ఘంటసాల బలరామయ్య . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

ఘంటసాల బలరామయ్య .

ఘంటసాల బలరామయ్య .
1906, జూలై 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, నెల్లూరు మండలంలోని పొట్టెపాలెం గ్రామంలో జన్మించాడు. ఇతని మనుమడు ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు.
నాటకరంగంలో ప్రసిద్ధులైన వీరి సోదరులు రాధాకృష్ణయ్య గారి ప్రోత్సాహంతో వీరికి రంగస్థల అనుభవం కలిగింది. అన్నదమ్ములిద్దరూ 1933లో కలకత్తా వెళ్ళి చిత్రరంగంలో అడుగుపెట్టారు. వీరు శ్రీరామా ఫిల్మ్స్, కుబేరా పిక్చర్స్ అనే కంపెనీలు పెట్టి 1936లో సతీ తులసి, 1938లో మార్కండేయ, 1940లో మైరావణ చిత్రాల్ని నిర్మించారు. 1940లో ప్రతిభా పిక్చర్స్ సంస్థను నెలకొల్పి పార్వతీ కళ్యాణం సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. తరువాతి కాలంలో చిత్ర నిర్మాణం, దర్శకత్వం రెండు నిర్వహిస్తూ గరుడ గర్వభంగం (1943), సీతారామ జననం (1944), ముగ్గురు మరాఠీలు (1946), బాలరాజు (1948), శ్రీ లక్ష్మమ్మ కథ, స్వప్న సుందరి, చిన్న కోడలు (1952) మొదలైనవి తయారుచేశారు.
1944లో నిర్మించిన సీతారామ జననం చిత్రం ద్వారా వీరు అక్కినేని నాగేశ్వరరావు, అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు లను తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. 1948లో నిర్మించిన బాలరాజు సినిమా సాటిలేని విజయాన్ని వీరికి అందించింది. తోటివారిలో పోటీపడి శ్రీ లక్ష్మమ్మ కథ చిత్రాన్ని కేవలం 19 రోజులలో నిర్మించి విడుదల చేశారు. వీరు అందరూ అభివృద్ధి చెందాలని, సుఖంగా జీవించాలని కోరుకొనేవారు. ఎన్నో సామాజిక అభివృద్ధి కార్యక్రమాలలో వీరు పాల్గొన్నారు.
తెలుగు సినీ రంగానికి వెలలేని సేవలందించిన వీరు 1953, అక్టోబరు 29 అర్థరాత్రిన గుండెపోటుతో పరమపదించారు. ఆ సమయంలో ఆయన రేచుక్క చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ చిత్రాన్ని పి.పుల్లయ్య పూర్తిచేశారు.