జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య - ambadipudi syamasundar rao

జాతీయ పతాక  రూపకర్త పింగళి వెంకయ్య

పింగళి వెంకయ్య గారు స్వాతంత్ర సమరయోధుడు మన జాతీయ పతాక రూపకర్త మన త్రివర్ణ పతాకం గాంధిజీ ప్రోద్బలంతో పుట్టింది మన తెలుగు నేలమీదే. కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లిములకు అని పేర్కొనడముతో ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ గాంధీజీ సూచనలపై ఆకుపచ్చ, కాషాయ రంగులతో పాటు తెలుపును కూడా చేర్చి త్రివర్ణపతాకాన్నిపింగళి రూపొందించాడు. మధ్యలో ఉండే రాట్నము గ్రామీణ జీవితాన్ని రైతు కార్మికత్వాన్ని స్ఫురింపచేస్తుందని అయన భావన.మన ఆశయాలకు భారతదేశము అవలంభించే సత్యము, అహింసలకు చిహ్నమే మన త్రివర్ణ పతాకం.అప్పట్లో ఈ జెండాను పింగళి కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్ర్యోద్యమములో రూపొందించాడు 1947 జులై 22 న భారత రాజ్యాంగ సభలో నెహ్రు జాతీయ జెండా గురించి తీర్మానం చేస్తూ త్రివర్ణ పతాకములోని రాట్నము స్థానములో మన పూర్వ సంస్కృతికి చిహ్నమైన సారనాద్ స్తూపములోని ఆశోకుని ధర్మచక్రాన్ని చేర్చారు ఈ మార్పు తప్పితే పింగళి రూపొందించిన జెండాకు మన జాతీయ జెండాకు తేడా ఏమి లేదు.ఆ విధముగా మన జాతీయ జెండా రూపకర్తగా పింగళి వెంకయ్య గారు మన చరిత్రలో స్థానము సంపాదించుకున్నారు.

పింగళి వెంకయ్య గారు ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా మచీలీపట్నానికి సమీపాన గల భట్ల పెనుమర్రు అనే గ్రామములో ఆగస్టు 2న, 1876 న హనుమంతరాయుడు, వెంకట రత్నమ్మ దంపతులకు జన్మించాడు.తండ్రి దివితాలుకా యార్లగడ్డ గ్రామ కరణము ప్రాధమిక విద్య పెద కళ్లేపల్లిలోనూ, చల్లపల్లిలోనూ హైస్కూల్ విద్య మచిలీపట్నములోని హిందూ ఉన్నత పాఠశాలలో జరిగింది.అక్కడ చదువు పూర్తిచేసుకుని సీనియర్ కేంబ్రిడ్జ్ చేయటానికి కొలొంబో వెళ్ళాడు. 19వ ఏటనే సైన్యములోచేరి దక్షిణ ఆప్రికాలోని బోయర్ యుద్దములో పాల్గొన్నాడు. అసమయములోనే ఆయనకు మహాత్మాగాంధీతో పరిచయము అయింది ఈ పరిచయము దాదాపు అర్ధ శతాబ్దము కొనసాగింది.దక్షిణ ఆఫ్రికా నుండి తిరిగి వస్తూ అరేబియా ఆఫ్గనిస్తాన్ లను చూచి మద్రాసు వచ్చి అక్కడ ప్లేగు ఇన్స్పెక్టర్ శిక్షణ తీసుకొని కొన్నాళ్ళు బళ్లారిలో ప్లేగు ఇన్స్పెక్టర్ గా పనిచేశాడు.ఆయనకు ఉన్న దేశభక్తి జ్ఞాన సముపార్జన కాంక్ష ఆయనను ఏ ఉద్యోగములో నిలవనివ్వలేదు. మళ్ళా కొలొంబో వెళ్లి అక్కడి సిటీ కాలేజీలో ఎకనామిక్స్ చదివి కేంబ్రిడ్జ్ సీనియర్ పరీక్షలో పాస్ అయినాడు కొంతకాలం రైల్వే లో గార్డుగా పనిచేశాడు ఈయన జ్ఞాన దాహము పరిమితమైనది అందుచేత లాహోర్ డీఎవీ కాలేజీలో చేరి సంస్కృతము ఉర్దూ,జపాన్ భాషలలో పాండిత్యము సంపాదించాడు ఈయన ప్రొఫెసర్ గోటే ఆధ్వర్యములో జాపనీస్ ,చరిత్రనేర్చుకున్నాడు ఈయనను "జపాన్ వెంకయ్య" అని కూడా పిలిచేవారు.

1913 నుండి ప్రతి కాంగ్రెస్ సభలకు హాజరు అయి నాయకులందరితో జాతీయ పతాక రూపకల్పన గురించి చర్చలు జరుపుతూ 1916లో పింగళి "భారతదేశానికి ఒక జాతీయ పతాకం" అనే ఇంగ్లిష్ గ్రంధాన్ని రచించాడు ఈ గ్రంధానికి అప్పటి కేంద్రమంత్రి, వైస్రాయ్ కి కార్యనిర్వాహక సభ్యుడైన సర్ బి ఎన్ శర్మ పీఠిక కూడా వ్రాసాడు. ఈయన రూపొందించిన జెండానే 1916లో లక్నో లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశములో ఎగురవేశారు. 1919లో లాలా హన్స్ రాజ్ సూచనను బట్టి జండాపై రాట్నము ను చేర్చారు1921మార్చ్ విజయవాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సమావేశాలకు పింగళిని ఆహ్వానించి జాతీయ జెండా రూపొందించవలసినదిగా కోరారు పింగళి కేవలము మూడు గంటల వ్యవధిలో అదే సమావేశములో ఎరుపు,తెలుపు ఆకుపచ్చ రంగులతో జెండాను రూపొందించి గాంధీజీకి అందజేశారు. ఈ జెండాకు ఏంటో ప్రజాదరణ లభించింది. ప్రజలు బ్రిటిష్ వారి నిషేధాజ్ఞలను లెక్కచేయకుండా ఈ జెండాతో సత్యాగ్రహాలు ఉద్యమాలు నిర్వహించారు. కానీ కొన్ని రోజుల తరువాత జెండా రంగుల గురించి కొంత వివాదాలు ఏర్పడ్డాయి చివరకు అందరికి ఆమోదయోగ్యముగా కాషాయము, తెలుపు ఆకుపచ్చ రంగులుప్రతిపాదించటంతో సమస్య పరిష్కారము అయింది.అప్పట్నుంచి పింగళి వెంకయ్యను "జెండా వెంకయ్య" అని పిలిచేవారు.

1902 నుండి 1922 వరకు భారత జాతీయ ఉద్యమములో వందేమాతరం, హోమ్ రూల్ ఉద్యమము, ఆంధ్రోద్యమము వంటి ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు.ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి స్వాతంత్ర ఉద్యమములో పాల్గొంటూనే జమిందార్ రాజా బహుదూర్ నాయని రంగారావు గారి కోరిక మేరకు మునగాల పరాగణాలోని నడిగూడెములో కాపురము ఉండి పత్తి వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించి కంబోడియా పత్తి అనే వంగడము మీద విశేషముగా కృషిచేశాడు ఈ కృషిని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా గుర్తించింది. అందుచేతనే ఈయనకు "పత్తి వెంకయ్య" అనే పేరు కూడా వచ్చింది. అంతేకాకుండా పింగళి ఖనిజ శాస్త్రములో కూడా అపారమైన జ్ఞానాన్ని సంపాదించి దేశములోని వివిధ ప్రాంతాలలో లభించే ఖనిజాల మీద వజ్రాల మీద విశేష పరిశోధనలు చేసాడు అందుకే ఆయనను "డైమండ్ వెంకయ్య" అని కూడా పిలుస్తారు. 1924 నుండి 44 వరకు నెల్లూరులో ఉంది అక్కడి మైకా గురించి పరిశోధనలు చేసాడు. వజ్రాల గురించి పరిశోధనలు చేస్తూ "వజ్రపు తల్లి రాయి" అనే గ్రంధాన్ని రాసి 1955లో దానిని ప్రచురించాడు స్వాతంత్రము తరువాత ఆయనను ప్రభుత్వము ఖనిజ పరిశోధక శాఖ సలహాదారుడిగా నియమించింది.1960 వరకు అంటే 82 ఏళ్ల వయస్సు వరకు ఆ పదవిలో ఉన్నాడు.

జాతీయ జెండా రూపకర్తగా, వ్యవసాయ,ఖనిజ శాస్త్రవేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పింగళి వెంకయ్యగారూ తనకంటూ ఏమి మిగుల్చుకోలేదు చివరి రోజుల్లో దుర్భర దరిద్రాన్ని అనుభవించారు వృద్దాప్యములో ఆర్ధిక భాధలు ఆయనను చుట్టుముట్టాయి మిలిటరీలో పనిచేసినందుకుగాను ప్రభుత్వమూ ఆయనకు విజయవాడలోని చిట్టినగర్ లో ఒక ఇంటి స్థలము ఇస్తే అందులో గుడిసె వేసుకొని కాలము వెళ్లబుచ్చాడు అయన ప్రతిభను నిస్వార్ధ సేవను ప్రభుత్వము గుర్తించలేదు జన గణ మన వ్రాసిన రవీంద్రనాధ్ టాగోర్ కు, వందేమాతరం వ్రాసిన బంకించంద్ర లకు వచ్చిన గుర్తింపు గౌరవము పింగళికి దక్కలేదు అయన పరిస్థితి చూచి కొంతమంది పెద్దలు సన్మానము చేసి కొంత నిధిని సమర్పించారు.కుటుంబ విషయాలకు వస్తే ఆయనకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె పెద్ద కొడుకు జర్నలిస్ట్ గా ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పని చేసాడు రెండవ కొడుకు మిలిటరీలో పనిచేసి చిన్న వయస్సులోనే చనిపోయినాడు కూతురు మాచర్లలో ఉంటారు. ఆ తరువాత అంటే సన్మానము జరిగిన ఆరు నెలలకే ,1963 జులై 4 న కన్ను ముశారు అయన చివరి కోరిక అయన మృత దేహము పై జాతీయ జెండాను కప్పి శ్మశాన వాటికలో దగ్గర్లో ఉన్న రావి చెట్టుకు ఆ జెండా కట్టవలసినది కోరాడు. హైదరాబాదు లో ట్యాంక్ బండ్ మీద ప్రభుత్వమూ అయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించి అయన దర్శన భాగ్యము ప్రజలకు కలుగజేశారు. జాతీయ పతాకం ఎగురు తున్నంత కాలము గుర్తుంచు కోవలసిన మహనీయుడు పింగళి వెంకయ్య గారు.

అంబడిపూడి శ్యామసుందర రావు