బేరం తెలుగు కథ -
గతుకుల రోడ్డు మూలంగా చాలా నిదానంగా డ్రైవ్ చేస్తున్నారు శ్రీరామ్ మాస్టారు. కారులో శ్రీరామ్ దంపతులతో పాటు మేమూ వున్నాం.
అందరం టీచర్లమే. మంచి ఫ్యామిలీ ఫ్రెండ్సుమి కూడా.
విజయవాడలో ఓ పెళ్ళి రిసెప్షన్ వుంటే వెళ్ళి వస్తున్నాం. దారిలో రోడ్డు పక్కన తేగలు అమ్మే బండ్లు కనిపించాయి. తేగలు తీసుకుందాం అంది లలిత. నేను కూడా తీసుకుందాం, కారు ఆపండి కొందాం అన్నాను. ఇన్ని సంవత్సరాలైనా వీటిని టేగలు అనాలో తేగలు అనాలో నాకు డౌటే.
వంకర రోడ్డు దానికి తగ్గట్టు గుంతలు రావటంతో చాలా స్లో చేసాడు శ్రీరామ్. అతను అలా స్లో చేసేసరికి టేగలమ్మే బండి దగ్గర నుంచి నలుగురు కుర్రాళ్లు మా కారు దగ్గరికి దూసుకుని వచ్చి కారు అద్దం దించ మన్నట్లుగా వెళ్ళతో కొడుతూ వున్నారు. ఇక తప్పదు అన్నట్లు బ్రేక్ వేసి కారు అద్దం కిందికి దిగడానికి లాక్ ఓపెన్ చేసాడు శ్రీరామ్.
ఈలోపు నలుగురూ నాలుగు వైపులా చేరి "సార్! సార్! తీసుకోండి సార్.. చాలా తాజా టేగలు. కట్ట ఐదు రూపాయలు. ఐదు తీసుకుంటే ఇరవై రూపాయలు" అన్నారందరూ ఒకే సారిగా. అందరూ తలోదిక్కు వచ్చి అలా మాట్లాడే సరికి "చూడబోతే వీళ్ళే వాళ్ళ బిజినెస్ కోసం కార్లు స్లో చేసేందుకు కావాలని రోడ్డు మీద గుంటలు చేసినట్లున్నారు. ఏం వద్దు పోనీయ్" అన్నారు మా వారు.
శ్రీరామ్ దగ్గర నిలబడిన కుర్రోడు "ఆగండి సార్! మళ్ళీ మళ్ళీ దొరికేవి కాదు. పైగా నిప్పు మీద కాల్చినవి. చాలా బావుంటాయి" అంటూ చేతిలో ఓ కట్ట పెట్టాడు.
నేను కూడా గ్లాస్ కిందికి దింపి
ఓ కట్ట తీసుకుని చూసాను. "కట్టలో మూడు తేగలు వున్నాయి. ఒక్కోటి దాదాపు రూపాయి అరవై ఆరు పైసలు పడిందన్నమాట" అన్నాను.
"లెక్కల టీచర్ కదా తొందరగా లెక్క కట్టినట్లున్నారు. రూపాయి కన్నా ఎక్కువ ఇవ్వటం దండగ' అంటూనే శ్రీరామ్ 'ఐదు కట్టలు పదిహేను రూపాయలు చేసి ఇస్తే తీసుకుంటాం" అన్నాడు.
"మాకే ఆ రేటు పడదు సార్. మేం చెప్పిందే తక్కువ. ఐదు రూపాయల్లో ఏముంది సార్?" అన్నాడు బేరం ఆడకండి అన్నట్లు.
నాకు నిజమే అనిపించింది. పోన్లే తీసుకోండి శ్రీరామ్ అన్నాను.
"మీరుండండి మేడం. వీళ్ళు అలాగే చెప్తారు. ఇవేమన్నా కష్ట పడి పండించినవా. ఊరికే వచ్చినవి కదా! వీటికి రేటేంటి?" అన్నాడు.
చిన్నప్పుడు వేసవికాలంలో అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు తాటికాయలు ఏరుకోవడం గుర్తొచ్చి "కష్టపడి పండించక పోయినా అవి మన చేతికి రావాలంటే ఎంత శ్రమో తెల్సా. అసలే తాటి చెట్లు కరువవుతున్న ఈ రోజుల్లో తాటి ముంజలు తినగా ఎక్కడో ఒకటో రెండో కాయలు ముదిరి కింద పడిపోతే, వాటిని ఏరుకుని తెచ్చి, కొంత కాలం భూమిలో కప్పి వుంచి, సంరక్షించి, అని మొలకెత్తిం తర్వాత తవ్వి తీసి శుభ్రంగా కడిగి ఉడక బెట్టో, కాల్చో మనకి అందించటం ఒక ఎత్తయితే, ఇలా రోడ్డు పక్కన వచ్చి పోయే వాహనాల వారికి మార్కెట్ కెళ్ళి కొనుక్కునే అవసరం లేకుండా అందించటం మరో ఎత్తు. అందుకే బేరం ఎందుకు? తీసుకోండి" అన్నాను.
ఉండండి మేడం! వాళ్ళు మార్కెట్ కేస్తే ఈ రేట్లకి అమ్మ లేరు. అందుకే ఇక్కడికి వచ్చి అమ్ముతున్నారు. మన మీదేం ప్రేమ కాదు అంటూనే "చెప్పు పదిహేనైతే పది కట్టలు తీసుకుంటాం" అన్నాడు కారుని ముందుకు పోనిస్తూ.
వాళ్ళు కారుతో పాటే కదులుతూ అటు లలితకి ఇటు నాకు తీసుకోండి మేడం చాలా బావుంటాయి అని చెప్తున్నారు. అప్పుడే వెనుక నుంచి మరో వాహనం హార్న్ కొడుతుంది సైడ్ ఇమ్మన్నట్లుగా.
ఈలోపు ఇంకో కుర్రాడు వెనుక నుండి ముందుకు వచ్చి "ఆ రేటుకు నేనిస్తా సార్ తీసుకోండి" అన్నాడు. శ్రీరామ్ వెంటనే కారు మళ్ళీ ఆపి పది కట్టలు లెక్కపెట్టి ముప్పై రూపాయలు ఇచ్చిన తర్వాత కారుని నిదానంగా ముందుకు పోనిస్తున్నాడు.
నా చేతిలో కట్ట పెట్టిన కుర్రోడు నా వంక జాలిగా చూసాడు. అది వాడికి తిప్పి ఇవ్వటం ఇష్టం లేక ఈ శ్రీరామ్ అన్నీ ఇలాగే చేస్తాడు పది రూపాయలు దగ్గర ఎందుకింత పీనాసితనం అనుకుని పర్సులోంచి పది రూపాయలు తీసి ఇచ్చాను. కారు ముందుకు కదిలింది. గ్లాస్ క్లోజ్ చేయబోయాను. అయినా వాడు పరుగులాంటి నడకతో వచ్చి గ్లాస్ పైకి లేవకుండా అదుముతూ చిల్లర లేదని మరో కట్ట చేతిలో పెట్టాడు. నేను పర్వాలేదులే అనే లోపే వాడు వెనుక వున్న వాహనం వైపు "టేగలు.. టేగలు.. తాజా టేగలు" అని అరుస్తూ వెళ్ళిపోయాడు.
వాడలా ఇవ్వటం చూసి "నేను తీసుకున్నాగా మేడం మళ్ళీ పది రూపాయలు ఇచ్చారెందుకు?" అన్నాడు .
"పోనీలే, మా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. తీసుకోవాలనిపించింది" అన్నాను.
"శ్రీరామ్ ఎంత బాగా బేరమాడాడో చూసావా. కార్లలో వస్తే చాలు ఎంత రేటైనా పెడతారనుకుంటారు. ఆ రేటుకి ఈవ్వలేం అంటూ ఎలా ఇచ్చారో చూడు" అన్నారు మావారు.
"ఇక్కడ ఇలాగే బేరమాడాలి సార్ లేకుంటే మనల్ని పిచ్చోళ్ళని చేస్తారు" అని శ్రీరామ్ అనటంతో ఇద్దరూ ఏదో ఘనకార్యం సాధించినట్లు ఆనందంగా నవ్వుకున్నారు. నాకెందుకో వాళ్ళు అలా ఆనంద పడటం నచ్చలేదు.
తర్వాత మావారు తేగల కట్ట నుంచి రెండు తేగలు తీసి మాకు వెనక్కి ఇవ్వబోతే వద్దు మా దగ్గర వున్నాయి మీరు తీసుకోండి అంటూ నా చేతిలో వున్న తేగ నొకదానిని లలితకి ఇచ్చాను.
నేను కూడా ఓదాన్ని తీసుకుని తినటానికి ఉపక్రమిస్తూ అన్నాను "ఎలాంటి మందులు వెయ్యకుండా మొలకెత్తే వాటిల్లో ఇదే మొదటిది. మంచి ఫైబర్ తో కూడిన ప్రోటీన్ ఫుడ్" అని చెప్తూ లలిత వంక చూసాను సైన్స్ టీచరుని నాకు చెప్తున్నారా అన్నట్లు చూసింది.
నేను సమర్థించుకోటానికి చిరునవ్వుతో "ఏ సీజన్లో తినాల్సినవి ఆ సీజన్ లో తప్పక తినాలి. దానికోసం ఒక్కోసారి ఖర్చు ఎక్కువైనా భరించాలి. ఈ కాలం దాటాక వెయ్యి రూపాయలు ఇస్తామన్నా దొరుకుతాయా?" అన్నాను ఇందాక వాళ్ళు నవ్విన నవ్వుకి సమాధానంగా.
రెండు నిమిషాలు మౌనం రాజ్యమేలింది. అంత పరుషపదాలు నేనేమన్నానబ్బా అంత సైలెంట్ అయిపోయారని అయోమయంగా చూసా. ముందు సీట్లో వున్న ఇద్దరూ టేగ ముక్కని నములుతున్న వారల్లా ముఖా ముఖాలు చూసుకున్నారు.
తర్వాత కారు ఓ పక్కగా స్లో చేసి ఆపటం, కారు అద్దాలు దించటం, ఇద్దరూ తలలు బైటకు పెట్టి తుపుక్కున ఊయటం చూసి "ఏమైంది?" అడిగాం లలితా నేనూ ఒకేసారి.
"మీరే కరెక్ట్ మేడం కక్కుర్తి పడి బేరం ఆడితే వాడెవడో వెనుక నుండి వచ్చి ఇచ్చినవి తీసుకున్నా. అవన్నీ పాడైపోయినవి అనవసరంగా నోరు పాడైంది" అన్నాడు.
"నిజమా! ఏదీ?" అంటూ వాటిని అందుకుని చూస్తే అందులో కొన్ని ఉడకపెట్టినవి సేల్ కాక మిగిలితే కాల్చినట్లున్నారు బాగా పాసి వాసన వస్తున్నవి. మరికొన్ని బాగా ఎండిపోయినవి. వాళ్ళ అవస్థకి గట్టిగా నవ్వాలనిపించినా నొచ్చుకుంటారని నవ్వలేదు.
కారు దిగి ఇద్దరూ బాటిల్ లో వున్న నీటితో నోరు పుక్కిలించుకుని కారెక్కారు. నేను తీసుకున్న కట్టలోంచి వాళ్ళిద్దరికీ తేగలు ఇస్తూ "చూసారా బేరం ఆడకుండా తీసుకుంటే ఎలాంటివి దక్కాయో వీటి విలువ ఇప్పుడు నలభై రూపాయలు అనుకోవడమే...చేసేదేం లేదు" అన్నాను.
మళ్ళీ అంతలోనే "తిక్క బాగా కుదిరింది. రోడ్డు పక్కన వచ్చిపోయే వాహనాల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతూ, ఎండా వాన లెక్క చేయక హాయిగా జర్నీ చేసేవారికి మంచి ఫుడ్ అందించే ఈ చిరు వ్యాపారస్తులనా రోడ్డు గుంటలు పడేసారన్నారు.. కష్టపడి పంట పండించిన రైతులు కాదని పది రూపాయల దగ్గర గీసి గీసి బేరం ఆడారు? మీరు రోజూ బైట తాగే నాలుగు టీలలో ఈ ఖర్చు ఏపాటిది?" అన్నాను.
టేగ నములుతూ "పాఠాలు బాగానే చెప్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయని ఈసారి మీకే... ఆహా ఏమి రుచి. తేగంటే ఇలా వుండాలి. బేరం ఆడకుంటే నలభై ఏంటి నాలుగొందల విలువైన రుచినిస్తుందని ఇప్పుడే తెలిసింది" అన్నాడు శ్రీరామ్ బుద్దిమంతుడిలా దాని రుచిని ఆశ్వాదిస్తూ.
... సమాప్తం...

