జీవితగ్రంథంలో చివరి వాక్యం -
సాయంత్రం ఆరవుతుండగా ఆఫీసు నుండి వచ్చాడు శరత్ చంద్ర.తను ఫ్రెషప్ అయ్యేలోగా పకోడీలు మూకుట్లో వేసింది రాగిణి.
వేడివేడిగా ప్లేట్లో పెట్టి తీసుకు వచ్చింది.అతడా ప్లేట్ ని ఖాళీ చేసేదాకా మౌనంగా కూర్చుంది.కాఫీ కూడా ఇచ్చి తాగేదాకా ఎదురు చూసింది.
"వచ్చే నెలలో ఉద్యోగంలోంచి శ్రీవారు రిటైర్ కాబోతున్నారు కదా!"గుర్తుచేసింది.
"ఊ..."పొడిగా పలికాడు.
"రిటైర్ అయ్యాక తమరేం చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నారు?"
సరదాగా లైవ్ చాట్ ప్రారంభించింది రాగిణి.
శరత్ చంద్ర నోరు విప్పబోతుంటే తనే తిరిగి అడ్డు తగిలింది"ఇంకా ఏమీ అనుకోలేదు.అనే పాత పురాణం మాత్రం విప్పకండి"హెచ్చరించింది సన్నగా నవ్వుతూ.
సమాధానం కోసం వెతుక్కోకుండా"నాతో పాటు నీక్కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తే ఎలా ఉంటుందా అని యోచిస్తున్నాను"అన్నాడు శరత్ చంద్ర తను కూడా తేలిగ్గా నవ్వేస్తూ.
బుగ్గలు నొక్కుకుంటూ"ఇదెక్కడి చోద్యం?ఇంటికి సెలవు.ఇల్లాలికి రిటైర్మెంట్.ఇలాంటి మాటలు ఎక్కడైనా ఉంటాయా?ఎప్పుడైనా చూసామా? విన్నామా?విడ్డూరం కాకపోతే!"చురుగ్గా బదులిచ్చింది రాగిణి.
"అదే కదా!మీ ఆయన శరత్ చంద్ర ప్రత్యేకత. ఇంటికి సెలవులు ఉండక పోవచ్చు!ఒప్పుకుంటాను. ప్రతిరోజూ వండి వార్చాల్సిందే కాబట్టి.కానీ ఇల్లాలికి మాత్రం రిటైర్మెంట్ ఉండాల్సిందే!నాలాంటి భర్తలు ఏదో ఒక తరుణంలో ఆ ఏర్పాట్లు చేయాల్సిందే!" సాత్వికమైన స్వరంతో తన అభిప్రాయాన్ని భార్యకు వెల్లడించాడు.
బదులుగా"పోదురూ బడాయి.సాధ్యం కాని మాటలెందుకు?సరదాకి తప్ప..."అంది రాగిణి చిరునవ్వుతో.
"గుర్తుంది.నాకు ఉద్యోగం వచ్చిన కొత్తలోనే మన పెళ్లయింది.హౌస్ వైఫ్ గా ఈ ఇంట్లోకి నీ ప్రస్థానం కూడా అప్పుడే మొదలైంది.నేనొక ఉద్యోగిగా ఇప్పటి వరకు చేసిన సేవలు చాలు.అంటూ రిటైర్మెంట్ ప్రకటించింది గవర్నమెంట్.
దాదాపు నా ఉద్యోగపు తొలినాళ్లలోనే నీ వంట పనులు మొదలయ్యాయి.ఉద్యోగం నుంచి నన్ను ప్రభుత్వం విరమణ చేయిస్తున్నప్పుడు,నిన్నెందుకు బాధ్యతల నుండి విముక్తి కలిగించకూడదు?"
"బాగుంది.మీ వరుస.ఈ ప్రశ్న నా క్వశ్చన్ బ్యాంకు లోంచి దొంగలించారు.దొంగ.అది నా వైపు నుండి తమరికి రావాల్సిన క్వశ్చన్"అంది ముసి ముసిగా నవ్వుతూ.
"ప్రశ్న ఎవరి వైపు నుంచి వచ్చిందన్నది కాదు ముఖ్యం.తగు సమాధానంతో ఆ ప్రశ్నకు న్యాయం చేయబడిందా లేదా అన్నదే మార్కులకు అర్హం"
"మాంగల్యధారణ ఘడియలతోనే మీ మనసుతో ముడివడిన మనసు నాది.ఇప్పటికైనా ఎప్పటికైనా మీ మాటే శిరోధార్యం...మీరెలా అంటే అలా"భర్తను వెనకేసుకు వస్తూ అతడి మీదే భారం వదిలేసింది.
"అమ్మాయి అబ్బాయి ప్రయోజకులయ్యారు. పెళ్లిళ్లు చేసేసాం.వారికి ముద్దులొలికే పిల్లలయ్యారు. ఉద్యోగ బాధ్యతల్లో తలమునకలవుతూ హాయిగా హైదరాబాదులో కాపురాలు చేసుకుంటున్నారు.
ఏ చీకూచింతా లేకుండా మన దాంపత్య గ్రంథ పుటలు హ్యాపీగా దొర్లి పోతున్నాయి.మనమిప్పుడు జీవితపు చివరి పేరాకి వచ్చేసాము.మన జీవితపు చివరి వాక్యమైన రిటైర్మెంట్ దగ్గర ఉన్నాము.ఇలాగే రేపటి రోజులు కూడా ఆనందకరంగా గడిస్తే ఈ జన్మకు అంతకు మించిందేముంది?"
నవ్వేసింది రాగిణి.
"అలా జగిత్యాల జిల్లా రిటైర్ మెంట్ యూనియన్ ఎన్జీవోస్ భవన్ వైపు ఓసారి వెళ్లొస్తాను.పదవీ విరమణ పొందిన వాళ్లంతా అక్కడ ప్రతిరోజు సాయంత్రాలు కలుస్తుంటారట. వాళ్ళక్కడెలా సమయం గడిపేస్తారో చూసొస్తాను" రాగిణికి చెప్పి బయటపడ్డాడు శరత్ చంద్ర.
వెళ్ళి రిటైర్మెంటైన సీనియర్స్ బ్యాచ్ ని కలిసాడు. పరిచయాలయ్యాయి.పిచ్చాపాటి కబుర్లలో పడ్డారు.
"రిటైరయ్యాక మీ ప్లానేంటి?ఎటైనా టూర్ ప్రోగ్రామ్ వేసారా?"అడిగాడొకాయన.
"అబ్బే!అలాంటిదేం లేదండీ!ఇల్లే కదా స్వర్గసీమ. పైగా నాలాంటి వాళ్లకు ఇల్లే వైకుంఠం.ప్రస్తుతానికైతే ఇల్లు దాటి వెళ్లాలని అనుకోవడం లేదు"
"మరేదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా?" ఇంకొకాయన ఆరా తీశాడు.
"వ్యాపారం పేరుతో జనం కళ్ళల్లో మట్టి కొట్టాలని నాకేమాత్రం ఇష్టం లేదు"తన మాటకి తనే నవ్వాడు శరత్ చంద్ర.
"పోనీ ఏదైనా స్కూల్లో ఆఫీస్ క్లర్క్ గానో,ప్రైవేటు ఆఫీసు లో కంప్యూటర్ ఆపరేటర్ గానో జాయిన్ అయ్యే ఆలోచన ఏదైనా ఉందా?"గుంపులోని మరో తలకాయ ప్రశ్నించింది.
"అబ్బే!ఆ ప్రైవేట్ జలగలకి నా శక్తిని రక్తాన్ని పీల్చుకునే అవకాశం ఇవ్వాలని లేదు.ఇప్పటి వరకు"
"మరి ఫ్యూచర్ సమయాన్ని ఎలా గడపాలని అనుకుంటున్నారు?"కదిపాడు ఖాళీగా ఉన్న మరొకాయన.
"వంటపనులతో..."
"ఓహో!స్వగృహ లాంటి ఫుడ్ పాయింట్ ప్రపోజల్ గాని,స్మాల్ టిఫిన్ హోటల్ గాని నడపే యోచనలో ఉన్నారా?"
"ఊహూ...అలాంటిదేం లేదు...రెస్ట్ పేరుతో మా ఆవిడను పక్కన పెట్టేసి,నేను వంటింట్లో దూరుదాం అనుకుంటున్నాను.లైటర్ చేత పట్టుకుందామని భావిస్తున్నాను"అంటూ నవ్వేసాడు.
శరత్ చంద్ర మాటలు విని ఆ రిటైర్మెంట్ మహానుభావులు తెరిచిన నోళ్ళు తిరిగి మూత పడేలోగా మెల్లగా అక్కడి నుండి జారుకున్నాడు. వాళ్ల మెదళ్ళలోనూ ఒక కొత్త ఆలోచనను రగిలిస్తూ.
రాహుల్ తన పిల్లలు గోల చేస్తున్నారని పేరెంట్స్ దగ్గర ఒక వారం ఉండి పోదామని తన ఫ్యామిలీతో పాటు జగిత్యాలకు వచ్చేసాడు.
అమ్మని తీరిగ్గా కూర్చోబెట్టి అందరికీ కాఫీలు స్వయంగా చేసుకుని తీసుకు వస్తున్న తండ్రిని చూసి బోల్డుఆశ్చర్యపోయాడు.కలయో,నిజమో,వైష్ణవ మాయో అన్నట్టు దిగ్భ్రమ చెందాడు.
ఒక అడవి సింహం జూలు విదిల్చి గర్జించడం మానేసి పెరట్లోని పచ్చగడ్డిని బుద్ధిగా మేస్తున్నట్టు అనిపించిందా దృశ్యం.
కోడలు సౌజన్య మనసు హ్యాపీగా ఫీలవుతోంది. అత్తగారికి ఈ వంకతో ఇలాగైనా ఈ వయసులో విశ్రాంతి దొరుకుతున్నందుకు.
తండ్రి నుంచి కాఫీ కప్పు అందుకుంటూ"మీరు మీరేనా?"నిబిడాశ్చర్యాన్ని ప్రకటించాడు రాహుల్.
"కాదోయ్!రాగిణీ వల్లభుడిని.మీ అమ్మలో సగభాగాన్ని.ధర్మపతిని"అన్నాడు భేషజం లేకుండా భార్యవంక మురిపెంగా చూస్తూ.
రాహుల్ కి అవి కొత్తగా పెళ్లయిన రోజులు. దంపతులను చూసి పోదామని హైదరాబాద్ కు శరత్ చంద్ర వెళ్ళాడు .
"ఏంట్రా!నీ భార్యని కంప్యూటర్ కి అప్పజెప్పి నువ్వు గరిట పట్టావ్?"అని సౌజన్య వినకూడదని కొడుకు ముందు గొణికాడు.
"నాకీ రోజు ఆఫీసుకి ఆఫ్ డాడీ!తను కూడా సాఫ్ట్వేరేగా!ఎవరి వీలును బట్టి వాళ్ళం...ఇద్దరం తలో చెయ్యి వెస్తేనే వంట అవుతుంది మరి.ఆడా మగా అంటూ తేడాలేమీ లేవిక్కడ"రాహుల్ బదులు చెబుతుంటే శరత్ చంద్ర మొహం వేలాడిపోయింది.
ఆ మాటలు సౌజన్య చెవిలో కూడా పడ్డాయి. తేలిగ్గా నవ్వుకుంది.
కబోర్డు లోనుంచి రాగిణి టవల్ తీసివ్వనిదే స్నానాల గదికి వెళ్ళని అలాంటి శరత్ చంద్ర దర్జాగా డాబా పైకి వెళ్లి బాధ్యతగా బట్టలు ఆరవేస్తున్నాడు.
కనీసం ఈ వయసులోనైనా తల్లిదండ్రుల అన్యోన్యతకి రాహుల్ కళ్ళు చెమర్చాయి.
హాల్లో కంప్యూటర్ ముందు కూర్చున్న వాడల్లా లేచి వెళ్ళి తన తల్లి రాగిణి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు అనురాగాతిశయంతో.
రాగిణి ఆ సూర్యుడి కంటే ముందే పోటీపడి నిద్రలేచేది.తామందరూ పడుకున్నాకే తను కాస్త ఒరిగేది.తల్లి మంచం మీద పడుకొని ఉండడం రాహుల్ ఇప్పటికీ చూసింది లేదు.
ఇక ఉదయం లేచింది మొదలు గడియారం కంటే వేగంగా పనులు మొదలు పెట్టేది.బ్యాటరీ పని చేయని ఒక్క క్షణమైనా గడియారం ఆగుతుందేమో. కానీ అమ్మ ఏనాడు అలసి కనిపించింది లేదు.వంటా వార్పు, స్నానానికి వేడి నీళ్లు పెట్టడం,ఉదయానికి టిఫిన్స్,లంచ్ కి స్కూల్ బాక్స్ లు సర్దడం వంటి పనులన్నీ ఒంటి చేత్తో టైముకి చేసి పెట్టేది.
ఏరోజు కూడా ఏ వేళ కూడా ఆమె ముఖంలో చికాకు గాని అలసట గాని కనపడిన దాఖలాలు లేవు.చిరునవ్వుతో ఎన్ని పనులైనా నిమిషాల మీద చేసేది.తాను చేసేదంతా తన కుటుంబం కోసమేగా అన్నంత ధీమాతో గర్వంతో.
వంట గదిలో ఇన్ని పనులు చేసి కూడా సమయానికి పిల్లలకు స్నానాలు చేయించి,స్కూల్ యూనిఫామ్ లు తొడిగి,తలలు దువ్వి స్కూలుకు రెడీ చేసేది.ఓపిగ్గా సాయంత్రం పిల్లల దగ్గరే కూర్చొని స్వయంగా వాళ్ళ చేత హోంవర్కులు చేయించేది.
తండ్రి ఆమెకి ఏ ఒక్కరోజు కూడా చిన్న పనిలో సహాయ పడినట్టు అగుపించలేదు.ఆఫీసుకి వెళ్ళే సమయానికి నిద్రలేచేవాడు.
కొంపలు అంటుకు పోయినట్టు ఆలస్యం అవుతోందంటూ హడావుడిగా తయారై ఇంటి వ్యవహారం ఏదీ పట్టించుకోకుండా లంచ్ బాక్స్ పట్టుకొని ఆఫీసుకు వెళ్లి పోయేవాడు.
తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చాడంటే కాఫీ తాగి, స్నాక్స్ తిని పొందిగ్గా టీవీ ముందు కూర్చునేవాడు. మళ్లీ తినడానికి లేవడమే.అదీ అతడి దినచర్య.
ఇన్నాళ్లు కుటుంబం కోసం నిమిషం క్షణం తీరిక లేకుండా మానవ యంత్రంలా పనులు చేసి...అరిగి, అలసి సొలసిన ఆ కన్నతల్లి రెండు అరచేతుల్ని ఆప్యాయంగా నిమురుతూ ఇష్టంగా తన చేతుల్లోకి తీసుకున్నాడు రాహుల్.
కందిపోయిన కన్నతల్లి కరకమలాలను ఒకమారు ప్రియంగా ముద్దు పెట్టుకున్నాడు.
ఆ కన్నతల్లి తిరిగి ఆ ముద్దుల్ని ఋణశేషం లేకుండా తన మనవడు మనవరాలుని గుండెలకు హత్తుకుని వారి బుల్లి బుగ్గల మీద ప్రేమకానుగా బదులిచ్చేసింది.
ఆ చిట్టి మనవరాలు"నానీ!తాతయ్య గుడ్ బాయ్ కదూ?"అని అడిగేసింది ఎందుకనో.
"గుడ్ హస్బెండ్ కూడా!"నవ్వుతూ బదులిచ్చింది రాగిణి.అదే ఆమె గొప్పతనం.పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తుందో భర్తను అంతగా వెనకేసుకు వస్తుంది.
ఇల్లాలు అనే పదానికి పరిపూర్ణ నిర్వచనమై నిలుస్తూ మహిళా లోకానికి ఆదర్శనీయంగా దర్శనమిస్తున్న అత్తమ్మ వంక అభిమానంగా చూసింది సౌజన్య.
డాబా పైన వేసిన ఉతికిన బట్టలు సాయంత్రం ఆరాక వాటిని బుద్దిగా మడత పెట్టి శరత్ చంద్ర తిరిగి కిందికి తెస్తున్నపుడు ఇరుగు'పురుగు' చెవులు కొరక్కున్నారు.
"ఏం పనాపాటా?ముసల్ది ముండవోసి ఓ మూలన కూర్చున్నట్టు...రిటైర్మెంటై ఇంట్లోనే ఉంటున్నాడుగా.అందుకే ఇలా ఆడంగి పనులు మొదలెట్టాడు"అంటూ చెవులు కొరక్కున్నారు... ఇంట్లో ఆ పుల్ల ఇటు,ఈ పుల్ల అటు పెట్టని...కొందరు మగరాయుళ్లు.
"ఈ వయసులో నైనా భార్యకి చేదోడు వాదోడుగా నిలబడుతున్నాడు.తప్పేముంది అందులో?"అంటూ పాతకాలపు సంకెలలను బద్దలు కొట్టి భార్యకి సగభాగమై అన్ని పనులు పంచుకుంటూ అన్ని విషయాల్లోనూ సహకరిస్తున్న మరికొందరు పుణ్యపురుషులు ఆయన్ని వెనకేసుకు వచ్చారు.
వాళ్ల మాటలు చెవిలో పడుతుంటే పెద్దగా పట్టించుకోకుండా నవ్వేస్తూ తన పనిలో తాను మునిగిపోతున్నాడు శరత్ చంద్ర.
"మీరు ఉద్యోగరీత్యా పదవీ విరమణ పొందాక వంట పనిలో జాయిన్ అయ్యారు.సంతోషం.నన్ను ఇంటి పనిలో నుంచి రిటైర్ చేశారు.ఇది మరీ బాగుంది.అయితే మీలాగే నాక్కూడా వేరొక పని కల్పించాలిగా!తేరగా కూర్చుని తింటే కొవ్వెక్కదూ?" కవ్వింపుగా అంది రాగిణి భర్తతో.
"ఓఎస్.శ్రీమతీ!నీవు అడిగిన దాంట్లో పాయింట్ ఉంది.ఏం చేద్దాం అంటావు?అయ్యో!ఏం చేద్దాం అనుకుంటున్నావ్?అది నువ్వే చెప్పు.గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తా!"వరం ఇచ్చేశాడు శరత్ చంద్ర.
"పైగా ఏ పని చేయకుండా ఊరికే కూర్చుంటే బోరింగ్ గా కూడా ఉంది.మీరు కొత్తగా చేపట్టిన వంటపనిలోకి నన్ను సహాయకురాలిగా అపాయింట్ చేసుకోండి.మీకే కాదు,నాకూ టైమ్ గడవాలిగా" అంది అభ్యర్థనగా.
"ఓకే,డన్!ఈ రోజు నుండి నాకు హెల్పర్ గా యుఆర్ అపాయింటెడ్!"ఆర్డర్ పాస్ చేశాడు.
"థాంక్యూ బాస్!"అంటూ చేతులు ముందుకు చాచిన భర్త కౌగిలిలో ఒదిగిపోయింది రాగిణి.
"మనం ఎప్పటికీ ఇలాగే దాంపత్యవీణకు శృతిలయలుగా కడదాకా అన్యోన్యంగా ఉందాం" అన్నాడు శరత్ చంద్ర కౌగిలి పట్టు బిగిస్తూ.రాగిణి తలాడించింది ఆ బిగి కౌగిలిలో మంచుముత్యంలా కరిగిపోతూ.
(అయిపోయింది)

