ది సేఫెస్ట్ హీరో! -
రాజు చిన్నతనం నుంచే చాలా తెలివైనోడు. మిగతా పిల్లలంతా డాక్టర్లు, కలెక్టర్లు అవ్వాలని కలలు కంటుంటే, రాజు మాత్రం "నేను ఎలాగైనా సినిమా హీరోనే అవ్వాలి" అని బలంగా డిసైడ్ అయ్యాడు. అందుకే వాడి పేరుని హీరో రాజుగా మార్చేసుకున్నాడు.
దానికి వాడు చెప్పే లాజిక్ వింటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..
'నిజజీవితం చాలా డేంజర్ రా బాబు! సైకిల్ మీద నుంచి పడితేనే కాళ్లు విరుగుతాయి, అమ్మాయిల వెంట పడితే చెప్పు దెబ్బలు తింటాం, రోగం వస్తే హాస్పిటల్ చుట్టూ తిరగాలి. అదే సినిమా హీరో లైఫ్ అయితే... పరమ సేఫ్, బెటర్ అండ్ లాంగ్ లైఫ్ కూడా! ఎందుకంటే హీరోకి చావే లేదు!' ఈ నమ్మకంతోనే వాడు హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో అడుగుపెట్టాడు.
ఎట్టకేలకు హీరో రాజుకి హీరోగా ఒక ఛాన్స్ వచ్చింది. మొదటి రోజే హీరోయిన్‌తో లవ్ సీన్. హీరోయిన్ ఎవరంటే... ఇండస్ట్రీలోనే నంబర్ వన్ బ్యూటీ.
డైరెక్టర్ "యాక్షన్" అనగానే, రాజు ఒక సైకిల్ మీద స్టైల్‌గా వచ్చి హీరోయిన్ ముందు ఆగాడు. స్క్రిప్ట్ ప్రకారం హీరోయిన్ పరుగెత్తుకుంటూ వచ్చి, "నువ్వు ఏ పనీ చేయకపోయినా పర్లేదు, రోజూ నన్ను తిట్టినా పర్లేదు... నేనే నిన్ను పోషిస్తాను. ఐ లవ్ యూ!" అని డైలాగ్ చెప్పింది.
రాజు వెంటనే కట్ చెప్పి, డైరెక్టర్‌తో... "సార్! చూశారా నా లాజిక్? రియల్ లైఫ్‌లో మా ఊళ్ళో పక్కింటి అమ్మాయికి 'ఐ లవ్ యూ' చెప్తే.. వాళ్ళ అన్నయ్య వచ్చి వీపు విమానం మోత మోగించాడు. కానీ ఇక్కడ ఏ కష్టం లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇంత అందమైన హీరోయిన్ లవ్ ప్రపోజ్ చేసింది! హీరో లైఫే బెటర్ సార్!" అన్నాడు కాలర్ ఎగరేస్తూ.
మరుసటి రోజు ఫైట్ సీన్. వంద మంది విలన్లు కత్తులు, తుపాకులతో రాజుని చుట్టుముట్టారు.
మెయిన్ విలన్ పెద్ద కత్తి తీసుకుని రాజు కడుపులో పొడవడానికి దూసుకొచ్చాడు. మన రాజు ఏమాత్రం భయపడకుండా, నవ్వుతూ కడుపుని ముందుకు జరిపాడు. విలన్ డూప్లికేట్ కత్తితో పొడవగానే... రాజు విలన్ చెవిలో మెల్లగా, "బ్రదర్! గట్టిగా పొడుచుకో. ఎలాగూ నేను హీరోని కదా, బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక ఎమోషనల్ సాంగ్ వచ్చేసరికి నేను మళ్ళీ లేచి నిలబడతాను. నాకేం కాదు!" అన్నాడు.
పక్కనే ఉన్న విలన్ గ్యాంగ్ తుపాకులతో 'ఢిష్యూమ్ ఢిష్యూమ్' అంటూ వంద బుల్లెట్లు కాల్చింది. రాజు నిలబడే ఉన్నాడు, బుల్లెట్లన్నీ పక్క నుంచి వెళ్ళిపోయాయి. రాజు నవ్వుకుంటూ, "అబ్బా... నిజజీవితంలో దోమ కుట్టినా రక్తం వస్తుంది, కానీ ఇక్కడ వంద మంది తుపాకులతో కాలుస్తున్నా నాకు ఒక్క దెబ్బ కూడా తగలట్లేదు. సినిమా హీరో లైఫ్ ఎంత సేఫో కదా!" అని మురిసిపోయాడు.
సినిమా క్లైమాక్స్ కి వచ్చింది. యాభై అంతస్తుల బిల్డింగ్ పైన ఫైట్. విలన్ రాజుని గట్టిగా తన్నడంతో, రాజు బిల్డింగ్ పైనుంచి కిందకు పడిపోవాలి.
రాజు కిందకి చూసి అస్సలు భయపడలేదు. పైగా గాల్లో పడుతూ సెల్ఫీలు దిగాడు. కింద రోడ్డు మీద పడగానే... బ్యాక్‌గ్రౌండ్‌లో భీభత్సమైన డ్రమ్స్ మ్యూజిక్ మోగింది. ఆ సౌండ్‌కి గ్రావిటీ కూడా భయపడిందో ఏమో... రాజు సేఫ్‌గా దూది పరుపు మీద పడ్డట్టు లేచి నిలబడ్డాడు. కనీసం అతని హెయిర్ స్టైల్ కూడా చెదరలేదు!
దుమ్ము దులుపుకుంటూ కెమెరా వైపు చూసి, "చూశారా ఫ్రెండ్స్! యాభై అంతస్తుల పైనుంచి పడినా నా ఒంట్లో ఒక్క ఎముక కూడా విరగలేదు. ఎందుకంటే నేను సినిమా హీరోని! నాది లాంగ్ లైఫ్!" అని గట్టిగా డైలాగ్ చెప్పాడు.
సినిమా షూటింగ్ అంతా సక్సెస్‌ఫుల్‌గా పూర్తయింది. డైరెక్టర్ "ప్యాకప్!" అన్నాడు.
రాజు ఎంతో గర్వంగా కార్ ఎక్కబోతుంటే, ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి కార్ డోర్ లాక్ చేసి... "బాబు రాజు! షూటింగ్ అయిపోయింది. ఇక కార్ దిగి, ఆ పక్కన ఉన్న ఆర్టీసీ బస్సు ఎక్కి, నీ రూమ్‌కి వెళ్ళు" అన్నాడు.
బస్సు ఎక్కే తొందరలో రాజు కాలు జారి, కింద పడ్డాడు. అంతే... మోకాలు చిట్లి "అమ్మా!" అని గట్టిగా అరిచాడు. పక్కనే ఉన్న కండక్టర్, "ఏంటయ్యా... సినిమాలో అంత పెద్ద బిల్డింగ్ మీద నుంచి పడినా బతికేసావ్, ఇక్కడ చిన్న బస్సు మెట్టు దిగడానికే మోకాలు విరగ్గొట్టుకున్నావ్?" అని నవ్వాడు.
అప్పుడు రాజుకి అర్థమైంది... "సినిమా హీరో లైఫ్ సేఫే... కానీ అది కేవలం 'కట్' చెప్పేంత వరకే!" అని తల పట్టుకున్నాడు!
************

