Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

మ‌నంలో మ‌ర్చిపోలేని అనుభూతులున్నాయి - నాగార్జున‌

interview with nagarjuna

ప్రయోగాలకు పెట్టింది పేరు.. నాగార్జున‌. ఆయ‌న ఎప్పుడూ ఇమేజ్ చ‌ట్రంలో ఇరుక్కోలేదు. క‌థ న‌చ్చితే చాలు.. ఎలాంటి పాత్రకైనా సిద్ధమే. కొత్త దర్శకులతో సినిమా అంటే.. ముందుగా వినిపించే పేరు.. నాగ్‌!  మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు రావాలి... అని కోరుకునేది, అలాంటి క‌థ‌లు ముందుగా ఎంచుకునేది నాగార్జున‌నే. ఆయ‌న‌లో మంచి క‌థానాయ‌కుడే కాదు. మంచి నిర్మాత కూడా ఉన్నాడు. మ‌ల్టీప్లెక్స్ సంస్ర్కృతి పెరుగుతుంద‌ని, ఇక మీద‌ట వాళ్ల కోసం ప్రత్యేకంగా సినిమాలు తీస్తార‌ని ఐదారేళ్ల క్రిత‌మే ఊహించారు. తెలివిగా చిన్న సినిమాల్ని తీస్తే... క‌చ్చితంగా హిట్ కొట్టొచ్చని, చిన్న సినిమాల‌తో రిస్క్ ఉండ‌ద‌ని ఆయ‌న నమ్మకం. ఆ దారిలో కొన్ని సినిమాల్ని తీశారు కూడా. నాగార్జున‌లో మంచి కొడుకూ ఉన్నాడు.  ఏఎన్నార్ న‌టించిన చివ‌రి చిత్రాన్ని... అభిమానుల‌కు ఓ కానుక‌గా అందివ్వాల‌న్న త‌ప‌న ఆయ‌న‌లో ఉంది. అందుకే ఈసినిమా గురించి ఆయ‌న చాలా చాలా జాగ్రత్తలు తీసుకొన్నారు. మూడు త‌రాల క‌థానాయ‌కులు ముచ్చటైన చిత్రంగా మ‌నం... మే 23న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా నాగార్జున‌తో ప్రత్యేక చిట్ చాట్‌.

*   మ‌నం చాలా ప్రెస్టేజియ‌స్ చిత్రం. కానీ ప్రమోషన్లు మాత్రం చాలా స్లోగా ఉన్నాయ్‌..
- కావాల‌నే అలా చేశాం. నాన్న లేకుండా ఆడియో వేడుక నిర్వహించడం నాకు నచ్చలేదు అంద‌రూ ఆయ‌న్ని గుర్తు చేసి మాట్లాడ‌తారు. దాంతో అదో సంతాప స‌భ‌లా త‌యార‌వుతుంది. దానికి తోడు నేను చాలా ఎమోష‌న‌ల్‌. దాన్ని త‌ట్టుకోలేను. అందుకే ఆడియో వ‌ద్ద‌నుకొన్నాం. కానీ... సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా విస్తృతంగా ప్రచారం చేశాం. యూ ట్యూబ్‌లో మ‌నం పాట‌ల్ని విడుద‌ల చేశాం. దానికి మంచి స్పంద‌న వ‌చ్చింది. మ‌నం సంగీతం అంటూ ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించాం. ఇక సినిమా బాగా ఆడిన త‌ర‌వాత ఎలాగూ విజయోత్సవం  చేస్తాం.

* ఎప్పుడూ లేనిది ఓ సినిమా గురించి విడుద‌ల‌కు ముందే ఇంత నమ్మకంగా మాట్లాడారు..
- అవునండీ. క‌థ అలాంటిది. అయినా కొన్ని సినిమాలు తెలిసిపోతాయి. మ‌నం చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్నప్పుడు నాకు అనిపించింది. ఇది క‌చ్చితంగా మంచి సినిమా అవుతుందని. సినిమా పూర్తయ్యాక చూసుకొన్నప్పుడు నా అంచ‌నా త‌ప్పు కాలేద‌నిపించింది. క‌చ్చితంగా మ‌నంద‌రి హృద‌యాల‌ను గెలుచుకొనే సినిమా అవుతుంది.

*  మ‌నం ఎలాంటి జ్ఞాప‌కాల్ని మిగిల్చింది?
- మ‌నంలో ఎన్నో మ‌ధుర స్మృతులున్నాయి. ఈ సినిమాతో ఎమోష‌న‌ల్ బౌండింగ్ చాలా ఉంది. నాన్న చివ‌రి సినిమా అని గుర్తుపెట్టుకోవాలా??  లేదంటే నేనూ, చైతూ, నాన్న క‌ల‌సి న‌టించాం.. అని గుర్తు పెట్టుకోవాలా..??  ఇవి రెండూ మిక్సయిన ఓ విపరీతమైన ఫీలింగ్‌.

* నాన్నగారితో ఇది వ‌ర‌కు క‌లిసి న‌టించారు. కానీ చైతన్య  కు మాత్రం ఇదే తొలిసారి. ఏమైనా కంగారు ప‌డ్డాడా?
- నాన్న దగ్గర అలాంటివేం ఉండ‌వండీ. ఆయ‌న ప‌క్కా ప్రొఫెష‌న‌ల్. మమ్మల్ని సాటి న‌టుల్లానే చూస్తారు. ఆయ‌న సెట్లో ఎలా ఉంటారో నాకు తెలుసు. ఇక చైతూకి కొత్త. పైగా నాన్న - చైతూపై చాలా కీల‌క‌మైన సన్నివేశాలున్నాయి. ఇద్దరూ క‌ల‌సి ముందుకొడ‌తారు. నాన్నతో క‌ల‌సి మందు కొట్టడమా??  అలా న‌టించ‌డం కూడా కష్టమే. కానీ చైతూ చాలా బాగా చేశాడు. అత‌నిలో మెచ్యూరిటీ క‌నిపించింది.

* నాన్న చివ‌రి చిత్రం క‌దా..?  అందుకు త‌గిన‌ట్టుగా స్పెష‌ల్ కేర్ తీసుకొని మార్పులేమైనా చేశారా?
- అదేం చేయ‌లేదు. దర్శకుడు ఏం చెబితే అదే తీశాం. ఎందుకంటే మా కోసం స్ర్కిప్టు మార్చుకొంటే.. మొద‌టికే మోసం వ‌స్తుంది. ఆ త‌ప్పు చేయ‌లేదు.

* మీ బ్యాన‌ర్‌కి చాలా ప్రతిష్టాత్మక చిత్రం   ఇది. అనుభవం ఉన్న దర్శకుడి  చేతిలో పెడితే బాగుంటుంది క‌దా అనిపించిందా?
- లేదండీ. క‌థ‌తోనే మమ్మల్ని ప‌డేశాడు విక్ర‌మ్‌. నాన్న - చైతూల‌తో క‌ల‌సి ఓ సినిమా చేయాలి అని మూడేళ్ల క్రితం నుంచే అనుకొంటున్నా. చాలా క‌థ‌లు విన్నా. కానీ కుద‌ర్లేదు. చివ‌రికి విక్రం మాకు స‌రిప‌డా క‌థ చెప్పాడు. దాంతో మ‌నం ప‌ట్టాలెక్కేసింది.

* ఇది వ‌ర‌కు చాలా సినిమాలు చేశారు. కానీ వాటికీ మ‌నంకీ చాలా తేడా ఉంది. ఆ మార్పు గ‌మ‌నించారా?
- అవును. ఇదేదో డ‌బ్బుల కోస‌మో, పేరు కోస‌మో తీసిన సినిమా కాదు. మా సంతృప్తి కోసం తీసిన సినిమా. నాన్నకి ఘ‌న‌మైన వీడ్కోలు ఇవ్వాల‌నుకొన్నాం. ఆయ‌న అభిమానుల్ని సంతోష‌పెడ‌దామ‌నుకొన్నాం. అమితాబ్‌తో అతిథి పాత్ర చేయించిన ఉద్దేశం కూడా అదే. మేం అనుకొన్నట్టుగానే ఓ మంచి సినిమా తీశాం. సినిమా చూస్తుంటే.... నేనేనా ఇది వ‌ర‌కు భాయ్‌లో న‌టించింది అనిపించింది.

*  భాయ్ మిమ్మల్ని ఇంకా వెంటాడుతోందా?
- త‌ప్పుల్ని ఒప్పుకోవాలి క‌దా..??  ఇలాంటి క‌థ చేయ‌కుండా ఉండాల్సింది. పూర్తిగా ఇది నా త‌ప్పే. ఓ షోరూమ్‌కి వెళ్తాం. అక్కడ ప‌ది ర‌కాల డ్ర‌స్సులుంటాయి. మంచివీ ఉంటాయి. చెత్త‌వీ ఉంటాయి. మ‌నం మంచివే ఎంచుకోవాలి. చెత్తవి ఎంచుకొంటే వాళ్ల త‌ప్పు ఎలా అవుతుంది..??

* భాయ్ ఎలాంటి పాఠం నేర్పింది?
- మ‌న‌కు కొన్ని క‌థ‌లు న‌ప్పవ్‌. వాటిని ట్రై చేయ‌కూడ‌దు.

* భవిష్యత్తులో ఇదే మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటారా?
- త‌ప్పకుండా. మ‌నం నుంచే ఆ మార్పు మొద‌ల‌వుతుంది.

* రాజ‌కీయాల విష‌యానికొద్దాం. అమల‌ని పోటీలో నిల‌బెట్టాల‌నుకొన్నారా?
- అయ్యో...  ఆ ఉద్దేశం అస్సల్లేదు. నేనేదో మోడీ గారిని క‌లుసుకొని మంచి ప‌నులు చేశారు.. మీరు ప్రధాని కావాల‌ని ఉంది అని చెబుదామ‌ని వెళ్లా. ప‌త్రిక‌లు ఏవేవో రాశాయి.

* అంద‌రూ గుజ‌రాత్ వెళ్లి మోడీని క‌ల‌సొచ్చారు. మీరు మాత్రం ఊర్లు చుట్టొచ్చారు...
- అవును. మోడీ ఆ గుజ‌రాత్‌ని ఎలా అభివృద్ది చేశారో చూడాల‌నిపించింది. వాళ్లు తీసుకెళ్లిన ఊర్లు కాదు. ఆ ప‌క్క ఊర్లు కూడా అలానే అభివృద్ది చేశారా? అనేది చూడాల‌నుకొన్నా. అక్కడా అదే స్థితి. సోలార్ విద్యుత్ ను వాళ్లు అద్భుతంగా వాడుకొంటున్నారు. స్కూళ్ళన్నీ పిల్లలతో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. వైద్యం అంద‌రికీ అందుతోంది. ప‌ల్లెల్లో పాల‌న బాగుంది. ఇలాంటి చిన్న చిన్న విష‌యాలు మ‌నం ప‌ట్టించుకోం.

* ఉయ్యాల జంపాల లాంటి చిన్న సినిమాలు మ‌రిన్ని తీయొచ్చు క‌దా..?
- అవునండీ. ఆ ఆలోచ‌న ఉంది. క‌థ‌లూ వింటున్నా. త్వరలోనే మా సంస్థ నుంచి చిన్న సినిమాలు ఆశించొచ్చు.

* మ‌రి అఖిల్ ఎంట్రీ ఎప్పుడు?
- అది వాడి చేతుల్లోనే ఉంది. దర్శకుడినీ, క‌థ‌నీ వాడే ఎంచుకొంటానంటున్నాడు. చూద్దాం.

* ఎన్టీఆర్‌తో సినిమా ఎప్పుడు?
- ఆగ‌స్టులో ఉంటుందేమో...??  ఆమ‌ధ్య క‌థ వినిపించారు. చాలా బాగుంది.

* జిల్లాకి రీమేకా?
- అదేం కాదు. చాలా కొత్త క‌థ‌.

* ఒకే ఆల్ ది బెస్ట్ ఫ‌ర్ మ‌నం..
- ధ్యాంక్యూ

మరిన్ని సినిమా కబుర్లు
Movie Review - Manam