మన తెలుగు తల్లి తెలుగు కథ - కోటమర్తి రాధా హిమబిందు

Mana Telugu Thalli Telugu Story

వీరేశానికి కొడుకు నుండి ఫోన్ వచ్చింది. కల్పవల్లి ఫోన్ తీసుకొని పరిగెత్తుకుంటూ భర్త దగ్గరికి వచ్చింది.

“ఏంది” వరండాలో పడకుర్చీలో కూర్చుని దినపత్రిక చూస్తున్న వీరేశం వెలుగులు చిమ్ముతున్న భార్య ముఖం చూసాడు.

“సతీషు ఫోన్ చేస్తున్నడు” అంటూ ఫోన్ ఇచ్చి కుర్చీలో కూర్చొని కొడుకు ఏం మాట్లాడతాడా అని ఆరాటంగా చూసింది.

“నాన్నా.. స్పీకర్ పెట్టండి.. అమ్మ కూడా వింటుంది.. అమ్మా..సినిమా దాదాపుగా అయిపోయింది.. ఉగాది సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నాం.. పదిరోజుల్లో ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది, నాన్నా.. అమ్మా.. మీకు సంతోషంగా వుందా?”

“ఇద్దరికీ చాలా చాలా సంతోషంగా వుందిరా.. సతీషూ.. యాంకరు అమ్మకూ నాకూ ఎంతో ఇష్టమైన ఉమే కదా”

“ఆమే నాన్నా..సినిమా అనుకున్నప్పటినుండే ఆమే ఖచ్చితంగా వుండాలని అమ్మా మీరు కోరారు కదా”

“ఆమెను టీవీలో చూడటమే..ఇప్పుడు ఎదురుగా చూడటం అంటే భలే బాగుందిరా” ఉత్సాహంగా అంది కల్పవల్లి.

“అమ్మా.. నా సినిమా రిలీజ్ కాబోతుంది.. నా గురించి మాట్లాడకుండా యాంకర్ గురించి మాట్లాడతావేంటమ్మా?”

“నా కొడుకు గురించి వేరే మాట్లాడాలా? నువ్వు ఉద్యోగం వద్దనుకుని అమెరికా నుంచి వచ్చినవు సినిమా తీయటానికి”

“అమ్మా..వీలు చూసుకుని మళ్ళీ మాట్లాడతా.. హీరోగారు వచ్చారు, నాన్న.. మీరు ఈ లోపే ఒకసారి నన్ను అక్కడికి రమ్మన్నారు.. కానీ నాకు కుదిరేట్టు లేదు.. పాసులు పంపించినప్పుడు మీరే రండి..వుంటాను” కాల్ కట్ చేశాడు సతీష్.

“ఎంత ప్రాణమేంటే కొడుకంటే నీకు? అంతగా ఉరుక్కుంటూ వచ్చినవు? సినిమా దర్శకుడిగా తొందరలో నీ కొడుకు పేరు వెండితెర మీద కనపడబోతదని సంతోషం, అంతేనా? సినిమా దర్శకుడిని కన్నతల్లి, ఇప్పుడే ఇట్లున్నవు తర్వాత ఎంత గొప్పలు పోతవో?” నవ్వుతూ అన్నాడు వీరేశం.

“అట్లాంటి గొప్పలన్నీ నీకే.. నాకేం లేవు. ఒక్కగానొక్క కొడుకుని ఇక్కడ బాగా చదివించినవు. ఆ తర్వాత అమెరికా పంపినవు. అక్కడ చదువు పూర్తి చేసి ఉద్యోగం చేసుకుంటున్నొడ్ని సినిమా తీస్తనంటే ప్రేమగా ఒప్పుకొని ఇక్కడికి రప్పించినవు.. వాడు ఏది చేస్తనన్నా నువ్వు సరే అంటవు.. మధ్యలో నాదేమన్నా వుంటదా? వాడిపై నీకు చచ్చేంత ప్రేమ. నీకు సినిమాలంటే ఇష్టం. నీ కొడుకు సినిమా తీస్తనంటే ఎగిరిగంతేసినవు” “ఎగిరినా చతికిలపడనులే.. నలభైఎకరాల పొలం ఉంది. సినిమా తీస్తా అంటే.. నిర్మాతతోపాటు ఇంకో నిర్మాతగా వాడు నన్ను పెట్టిండు సరే అన్నా, నేను సంపాదించిందంతా వాడి కోసం కాదా.. ధైర్యంచేసి వాడు అడిగినంత డబ్బు ఇచ్చినా.. అంతకంత లాభమే మనకు వస్తది.. నా కొడుకు నాకంటే గొప్పొడు అవుతడు.. సినిమా విడుదల కానీ, ఇదే హీరో వాడి వెంటపడి ఇంకో సినిమా తీద్దాం అంటడు” అంటున్న వీరేశాన్ని కళ్ళనిండుగా ప్రేమగా చూసుకుంది కల్పవల్లి.

***** *****

కొడుకు సతీష్ వి చంద్ర సినిమా డైరెక్టర్ కావటం..ప్రీ రిలీజ్ ఫంక్షనుకు పదిపాసులు పంపటం తండ్రి వీరేశానికి ఎనలేని సంతోషం కలిగించింది. తన వాళ్లందరికీ ఫోన్ చేసి చెప్పుకున్నాడు.. పక్క వీధిలో ఉండే బావమరిదిని పిలిచి విషయం చెప్పాడు. బావమరిది మల్లేశం ఆనందంతో పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఉరుకులు పరుగులు తీస్తూ ఊరంతటికీ ఈ వార్త చెప్పాడు. రెండు రోజుల్లో హైదరాబాద్ పోతున్నట్లు కొన్ని పాసులే ఉన్నాయి కాబట్టి అందర్నీ ఇప్పుడు మాతో తీసుకోపోలేకపోతున్నామని, సినిమా రిలీజు కాగానే అందరికీ తన డబ్బులతో ఖచ్చితంగా సినిమా చూపిస్తానని బావ చెప్పమన్నాడని చెప్పాడు. ప్రతీ ఒక్కరూ తమ ఇంట్లో వేడుక అన్నట్లు సంతోషంగా వచ్చి వీరేశాన్ని కల్పవల్లిని సతీష్ వి చంద్ర అక్కడ లేకున్నా అతన్ని కూడా పొగడ్తలతో ముంచెత్తారు.

***** *****

ఒక వ్యాను మాట్లాడుకుని తన ఇంటి సభ్యులలో ముఖ్యమైన వారితో ఊరినుండి బయలుదేరి హైదరాబాదుకు వచ్చి అనుకున్న సమయానికి ఇండోర్ స్టేడియంకు చేరుకున్నారు వీరేశం కల్పవల్లి మిగతావాళ్ళు. కొడుకును స్టేజీమీద చూసి పొంగిపోయారు వీరేశం కల్పవల్లి.. తనకు తన భార్యకు ఎంతో ఇష్టమైన యాంకరు ఉమ హుషారుగా వేదిక మీద అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడుతుంటే ఆమెకు తామిద్దరినీ కొడుకు ఎప్పుడు పరిచయం చేస్తాడా అని తహతహలాడారు. యాంకరు ఉమ తన మాటల చాతుర్యంతో తెగ మాట్లాడుతోంది. ముందుగా సినిమాలోని పాటలను పాడారు గాయని గాయకులు. మధ్య మధ్య కొంతమందిపై సెటైర్లు వేస్తూ జోకులు పేలుస్తూ అందర్నీ ఉత్సాహపరుస్తూ నవ్వించసాగింది యాంకరు. ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రిని సాదరంగా ఇంగ్లీష్ లో వేదిక మీదికి ఆహ్వానించింది. మంత్రి ఇంగ్లీషులో చాలాసేపు మాట్లాడుతుంటే ఏమీ అర్థం కాలేదు వీరేశానికి.. కల్పవల్లి కూడా అయోమయంగా భర్తను చూడసాగింది.

“ఏందిరా..మల్లేసూ..మంత్రి తెలుగోడే కదా.. ఇంగ్లీషులో మాట్లాడుతున్నడేంది? ఇదేంగోల? మనకేం అర్థమై చస్తదిరా”

“పెద్దగా మాట్లాడకు బావా.. ఎవరైనా వింటే బాగుండదు” గుసగుసగా అన్నాడు మల్లేశం

“వింటే ఏందిరా.. నాకేమన్నా భయమా? సినిమాకు బోలెడంత డబ్బు పెట్టినా? మాట్లాడే సొసంత్రం నాకు లేదా?”

“లేదనట్లేదు బావా.. మన ఊళ్ళో మాట్లాడుకోవడం వేరు, ఇక్కడ మాట్లాడటం వేరు”

“అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా ఈ వీరేశం మాట మాటే.. అవసరం అయితే చింతాకు దులిపినట్టు దులపనూ”

“అది సరేలే.. ముందు ప్రోగ్రాం చూడు. తర్వాత సతీషు ఏమన్నా అడిగితే మనం చెప్పొద్దూ”

“ఏముంది చెప్పటానికి? మనకు ఏం అర్ధమౌతుందని? నాకు పిచ్చి కోపం వస్తుందిరా” లేచి నిలబడ్డాడు వీరేశం

“బావా..కూచో.. ప్లీజ్.. నువ్వు ఇక్కడ ఏది మాట్లాడినా బాగోదు. సతీషు మాట్లాడమంటేనే మాట్లాడు అంతే” అంటూ వీరేశం చేయిపట్టుకొని కూర్చోబెట్టి ఆ చేతిని అలాగే గట్టిగా పట్టుకున్నాడు మల్లేశం

తర్వాత సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ముంబైకి చెందిన అమ్మాయి “అందరికీ నమస్కారం” అనేసరికి అంతా గొల్లుమంటూ అరిచారు. ఆ తర్వాత ఆమె అంతా ఇంగ్లీషులోనే మాట్లాడింది. హీరో కూడా ఇంగ్లీషులోనే మాట్లాడాడు. ఎంతమాత్రం అర్థంకాకున్నా వినక తప్పలేదు వీరేశానికి, కల్పవల్లికి, వాళ్ల వెంట వచ్చిన మిగతావారికి.. ఏదో కళ్ళప్పగించి చూడటం తప్ప వాళ్ళందరికీ ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. మంత్రిగారు ఏదో అర్జెంట్ పనివుందని వెళ్ళిపోయాడు. చివరాఖరికి సతీష్ వి చంద్ర కూడా ఇంగ్లీషే మాట్లాడటంతో వీరేశానికి పిచ్చి కోపం వచ్చింది.

అదే సమయంలో తల్లి తండ్రిని వేదిక మీదికి పిలిచాడు కొడుకు. “బావా..నువ్వు అడ్డగోలుగా మాట్లాడి, ఇక్కడంతా రచ్చ రచ్చ చేయకు. మనం పల్లెటూరోళ్ళం, వీళ్ళంతా సిటీ వోళ్ళు ఏదో..వాడు పిలిచాడు..మర్యాద దక్కించుకొని వెళ్ళిపోదాం” అలా మాట్లాడుతున్న బావమరిదిని కోపంగా చూసి చేతిని విసురుగా లాక్కుని, భార్యను వెళ్దాంపద అన్నట్లుగా సైగచేసి వేదిక మీదికి వచ్చాడు వీరేశం. ఇంగ్లీషులో తల్లితండ్రిని పరిచయం చేస్తూ వాళ్ల గురించి చెప్పాడు డైరెక్టర్ సతీష్ వి చంద్ర, తానేం చేస్తున్నాడో తనకే తెలియని వింత స్థితిలో చాలా చిరాగ్గా కొడుకు చేతిలోంచి మైక్ లాక్కున్నాడు.

“యాంకరమ్మా..ఇన్ని జోకులు వేస్తవు..చెప్పిన మాట చెప్పకుండా చెప్తవు..ఏం..నువ్వు వీళ్ళను మన తెలుగుభాషలో మాట్లాడమని చెప్పలేవా? అబ్బబ్బ..టీవీలలో చూపించే సినిమా ఇంటర్యూలలో ఇదే గోల..ఇక్కడ ఇలాంటి చోట అంతే.. ఎవరు చూడు ఇంగ్లీషులో మాట్లాడటమే, ఒక్క ముక్క మాకు అర్థం కాకపోయే, ఇది తెలుగుసినిమా.. ఇంగ్లీష్ సినిమా కాదు. మీరంతా తెలుగోళ్ళు.. ఇంగ్లీషోళ్లు కాదు. హీరోయిన్ ముంబయి పిల్లకంటే తెలుగు రాదు, పోనీ అని అనుకుందాం. హీరోకు ఏమైంది? హీరో మాకు తెలిసినోడే, బాగా సంపాదించిండు, కానీ కనపడితే మాట్లాడడు. నేను చెప్పేదేంటంటే, తేనెలూరే మన తెలుగు గొప్ప భాషను మనం చల్లగా బతికించుకోవాలి.. మన తెలుగుకు మనమే విలువ ఇవ్వకుంటే, బయటోడు విలువెందుకిస్తడు? అమెరికాలు ఆస్ట్రేరియాలు పోయినంత మాత్రాన మనభాష మార్చుకోవాలా? ఈమధ్య అందరికీ ఇదో ఫ్యాషన్ అయింది. నా కొడుక్కి ముందే నేను చెప్పిన.. ఎప్పుడు నువ్వు తెలుగులోనే మాట్లాడాలి అని.. వాడికీ వీళ్ళందరి జిడ్డు అంటుకుందేమో.. వాడూ ఇంగ్లీషులోనే మాట్లాడుతుంటే మా పరిస్థితి ఏంది? అరెరే.. నా కొడుకు సినిమా డైరెక్ట్ చేసే..ఏం చేసిండో ఎట్ల చేసిండో మాకు ఏమాత్రం అర్ధం కాకపోయే? పాసులు ఎందుకు పంపినట్టు? మేం ఇంతదూరం వ్యాను మాట్లాడుకొని ఎందుకు వచ్చినట్టు? ఏం విని పోతున్నట్లు? మంత్రి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు తెలుగులోనే మాట్లాడతడు కదా.. మరి ఇప్పుడేమైంది? యాంకరమ్మా.. నువ్వు చాలా తప్పు చేసినవు” ఎర్రటి కళ్ళతో యాంకరును వేలితో బెదిరిస్తూ అన్నాడు వీరేశం

గలగల గోదారిలా మాట్లాడే ఉమకు ఎంతో అవమానంగా అనిపించి ఏం చెప్పాలో అర్థంకాక దొంగచూపులు చూసింది. కొడుకు తండ్రి చేతిలోనుండి విసురుగా మైకు లాక్కుని బాధగా ఉమకు ఇచ్చాడు. ఉమ వేదికలమీద వాడే తన సమయస్ఫూర్తితో మాట్లాడబోతూ అందరినీ కలియజూసింది. అక్కడ అంతా నిశ్శబ్దవాతావరణం కనబడింది.

“ఇప్పుడు మీ అందరికీ తెలియని ఒక విషయం చెప్తాను. డైరెక్టర్ అసలు పేరు సతీష్ చంద్ర..మధ్యలో వి అంటే మీకు తెలియదు కదా.. నేను చెప్తాను.. వీరేశంగారూ” అంటూ వాతావరణాన్ని తేలిక పరిచేందుకు పెద్దగా అరిచి అందరి చేత చప్పట్లు కొట్టించింది. తన మాటల ప్రవాహ ఉధృతంలో సతీష్ వి చంద్ర తల్లిదండ్రులని వేదిక నుండి కిందికి పంపింది. ఆ తర్వాత వీరేశాన్ని కల్పవల్లిని మిగతా వాళ్ళను కలిసింది.

“వీరేశంగారూ.. మీరు మేడమ్ గారు మిగతా వీళ్ళు నా అభిమానులు అని సతీష్ చెప్పాడు..నేను కూడా నిజంగా చస్తున్నాననుకోండి..మన భాష ఏంటి? మన సంస్కృతి ఏంటి? మీరు నన్ను నిలదీసి మరీ అడిగారు కానీ.. ఇంగ్లీషు మాట్లాడకండి అని నేను చెప్పటం పద్ధతి కాదు. నేను చెప్పలేనిది మీరు చెప్పారు.. థాంక్యూ.. ఇలా అంతా ఇంగ్లీషు మాట్లాడుకుంటూ పోతే మన తెలుగు భాష ఏమైపోతుంది? మీరు మాత్రం భలేగా బుద్ధి చెప్పారు. మీకు ఈ కడుపులో మంట ఎప్పటినుండి వుందో.. మొత్తం మీద చల్లార్చుకున్నారు. ఎవరో ఒకరు కంకణం కట్టుకొని ఇలా ధైర్యం చేయాలి.. తెలుగుతల్లి విగ్రహాలు పెట్టుకుంటూ వేడుకలు చేసుకోవటం కాదు. తెలుగుభాషను భక్తిశ్రద్ధలతో మనం కాపాడుకుంటూ తెలుగుతల్లిని గౌరవించాలి” అంటూ వాళ్లందరితో నవ్వుముఖంతో మాట్లాడి వాళ్ళను పంపించింది యాంకరు ఉమ. సరిగ్గా అదే సమయంలో తండ్రి మాటలకు అవమానభారంతో కినుక వహించిన హీరో వెంటపడి బ్రతిమాలుతున్నాడు సతీష్ వి చంద్ర.. అతనికి కోపం తగ్గలేదు. నీతో ఇంకో సినిమా ఎప్పటికీ చేయనని వెళ్లిపోయాడు.

***** *****

సతీష్ వి చంద్ర సినిమా అనుకున్నట్లుగా ఉగాదికి విడుదల అయింది. ఉదయం ఆటతోనే ప్రతి ఒక్కరూ సినిమాని పొగడ్తలతో ముంచెత్తారు. కొడుకు ఫోన్ చేసి చెప్పిన మాటలకు మరింతగా ఉబ్బితబ్బిబ్బయ్యారు వీరేశం కల్పవల్లి. “ఇండస్ట్రీలో టాప్ లో వున్న హీరోతో నేను పాన్ ఇండియా సినిమా చేస్తున్నాను. మీరు చెప్పిన మాటలు వారికి బాగా నచ్చాయట..తను ఇకనుండి మీలాంటి వాళ్ళకు అర్థమయ్యేలా తెలుగులో మాట్లాడతానన్నారు.. కొత్త కథ రెడీగా వుంది కదా..అది హీరోగారికి బాగా నచ్చింది. ఉగాదికే విడుదల కావాలని హీరో అన్నారు. ఉగాది వారికి సెంటిమెంట్ అట” “అవునా..అయితే రాబోయే సినిమా బొమ్మ విడుదలకు కూడా యాంకర్ ఉమే ఉండాలి. ఆమె మనకు అచ్చి వచ్చింది” అన్నారు ఆనందంగా వీరేశం కల్పవల్లి. ఆ మాటలకు ఖుషిగా నవ్వి సరే అంటూ అభయం ఇచ్చాడు సతీష్ వి చంద్ర.

***** *****