వీణ గాన గంధర్వుడు - ఈమని శంకర శాస్త్రి - ambadipudi syamasundar rao

వీణ గాన గంధర్వుడు - ఈమని శంకర శాస్త్రి

అంతర్జాతీయ ఖ్యాతి గడించిన వీణా విద్వాంసుడు ఈమని శంకర శాస్త్రిగారు తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామమంలో సెప్టెంబర్ 23, 1922లో సాంప్రదాయ సంగీత విద్వాంసుల కుటుంబములో జన్మించారు వీరి తండ్రి వైణిక భూషణ ,వీణ ఆచార్య బిరుదాంకితుడైన ఈమని అచ్యుతరామ శాస్త్రిగారు ప్రముఖ వీణ విద్వాంసుడు సంగమేశ్వర శాస్త్రి గారు (వీరి వీణా నాదము విన్న విశ్వ కవి రవీంద్ర నాధ్ ఠాగుర్ శాంతినికేతన్ రమ్మని ఆహ్వానించారు) వీణ వెంకట రమణయ్య గారు వీరి సమకాలీకులు.చిన్నప్పుడే తండ్రి దగ్గర పొందిన తర్ఫీదుతో వీణ వాయించటంలో మెళకువలు నేర్చుకున్నాడు శంకర శాస్త్రి గారు కాకినాడ పిఠాపురం మహారాజ కళాశాలలో బిఏ డిగ్రీ చేశారు 19 ఏళ్ల వయస్సులోనే అంటే కాలేజీలో చదువుకొనే రోజుల్లోనే కాకినాడ దసరా వేడుకల్లో తన వీణా కచేరీతో సంగీత విద్వాంసులను సైతము మంత్ర ముగ్దులను చేసిన విశేష ప్రతిభా శాలి శంకర శాస్త్రి గారు.ఆంధ్ర యూనివర్సిటీ లో చదువు ముగించుకున్నాక మద్రాసు లోని జెమిని స్టూడియో లో సంగీత దర్శకుడిగా చేరి దాదాపు పది సంవత్సరాలు పనిచేశాడు అక్కడ పని చేస్తున్నప్పుడు మంగళ,సన్సార్, బహుత్ దిన్ హువా, వింధ్యరాణి, నిషాన్ మరియు మిస్టర్ సంపత్ వంటి హిట్ చిత్రాలకు సంగీత దర్శకత్వము వహించి ఆ సినిమాలలో కొత్త టెక్నీక్ లు ఉపయోగించి ట్యూన్లు కట్టాడు వీణపై వేద మంత్రాలను పలికించటం, పాశ్చాత్య బాణీని సైతము తన వినూత్న శైలిలో పలికించటం శంకర శాస్త్రి గారి ప్రత్యేకత

కర్ణాటక సంగీతములో గమకలను విస్పష్టముగా నిర్వహించిన మహావిద్వాంసుడు శంకర శాస్త్రి., పంచదశ గమకములు ,దశవిధ గమకములు,గురించి భారతీయ సంగీత శాస్త్రములో విపులీకరించలేదని అలాంటి వాటిని శంకర శాస్త్రి గారు నిశితముగా అధ్యయనము చేశారని సంగీత విద్వాంసులు పేర్కొంటారు. గమకములు అనుస్వరాలు గురించి సాధికారికముగా శంకర శాస్త్రి ప్రసంగించేవారు. అయన వీణాకచేరీలో తన వీణపై మానవ కంఠాన్ని ముఖ్యముగా స్త్రీ కంఠ స్వరాన్ని పలికించేవారు. తానూ ఏ రాగాన్ని వీణపై ఆలాపిస్తున్నా శాస్త్రీయత లో ఎటువంటి భేదము లేకుండా చక్కని గమకాలతో పలికించే వాడు శంకరా భరణము, తోడిరాగాలు ఆలపించటంలో విశేష ప్రతిభ కనపరిచేవారు.తన వీణా కచేరీలద్వారా సంగీత కళాకోవిదులను మాత్రమే కాకుండా ఎటువంటి సంగీత పరిజ్ఞానము లేని సామాన్యులను కూడా ఆకర్షించేవారు . అందువల్ల అయన అభిమానుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది అయన వీణా నాదాన్ని ఆస్వాదించని సంగీతాభిమానులు అరుదేమో అని చెప్పవచ్చుఆరు వీణలు వాడుతూ అయన రూపొందించిన ఆదర్శ శిఖారోహణం అనే సంగీత రూపకం, అలాగే గాంధీజీ గురించి, సౌమ్య పురుష ,నెహ్రూజీ గురించి భారత జ్యోతి ,తుమ్మెదల రోదను వాయిద్యాల ద్వారా ఆవిష్కరించిన భ్రమర విన్యాసము సంగీత కళాఖండాలుగా శంకరశాస్త్రి గారికి మంచి కీర్తి ప్రతిష్టలను తెచ్చి పెట్టాయి. 1959 లో ఆల్ ఇండియా రేడియో మద్రాసు లో చేరి స్టేషన్ డైరెక్టర్ గా, నేషనల్ ఆర్కెస్ట్రా కంపోసర్ మరియు మ్యూజిక్ ఛీఫ్ స్థాయికి ఎదిగారు. శాస్త్రీయ సంగీత శాఖను చాలా కాలము అయన నిర్వహించారు అ సమయములో అయన హిందీ భజనలకు లలితా గీతాలకు స్వరాలు సమకూర్చారు. హిందుస్తానీ పాశ్చాత్య సంగీతాలకు ఆకళింపు చేసుకున్న మహా సంగీత జ్ఞాని శంకర శాస్త్రి గారు

శంకరశాస్త్రి గారు దేశమంతాట తన వీణ కచేరీలను ఇచ్చారు. ఈస్ట్ వెస్ట్ మ్యూజి ఫెస్టివల్, తాన్సేన్ ఫెస్టివల్,విష్ణు దిగంబర్ ఫెస్టివల్ వంటి ప్రతిష్టాత్మక సంగీత కచేరీలలో పాల్గొని కళారంగములో మంచి పేరు సంపాదించుకున్నారు ఈయన కీర్తి ప్రతిష్టలు దేశ విదేశాలలో కూడా వ్యాపించాయి. ఉస్తాద్ హలీమ్ జాఫర్ ఖాన్, పండిట్ రవి శంకర్ మరియు పండిట్ గోలా కృష్ణ వంటి వారితో కలిసి కచేరీలు చేసి ఉత్తర హిందుస్తాన్ లోని శ్రోతల అభిమానాన్ని చూరగొన్నారు.శంకరశాస్త్రి గారు అనేక సాంస్కృతిక విద్యా సంబంధమైన సంస్థలతో కలిసి పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్థాన విద్వాంసుడిగాను, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సభ్యుడిగాను , మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఎక్స్పర్ట్ కమిటీ సభ్యుడిగాను, పనిచేశారు కర్నాటిక్ మ్యూజిక్ లో విద్యార్థులకు స్కాలర్ షిప్పుల మంజూరు చేసే కమిటీకి చైర్మన్ గా కూడా ఉన్నాడు. సంగీత నాటక అకాడమీ సభ్యుడిగా ఉండి జాతీయ స్థాయి అవార్డు ల ఎంపికలో కీలక పాత్ర పోషించేవాడు.

ఈయన ప్రతిభ ను గుర్తించిన న్యూయార్క్ వాసులు వీణా విర్చువసో బిరుదును 12 అక్టోబర్ 1963లో ప్రదానము చేశారు. 1973లో శంకరశాస్త్రి గారు వీణపై శంకరాభరణము రాగాన్ని ఆలపించి ఏషియన్ రోస్ట్రామ్ అవార్డు ను గెలుచుకున్నారు. ఈ సంస్థ యునెస్కో ఆధ్వర్యములో పనిచేసేది సోవియట్ యూనియన్ లోని అలామ్ అట్టా లో జరిగిన ఈ సభకు ముప్పై దేశాల సంగీత కళాకారులు పాల్గొన్నారు.శంకరశాస్త్రిగారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వయోలిన్ విద్వాంసుడు యెహూది మెంహుయిన్ యొక్క ప్రశంసలు అందుకున్నాడు. అయన ప్రత్యేక ఆహ్వానము అందుకొని 8 జనవరి, 1974 లో ప్యారిస్ లో జరిగిన ఇంటెర్ర్నేషనల్ మ్యూజిక్ కౌన్సిల్ పాల్గొన్నాడు. అలాగే జులై 1980 లో రోమ్ లో జరిగిన పాన్ ఏసియాటిక్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ లో పాల్గొన్నాడు. ఆ విధముగా అసమాన ప్రతిభ చూపించి ఇంటా బయట గణనీయమైన గుర్తింపు పొందిన కళాకారుడు శంకరశాస్త్రి గారు.అల్ ఇండియా రేడియోకు తన వీణ కచేరీల అనేక రికార్డులను అందజేశాడు వాటిలో రెండు లాంగ్ ప్లే రికార్డులు యునెస్కో ద్వారా మొత్తము ప్రపంచానికి అందజేయ బడ్డాయి.

శంకర శాస్త్రి గారు అనేకమంది యువ కళాకారులను ప్రోత్సహించి వారిని సంగీత జగత్తుకు పరిచయము చేశారు అటువటిని వారిలో ప్రముఖ నేపధ్య గాయకుడు తెలుగు, తమిళ కన్నడ సినిమాలలో వేల పాటలు పాడిన.పి బి శ్రీబివాస్ ఒకరు.అయన శిష్యులైన చిట్టిబాబు, సరస్వతి, వై. కామశాస్త్రి సత్యమూర్తి ,రామచంద్రన్ తదితరులు దేశ విదేశాలలో ప్రోగ్రాములు ఇస్తూ గురువు గారి పేరు నిలబెడుతున్నారు వారందరు కూడా మేము శంకర శాస్త్రి గారి శిష్యులము అని గర్వంగా చెప్పుకుంటున్నారు. శంకర శాస్త్రి గారి కూతురు కళ్యాణి గారు దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలలోను విదేశాలలోని వీణ కచేరీలు చేస్తున్నారు.ఆవిధముగా తండ్రి దగ్గర నేర్చుకున్న వీణ ను కొనసాగిస్తూ అనువంశికముగా వస్తున్నా సాంప్రదాయాన్ని కాపాడుతున్నారు. శంకర శాస్త్రి గారి రెండవ కూతురు దేవి మూర్తి గారు ప్రముఖ గజల్ సింగర్ ఈవిడ కూడా దేశ విదేశాలలో తన ప్రోగ్రాములతో అభిమానులను సంపాదించుకున్న కళాకారిణి.

ఇక సన్మానాలు బిరుదుల విషయానికి వస్తే ఆయనకు "వైణిక శిఖామణి, వైణిక శిరోమణి ,వీణ గాన గంధర్వ,గాన రూప కళాసరస్వతి " వంటి బిరుదులను ఆయనకు ప్రదానము చేశారు ఆయనకు సంగీత నాటక అకాడమీ వారు 1973 లో "మహా మహోపాధ్యాయ" బిరుదును ప్రదానము చేశారు ఆ బిరుదును అందుకున్న మొదటి దక్షిణ భారతీయుడు శంకర శాస్త్రి గారే. భారత ప్రభుత్వమూ పద్మశ్రీ తో సత్కరించింది. ఛాలా యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్ లను ప్రదానము చేశాయి. భారత దేశ ఉపాధ్యక్షుడి అధ్యక్షతన ఏర్పడిన అయన సన్మాన కమిటీ ఆయనను సత్కరించి అయన సంగీతానికి చేసిన సేవలకు గుర్తింపుగా "చతుర్ దండి పండితః " అనే బిరుదును ప్రదానము చేశారు చివరగా డిశంబర్ 23,1987 లో గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరములో ఆయనకు కనకాభి షేకము చేసి ఘనముగా సన్మానించారు ఆ సభలో అయన శిష్యులు చిట్టి బాబు తదితరులు పాలొన్నారు ఆ తరువాత శంకరశాస్త్రి గారు తన వీణ కచేరీతో శ్రోతలను ఆనందింపజేశారు సన్మానము తరువాత ట్రైన్ లో మద్రాసు బయలు దేరి మద్రాసు చేరకుండానే ట్రైన్ లోనే తుది శ్వాస విడిచారు విషయము తెలుసుకున్న అనేక మంది సంగీతాభిమానులు ముఖ్యముగా గుంటూరు వాసులు తీవ్ర ఆవేదన చెందారు శంకరశాస్త్రి గారు తన జీవితాంతము సరస్వతి సేవలో తనదైన విశేష వైణిక శైలిని సమకూర్చుకున్న వైణిక విద్వాంసుడు నేడు అయన భౌతికంగా లేకపోయినప్పటికీ అయన వీణా నాదము సంగీతాభిమానులు చెవుల్లో వినబడుతూనే ఉంటుంది

మరిన్ని వ్యాసాలు

Ankitam
అంకితం
- మద్దూరి నరసింహమూర్తి
Peru lone pennidhi
పేరులోనే పెన్నిధి
- తోట సాంబశివరావు
పండరి విఠలుడు.
పండరి విఠలుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
ఇది నిజమా ???.
ఇది నిజమా ???.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
మన రామాయణాలు .
మన రామాయణాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
జైనతత్వ శాస్త్ర ం
జైనతత్వ శాస్త్ర ం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.