుడు పనిలో పనిగా ఇళ్లు కూడా శుభ్రం చేసుకోవాలి. ఈ దుమ్ము వదుల్చాలి. అంటే కొత్తగా సున్నం వేయాలి. ఏడాది పొడవునా కష్టం చేసి పండించిన పంట ఇంటికొచ్చింది. కాస్త సమయం చిక్కింది అందుకే ఇంక ఇంటి సంగతి చూడాలి. సున్నం వేసే ముందు, ఏడాది పొడవునా పొలం పనిలో పడి ఇంటి సంగతే మర్చిపోవడం పేరుకున్న చెత్త సంగతి చూడాలి. ఏడాది పొడవునా ఇంటిలోకి ఎంత చెత్త చేరుతుందో. ఈ కాలంలో గమనించండి. ముఖ్యంగా అద్దె ఇళ్లలో వున్నవారు. ఇల్లు మారినపుడు తెలుస్తుంది. ఇంట్లో అక్కరలేని సామగ్రి ఎంత పేరుకుందో. అప్పుడు అనుకుంటాం.. ఈ అక్కరలేనివన్నీ పారేయాలి అని. సరిగ్గా ఇందుకోసం ఏర్పాటు చేసిందే భోగి మంట కార్యక్రమం. ఎప్పుడో ఓ సారి కాకుండా, ఏటేటే, ఇల్లు అంతా సర్దేసి, వెల్ల వేసి, ఆపై ఇంట్లో అవసరం లేని సామగ్రిని గుర్తించి మంట పెట్టడం. మరి మంట పెట్టడం ఎందుకు? పూర్వం అన్నీ కలప, లేదా ఇలా పంచభూతాల్లో కలిసిపోయే సామగ్రినే వాడేవారు. ప్లాస్టిక్ పుట్టలేదింకా. ఇలా జంక్ తో ప్రపంచం నిండిపోకుండా, కాల్చేసి పర్యావరణాన్ని కాపాడడం. ఇప్పుడు కాల్చాలన్నా కాల్చలేని పరిస్ఢితి మరి. అంటే భోగి పండుగ అంటే జంక్ క్లియరింగ్ తప్ప వేరు కాదు.

వీధులు అలికి, ఇల్లు తీర్చి, శుభ్రం చేసుకున్నాక, అప్పుడు అసలైన పండుగ సంక్రాంతి. మనం ఈ రోజు ఇలా వుండడానికి కారణమైన పెద్దలను తలుచుకునే పండగ. వారు లేకుంటే పరంపర లేనట్లేగా అందుకే వారి పండుగ అది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పండగ కూడా నేను,నాది అని చేసుకోలేదు. భోగి తన ఇంటి కోసం, సంక్రాంతి తన ఉనికికి కారణమైన పెద్దల కోసం. మూడో రోజు. తన పంట పండడంలో భాగస్వాములైన పశువుల కోసం. తనతో సమానంగా అవీ పొలంలో ఆరుగాలం కష్టపడ్డాయిగా. ఆఖరికి పంటను కూడా అవే ఇంటికి చేర్చాయిగా. అందుకే వాటికీ పరమోన్నతమైన అన్నం, పరమాన్నం వండి పెట్టడం. ఆ విధంగా పశువుల పట్ల కూడా కృతజ్ఞత చూపే వైనం. ఇప్పుడు మనుషుల పట్లే లేదనుకోండి. అది వేరే సంగతి. ఎక్కడ ఆ పశువుల పండగను భవిష్యత్ లో నిర్లక్ష్యం చేస్తారో అని, కనుమ నాడు ఊరు కదల కూడదు అన్న చిన్న లాక్ వేసారు. ఆ విధంగా కచ్చితంగా ఆ పండుగ కూడా ఆచరించేలా చేసారు. ఇక ముక్కనుమ ఒక్కటే మనిషి సెంటిమెంట్ వల్ల వచ్చింది. మూడు అంకె అంతగా నచ్చదు కనుక, ముక్కనుమ అంటూ మరో తోక తగిలించారు. కారణం ఏదైతేనేం, పండుగ అంటే ఆనందమేగా?

ఇంక గొప్పగా పండుగలను ఆలోచించి, డిజైన్ చేసిన పెద్దలకు మనం అందించే కృతజ్ఞత ఒక్కటే. ఆ పండుగులను మన కాలానుగుణంగా మార్చుకుని, ఆనందించడం. అపార్ట్ మెంటాలిటీ వచ్చేసినా, జంక్ క్లియరింగ్ అన్నది ఇప్పటికీ అవసరమే. అలా పోగైన వాటిని తగలబెట్టే అవకాశం లేదు కాబట్టి, అందులో ఉపయోగపడేవి వుంటే, ఏ ఆశ్రమాలకో ఇచ్చేయడం. రిపేరుకు అయిదు వందులు, కొత్తది వెయ్యి పెడితే వచ్చేస్తుందని, పదే పదే కొత్తవాటికి వెళ్లేవారి సంఖ్య రాను రాను పెరుగుతోంది. పోనీ వాటిని తెలుసుకున్నావాళ్లు, పనివాళ్లు, వాచ్ మెన్ లు అలాంటి వారికి రిపేర్ చేయించుకోమని చెప్పి ఇచ్చేయవచ్చు.

పెద్దవాళ్లు ఇన్ని వందల ఏళ్లు  ముందుగా ఆలోచించి పండగులు ఏర్పాటు చేయగా లేనిది, మనం మన తరానికి అనుగుణంగా వాటిని మార్చుకునే ఆలోచన చేయలేమా? పండగంటే తిని, తాగడం అన్న కాన్సెప్ట్ నుంచి బయటకు రాలేమా?

-- వి. మూర్తి

మరిన్ని శీర్షికలు
Feeling Bore....