సుబ్బారావ్ డాక్టరేట్ - కిలపర్తి దాలినాయుడు

Subbarao Doctorate

పేపర్లో ప్రకటన చూసే ఆశ్చర్యపోయాను.

ఆర్.ఐ.పి. యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న సుబ్బారావ్. అది వార్త సారాంశం.

జిల్లా పేజీ నిండా అడ్వర్టైజ్మెంట్లు కుమ్మేశాయి.

అటు సుబ్బారావ్ ఆఫీస్ వారు, బంధుమిత్రులు, స్నేహితులు, అభిమానులు, పరిచితులు, అపరిచితుల పేరుతో”దినం” జిల్లా పేజీ నిండా ప్రకటనలే.

డాక్టరేట్…. సుబ్బారావ్ ,డాక్టరేట్…సుబ్బారావ్

నినాదాల్లామారుమొగింది పేపర్ అంతా. పరిశోధన చేస్తే డాక్టర్ రేట్ ఇస్తారు. ఒక రంగంలో ఎక్కువ కృషి చేస్తే గౌరవ డాక్టరేట్ ఇస్తారు. ఇది రెండో రంగానికి చెందిన దే అయినా…సుబ్బారావుకు ఒక డాక్టరేట్ రావడం పరిచితులైన మా బోటు వారికి ఆశ్చర్యమే.



సుబ్బారావ్ ఎమ్మార్వో ఆఫీస్ లో క్లరికల్ సైడ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. మూడు మాసాలా నుండి కవితలు రాస్తున్నాడు. అదే మండల కేంద్రంలో ఉన్న హైస్కూల్లో తెలుగు టీచర్ గా పని చేస్తున్నాను నేను. ఈ విషయం తెలుసుకున్న

సుబ్బారావ్…

“మాస్టారూ! నాకు కవితలు రాయడం నేర్పుతారు కదూ”అంటూ పరిచయమయ్యాడు. తలా తోక లేని

కవిత లేవోరాస్కొస్తే అవి దిద్దడానికి తలప్రాణం తోకలోకి వచ్చేది నాకు.

అప్పుడప్పుడు నేను రాస్తున్నా భయపడుతూ భయపడుతూవాట్సప్ లో పెట్టేవాడిన్ని.

ఒకరోజు సుబ్బారావ్ ఒకే రోజు తొమ్మిదిపత్రికల్లో

పెట్టిన కవితల కటింగ్లను చూసి ఆశ్చర్యపోయాను.

దేవతా వస్త్రం లాంటి అంతర్జాల మాయాపత్రికలు

ఇన్ని ఉన్నాయా అని ఆశ్చర్యపోయాను.

ఒకరోజు సుబ్బారావ్ నా దగ్గరకు వచ్చి “సార్! మీ దయ వలన, ఇంటర్నెట్ దయవలన కవితలు రాయగలుగుతున్నానండి. వాట్సప్ లో

ఓ వందస్పందనలు, ఫేస్బుక్లో రెండువందల లైకులు,

ఇంస్టాగ్రామ్ లో మూడువందలవ్యూస్, ఎక్స్ లో

ఓ వెయ్యి మంది చదివి ఉంటారు సార్” పిల్లాడు ప్రోగ్రెస్ రిపోర్టు చదివినట్టు సుబ్బారావ్ చెప్పు పోతున్నాడు.

నేను కాస్త సిగ్గుపడ్డాను. తెలుగు మాస్టర్నై ఉండి

నాలుగు వాక్యాలు రాయడానికే నానా తండాలు పడుతుంటాను. సుబ్బారావ్ చూపిస్తుంటే అసూయతో పాటు నాపై నాకే కోపం వేసింది.

నెట్వర్క్ లో సుబ్బారావ్ కొంతముందంజ వేశాడనే చెప్పవచ్చు. నాకు అనుమానం వచ్చింది. “ఇంటర్నెట్ ఎలా కవిత్వం నేర్పుతుంది? సుబ్బారావు?”అడిగాను ఉండలేక. నా వెనుకబాటు తనానికి కూడా నాపై నాకే చిరాకేసింది. టెక్నాలజీలో వెనుకబడ్డం చాలా వెనుకబడి పోతామనిపించింది.

“సార్ ర్ ర్…గూగుల్ తల్లి లేకపోతే ఈ సుబ్బారావు మీ దయ వలన కవిగా మారేవాడు కాదు”నాకు ఒకింత ఆశ్చర్యం కలిగింది.

“ఎలా కాస్తావివరంగా చెప్పవయ్యా?”

“సార్! గ్రూపులు ఒక విషయాన్ని ముందు రోజు ఇచ్చి మరుసటి నాటికే కవిత్వం రాసిన వారికి

ప్రశంసా పత్రాలు ఇస్తాయి. వెంటనే ఆ విషయంపై

గూగుల్ హిస్టరీ తీసి…కాపీ చేసుకుని ముక్కల ముక్కలుగా విరిచి 20-30 లైన్లు రాస్తే కవిత అయిపోతుంది. అలా రాసిన వారికే బహుమతులు కూడా వస్తున్నాయి.” సుబ్బారావ్ కొంత రహస్యాన్ని చెప్పాడు.

“ఓహో! అందుకే ఈ మధ్య నువ్వు రావటం మానేసావ్ అన్నమాట.

అయినా నీకు చెప్పడానికి నాకు వస్తే కదా కవిత్వం.

ఏదేమైనా నీ ప్రయాణం బాగుందోయ్”అంటూ ముగించేసాను. వచన కవిత అంటే ముక్కల ముక్కలుగా వ్రాయటమే సుబ్బారావు నుంచి నేను నేర్చుకున్నట్టు అయింది.

ఒకరోజు “సుబ్బారావ్ కవితకు ప్రథమ బహుమతి”

అంటూ ఒక వార్త “తెలుగు దీపం”పత్రికలో పడింది.

ఆ వార్తని తన గ్రూపులన్నిటిలో పోస్ట్ చేసి మరి మిత్రుల చేత చప్పట్లు కొట్టించుకున్నాడు సుబ్బారావ్. గ్రూపుల్లో కూడా ఊరికే కొడతారా!

ఇతడు కొందరికి లైక్ లు షేర్ చేస్తూ ఉండాలి.

ఒక ముఠా లాగా పరస్పర ప్రక్రియ కొనసాగుతుంటుంది. ఈ వార్త మా స్కూల్లో సైన్స్ మాస్టర్ చదివారు.

“సార్! మన మండల్ ఆఫీసులో సుబ్బారావ్

కవితలు పోటీల్లో ఏదో ప్రైజ్ వచ్చిందని పెట్టాడు చూసారా! మీరు కూడా అప్పుడప్పుడు రాస్తుంటారు కదా! మీకు బహుమతులు రావంటారా”అంటూ

నాలో తెలుగు మాస్టరీ తనాన్ని ఎత్తి చూపాడు.

“సుబ్బారావ్ లాగా నేనైతే వ్రాయులేనండి

దాన్ని మీరు ఎలాగా అర్థం చేసుకున్న మీ ఇష్టమే”

అంటూ క్లాస్ వైపు నడిచాను నేను.

మరో మూడు మాసాలు గడిచిన తర్వాత

సుబ్బారావ్ ఓ లావుపాటి స్పైరల్ బైండ్ పుస్తకాన్ని నా దగ్గరికి తీసుకుని వచ్చాడు. సారీ మోసుకొని వచ్చాడు.

ఆఫ్ ఇయర్లీ పరీక్షల ప్రోగ్రెస్ కార్డులా సుబ్బారావ్

చూపించిన పేపర్ కటింగ్స్ చూసి నా గొంతులో పచ్చి వెలక్కాయి పడింది. కవితలు పడిన పేపర్లో కటింగులు, ఆ వార్తను పది పేపర్లలో వేసిన కటింగులు రోజూ ఇరవై కటింగ్ లైనా ఆన్లైన్ పేపర్లను డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసి బొంత కుడతాడట. క్షమించండి కాగితాలపై అంటిస్తాడట…

“సుబ్బారావ్! నువ్వు చాలా ఎత్తుకుఎదిగిపోయావయ్యా!”ప్రపంచంలో ఇన్ని అంతర్జాల(అంతా మాయ) పత్రికలు ఉన్నాయా!

పత్రికలు ఏమైనా చందా తీసుకుంటాయా? అని అడిగాను ఉండబట్టలేక.

“తప్పదు సార్. మనకోసం మన కవిత్వం కోసం వారు పని మానుకొని పేపరు తయారు చేయరు కదా. వార చందా, నెలచందా, మూడు మాసాల చందా, ఆరు మాసాల చందా, సంవత్సర చందా!

జీవితకాల చందా! ఇలా ఒక్కొక్క పత్రికది ఒక్కొక్క రేట్ సార్…అంటూ నాలుక కర్చుకున్నాడు సుబ్బారావ్.

అతని విజయ రహస్యం నాకు అర్ధం అయిపోయింది. “నువ్వు ఒకందుకు పోస్తే నేనొ కందుకు త్రాగుతాను అన్నట్టుగా ఉంది”వ్యవహారం.

అందులో కవితా పదార్థం ఏమిటో దేవుడు కెరుక.

ఇలా కవులు ను తయారు చేస్తున్న పత్రికలకు హేట్సాప్. అని మనసులోనే అనుకున్నా.

లోపల తిట్టుకున్నా సుబ్బారావ్ “గురువుగారు! గురువుగారూ!” అంటూ ఉండటం వలన అతన్ని పొగడక తప్పలేదు.

మరో మూడు మాసాల కాలం గడిచింది.

మరో వార్త చదవాల్సి వచ్చింది.”సుబ్బారావుకి “కవి సామ్రాట్” బిరుదు ప్రదానం”. స్థానిక మండల ఆఫీసులో పనిచేస్తున్న సుబ్బారావ్ “కవితా సేవ”కు

సా.సో. కవితా సంస్థ రవీంద్ర భారతిలో ఘనంగా సన్మానం చేయనుందని ఆ సంస్థ డైరెక్టర్ వినాయక్

ఒక ప్రకటనలో తెలిపారు.”ఇది ఆ వార్త.

రవీంద్ర భారతిలో సన్మానం అంటే నిజంగా కవి జన్మ ధన్యమే మరలా మా సైన్స్ మాస్టర్ నాతో ఈ వార్త ప్రస్థావనను మధ్యాహ్న భోజన విరామ వేళలో తీసుకొచ్చాడు పైకి. సుబ్బారావ్ కృషి నిజంగా

చాలా గొప్పదండీ అంటూ పొగడ్డం ప్రారంభించాడాయన. ఒంటిపై కారపు ముద్ద రాసుకున్నట్టు ఉంది నాకు. “నవ్వుకుంటూ

మనమూఅభినందిద్దాం. అనేసాను ముక్త సరిగా!



ఒకరోజుఎవరో కాలింగ్ బెల్ నొక్కితే “ఇంత తెల్లవారి ఎవరు వచ్చారు చెప్పమ్మా”అనుకుంటూ తలుపు తీశాను. ఇంకెవరు డియర్ సుబ్బారావ్.

ప్రోగ్రెస్ కార్డు లాంటి కార్డేదో అతని చేతిలో ఉంది.

ఆఫ్ ఇయర్లీఎగ్జామ్ రిజల్ట్ ని చూపించడానికి తీసుకు వచ్చిన పిల్లాడిల కనబడ్డాడు సుబ్బారావ్.

“సార్! హైదరాబాద్ నుంచి “సా.సొ. సంస్థ”వారు

పంపిన ఇన్విటేషన్ సార్ ఇది. ఇంత అందమైన ఇన్విటేషన్, ఇంత గొప్ప సభ నేనెప్పుడూ ఊహించలేదు సార్!”తొలి ఆహ్వాన పత్రిక మీకే ఇస్తున్నా…అంత దూరం మీరు రాలేకపోయినా

మీ దీవెనలు ఇవ్వండి చాలు”అంటూ రంగురంగుల కరపత్రాన్ని నా చేతిలో పెట్టాడు సుబ్బారావ్.

సా.సొ. సంస్థ అసలు పేరు “సాహిత్యమే సొమ్ము”

అని దాని పూర్తిపేరట…కరపత్రం చదివాక తెలిసింది.

శుభం నాయనా!వెళ్ళిరా!!

“గురువుగారు “ఒకరోజు” టీవీ వారు లైవ్ గా ప్రోగ్రామ్ ఇస్తారట తప్పనిసరిగా మీరు చూడాలి”అంటూ నడక లాంటి పరుగతో కదిలాడు సుబ్బారావ్.

“సుబ్బారావ్ కవిత్వంపై పరిశోధనచేయిస్తున్న

బేస్ యూనివర్సిటీ”

“సుబ్బారావ్ కవిత్వంలో తాత్వికత -ప్రముఖ విమర్శకుడు “దానా”మాస్టార్ విశ్లేషణ”

“సుబ్బారావు-బహుపార్శ్వాలు”

ఢిల్లీనుండి ఆన్ లైన్ సదస్సు”

రోజుకో వార్త అంతరాయంలేని పత్రికలనుండి

వార్తా స్రవంతి కొనసాగుతోంది.



సరిగ్గా పేపర్లో డాక్టరేట్ వార్త చూసి

సుబ్బారావు వామనావతార రహస్యం ఏమిటో

తెలీదు గాని ఇది కవిత్వంలో చాలా ముందడూగేఅనుకున్నాను.

మరుచటి రోజు సా.సొ పత్రిక ప్రత్యేక ఆన్ లైన్

ఎడిషన్ ప్రచురించింది.



“ఎమ్మార్వో ఆఫీసులో సుబ్బారావు సన్మానం

మీరు రావాలి మాస్టారు. అతనికో సన్మాన పత్రం రాయాలి. సద కూడా మీరే నిర్వహించాలి”

అంటూ ఎమ్మార్వో ఆఫీసులో అతని కొలీగ్

పాపారావు ఫోన్ చేసి మాట్లాడాడు.



పెళ్లి కంటే బాగా ఏర్పాటు చేశారు ఆయన మిత్రులు ఆఫీసు దగ్గర. సభలో కూర్చున్న నాకు ఆయన మిత్రుడు దగ్గరకు వచ్చి సార్! మా వాడు విజయ రహస్యాలు ఏమిటో మీకు తెలుసా? అవార్డులు మాట దేవుడెరుగు తెలిసిన వారి దగ్గర నుండి తెలియని వారి దగ్గర నుండి అప్పులు మాత్రం అధికంగా వాడాడు. ఈ కార్యక్రమానికి కూడా ఇంత హడావిడి ఎందుకండీ”అనడంతో సుబ్బారావు పై తెగ జాలేసింది.

ఔనుమరి డాక్ట”రేటు”ఇచ్చిన యూనివర్సిటీ

R I.P యూనివర్సిటీ కదా!”రిప్”యూనివర్సిటీ మాయలో మనవాడు ఆత్మ శాంతి పొందున్నందుకు

నవ్వుకున్నాను.