కరకరలాడే పకోడి - PETA YUGANDHAR

కరకరలాడే పకోడి

కరకరలాడే పకోడి

(పేట యుగంధర్)

ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు, పెరుగు, పచ్చళ్ళు, ఒరుగులు, ఊరగాయలు, మిఠాయిలు, పలహారాలతో నోరూరించే విందుభోజనం ఎంతో సంతృప్తినిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగని కేవలం విందు భోజనం మాత్రమే సంతృప్తిని కలిగిస్తుందని అనుకుంటే పొరపాటే! ఒక్కోసారి మనం తినే చిరుతిళ్ళు, అంతకుమించిన మధురమైన అనుభూతిని కలిగిస్తాయి.

ఆరు బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తున్నప్పుడు, సాయంత్రం స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు, ఒంటరిగా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు, నిర్విరామంగా సాగుతున్న ఆఫీసు మీటింగ్ మధ్యలోనో కరకర లాడే వేడివేడి పకోడి పొట్లం మన చేతిలో ఉంటే అంతకు మించిన ఆనందం మరేముంటుంది. కృష్ణస్వామి రాజుగారి “పకోడి పొట్లం” పుస్తకాన్ని చదివితే, అచ్చం అలాంటి అనుభూతే కలుగుతుంది. ఈ పుస్తకంలో మొత్తం అరవై కథలున్నాయి. అన్నీ చిన్న కథలే! చిరుతిళ్ళు లాంటి కథలే! చక్కని రుచి కలిగిన కథలే.

పుస్తకంలోని మొట్టమొదటి కథ “కోడికూత”. ఇతరుల మెప్పు కోసం తమ సహజత్వాన్ని వదిలి ఎగిరెగిరి పడితే అది ఎలాంటి వైపరీత్యానికి దారితీస్తుందో తెలియజేసే కథ. ఇక రెండవ కథ “ఆటోగ్రాఫ్”. బహిరంగ సభలలో తమ బలం చూపించడానికి రాజకీయ నాయకులు డబ్బు, మద్యం పంపిణీ చేస్తారని మాత్రమే మనకు తెలుసు. కానీ నేటి తరం సినిమా హీరోలు సైతం తమ సినిమా పబ్లిసిటీ కోసం ఇలాంటి పద్ధతిని అవలంబిస్తున్నారని సరదాగా చెప్పే కథ ఇది. నెమలికి పాత ఈకలు పోయి కొత్త ఈకలు వస్తుంటాయి. అలాగే సమస్యలు కూడా ఎప్పుడూ ఒకటి తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి అంటూ పాఠకులకు వ్యక్తిత్వ వికాస పాఠాన్ని “నెమలీక” అనే కథలో చెబుతారు రచయిత. సమస్య వచ్చినప్పుడు బాధపడుతూ కూర్చోకుండా సమస్య పరిష్కారాన్ని ఆలోచించాలని చెప్పన కథ “చెరో సగం”. ఈ కథలో తల్లి పాత్ర తమ పిల్లలకు వచ్చిన సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపుతుందో కథ చదివి తెలుసుకోవాల్సిందే! ప్రయత్న లోపం లేకుండా ముందుకు సాగితే ఫలితం దానంతట అదే దొరుకుతుంది అంటూ “ప్రయత్నం” అనే కథలో చెప్పారు రచయిత.

పుస్తకం అట్ట మీద కథ “పకోడీ పొట్లం” చాలా సరదాగా సాగి పాఠకులకు హాస్యాన్ని పంచుతుంది. అదృష్టం కలిసొస్తే పావలా విలువ చేసే పకోడీ పొట్లం ముప్పావు మందుబాటిల్ ను సంపాదించుకుని తీసుకొస్తుంది. అదే దురదృష్టం వెంటాడితే ముక్కు పగిలి కళ్ళు బైర్లు కమ్ముతాయి అంటూ నవ్వులు పూయించారు రచయిత. “మంత్రి లౌక్యం”, “నక్షత్రాల లెక్క”, “గ్రామాధికారి సమస్య”, “యథా రాజా - తథా ప్రజా” లాంటి కథలు పాత తరాన్ని ప్రతిబింబిస్తూ, నీతి సూత్రాలను వల్లె వేస్తే, “ఇంజక్షన్”, “విస్టింగ్ కార్డు”, “కర్రీ కార్నర్”, “హెల్మెట్”, “హోర్డింగ్”, “ఇన్ ఫార్మర్” లాంటి కథలు నేటి ఆధునిక సమాజానికి అద్దం పడతాయి. “కట్నం కావాలి”, “చదివింపులు”, “పాదయాత్ర”, “పాలిటిక్స్” లాంటి తప్పక చదవాల్సిన కథలు ఈ పుస్తకానికి మరింత వన్నె తీసుకొని వస్తాయి.

రచయిత సమయానుకూలంగా, సందర్భోచితంగా ప్రతి కథలోనూ ఉపయోగించిన సామెతలు ఈ పుస్తకాన్ని పాఠకుడికి మరింత దగ్గర చేరుస్తాయి. “ఊరంతా ఒక తోవ అయితే ఉలిపిరి కట్టేదొక తోవ”, “నేను మూడు ఆకులు తింటే, మావాడు ఆరు ఆకులు తినే రకం”, “తలంటూ ఉంటే తలనొప్పి తప్పదు”, “ఎగిరి దంచినా ఎగిరెగిరి దంచినా ఒకే పిండి”, “తిలా పాపం తలా పిడికెడు” లాంటి సామెతలు పకోడి తింటున్న పాఠకుడి నోటికి మధ్య మధ్యలో తగిలే ముంతమామిడిలా కమ్మని రుచిని కలిగించి పకోడి పోట్లాన్ని చేతిలో పట్టుకున్న పాఠకుడికి మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

సమాజంలో తనకు ఎదురైనా సంఘటనలనే కథా వస్తువుగా ఎంచుకుని రచయిత ఈ పుస్తకంలోని అధిక శాతం కథలు రాసినట్టు అనిపిస్తుంది. సమాజంతో పాటు సాహిత్యంలో కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. నవలలకు, పెద్ద కథలకు కాలం చెల్లింది. వాటి స్థానంలో చిన్న కథలు, మినీ కథలు, కార్డు కథలు, మైక్రో కథలూ వస్తున్నాయి. సాహిత్యం పై ఆసక్తి ఉన్న పాఠకుడికి పెద్ద కథలపై మక్కువ వున్నా సమయలేమి కారణంగా చిన్న కథలను చదవడానికి ఆసక్తి చూపుతున్న నేటి కాలంలో ఇలాంటి కథలు రావాల్సిన ఆవశ్యకత ఉంది. కృష్ణస్వామి రాజు గారి “ముగ్గురాళ్ళ మిట్ట”, “సల్లో సల్ల” కథల సంపుటిల తర్వాత వచ్చిన ఈ పకోడి పొట్లం” కూడా వారికి మరింత పేరు తీసుకుని రావాలని, వారు మరిన్ని మంచి కథలతో తెలుగు పాఠకుడిని రంజింపచేయాలని కోరుకుందాం.

*****స్వస్తి****

(పేట యుగంధర్ -9492571731)

 

పుస్తకాల కొరకు:

ఆర్.సి కృష్ణస్వామి రాజు, రచయిత,

ఫోన్: 9393662821

మల్లెతీగ ముద్రణలు, విజయవాడ.

ఫోన్: 9246415150