సహజీవనం - పొన్నాడ లక్ష్మి

Sahajeevanam

ఇటీవల సహజీవనం అన్న అంశం పై తరచుగా వార్తలు వింటున్నాం.  పెద్ద పెద్ద వాణిజ్య సంస్థలలో ఆడా మగా ఉద్యోగరీత్యా కలసి పనిచెయ్యడం ఈ రోజుల్లో సర్వ సాధారణం.  ఈ పరిచయంలో ఏర్పడిన ఆకర్షణలు ప్రేమగా మారి పెళ్లి వరకూ వెళ్తే తప్పులేదు.  కాని మన సాంప్రదాయాలు, సంస్కృతిని మరచి పాశ్చాత్య నాగరికతలను అలవరచుకుంటూ స్త్రీ పురుషులు  వివాహ బంధం లేకుండా సహజీవనం సాగించడం ఎంతవరకూ సమంజసం? ఇది మన దేశ  సంస్కృతికి పూర్తిగా భిన్నం కాదా?

మన వివాహ తంతులో వేదమంత్రాలు, వధూవరులు చేసే ప్రమాణాలు అన్నిటికీ ఒక పవిత్రత, ప్రత్యేకత వున్నాయి.  వీటికి కట్టుబడి భార్యాభర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకుని సంసారం సాగిస్తుంటారు.  మన వివాహ వ్యవస్థలో గొప్పతనాన్ని విదేశీయులు కూడా మెచ్చుకుని గౌరవిస్తున్నారు. ఇంత చక్కటి భారతీయ వివాహ వ్యవస్థని కాదని స్త్రీ పురుష ఆకర్షణలకు లోబడి, కేవలం శారీరక అవసరాల నిమిత్తం ఈ ప్రక్రియకి ‘సహజీవనం’ అని పేరుపెట్టుకుని కొన్నాళ్ళు కాపురం చేస్తున్నారు. తర్వాత  వేరొకరని వివాహం చేసుకునేవారు కొందరు. కొన్నాళ్ళు కాపురం చేసి, పిల్లల్ని కని వాళ్ళని వారి దారికి వదలి వేరొకరితో  సహజీవనం లోనే  సంతానాన్ని కని తరువాత వాళ్ళని వాళ్ళసంబంధం పెట్టుకుని సహజీవనం సాగిస్తున్నారు.  

పోనీ దుర్మార్గుడైన భర్తనో, గయ్యాళి అయిన భార్యనో వదలి వేరే  బంధాలు ఏర్పరుచుకుంటే  అది వేరే విషయం. భార్యాభర్తలు మధ్య సానుకూలత లోపించినప్పుడు విడాకుల చట్టాలు ఉండనే వున్నాయి. అటువంటప్పుడు విడాకులు పుచ్చుకుని ధైర్యంగా మరో వివాహం చేసుకుంటే సబబుగా ఉంటుంది. ఏది ఏమైనా ఈ జాడ్యం మన దేశంలో ఎలా ప్రవేశించిందో తెలియదుగాని అభం శుభం తెలియని పసి పిల్లలు తమ తండ్రి ఎవరో, తల్లి ఎవరో చెప్పుకోలేక బలి అయిపోతున్నారు. పి.శాండిల్య, కాకినాడ వారి ఈ క్రింద అభిప్రాయం (నవ్య వీక్లీ 8.1.2014) తో నేను ఏకీభవిస్తున్నాను.

“సహజీవనానికి న్యాయస్థానాలు వోటు వేయడంతో  సంసార భారం మొయ్యలేని బాధ్య్తారహితులకు ఇది ఒక వరంగా మారుతుందేమో. సహజీవనం వాళ్ళ కుటుంబ వ్యవస్థ కూలిపోయి, ప్రేమకు నోచుకోని పిల్లలు అమెరికా లో మాదిరిగా సంఘ విద్రోహులుగా మారే ప్రమాదం వుంటుంది.” మన మేధావులు ఈ విషయంపై కూలంకషంగా చర్చించి, మారుతున్న ఈ ధోరణలు తగురీతిలో
అరికట్టడానికి ప్రయత్నిస్తే మన సమాజం, మన సంసృతిని కాపాడుకోవడం ఎంతైనా అవసరం.