జీవన వేదం - కందర్ప మూర్తి, అరిపిరాల దుర్గాప్రసాద్

Jeevana vedam

పట్టణంలో ప్రముఖ వేద పండితులు పద్మనాభ శాస్త్రి గారికి శుభ కార్యాలు చేయించేటప్పుడు ఆయాసం, నీర్సం, రాత్రి నిద్రలో గురక పెడుతుండటంతో " మీకు వయసు పెరిగింది కనుక ఈ వైదీకం వదిలి విశ్రాంతి తీసుకోండని" కూతురు మంజుల అనగానే "అమ్మా , తాతల నుంచి వస్తున్న పురోహితం వదలలేను. ప్రాణం ఉన్నంతవరకు శుభకార్యాలు చేయిస్తు ఉంటాను" అన్నారు.

కూతురి ఒత్తిడితో శాస్త్రి గారు జనరల్ ఫిజీషియన్ కు చూపగా ఆయన కార్డియాలజిష్టుకు రిఫర్ చేసారు.

"మీ అబ్బాయిని ఒకసారి తీసుకురండి, మాట్లాడాలి" లేబ్, ఇసిజి, ఏంజియోగ్రామ్ , స్నేనింగ్ రిపోర్టులు చూసిన కార్డియాలజిస్టు గారి మాటలు విన్న పద్మనాభ శాస్త్రి నిర్లిప్తంగా ఇలా అన్నారు.

“ఎవరిని తీసుకుని రమ్మన్నారు?.. ఆస్ట్రేలియాలో పాతుకు పోయిన పెద్ద వాడినా, ముంబైలో ఎప్పుడూ బిజీగా వుండే చిన్న వాడినా?” అని నవ్వేసి,

“పర్వాలేదు డాక్టర్, చెప్పండి. నాకు జీవితం మీద పెద్ద ఆశలు లేవు. నా ఇంటావిడ చనిపోయి నాలుగు సంవత్సరాలైంది . ప్రస్తుతం నేను ఉండేది మా అమ్మాయి ఇంట్లో “ అన్నారు.

డాక్టర్ గారికి ఇక చెప్పక తప్పలేదు." మీ ఇన్వస్టిగేషన్ రిపోర్టులను బట్టి మీకు గుండె రక్త రక్త ప్రవాహ దమనుల్లో 3 బ్లాకులు వున్నాయి. వీలైనంత తొందరలో బైపాస్ ఆపరేషన్ చెయ్యాలి " అన్నారు.

“చూడండి డాక్టర్, నాకు ఈ వయసులో ఆపరేషన్ చేయించుకునే ఉద్దేశ్యం లేదు. మందులు వల్ల తగ్గదా ? ఐనా అదేదో స్టెంట్లు ఉంటాయిట కదా, అవి వేయించండి ” అన్నారు.

“అన్ని సందర్భాల్లో స్టెంట్లు కుదరవు. మీకు గుండెలో ఉన్న బ్లాకుల దృష్ట్యా ఆపరేషన్ తప్పని సరి " అన్నారు డాక్టర్.

“నేను 64 ఏళ్ళు బతికేను. ఇంకా బతికెయ్యాలని నాకు పెద్దగా ఆశ లేదు. ఎన్నాళ్ళు నాకు ఆయుర్దాయం ఉంటె అంత కాలం బతుకుతాను. దయచేసి, నాకు మందులు మాత్రం రాయండి " అని తెగేసి చెప్పేరు శాస్త్రి గారు.

“పోనీ మీ అమ్మాయిని కానీ, అల్లుడుని కానీ... ” డాక్టర్ మాటలు పూర్తవలేదు.

“వద్దు డాక్టర్, ఇప్పటికే, మగ పిల్లల మీద ఆధార పడకుండా, ఆడపిల్ల దగ్గర ఉంటున్నాను. నా అల్లుడు పైకి చెప్పలేకపోయినా, అతని మనసులో కూడా నేను బరువుగా తోచకూడదు. ఇప్పటికీ నేను రోజువారీ పనులు చేసుకోగలుగుతున్నాను, మందులు రాసి ఇవ్వండి. వాడుకుంటు వుంటాను" అని తేలికగా చెప్పేసేరు శాస్త్రి గారు.

గుండె డాక్టర్ ఇంక చేసేది ఏమీ లేక, మందులు చీటీ రాసి తీసుకోవల్సిన జాగ్రత్తలు చెప్పేరు.

***

ఇక్కడ, వేద పండితుడు పద్మనాభ శాస్త్రి గారి గురించి ప్రస్తావించాలి. ఆజానుబాహుడు ఆరడుగుల ఎత్తెన విగ్రహం నెత్తిన జానెడు పిలక, లలాటం, భుజాలు, వక్షస్థం మీద విభూతి రేఖలు, చెవులకు బంగారు తమ్మెట్లు, భుజాలపై ఎర్రని శాలువతో గంభీరంగా కనబడతారు.కంచు కంఠంతో మంత్రాలు చదువుతుంటె కార్యం చేసేవారు, వినేవారు ఆయన వాగ్ధాటికి ప్రసన్నమయేవారు. ఆ సమయంలో ఆయనలో ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది.

శాస్త్రి గారు పట్నంలో వేదం చదువుకుని, స్మార్త క్రియలు బాగా తెలిసిన పురోహితుడు. ఎన్నో పెళ్లళ్లు, శుభకార్యాలు చేయించిన దిట్ట. శుభ కార్యాలు చేయించడంలో మంచి పేరున్న పురోహితులు. శ్రాద్ధ అపర కర్మలు చేయించే వాళ్ళని కూడా ఆయనే నియమిస్తూ వుంటారు. దశ దిన కార్యక్రమాల్లో పెద్ద ఘనాపాటిగా వేద పండితులకి దానాలు ఇప్పించడం ఆయన చెప్పినట్లే జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా టౌన్లో ఆయన వైదిక కార్యక్రమాలలో పెద్ద దిక్కు. రాజకీయంగాను, పెద్ద వ్యాపార వర్గాల్లో పేరున్న వ్యక్తి. కొందరు ఆయన్ని యజ్ఞ శాస్త్రి గారని గౌరవంగా సంభోదిస్తారు.

శాస్త్రి గారి శ్రీమతి సావిత్రమ్మ భర్తకు తగ్గ భార్యగా ఉదయాన్నే తలారా స్నానం చేసి అడ్డకచ్చ మడి చీరతో ముఖానికి పసుపు, రూపాయి కాసంత కుంకుమబొట్టు కాళ్లకు వెండి కడియాలు, నిత్య దైవ పారాయణంతో మహలక్ష్మిలా కనబడుతుంది ఆ ఇల్లాలు. ఎవరు గుమ్మం ముందు చేయి చాచినా వట్టి చేతులతో పంపని అపర అన్నపూర్ణ.

పద్మనాభ శాస్త్రి గారికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కొడుకుల్ని వైదీకంలో దింపి తన తదనంతరం పురోహితం కొడుకులకు అప్పగించాలని ఆలోచిస్తే , పెద్దవాడు తన స్నేహితులు బాగా చదివి పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని ఆసక్తి చూపలేదు. రెండవ అబ్బాయికి ఉపనయనం అవగా వేదంలో పెడదామంటె ఈరోజుల్లో బ్రాహ్మణ్యానికి విలువలేదని అన్న లాగ తనూ చదువుకుని జాబ్ చేస్తానని ఖరాకండిగా చెప్పడంతో గత్యంతరం లేక వాళ్లను ఇంగ్లీషు చదువులకు పంపక తప్పలేదు.

ఉన్న ఒక్క కూతురికి కుటుంబ ఆచారానికి విరుద్ధంగా హైస్కూలు చదువులు చెప్పించారు. వారి కుటుంబంలో ఆడపిల్ల రజస్వల అయిన తర్వాత పాఠశాలకు పంపకూడదు. సమాజంతో పాటు మనము మారాలని, ఈరోజుల్లో ఆడపిల్లలకు చదువు ప్రాముఖ్యతను గుర్తించి హైస్కూలుకు పంపేరు. టౌన్లో మున్సిపల్ ఆఫీసులో గుమస్తాగా ఉద్యోగం చేస్తున్న బంధువుల అబ్బాయి నర్సింహమూర్తితో వివాహం జరిపించారు.

పద్మనాభ శాస్త్రి గారికి తన వృత్తి ధర్మం తప్ప ఆస్థులు సంపాదనలో ఆసక్తి లేదు. చివరకు స్వంతఇల్లు కూడా సమకూర్చుకోలేకపోయారు. పద్మనాభ శాస్త్రి గారికి తమ్ముడు విశ్వనాథ శాస్త్రి ఉన్నారు. ఆయనకు అన్నగారికున్నంత పరపతి లేదు ఐనా జగమెరిగిన వ్యక్తి. చాకచక్యంతో పౌరోహితం చేస్తు , కొడుకులిద్దరికీ వేదం నేర్పించి వైదిక కార్యక్రమాల్లో నిష్టాతుల్ని చేసి ఆస్థులు బాగా సంపాదించారు..

*** ఇంటికి చేరుకున్న పద్మనాభ శాస్త్రి గారిని కూతురు మంజుల " నాన్నా , డాక్టర్ గారు ఏమన్నారు ?" ఉత్సుకతో అడిగింది.

“ఏమీ లేదమ్మా, గ్యాస్ వల్ల గుండెల్లో బరువుగా అనిపించిందిట.. అంతే” అని తేలికగా చెప్పేసేరు.

ఆ రాత్రి పడుకున్నారన్న మాటే కానీ, పద్మనాభ శాస్త్రి గారి మనసు నిండా ఆలోచనలే. అప్పుడు ఆయనకు భార్య మరణించిన సంఘటన గుర్తుకు వచ్చింది.

పద్మనాభ శాస్త్రి గారి భార్య సావిత్రమ్మ గుండె పోటుతో అనుకోకుండా 4 సంవత్సరాల క్రితం మరణించారు. భార్య మరణవార్త తట్టుకోలేకపోయారు అయన. కొడుకులిద్దరికీ కబురు పెట్టేరు. పెద్టదవాడు రాలేనని, టికెట్ దొరకడం, ఫార్మాలిటీస్ పెద్దపని అని, తాను వచ్చేవరకు వుంచవద్దని దహన కార్యక్రమాలు జరిపించెయ్యమని నిర్మొహమాటంగా చెప్పేడు.

చిన్న వాడు కూడా దాదాపు అలాగే చెప్పేడు. ఏదో ప్రాజెక్ట్ పని మీద సింగపూర్ వెళ్ళేడుట, 4 రోజులు పడుతుందని అప్పటిదాకా ఫ్రీజర్ లో శవం ఉంచితే ఉంచమని చెప్పేడు. తల్లి శవాన్ని వీడియో కాల్లో చూసేరు కొడుకులు.

అన్ని విషయాలు తెలిసిన శాస్త్రి గారికి అలా ఐస్ గడ్డల్లో తన భార్యని నాలుగు రోజులు ఉంచడం ఇష్టం లేదు. కొడుకు, అందునా పెద్దవాడు తల్లి శరీరానికి చితి పెట్టి, దహనం చేయవల్సి ఉంటుంది.. వాడు రానప్పుడు భర్త చేసినా, కూలివాడు చేసినట్లే.. అని మనసులో అనుకుని చాలా ఆవేదన చెందేరు.

తప్పని పరిస్థితుల్లో ఆయనే శవ దహనం కానిచ్చి, కొడుకుల కోసం ఎదురు చూసేరు. చిన్నవాడు 5 వ రోజుకి వచ్చేడు. “ఎలాగూ కార్యక్రమాలు బ్రాహ్మడిని పెట్టి చేయిస్తున్నావు కదా !" అన్నాడు.

“అంత తప్పదంటే, అన్న వచ్చేక, నేను అతని వెనుక వుంటాను లే “ అన్నాడు. పెద్దవాడు 7వ రోజుకి చేరుకున్నాడు.

మొదటి 10 దినాలు దశ దిన కర్మలు యదా విధిగా చేయించాలని చూసిన శాస్త్రి గారికి కొడుకులు చేసిన పనికి తలెత్తుకోలేకపోయారు. అందరికీ విధి విధానాలు చెప్పే తన భార్య విషయానికి వచ్చేసరికి, ఒక బ్రాహ్మడిని పెట్టి దశ దిన కార్యక్రమాలు చేయించవల్సి వచ్చింది

7 వరోజు వచ్చిన పెద్ద కొడుకు కూడా ఆ కార్యక్రమాలలో పాల్గొన్నా, అవేవి అతనికి నచ్చినట్లు లేవు. ఏదో తండ్రి తృప్తి కోసం అన్నట్లు తూ తూ మంత్రంగా కానిచ్చాడు. అన్నదమ్ములు ఇద్దరూ , తండ్రికి 'చాదస్తం' అని గుస గుసలు పోవడం ఆయన దృష్టికి వచ్చింది.

ఎందరి ఇళ్ళల్లోనో షోడశ దానాలు చేయించిన వ్యక్తి ఆయన. దశ దిన కర్మ ఎందుకు చేయించాలో ఆయన అనేకమందికి గరుడ పురాణం చదివి వివరించారు చాలా సార్లు. మరణించిన జీవుడు విగత శరీరం వద్దకు వచ్చి, అనేక విధాలుగా దుఃఖిస్తూ ఉంటాడు. యోగ్యడైన పెద్ద కొడుకు దహన కార్యక్రమాలు, నిత్య కర్మ అత్యంత శ్రద్ధాశక్తులతో చేయించాలి. అప్పటికి జీవుడూ ప్రేత రూపంలో ఉంటాడు. దశ దిన కర్మలు చేయడం వలన, ప్రేతరూపంలో వున్న జీవుడు భౌతిక నేత్రాలకి కనపడని ఒక చిన్న దేహరూపం సంతరించుకుంటాడు. ఆ రూపంలో వున్న జీవుడు యమలోకానికి వెళ్లే దారిలో కొన్ని కష్టాల్ని అధిగమించవలసి ఉంటుంది.

వారసులు షోడశ దానాలు చేయడం అనేది, ఆ జీవుడు వైతరణిని దాటడానికి, మరికొన్ని నరకాలు సునాయాసంగా దాటడంలో కష్టాలు తొలగడానికి, అత్యంత ఆవశ్యం. అవన్నీ ఆయన ఎంతోమందికి ఎన్ని సార్లో వివరించారు. ఇప్పుడు విచిత్రంగా ఆయన ఇంట్లో పరిస్థితి చాలా దయనీయంగా వుంది. పిల్లలు చదువుల వెంబడి విదేశాలు, దూరాలు వెళ్లిపోతే, వాళ్ల అభివృద్ధి అడ్డుకోవడం ఎందుకని, ఆయన పట్టించుకోలేదు. కానీ, పిల్లలు పూర్తిగా విదేశీ సంస్కృతికి అలవాటుపడిపోయారు. తండ్రి చేసే కర్మ కాండలు అన్నీ వృధా ఖర్చులని, దహనం చేయడం చాలని, ఈ దశ దిన కర్మలు అన్నవి మూఢనమ్మకాలు తప్ప ఏమీ కావని, వాళ్ళ నమ్మకం. తల్లి విషయంలో వాళ్ళు ప్రవర్తించిన తీరుతో ఆయన గుండె చాలా గాయపడింది. అప్పటి నుండి, ఆయన తాను ఇంక పిల్లల మీద ఆశ పెట్టుకోకూడదని నిర్ణయానికి వచ్చేసేరు. అదీ ఆయన మానసికస్థితి ఇప్పుడు. తన భార్య కి జరిగినది తెలిసిన ఆయన, తాను మరణించినప్పుడు పిల్లలు ఏదో వేరేగా ప్రవర్తిస్తారని ఊహించలేకపోతున్నారు. తాను పక్కన ఉండడం వల్ల, తన భార్య విషయంలో ఏదో కొన్ని రోజులయినా, శ్రాద్ధ కర్మలలో పిల్లలు పాల్గొన్నారు...హెచ్చరించే వాళ్ళు ఎవరూ లేకపొతే, కొడుకులు తనకి కర్మ కాండలు చేయిస్తారా ? " ఇలా ఆలోచిస్తూ పడుకున్న యజ్ఞ శర్మ గారికి ఎప్పుడో తెల్లవారుఝామున నిద్ర పట్టింది. కూతురు లేపటంతో మెలకువ వచ్చింది ఆయనకి.

" ఏమి నాన్నా, వంట్లో ఎలా వుంది . ఇవాళ., సత్యం మాస్టారి ఇంట్లో సత్యనారాయణ వ్రతం వప్పుకున్నట్లున్నారు ? " కర్తవ్యమ్ గుర్తు చేస్తున్న కూతురి ప్రశ్నకి ఇహంలోకి వచ్చేరు.

“బాగానే ఉందమ్మా, బాగా నిద్ర పట్టేసి, మెలుకువ రాలేదు. ఇదిగో.. ఇప్పుడే తెమిలి వెళ్తున్నా” అని పెరట్లోకి దంతదావనం కోసం వెళ్ళేరు ఆయన.

ఒక మూడు నెలలు గడిచేయి. గుండె డాక్టరు రాసిన మందులు వాడుతున్నారు

ఒక వారం క్రితం ఆయన పట్టణంలో వున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకి తన మిత్రుడు రామశర్మను తోడు తీసుకుని వెళ్ళేరు. అప్పుడు ఆయన ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు.

దినచర్యలో ఎక్కడ, ఏఏ శుభకార్యాల గురించి, ముఖ్య విషయాలను చిన్న డైరీలో రాసుకోవడం ఆయనకు అలవాటు

***

ఆరోజు కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన పద్మనాభ శాస్త్రి గారు నిద్రకి ఉపక్రమించారు. గుండెల్లో నొప్పి అనిపించింది. అమృతాంజనం తీసి రాసుకున్నారు. డైరీ తీసి, యేవో 4 ముక్కలు రాసి, తలగడ కింద ఉంచేరు.

ఇంతలో నెప్పి ఎక్కువ అయింది, ఒక్క సారిగా తూలి పడిపోయారు. పక్కన వున్న స్టూలు మీద ఉన్న మంచినీళ్లు తాగాలనిపించింది. లేవలేక పోతున్నారు.. కళ్ళు మూతలు పడుతున్నాయి. " అమ్మాయ్, మంజులా " అని పిలవాలనుకున్నారు. పిలవలేకపోతున్నారు. ఇంతలో స్ప్రహ కోల్పోయారు.

ఉదయాన్నే, లేచిన మంజుల తండ్రి ఇంకా లేవలేదేమిటని వచ్చి చూసింది. మంచం మీద ఉండాల్సిన తండ్రి కింద అచేతనంగా పడివున్నాడు. ఒక్కసారిగా గావుకేక పెట్టింది.ఆమె భర్త నరహింహమూర్తి వచ్చి పరిస్థితి చూసేడు. పద్మనాభశాస్త్రి గారు కాలం చేసేరని అర్ధం అయింది.

మంజుల ఏడవడం మొదలు పెట్టింది. చుట్టుపక్కల వాళ్ళు అందరు వచ్చి ”అయ్యో నిద్రలోనే పోయినట్లున్నారు అంటూ తలో రకంగా మాట్లాడు కుంటున్నారు. ఇంతలో ఎవరో అంటున్నారు.. " కొడుకులు ఇద్దరూ దగ్గర లేరు పాపం."

ఆయన మంచం మీద తలగడ కింద సగం బయటకి వచ్చిన యెర్ర డైరీ మీద అల్లుడు నరసింహమూర్తి ద్రుష్టి పడింది.

పైకి తీసి చూసేడు. అందులో ఇలా రాసి వుంది:

“నేను ఈరోజో, రేపో వెళ్ళిపోతాను. ఈ శరీరం కాల్చడానికి వంతులు వేసుకొనవసరం లేదు. దశదిన కర్మలు చేయడానికి ఇబ్బందులు పడనవసరం లేదు. షోడశ దానాలు చేయడం అవసరం లేదు. మరణించేక, ఏ పుణ్య గతులు నా ప్రేత శరీరం చేరుతుందో అనే సందేహాల కంటే, ఈ పార్థివ శరీరం ఇహ లోకంలో ఎందరో డాక్టర్లకి ఉపయోగపడితే అంతే చాలు. ఈ జన్మ ధన్యం అయినట్లే. అందుకే శోత్రియ బ్రాహ్మణుడిగా పుట్టిన నేను, నా శరీరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ వారికి దానం చేసేను. నేను మరణించినప్పుడు చేయవలసిందల్లా, వెంటనే ఆ కాలేజీ వాళ్ళకి కబురు పంపితే చాలు. వాళ్ళు వచ్చి, నా పార్థివ దేహం, లేపనాలు పూసి జాగ్రత్త పెట్టుకుంటారు. ఇహలో మనిషికి బంధాలు, భవబంధాలు ఊపిరి ఉన్నంతవరకే. తర్వాత ఎవరు ఎక్కడో ? సెలవు.. పద్మనాభ శాస్త్రి ".

ఆయన మనోవేదనతో రాసిన ఉత్తరం చూసిన మంజుల, నర్సింహ మూర్తి ఎంతో బాధపడ్డారు.

శాస్త్రి గారి నిర్ణయం క్షణాల్లో ఆ వీధి అంతటా దావానలంలా వ్యాపించింది. అందరికీ వైదిక విధి విధానాలు వివరించే యజ్ఞ శాస్త్రి గారు ఇటువంటి నిర్ణయం ఎలా తీసుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.

టౌన్లో పేరు మోసిన వేదపండితులు పద్మనాభ శాస్త్రి గారి మరణ వార్త తెలిసి ఎందరో ప్రముఖులు నివాళులు అర్పించారు. వారి పార్థివ శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానం చేసేరని వారి ఔదార్యాన్ని మెచ్చుకుంటు మర్నాడు దినపత్రికల నిండా ఫోటోలతో వార్తలు వచ్చాయి.

* * * *

గమనిక కుటుంబంలో కొడుకు పుడితే పున్నామ లోకానికి తీసుకెళతాడని ఎన్నో ఆశలతో వారి భవిష్యత్తు కోసం ఎన్నో కష్టలు పడతారు తల్లిదండ్రులు. కాని ఆ కొడుకులే వృద్ధాప్యంలో అనేక కష్టాల పాలు చేసి బతికుండగానె నరకాన్ని చూపుతున్నారు.

అత్తారింటికి వెళ్లేదే కదా అని ఆడపిల్లలను చిన్నచూపు చూస్తారు. కాని ఆ ఆడపిల్లే అత్తారింట్లో ఉన్నా కన్నవారి బాగోగులు కోరుకుంటుంది. ఆప్యాయతలు చూపుతుంది. ఆపదలో ఆదుకుని ఆదరణ చూపుతుంది.

* * *

మరిన్ని కథలు

Gulakarallu
గులకరాళ్ళు
- Lakshmi Priyanka
Mamatala kovela
మమతల కోవెల
- డా:సి.హెచ్.ప్రతాప్
O chelli Tanjamma katha
ఓ చెల్లి తంజమ్మ కథ
- హేమావతి బొబ్బు
Vinta charya
వింత చర్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Illu-Illalu
ఇల్లు-ఇల్లాలు
- డా:సి.హెచ్.ప్రతాప్
Daariu choopina mitrudu
దారి చూపిన మిత్రుడు
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Chiru kaanuka
చిరు కానుక
- Prabhavathi pusapati