Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

aadityahrudayam

1983, 2004,2014 - ఈ మూడు సార్వత్రిక ఎన్నికలు నడుస్తున్న గతిని అనూహ్యంగా మార్చిన ఎన్నికలు. సామాన్యుడి ముంగిట్లోకి రాజకీయాల్ని పరిపాలనని తెచ్చింది 83 లో ఎన్టీఆర్ విజయం. అనేక పథకాలతో సామాన్యుడిని సుఖపెట్టింది 2004 లో డా. వై. ఎస్ విజయం. ఇప్పుడు రెండు రాష్ట్రాల ఆవిర్భావం సంధర్భంగా అభివృద్ది కాంక్ష తో ప్రజలు అందలం ఎక్కించింది చంద్రబాబు, కేసీఆర్ లని. నేను సీమాంద్ర గురించో, తెలంగాణా గురించో ఆలోచించట్లేదు. రెండు రాష్ట్రాల్లోనూ వున్న తెలుగువాడి గురించి, ఆ తెలుగు వాళ్ళ జీవితం లో ఎంటర్  టైన్మెంట్ గా మమేకమై పోయిన సినిమా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. చిన్నప్పటినుంచి మాతృదేశాన్ని, మాతృభాషని గౌరవిస్తూ పెరగమని పాఠాల్లో నూరిపోసారు తప్ప, మాతృ రాష్ట్రాన్ని, జిల్లాని, ఊరిని అభిమానించమని చెప్పలేదు. కాబట్టి, నా మాతృభాషని సీమాంద్ర, తెలంగాణా రాష్ట్రాల్లోను మాట్లాడే తెలుగువాళ్ళందరి తరుపున ఈ ఎన్నికలు, అధికారం, పోటీలు, పదవులు, గెలుపులు, ఓటమిలు అన్నీ చూస్తుంటే కొన్ని విషయాలు తట్టాయి. అవి షేర్ చేసుకుందామని ఈ కాలం.

హైద్రాబాద్ స్వభావరీత్యా ముంబై, డిల్లీ, చెన్నై, కలకత్తా, బెంగళూరు సరసన నిలిచే మహానగరం కాబట్టి ఎటూ అభివృద్ది చెందేస్తుంది. తెలంగాణ ప్రాంతం లో కానీ, దానికి 80, 90 కిలోమీటర్ల లోపున చాలా మండలాలు, గ్రామాల్లో, ఈ రోజుకీ కనీస సదుపాయాలు లేవు ప్రజలకి. హైద్రాబాద్ కి గంట దూరం లో వున్న 5 మండలాల్లో ఒక సినిమా థియేటర్ లేదు. ప్రభుత్వ కళాశాలలు లేవు, ప్రభుత్వాసుపత్రులు లేవు. పొలాలకి కరెంట్ లేదు, నీరు లేదు. చేతి వృత్తుల కార్మికులకి  పెన్షన్లు లేవు, ఇన్సూరెన్స్ లు లేవు. మహానగరం చుట్టు పక్కల పల్లెటూళ్ళే. ఇలా వుంటే, దూరంగా వున్నవి ఇంకెలా వుంటాయి? సమాజానికి సంబంధించినంత వరకూ సిటీలు డెవలప్ అవ్వడం ఎంత అవసరమో పల్లెలు, కుగ్రామాలు, తండాలు కూడా డెవలప్ అవ్వడం అంతే ముఖ్యం.

దాని వల్ల సెక్యూరిటీ సిస్టమ్స్ కూడా మెరుగవుతున్నాయంటే సోషల్ ఎలిమెంట్స్ నుంచి, వైరస్లనుంచి, కరప్షన్ల నుంచి, నిరక్షరాస్యత నుంచి రెండు రాష్ట్రాల విభజన  వేగంగా అభివృద్ది చెందడానికి జరిగిన అధికార వికేంద్రీకరణగా ఉపయోగపడాలి తప్ప పౌరుల మధ్య పోట్లాటలకి అనువుగా, దాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయ నాయకులు లబ్దిపొందే ఆయుధంగా ఉపయోగపడకూడదు. ప్రజల మధ్య సమన్వయం వుంటే కుహనా నాయకుల పాచికలు పారవు. తెలుగువాడి సమగ్రతకి, ఐకమత్యానికి కళారాధనకి, ఆత్మ గౌరవానికి, అభివృద్దికి ఈ విభజన. భంగం కలిగించకూడదు. పోటీ పడి రెండు రాష్ట్రాలను అభివృద్ధి పరిచే భాద్యత కే. సి. ఆర్, చంద్రబాబుల భుజస్కందాలపై పెట్టారు ప్రజలు. కనుక వారి మధ్య వివాదాలకు తావు లేకుండా చూడాల్సిన భాద్యత కూడా ప్రజలదే. ఓటు వేసి గెలిపించుకోగానే ప్రజల భాద్యత తీరిపోదు. భాద్యతను సక్రమంగా వినియోగించుకున్న వాళ్ళకు హక్కుల్ని అనుభవించే రైట్ కూడా వుందని మర్చిపోకూడదు. చెన్నై నుంచి వచ్చాక తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ది చెందిందో, అధో పాతాళానికి పడేసిందో చాలా కష్టంగా వుంది. స్థిరమైన మార్కెట్ ని సంపాదించుకోవడం లో ఫెయిల్ అయ్యామన్నది నిర్వివాదాంశం. కానీ గతం లో ఏ గవర్నమెంట్ లోనూ లేనంత మంది సినిమా వాళ్ళు ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల్లోనూ ఉన్నారు.

పవన్ కళ్యాణ్ తో కలిపి టి.డి.పి లో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళంతా పరిశ్రమలో మిగిలిన పెద్దలు, విజ్ఞులను కలుపుకుని రెండు రాష్ట్రాల్లోను సినిమా, టెలివిజన్, నాటక, సంగీత, నృత్య, సాహిత్య తదితర కళారంగాల అభివృద్దికి మార్గదర్శక సూత్రాలను కచ్చితంగా రాస్తే బాగుంటుంది. వాటిని ఆ పరిశ్రమలన్నీ అమలు పరిచేలా చూస్తే ఇంకా బాగుంటుంది. ముఖ్యంగా సినిమా, టి వి పరిశ్రమలకి ఉభయ రాష్ట్రాల్లోను పెట్టుబడులను ఆహ్వానించేలాంటి ఆకర్షక పథకాలు కనీసం మరో పదిహేనేళ్ళు అవసరం. డబ్బున్న వాళ్ళే  సినిమా తీయగలిగిన స్థితి నుంచి కళ మీద ఆసక్తి, ఫ్యాషన్ వున్న వాళ్ళు సినిమాల్లో రాణించగలిగే స్థితికి ఈ పరిశ్రమని బాగుచేయాల్సిన అవసరం ఇప్పుడు చాలా వుంది.

రాయితీల వల్ల, ప్రోత్సాహకాల వల్ల అందరూ బాగుపడుతారు. ప్రభుత్వం లో లాబీ చేయగలిగిన కొద్దిమంది తప్ప కామన్ ట్రాన్స్ పరెంట్ సిస్టం క్రియేట్ చేయాలి. అది అందరికి అన్ని స్థాయిల్లోను అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యుటర్, బయ్యర్, ఫైనాన్షియర్, ప్రొడ్యుసర్ వ్యవస్థలన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలి. ఆటో మేటిక్ గా ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఆ వ్యవస్థల రూల్స్ లోకి ఒదిగిపోతారు. ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి పని కావాలి. వాళ్ళ ప్రతిభని నిరూపించుకునే అవకాశాలు ఒకటికి పది కావాలి. ఇప్పుడున్న నాకౌట్ సిస్టమ్ లో అది కుదరని పని. ఆ పనే వాళ్ళకి డబ్బు, పేరు తెస్తుంది. ఇది చెన్నయ్ లో జరిగేది ఇక్కడ అలా లేదు.  ఈ,డి,బి,ఎఫ్, పి వ్యవస్థలకి పని కన్నా ముఖ్యంగా డబ్బు కావాలి. రూపాయి ఖర్చు పెట్టి పనిచేయిస్తే కనీసం రూపాయికి పదిపైసలైనా దానికి విలువ రావాలి. లేకపోతే వాళ్ళు సినిమాలు తీయలేరు. సప్లై, డిమాండ్ అనే ఆర్ధిక సూత్రం సినిమా రంగానికి వర్తించదు. సినిమా తీయమని ఎవ్వరూ అడగరు. మనకి నచ్చింది తీసి మార్కెట్ లో పడితే, వాళ్ళకి నచ్చింది చూస్తారు. డిమాండ్ లేని సప్ప్లైకి అప్ప్లై చేయాల్సిన రూల్స్ అండ్ రెగ్యులరేషన్స్ వేరేలా వుండాలి కదా! అలా లేవు. ఎవరికి లబ్ది చేకూరేలా లేవు. షో మీద బిల్డప్ మీద ఎవరైన ఎన్నేళ్ళు నెట్టుకొస్తారు.

కొత్త రాష్ట్రాలు, కొత్త ప్రభుత్వాలు ఎలాగూ అన్నీ కొత్తకొత్తగా వున్నప్పుడు కళారంగాన్ని కూడా కొత్తగా తీర్చిదిద్దడానికి ఇదేసరైన సమయం. మరో వందేళ్ళు పరిశ్రమ పచ్చగా వర్ధిల్లాలంటే తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలానే వున్నాయి. ఇప్పటికే తెలంగాణ అభివృద్ధిని ఆంధ్రావాళ్లు తొక్కేసారని, తెలుగు రాజ్యం లో అబివృద్ది చెందిన మహానగర భాగాన్ని తెలంగాణ వాళ్ళు లాగేసుకుని మమ్మల్ని నెట్టేసారని సీమాంద్ర  వాళ్ళు భావిస్తున్న వర్గాలు కొన్నున్నాయి. వీళ్లు బహిరంగంగానే ఎప్పుడూ కయ్యాలకు కాళ్ళు దువ్వుతూనే వున్నారు. నీటుగా తల దువ్వుకోవడం కూడా సరిగ్గా రాని వాళ్లు కూడా ఈ కయ్యాలకు కాలు దువ్వే పనిలో వున్నారు. రెండు ప్రభుత్వాల అధినేతలు, ఆ ప్రభుత్వాలలో, పార్టీలలో ఉన్న వివిధ స్థాయిల నాయకులు, విద్యాధికులు అందరు వీళ్ల నోళ్లు ముందు మూయాలి. తరువాత అభివృద్ది తలుపులు తెరవాలి. మదరాసు రాష్ట్రం, కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం, హైద్రాబాద్ రాజధానిగా ఆంద్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ, సీమాంధ్ర - చాలా ఏళ్ళుగా తెలుగువాడి అస్తిత్వం రాజకీయానుగుణంగా మారుతూనే వుంది, మనం అలవాటు పడ్డాం. ఇప్పుడు కూడా అంతే. అమెరికాలో వున్న, అనకాపల్లి లో వున్న, కరీంనగర్ లో వున్న తెలుగువాడు తెలుగువాడే. అమ్మని అమ్మా అనే అంటారు. నాన్నని నాన్నా అనే అంటారు.

నేనెక్కువ, నువ్వు తక్కువ లాంటి యాటిట్యూడ్ అన్ని రంగాల్లోను పోగొట్టే పనులు అందరం చేద్దాం. రాజ్యాంగ బద్దంగా మన అభివృద్ది ప్రణాళికలు మనం రచించుకుందాం. మనమే ఆచరించుకుందాం. అందుకు మనం ఎన్నుకున్న రెండు ప్రభుత్వాలకీ సహకరిద్దాం - జై తెలంగాణ, జై సీమాంద్ర, జై భారత్...

 

మీ
వి.ఎన్.ఆదిత్య

 


 

    

మరిన్ని సినిమా కబుర్లు
great honour for 12 couples by Zee telugu okariki okaru