రిటైరయితే! -
“ఏమండీ! ఏంచేస్తున్నారూ? ఓ చిన్నపని ఇలారండి!” అని భార్య ధరిత్రి వేసిన రంకెలాంటి పిలుపుకి చదువుతున్న పేపర్ వెంటనే టీపాయ్ మీద జాగ్రత్తగామడిచిపెట్టి పరుగునవెళ్ళాడు పరమేశం వంటింట్లోఉన్న భార్యదగ్గరికి. ఆపేపరు పొరపాటున మడతపెట్టకుండా వదిలేశాడో...ఇంటిల్లిపాదీ పరమేశాన్ని చెడుగుడుఆడేస్తారు.
ధరిత్రి పరమేశాన్నిచూసి, “ఏమండీ! పక్కింటి పద్మకి బాత్రూములో టాప్ లీకై నీళ్ళుపోతున్నాయిట. ప్లంబరుకి ఫోన్‌చేస్తే వాడు ఆన్సర్ చెయ్యడంలేదుట. నీళ్ళుపోతే కనుక మళ్ళీ రేపొద్దున్నదాకా నీళ్ళుండవు. మీరోసారి వెళ్ళి అదేంటోచూడండి. మనింట్లో ఏవో రిపేర్లు అవీచేస్తుంటారుగా. అలానే, ఆ నీళ్ళ లీక్ ఏదో అరికట్టిరండి.” అని ఏకపక్షహుకుం జారీచేసింది ధరిత్రి.
“ఏమిటి! నేనా? పద్మగారింటికా? మతిలేదానీకు? నేనెళ్లి వాళ్ళింట్లో టాప్ రిపేర్ చెయ్యడమెంటీ? వాళ్ళాయన లేడా?” అని రైలింజన్ హారన్ కొట్టినట్టు అరిచాడు పరమేశం.
“ఉష్! అరవకండి. ఆయనే ఉంటే ఈ మంగలాడు.... అదే... మీరెందుకని, వాళ్ళాయన ఊర్లోలేడుకనుకే. మిమ్మల్నిఅడిగింది.! ఆపాటి పరోపకారంచేస్తే అరిగిపోరు. రిటైరయ్యాక ఏంతోచట్లేదంటూ గొణుగుతూంటారుగా. వెళ్ళండి. కాస్త టైమ్ పాస్ అవుతుంది!” మరోమాట లేనట్టు హుంకరించింది ధరిత్రి.
ఆమధ్య ఆవిడతో ఏదోమాట్లాడుతుంటేనే, “ఏమిటీ ఆవిడతోకబుర్లూ?..ఆ!” అంటూ నన్ననుమానించావ్. ఇప్పుడు ఆవిడకి అవసరమొస్తే.. అనుమానాల్లేవా! నేనెళ్లను!” అని తిరుగుబాటు చేయబోయాడు పరమేశం.
“అలాఅన్నానా? ఏమో? అప్పుడేదో అనుంటాన్లెండి. అయినా మీకంతసీన్లేదుగానీ, వెళ్ళండి!” తనకి కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చిందో, అసమర్ధుడని తిట్టిందో లేక అవసరానికి వాడుకుంటోందో తెలీకుండా, మళ్ళీ ఆర్డరేసింది ధరిత్రి.
ఇక చేసేదిలేక వెళ్ళివచ్చాడు. “అందాకా ఏవోగుడ్డలు చుట్టివచ్చాన్లే. ప్లంబర్ వస్తేగానీ అవదు. వాడికి నేను ఫోన్‌చేస్తే పలికాడు. వాళ్ళింటికైతే రానన్నాడు. గీసిగీసి బేరాలాడతారట. అందుకే ఆవిడ ఫోన్‌చేసినా ఎత్తలేదన్నాడు. నేనేదో చెప్పి ఒప్పించాలే!” అన్నాడు.
“సర్లెండి! కాస్త ఈ బీరకాయలు కట్ చేసి పెట్టండి. కాయకో చిన్నముక్క శాంపిల్ కి రుచి చూడండి. చేదుగా ఉంటుందేమో.” అని ఇంకోపని అప్పచెప్పింది ధరిత్రి, కనీసం వెళ్లొచ్చినందుకు థాంక్స్ ఐనా చెప్పకుండా. గుర్రుమని చూసి, ఆ పళ్ళెం, చాకు అందుకున్నాడు.
“అన్నట్టు వాషింగ్ మెషీన్లో బట్టలువేశా. వాష్ అయిపోయుంటుంది. అందులో బట్టలుఆరేసేయండి. తర్వాత పనిమనిషి తోమిన సామాన్లు వాటి వాటి జాగాల్లో సర్దేయండి. ఇవన్నీ రోజూ నేను చెప్పడం, మీరుమర్చిపోవడం.” అని, బీరకాయలు కట్ చేసిన తర్వాత జాబ్ కాలెండర్ ఏమిటో కూడా డిక్లేర్ చేసిందామె.
“ఏమిటే ఈ టార్చర్. నేను ఆఫీసులో గొడ్డుచాకిరీ చేసిచేసి, ఏదో ఇలా ఆరోగ్యంగా రిటైరయ్యాను అని సంతోషిస్తూంటే, నన్నారోగ్యంగా ఉండనిచ్చేట్టులేవు. రోజూ గంటకోపని అప్పచెపుతున్నావు.” ఒంటికాలి మీద లేవబోయి, బేలన్స్ కుదరక, రెండుకాళ్ళమీదే నిలబడి అరిచాడు పరమేశం.
“రిటైరయితే? ఒక్క ఆఫీస్ పని తప్ప ఇంకేం మానేశారు? వేళకి టిఫిన్, భోజనం, కొత్తగా మధ్యాహ్నం నిద్ర! బాగానే ఎంజాయ్ చేస్తున్నారుగా. అయినా ఎవరికి సాయం చేస్తున్నారు. మన ఇంట్లోకే కదా. ఇంట్లోకైనా పోనీ, ఇంట్లో ఉన్న చెత్త, అనవసర సామాన్లు తీసిపారేయడం లాంటివేమన్నా చేస్తున్నారా!? అదీ లేదు!! మొన్నెప్పుడో చెప్పానని సణుక్కుంటూ పక్కింటి పద్మ ఇంట్లో ఏదో వాటర్ లీక్ అంటే వెళ్లొచ్చారు. ఇంకేమైనా బరువులెత్తుతున్నారా!? మీరు రిటైరయ్యారు సరే. మీకన్నా ఓ మూడేళ్లే చిన్నదాన్నైనా, ముణుకుల నొప్పుల్తో మూలుగుతూ ఇంట్లో పాన్లు చేయలేక చస్తున్నాను. మరి నాకేమీ రిటైర్మెంటులేదా? నేనూ రేపటినుండి రిటైర్మెంట్ తీసుకుంటాను. ఇంటిపని, వంటపని ఎవరుచేస్తారో, ఎవరిచేత చేయించుకుంటారో మీఇష్టం. చాలా ఏళ్లక్రితంవచ్చిన “అమ్మ రాజీనామా!” సినిమా మళ్ళీనిన్ననే టీవీలోచూశా. నేనూ అలానే రాజీనామాచేస్తే బావుణ్ణననుకుంటున్నా. అసలు “అమ్మరాజీనామా” బదులు “అమ్మ రిటైర్మెంట్” అంటే ఇంకా మజాగా ఉంటుందికదా!” అని అంతకన్నా హై డిటిఎస్ డోల్బీలో అరిచింది ధరిత్రి.
“పేరు ధరిత్రి అయినా నీలో క్షమ, సహనగుణాలు లేవే ధరీ! శాంతం! శాంతం!!” అని ఆమెని శాంత పరచి అక్కడనుండి బీరకాయల పళ్ళెం, చాకుతో సహా జారుకున్నాడు పరమేశం.
ఆర్నెల్లక్రితం రిటైరైన పరమేశానికి ఓ మూడునెలలు ఇంట్లో రాజభోగంగా గడిచింది. ఆతర్వాత్తర్వాత మెల్లగా ఒక్కొక్కపనీ ఇంట్లో చెప్పసాగింది ధరిత్రి, ఆవిడతోపాటూ పిల్లలుకూడా. “నాన్నగారూ! ఖాళీయే కదా, ఈ పేంట్ షర్ట్ అర్జెంట్ గా ఇస్త్రీ చేసీచ్చేయండి. ఇవాళ త్వరగా వెళ్ళాలి” అని కొడుకూ, “నాన్నా! నా స్కూటీ పంక్చర్ అయినట్లుంది. ఇవాల్టికి మీ స్కూటీ తీసుకెళ్తా. మీరు ఖాళీయేగా! ఓసారి టైర్ చెక్ చేయించి, పంక్చర్ ఉంటే కనుక రిపేర్ చేయించీండి” అని కూతురు, లేదా ఇంకేవో పన్లూ అప్పచెప్పడం మొదలెట్టారు. దాంతో, పరమేశం రిటైరైంతర్వాత అలా సంపాదనలేనిపనుల్లో ఉద్యోగంలోకన్నా బిజీగా గడపసాగాడు. ఓసారి ఓ మిత్రుడు చలపతి ఇంటికొస్తే, కబుర్లు చెప్పుకుంటూండగా, ధరిత్రి కాఫీ తెచ్చిఇస్తూ, దాంతో పాటు ఓపళ్ళెంనిండా గోరు చిక్కుడు కాయలు తెచ్చి పడేసి, “రిటైరైన మిత్రులు అలా గోళ్ళు గిల్లుకుంటూ కబురుచెప్పుకునే బదులు, ఈ గోరు చిక్కుళ్ళు ఆ గోళ్ళతోనే ముక్కలుగా చేసిపెట్టండి. అన్నట్టు నార తీయడం మర్చిపోకండి. మంచి కాలక్షేపం అవుతుంది” అంది కోవై సరళలా ఓ చిలిపినవ్వు నవ్వుతూ. దాంతో చలపతే కాదు, ఇంకే ఫ్రెండూ పరమేశం ఇంటికి రావడం మానేశారు, పైగా వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో ఈ సంగతి పెద్ద వైరల్ అయిపోయింది కూడా.
=================
ఇంకో నెలరోజులు ఇలా గడిచాక, ఓ రోజు బయటికెళ్లొచ్చిన పరమేశం, ధరిత్రితో “రేపట్నుండీ మామూలుగా నాకేరెజీ నాకు కట్టిఇచ్చేస్తూండు. ఓ ప్రైవేటుద్యోగంలోచేరాను. రోజూ రిటైరై ఖాళీగాఉంటున్నారుగా అని దెప్పుతూ గంటకోపని చెప్తున్నావ్. అదేదో బయటే పనిచేస్తే, ఎంతోకొంత సంపాదనైనా ఉంటుంది.” అన్నాడు పరమేశం.
“వెరీ గుడ్. అయితే మీరు ఎప్పట్లా నాకు అన్నిపనుల్లో సాయంచేస్తూ, మీ సంపాదనలో సగం నాకు ఇవ్వడానికి ఒప్పుకుంటే, కేరేజీ కట్టివ్వడానికి నాకేం అభ్యంతరం లేదు” అంది ధరిత్రి.
ఎవరో చెంపమీద గట్టిగాకొడితే వెళ్ళి గోడకు గుద్దుకున్నట్టు, ఇప్పుడు పరమేశానికి చెంపదెబ్బా, గోడదెబ్బా, రెండూ తగిలినట్లైంది.
==== సమాప్తం ====

