చరవాణి (మొబైల్)
న్యూయార్క్ సిటీ లో ఉండే మార్టిన్ కూపర్ సుమారు రెండు కిలోగ్రాములు ఉండే చరవాణి (మొబైల్) ని అర్ధ శతాబ్దం క్రిందట, 03 ఏప్రిల్ 1973 న, ఆవిష్కరించేరు.
ఆరోజు ఆయన హిమాలయ శిఖరాన్ని అధిరోహించినంతగా ఆనంద పడి ఉంటారు.
కానీ, అదే పెద్దమనిషి ‘చరవాణిలో మాట్లాడుతూ రోడ్డు దాటుతున్నవారిని చూసి చాలా విచారించేడు’ అని ఈ మధ్యన వార్తా పత్రికలలో వ్రాసేరు.
ఆయన ఆవిష్కరణ ఎంత ఉదాత్తమైనదో ఉపయోగకరమైనదో మాటలలో వర్ణించడం కష్టం.
ఆ వస్తువు యొక్క మూల ఉపయోగం ఏమిటంటే - మానవులు టెలిఫోన్ సదుపాయానికి దూరంగా, ఇంటి బయట ఎక్కడ ఉన్నా, వారికి కావలసినవారితో మాట్లాడగలగడం. అందువలన ఆపత్కాల సమయాలలో వారు మరొకరికి ఉపయోగపడడం మరియు వారికి మరొకరి సహాయం లభించడం జరగడం సంభవమయే సులభస్కరం.
ఆ వస్తువు అంతవరకే ఉపయోగిస్తూ ఉండి ఉంటే -- ఈరోజు ఆ ఆవిష్కర్త విచారించవలసిన అగత్యం లేకపోయి ఉండేది. పైగా, ఆ ఆవిష్కరణ జరిగి ఐదు దశాబ్దాలు దాటినా, అందరికీ ఉపయోగపడడం చూసి ఎంతో ఆనందించేవాడు.
ఆయనకి ఉండవలసిన ఆ ఆనందాన్ని అందనివ్వకుండా చేసిన మనల్ని ఆయన ఎప్పటికీ క్షమించలేడు. పైగా ఆ వస్తువును ఎందుకు ఆవిష్కరించేనా అని ప్రస్తుతం మనసులో మధన పడుతూ ఉండి ఉంటాడు.
మానవుడు ఆ చరవాణి (మొబైల్) సౌలభ్యాన్ని ఎంతగా మార్చుకున్నాడంటే -
గడియారం పనివారిని గడ్డి కరిపించేడు; కెమెరా పరిశ్రమకి చరమ గీతం పాడించేడు; అదే పనిగా చరవాణి (మొబైల్) వాడుతూ నేత్ర వైద్యులని పోషిస్తున్నాడు; కళ్లద్దాల అమ్మకాలు ఆకాశాన్ని అందేటట్టుగా అనుగ్రహిస్తున్నాడు; మొబైల్ లో తాను వినేదాన్ని పైవారికి వినిపించకుండా తనకు మాత్రమే వినిపించేటట్టుగా చెవిలో యంత్రాన్ని వాడుతూ కాలక్రమేణా వినికిడి శక్తిని కోల్పోతున్నాడు; పసిపిల్లలు కూడా పాలు త్రాగాలంటే తల్లులు చరవాణి (మొబైల్) ని చూపించవలసిన అవసరాన్ని ఆవిష్కరించేడు;
-2-
చిరుప్రాయంలోనే ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా చరవాణి (మొబైల్) లో చూడరానివి చూసే అవకాశం కల్పించుకున్నాడు; ఇంట్లో పది మంది ఉన్నా, సూది పడితే వినిపించేటంత నిశ్శబ్దంతో, ఎవరికీ వారే చరవాణి (మొబైల్) చూడడంలో నిమగ్నమయేటట్టు సమకూర్చుకున్నాడు; మానవ సంబంధాలకు స్నేహ సుగంధాలకు తిలోదకాలిస్తున్నాడు; నోటితో ఉచ్చరించడానికి కూడా వెగటు కలిగించే నేరాలు పసిప్రాయం వారు కూడా చేసే స్థితికి దిగజారిపోయేడు; బాల నేరస్థుల సంఖ్య పెంచుతున్నాడు; పెద్దవారిని విచారించేటట్టుగా బాల నేరస్థులని కూడా న్యాయస్థానాలు విచారించే పరిస్థితి తెచ్చిపెట్టేడు; ఒంటరిగా వెళ్లేవారు ‘బ్లూటూత్’ అన్న సాధనంతో చరవాణి (మొబైల్) లో మాట్లాడుతూ చూసేవారికి ‘తనలో తాను మాట్లాడుకుంటున్న పిచ్చివాడు కాడు కదా’ అనే అపోహ కల్పిస్తున్నాడు.
ఇవన్నీ ఒక ఎత్తైతే --
'సెల్ఫీ' అన్న పిచ్చి ప్రబలి ప్రమాదాల బారిన పడే వారి సంఖ్య దినదినాభివృద్ధి చెందుతూంది.
సకారణం కాని స్వల్ప ఆవేశాలతో అకాల మరణాలతో పిన్న వయసు వారు వారి తల్లితండ్రులకి ఎనలేని దుఃఖాన్ని మానసిక వేదనను కలగచేస్తున్నారు.
కొండొకచో, అలాంటి దుర్మరణాలతో సంపాదనపరులైనవారి తల్లితండ్రులు నిర్భాగ్యులుగా రోడ్డున పడిపోయే దుస్థితి కలగడం చూస్తున్నాం/వింటున్నాం.
ఇలా వ్రాసుకుంటూపోతే, చరవాణి (మొబైల్) ని సదవకాశంగా వాడుకోవడానికి బదులు దురుపయోగానికి మానవుడు చేసిన/చేస్తున్న వాడకమే ఎక్కువగా గోచరిస్తుంది.
కనుక, అసాధ్యం అంటూ ఎరుగని మానవుడు ఇప్పటికైనా తన తప్పుని గ్రహించి, అంటుజాడ్యమైనటువంటి దురుపయోగాలని విసర్జించి, చరవాణి (మొబైల్) ని మూల వాడకానికి పరిమితం చేస్తే -- మనతో బాటూ ఆ ఆవిష్కర్త ఆనందంగా ప్రశాంతంగా తన శేష జీవితం గడుపుతాడు.
లేకపోతే, అనంత లోకాలకి అతని ఆత్మఘోష ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.
*****
--మద్దూరి నరసింహమూర్తి, బెంగళూరు