అత్తగారు-మతిమరుపు -
“అత్తయ్యగారూ, పొద్దున్నే లేచారు ఏంటీ” అడిగింది రమణి
“నిద్రపట్టడం లేదే, సరేకానీ కాస్త టీ పెట్టు ,ఈ లోపు మొహం కడుక్కుని వస్తా”అంది రమణి అత్తగారు
“చూడు రమణీ, ఎవరో రాజేష్ కోసం వచ్చినట్టున్నారు, ఆయనకి కూడా కాస్త టీ పెట్టు” వంట గదిలోకి వచ్చి తనకు పెట్టిన టీ గ్లాసు తీసుకుంటూ పురమాయించింది రమణి అత్తగారు
“ఎవరో వచ్చారని చెప్పారు మీ అమ్మగారు, ఏరండీ “ తీరిగ్గా కూర్చుని పేపర్ చదువుకుంటున్న భర్తని అడిగింది రమణి
“ఎవరొచ్చారు,ఎవరూ రాలేదే, నేనే వాకింగ్ కి వెళ్ళొచ్చి పావుగంటయ్యింది. అదుగో అప్పటినుంచి పేపర్ చదువుకుంటున్నా”
“ఖర్మ,ఖర్మ.మిమ్మల్ని చూసే కాబోలు మీ అమ్మగారు ఎవరో వచ్చారనుకుంటున్నారు, చచ్చీచెడి పెట్టుకొచ్చా మరో కప్పు టీ, మీరేమో పొద్దున్నే కాఫీయే గానీ, టీ తాగరు. నేనా టీ, కాఫీలు ముట్టను. బయట పారబోయాలి. వేగలేక పోతున్నాననుకో, ఈవిడ మతిమరుపు కాదుగానీ” తిట్టుకుంటూ లోపలికెళ్ళింది.
“ఒరేయ్! సురేష్ ఎక్కడ చచ్చావురా, ఆ పెద్దమనిషి వచ్చి అపుడే పావుగంట పైనే అయ్యింది, కాఫీ చుక్క ఇమ్మని చెప్పాను వచ్చినాయనకు, అదైనా ఇచ్చిందా మీ ఆవిడ” గావు కేక పెడుతూ హాల్ లోంచి రాజేష్ వాళ్ళ రూమ్ కేసి వెళ్ళబోయింది.
“అమ్మా, నేనేనే, ఎవరూ రాలేదు నా కోసం, వాకింగ్ కి వెళ్ళొచ్చి పేపర్ చదువుకుంటున్నా, అయినా ఎప్పుడూ లేంది ఇంత పొద్దున్నే లేచిపోయావేంటీ, పైగా నన్ను సురేష్ అంటావేంటి, నాపేరు రాజేష్. నువ్వు కాఫీ కాదు ఆ వచ్చినాయనకు, టీ పెట్టమన్నావు, నీ కోడలు టీ పెట్టి పట్టుకురావడం, బయట పోయడం కూడా అయ్యాయి. నీ మతిమరుపు తో చచ్చిపోతున్నాను” బాధంతా వెళ్ళగ్రక్కాడు.
*** *** *** “ఏమ్మాయ్! ఒకసారి నా గదిలోకి రామ్మా, నీకో విషయం చెప్పాలి” హాల్లో తీరిగ్గా “మతిమరుపు అత్త-కన్నీళ్ళ కోడలు” సీరియల్ చూస్తున్న రమణిని , రమణి అత్తగారు పిలిచింది
“ఏమైఉంటుందబ్బా అంటూ అత్తగారి గదిలోకి అడుగుపెట్టిన రమణిని తన మంచంపై కూర్చోబెట్టి చెవి దగ్గరగా నోరు పెట్టి ”మా కోడలకి చెప్పకే, నాకేమో “గడుసు అత్త-తింగరి కోడలు” సీరియల్ చూడాలనుకుంటానా, అదేమో ఇదుగో ఇప్పుడు నువ్వుచూస్తున్నావే , ఆ సిరియల్ వేసుకుని కూర్చుంటుంది. ఇంక నా కొడుకున్నాడు చూడు, మా కోడలు చుట్టూ బొంగరంలా తిరుగుతుంటాడు, పాపం ఏమాటకామాటే చెప్పుకోవాలి, తిండితిప్పల్లో గానీ , నా ఆరోగ్యం విషయంలో గానీ ఏ మాత్రం అశ్రద్ధ చేయరు ఇద్దరూ, ఈ మాటలు మా కోడలదగ్గర అన్నావుగానీ” అంది.
అంతే ఒక్కసారిగా రమణికి బి.పి పెరిగిపోయింది, కొడుకు, కోడలు గుర్తుండరుగానీ ఈవిడకి సీరియల్స్ పేర్లు మాత్రం బాగానే గుర్తుంటాయనుకుంటూ “ఇపుడు చెప్పినవన్నీ ఎవరికి చెప్పారనుకుంటున్నారు మీ కోడలకే, నేనే మీ కోడలని” అనేసరికి రమణి అత్తగారు బిక్కచచ్చిపోయింది. మరుక్షణమే రమణి శాంతపడిపోయింది, తను,తన భర్త బాగానే చూసుకుంటున్నాం అని అత్తగారు చెప్పిన విషయం గుర్తుకొచ్చి.
*** *** ***
కాలింగ్ బెల్ మోగుతుంటే రమణి అత్తగారు వెళ్ళి తలుపు తీసి గుమ్మం దగ్గరే సూట్ కేస్ తో టక్ చేసుకుని నిలబడినతనిని చూసి, బయటకెళుతూ తన కోడలు ఎవరైనా వస్తే ఏంచెప్పమన్నాదో తూ.చ తప్పకుండా చెప్పమన్నట్లుగానే ” మా కోడలు బయటకెళ్ళింది,మీరు తను వచ్చిన తరువాత రండి” అనిచెప్పింది. మీరు చూస్తే టీ.వి రిపేర్ చేయడానికి వచ్చిన మెకానిక్ లా ఉన్నారే ,అయినా మా టి.వీ ఏమి పోలేదే,” అంటూ దడాలున మొహం మీదే తలుపేసేయబోయింది,వచ్చినవాడు ఇంటల్లుడు అని గుర్తుపట్టక.
“బామ్మగారు, నేను మీ రాజేష్ గారి అల్లుడుని” బాధ వెళ్ళగ్రక్కుకున్నాడు.
“వెళ్ళు,వెళ్ళు మా ఆమని చెపుతానే ఉంది, మీ బంధువులం,మీ అబ్బాయి స్నేహితులం అని చెపుతారు గానీ తీయకండని” అంటూ ఫెడేలున మొహం మీదే తలుపేసేసింది.
“ఏమేవ్! కోడలా, నువ్వన్నట్టుగానే దొంగసచ్చినోడు, రాజేష్ గారి అల్లుడనే చెప్పాడే ఏకంగా, మొహం మీదే తలుపేసి మా కోడలు వచ్చిన తర్వాత రమ్మని చెప్పేనే” గర్వంగా చెప్పింది అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన కోడలితో.
“కొంపదీసి అల్లుడు గానీ వచ్చాడా అని అల్లుడు కి ఫోన్ చేస్తే ”చాలా గొప్పగా బుద్ధి చెప్పారులెండి, మీ ఊరుకేసి టూర్ పడితే చెప్పాపెట్టకుండా వచ్చి ఆశ్చర్యపరుద్దామనుకుంటే మొహం మీదే తలుపులేసి పంపించిందండి బామ్మగారు ఇంకెప్పుడూ రాకుండా” అనేసరికి శోష వచ్చి పడినంత పనై తన అత్తగారి మతిమరుపు బాగోతం అంతా చెప్పి అతన్ని శాంతింప చేసేసరికి రమణికి తలప్రాణం తోకకొచ్చింది.
“కొంచెం వచ్చినోళ్ళు ఎవరో ఏంటో మర్యాదగా అడిగి తెలుసుకోండి ఇకనైనా “అని చివాట్లు పెట్టింది అత్తగారికి.
*** *** ***
“ఈసారి మరల కాలింగ్ బెల్ మోగింది. అప్పుడే భార్యాభర్తలు బయటికెళ్ళారు. మరల రమణి అత్తగారు తలుపుతీసింది. ఎదురుగా అపరిచిత వ్యక్తి. కోడలు చెప్పిన మాటలు , చివాట్లు బాగా గుర్తుచేసుకుంది.
పక్క పోర్షన్ ని అద్దెకిద్దామని రాజేష్ పెట్టిన టు-లెట్ బోర్డ్ చూసి అంతకుముందు రోజు రాజేష్ లేని సమయంలో వచ్చిన అతనికి రమణి అత్తగారు తలుపుతీసి కోడలను పిలవటంతో రమణి వచ్చి “ఆయన లేరు రేపు రండి” అని చెప్పటంతో వెళ్ళిపోయిన అతను మరునాడు వచ్చి “ మీ అబ్బాయి గారు లేరాండి?” అని అడిగాడు రాజేష్ తల్లిని చూసి,అంతకుముందు రోజు చూసి ఉండటంతో .
“బయటకెళ్ళారు బాబూ, వచ్చేస్తారు రండి బాబూ” అని లోపలికి తీసుకెళ్ళింది.
“ఈ లోపు పక్క పోర్షన్ చూస్తానండి” అన్నాడు వచ్చిన వ్యక్తి
“చూద్దువుగానీలే బాబూ, ముందు కాఫీ పెట్టుకుని పట్టుకొస్తానని” ఐదు నిమిషాలు కాకుండా కాఫీ తెచ్చి ఇచ్చింది. కాఫీ తాగనిచ్చి “నేను ఇప్పుడే వస్తాను మీరు వెళ్ళండి బాబూ! ఆ పక్క పోర్షన్ కి అని చెప్పడంతో ఆ పక్క పోర్షన్ చూడటానికి వెళ్ళిన అతని దగ్గరికి కాసేపటికి చేతిలో పదివేల కట్ట పెట్టుకుని వచ్చి “బాబూ, మళ్ళా మీ అత్తా మావయ్యలొచ్చేస్తే ఈ డబ్బులివ్వనివ్వరు, ఇపుడు నువ్వు ఇవ్వాలేంటి అంటారు మీ పెళ్ళి అయినప్పటినుంచి ఇవ్వాలనుకుంటున్నా అని చేతిలో పెట్టబోయేసరికి” లేదు బామ్మగారు వద్దండి అని ఏదో చెప్పబోతున్నా,”నువ్వింకేం చెప్పొద్దు అంటూ జేబులో పెట్టేస్తూ , ఇలా ఇచ్చినట్టు మీ అత్తగారికి, మావగారికి చెప్పకని ఒట్టేయించుకుంది”. అప్పటికి అద్దెకి పోర్షన్ తీసుకుందామని వచ్చిన అతనికి రాజేష్ తల్లి తనను రాజేష్ గారి అల్లుడు అనుకుంటుందని అనే విషయాన్ని గ్రహించాడు. పైపెచ్చు నిన్న తను వచ్చినప్పుడు తన విషయాలు ఏమీ చెప్పనివ్వకుండానే మరునాడు రమ్మనడంతో ఇదీ బాగుందనుకుని కాసేపట్లో వస్తానని వెనుక రాజేష్ తల్లి ఎంత బతిమాలుతున్నా ఉడాయించాడు. కాసేపటికి ఇంటికొచ్చిన కొడుకు,కోడలుకి ఉప్పొంగిపోతూ “మీ అల్లుడు వచ్చాడు , ఎంత బతిమాలినా ఉండకుండా వెళ్ళిపోయాడు అని చెప్పటమే కాకుండా తను చెప్పొద్దన్న విషయాన్ని తనే మరిచిపోయి పదివేలు బహుమతి ఇచ్చానన్న సంగతి చెప్పేసరికి “గతంలో అత్తగారు చేసిన నిర్వాకానికి అల్లుడు రాడని తెలిసి అల్లుడికి ఫోన్ చేస్తే, ”నేనెక్కడ వచ్చానండీ బాబూ! మీకూ, బామ్మ గారికి ఓ నమస్కారమండి, మీరు ఇంట్లో ఉన్నప్పుడే వద్దామని అప్పుడే డిసైడ్ అయిపోయానని చెప్పేసరికి, ఎవరై ఉంటారబ్బా అని ఆలోచిస్తే ముందు రోజు పక్క పోర్షన్ ని చూసుకోవడానికి వచ్చిన అతను గుర్తుకొచ్చింది ఇద్దరికి, అద్దెకని వచ్చిన అతణ్ణి ఈ రోజు రమ్మన్న సంగతి గురించి రాత్రి రాజేష్ కి రమణి చెప్పటంతో . అంతే కొడుకు,కోడలు లబోదిబో మన్నారు, ఆ డబ్బులకి కాళ్ళొచ్చాయి అని తెలిసి కారణం ఆ వచ్చిన అతని గురించిన విషయాలేవీ అంతకుముందు రోజు ఏమీ అడగకపోవడంతో

