మార్గ దర్శకుడు శ్రీశ్రీ - రాంభట్ల పార్వతీశ్వర శర్మ

sri sri - the mentor

"నేను ఇరవయ్యో శతాబ్దపు తెలుగు కవిత్వం మీద తిరుగులేని నియంతృత్వం చెలాయించాలని నిశ్చయించాను" - ఇది శ్రీశ్రీ తన అంతరంగంలో తనకు తానుగా చేసుకున్న ప్రతిజ్ఞ.  ఇది ఓసామాన్య మానవుడు తీసుకున్న సాధారణ నిర్ణయంలా అప్పటి వారికి అనిపించొచ్చు. కానీ, తెలుగు కవిత్వాన్ని ఊగించి, శాసించి, పలవరించేలా చేసి... భావకవితా కలల్లో నిద్రాణావస్థలోవున్న కవితా లోకానికి... కలం కదలికతో నవ్యస్వభావాన్ని పరిచయం చేసి.... అనూహ్య పద ప్రయోగ పథాన్ని నిర్మించి....... నూత్న మార్గాన్ని ఆధునికులకు అందించిన ఓ యుగపురుషుడు "శ్రీరంగం శ్రీనివాసరావు" అని ఇప్పటివారందరూ విశ్వసించేలా చేసే వాక్యంగా కనిపిస్తుంది. వస్యవాక్కు అంటే ఇదేనేమో?

ఆది కవి నన్నయ-మార్గకవితకే తెలుగులో ఆద్యుడు అనుకుంటే..... అ మార్గంలో తిక్కనాది కవి పండితులు నడిచారు అనడంలో ఎలాంటి సంశయంలేదు. మార్గకవిత అంటే శాస్త్రీయత పరిపూర్ణంగా సంతరించుకొన్న కవిత అని సాధారణంగా చెప్పుకోవచ్చు. ప్రాచీన కాలంలో సంస్కృత ఆలంకారికులు, లాక్షణికులు ఎందరో ఎన్నోన్నో అంశాల పోహళింపుతో - కవిత్వాన్ని ప్రబంధంగా తీర్చిదిద్దారు. రసం, అలంకారం, గుణం, రీతి, ధ్వని, వక్రోక్తి, ఔచిత్యం... ఇలా అనేక ప్రామాణిక సంప్రదాయాలు కవిత్వంలో చొప్పించి, అందర్నీ మెప్పించే అద్భుత కృతులను పూర్వకవులు ఆవిష్కరించారు. కాని కవిత్వం అనుభూతికి- అనుభవానికి సంబంధించింది. ఏవిషయాన్నైనా ప్రామాణీకరించాలంటే కొలబద్దలు అవసరం. కవిత్వపు పోకడలు నిర్ణయించడంలో రసాది కొలమానాలు ఎంతవరకు ఉపకరిస్తాయో అంచనా వెయ్యడం సాధ్యపడకపోయినా - శాస్త్రీయత, పూర్వకవుల ప్రభావం, ప్రాచీన దృక్పథం, మొదలైనవి వెలికితీయడంలో ఆధునిక కవిత్వంలో సాంప్రదాయ కవిత్వ ధోరణుల్ని విశ్లేషించడంలో ఉపకరిస్తాయనడంలో సందేహించక్కర్లేదు.

మార్గ-దేశి శాఖలుగా విభాగించబడిన కవిత్వంలో పండితుల ఆమోదం పొందింది. మార్గకవిత అనుకుంటే..... అలాంటి మార్గ కవిత్వాన్ని ఆధునిక ధోరణిలో అడుగడుగనా..... ప్రతి పదంలో, వాక్యంలో,  భావంలో ఆవిష్కరించిన అభినవ అలంకారికుడు శ్రీశ్రీ. ఆధునిక యుగంలో కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కవిత్వం అంటే ఇదీ అనిపించేలా సాంప్రదాయక మార్గాన్ని సుస్థిరం చేస్తున్న రోజుల్లో...... కవితా... ఓ కవితా!  నా యువకాశల..... నవపేశల సుమగీతావరణంలో..... అంటూ ఓ దీర్ఘ కవితను వినిపించి... విశ్వనాథులవంటి  సాహితీ ఉద్దండుణ్ణి  కూడా ముగ్ధుణ్ణి చేసిన "కళారవి, పవి కవి" మన శ్రీరంగం శ్రీనివాసరావు.

"కవిత్వం వాడుక భాషలోనే ఉండాలి అన్న నిర్ణయానికి శ్రీశ్రీ రాకముందు భావకవితా ధోరణుల్ని అవలంబించిన కృష్ణశాస్త్రి, విశ్వనాథుల ప్రభావం నామీద  అవ్యాహతంగా ప్రసరించింది". అన్న శ్రీశ్రీ అనంత వాక్యాలు - ఆయన ప్రారంభ కవిత్వంలో.... ఉత్కృష్ట భావ, భాషా ప్రావీణతకు మూలస్తంభాలైన వనరులను మనం ఊహించేలా చేస్తున్నాయి. శ్రీశ్రీ జ్ఞానభాండాగారాలైన ఆయన గ్రంథాల్ని తరచి చూస్తే, బాల్యంలో చోటు చేసుకున్న సాహితీ వాతావరణం, అబ్బూరి రామకృష్ణారావుగారి మార్గదర్శకత్వం, యవ్వనంలో చదివిన మార్క్సిస్ట్ సారస్వతం ఇలాంటివి సమాలోచించవలసిన విషయాలు. శ్రీశ్రీ  పాండిత్య పరిగణనను, భాషాప్రాగల్భ్యాన్ని విశ్లేషించాలంటే.... ఆయన గ్రంథాల్లో, కవితల్లో, అచ్చమైన మచ్చు తునకలు అనేకం మనకు తారసపడతాయి.

మొట్టమొదటగా చెప్పుకోవలసిన అంశం 'యతి'.  స్వర, వ్యంజన, ఉభయయతులు ఛందశ్శాస్త్రంలో చెప్పారు. వీటిని పట్టిచూస్తే గానీ-  కవితల్లో యతులు పాటించాడని తెలియని విధంగా సహజ సుందరంగా - యతులు శ్రీశ్రీ కవిత్వంలో  కనిపిస్తాయి. దీనికి ఉదాహరణగా.....

పొలాలనన్నీ- హలాల దున్నీ
ఇలాతలంలో-హేమం పిండగ
జగానికంతా-సౌఖ్యం నిండగ
విరామ మెరుగక- పరిశ్రమించే
బలంధరిత్రికి-బలికావించే
కర్షక వీరుల కాయం నిండా
కాలువగట్టే - ఘర్మజలానికి
ఘర్మజలానికి-ధర్మజలానికి
ఘర్మజలానికి ఖరీదులేదోయ్... (ప్రతిజ్ఞ)

ఇలా ఎక్కడ చూసినా సాధారణ యతో, ప్రాసయతో వాడడం శ్రీశ్రీ ప్రత్యేకత. అలాగే నన్నయలోని అక్షరరమ్యత తాను కూడా అంది పుచ్చుకున్నాడా అనిపించేటట్లు...

"శ్రమ నిష్ఫలమై.... జనినిష్టురమై
అనాథలంతా... అశాంతులంతా....
దీర్ఘశృతిలో...తీవ్రధన్వితో.....
విప్లవశంఖం వినిపిస్తారోయ్.....”

ఇలా ఎన్నెన్నో కవితల్లో శ్రీశ్రీ పదంమీద పట్టును ప్రదర్శించారు. ఇక వ్యాకరణ విషయానికొస్తే... జగన్నాథుని రథచక్రాల్లో "దీర్ణ్యమాన", మహాప్రస్థానంలో 'వార్షుకాభ్రములు', రోచిర్నివహం' వంటివి శ్రీశ్రీ వేదాంగ పరిజ్ఞానాన్ని వివరిస్తాయి. ఇంకా "వలపు కడలి - కడలి వలపు" వంటి ప్రయోగాలు ఆంధ్రనామ సంగ్రహం లాంటి తెలుగు నిఘంటు జ్ఞానాన్ని వ్యక్తం చేస్తుంటే... "త్రాచుల వలెను... రేచుల వలెను - ధనుంజయునిలా సాగండి" అనడంలో అమరకోశాధ్యయనం, ప్రాచీన సంస్కృత గ్రంథ పరిశీలన అవగతమౌతాయి.

"చదవడం ప్రారంభించినప్పటి నుంచి ఏ పుస్తకం దొరికినా దాన్ని పూర్తి చేసేదాకా నాకు తోచేది కాదు" అని చాలా చిన్న వయసులోనే అధ్యయనం అంటే ఆసక్తి, జ్ఞానార్జన పట్ల అనురక్తి కలిగాయని శ్రీశ్రీయే చెప్పుకున్నారు.

ఇంత వ్యవహారిక భాషలో అందర్నీ మంత్ర ముగ్ధుల్ని చేసే పదజాలంతో ఆధునిక వచన సాహిత్యాన్ని సృష్టించిన శ్రీశ్రీ ప్రాkమిక రచనలను పరిశీలిస్తే మనమంతా ఆశ్చర్యపోక తప్పదు. పాఠశాల విద్య పూర్తి కాక ముందు శ్రీశ్రీ తాను చదివిన ప్రాచీన గ్రంథాలను అనుసరిస్తూ పుస్తక రచన మొదలు పెట్టాడు.

ఓ సారి ఒక పొట్టి పాదం, ఒక పొడుగు పాదం తర్వాత మరో పొట్టి పాదం, పొడుగు పాదం రాసి దాన్ని కంద పద్యమని కందం రాసిన వాడే కవి అన్నట్టు తాను కవినైపోయానని మురిసిపోయాడట. శ్రీశ్రీ తండ్రి శ్రీశ్రీ కవితాసక్తిని గుర్తించి, కవితాశక్తి అబివృద్ధి చెందేలా లింగమగుంట తిమ్మకవి రాసిన "సులక్షణసారం" అనే లక్షణ గ్రంథాన్ని కొనిచ్చి, ఎన్నో ఛందో రహస్యాలను బోధించారట. అందుకే "రకరకాల ఛందస్సులతో సాముగరిడీలు చేస్తూ అదే కవిత్వం అనుకున్నాను" అని ఒకానొక సందర్భంలో శ్రీశ్రీ పేర్కొన్నారు.

ఇక అలంకారప్రియత్వం పోతనకే పరిమితం చెయ్యకుండా శ్రీశ్రీకి కూడా ఆపాదించుకోవచ్చు.

"సింధూరం రక్త చందనం -బంధూకం సంధ్యారాగం
పులిచంపిన లేడి నెత్తురు- ఎగరేసిన ఎర్రని జెండా" లాంటి కవితా ఖండికల్లోనూ.......

"గగనమంతా నిండి, పొగలాగుకమ్మి
బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టునన్ను"  అన్న గీతంలోనూ అర్థాలంకార పోషణ శ్రీశ్రీ దండిగా చేసాడు.

శ్రీశ్రీ గారి ఆలంకారిక ప్రయోగాలను ప్రశంసిస్తూ.... "కరి కళేబరములా కదలదు కొండ" లాంటి ఉపమానాలు ఒక్క సంస్కృత కవులకే సాధ్యమని సాక్షాత్ విశ్వనాథ వారే మెచ్చుకున్నారంటే ఆధునిక ఆలంకారికుడు శ్రీశ్రీ అనడం అతిశయోక్తి కాదేమో!! శబ్దాలంకారాలు కూడా శ్రీశ్రీ రచనల్లో మెండు. హింస నచణ- ధ్వంస రచన, ధ్వంస నచణ హింస రచన , అలాగే యువశక్తీ! నవయుగ శక్తీ! ఘనకీర్తి! జీవనదీప్తి మొదలైనవి పేర్కొనదగినవి.

ముందు వైదికమతంలో వేదసారాన్ని ఒంటపట్టించుకున్న పాల్కురికి సోమనాథుడు తర్వాత వీరశైవ మతానుసారిగా మారినా... తాను రచించిన గ్రంథాల్లో ఎన్నో వేదోక్త విషయాలను వివరించాడు. ముందు ఆర్జించిన సమస్త వేదవాజ్ఞ్మయ వ్యుత్పత్తి సోమనాథుని గ్రంథాల్లో ప్రతిబింబిస్తుంది.

అలాగే బాల్య-యవ్వన దశలో శ్రీశ్రీ సాంప్రదాయక కవిత్వాధ్యయనం చేసి తర్వాత అభ్యుదయ, విప్లవ మార్గాల్లో పయనించినా తన కలం నుంచి జాలువారిన ప్రతీ కవితా ఖండికలోనూ... ఆ ప్రభావాన్ని అనువర్తింపజేసిన మార్గకవితా ప్రవర్తకుడు శ్రీశ్రీ..

అందుకే అలనాటి పాల్కురికి సోమన్నకు  సాటి మన శ్రీరంగం శ్రీనన్న. అల్పాక్షరముల ననల్పార్థ రచన అన్నట్టు కుక్క పిల్లా... అగ్గిపుల్లా... అంటూ శ్రీశ్రీ చక్కని తత్త్వాన్ని వివరించాడు. అందుకే ప్రపంచాన్ని పద్మవ్యూహంతోనూ ...కవిత్వాన్ని తీరని దాహంతోనూ పోల్చాడు. శ్రీశ్రీ ఉగాదిగీతం అనే కవితలో...

'ఎక్కడున్నారు వీళ్ళు
ఇందుగలరందులేరని
సందేహం అక్కరలేని
సర్వాంతర్యాములు వీళ్ళు' అని పోతన గారి ప్రహ్లాద చరిత్రలో ప్రశస్త పద్యాన్ని అనుసరించినట్టు కనిపిస్తుంది.

శ్రీశ్రీ "ప్రభవ" -  పద్య సాహిత్యమే, స్వర్గదేవతలు' అన్న పేరుతో మరో పద్య రచన చేశాడు. అయితే అందులో ఎక్కడా కంద పద్యం రాయలేదు. అనంతంలో శ్రీశ్రీ "కంద పద్యానికి లాక్షణికులు పెట్టిన షరతులివి" అని కంద పద్య లక్షణాలను విస్తృతంగా చర్చించాడు. యతి ప్రాసలతో పాటూ గణనియమం గురించీ చెప్పాడు.

"జగణంతో జగడం కో
రగా దగదు గాని......" అన్నట్టు దీర్ఘాక్షరంతో ప్రారంభమైన కందంలో నాలుగింట జగణం వాడకూడదని, లక్షణం చెబుతూనే -

"వాజమ్మ వంటి కుకవిని
సజీవ దహనం పొనర్చి....." అంటూ రాయకూడదని లక్షణకారుడిలా రాసి మరీ ఉదాహరణలు చూపించాడు. ఈ శతకంలో శ్రీశ్రీ కందంలో చాలా ప్రయోగాలు చేశాడు.

"అందంగా , మధురస ని
ష్యందంగా, పఠితృ హృదయ సంస్పందంగా
కందాలొక వంద రచిం
చిందికి మనసయ్యె నాకు సిరిసిరి మువ్వా!

ఛవి మద్రసవద్గతుల,  చ
దివెడు నుదారులకు హృదయతృష్ణ శమింపన్
నవ నవముగ శతకము వ్రా
సి  వేయమని మాయ మాయె సిరిసిరి మువ్వా! -

అని సిరిసిరిమువ్వా శతకంలో లక్షణబద్ధంగా కందాలు రాస్తూ వ్యావహారిక భాష వాడినా అక్కడక్కడా గ్రాంథిక భాషలో పద్యాలు రాశాడు. శ్రీశ్రీ గారిపై ప్రాచీన కావ్య  ప్రభావం గురించి ఆయనే ఒక సందర్భంలో చెప్పుకున్నారు.జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారు శ్రీశ్రీ గారిని కలిసిన సందర్భంలో ఈ అమూల్య విషయం తెలిసింది. 1976 జూన్ 12,13 తేదిల్లో కడప జిల్లా రచయితల ౩ వ మహాసభలు జరిగినప్పుడు శ్రీశ్రీ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాక - శ్రీశ్రీ మనుచరిత్ర, వసుచరిత్రల నుండి కొన్ని పద్యాలు ఉటంకించారట.

అప్పుడు "విప్లవకవిగా లోకం మిమ్మల్ని కీర్తిస్తుంటే మీరు ప్రబంధకవులను ప్రశంసిస్తున్నారే" అని హనుమచ్ఛాస్త్రి ఆశ్చర్యం వ్యక్తంచేస్తే ...... ఆ కావ్యాలన్నీ చదివాను కాబట్టి ఈనాడు కవితలు రాస్తున్నాను. ప్రాచీన కావ్యాల అధ్యయనం, మన భాషా సంపదకు మూలకందం. తప్పక అందరూ చదివి తీరాలి" అని ప్రత్యుత్తరం ఇచ్చారట. నిజంగా ఇది అమోఘ విషయం.

ఇలా "ఈ శతాబ్దం నాది" అని నవ్యసంప్రదాయవాదిగా శ్రీశ్రీ సృజించిన మార్గకవిత ఎందరినో రంజింపజేసింది. అలరిస్తోంది కూడా. మార్గకవిత్వాన్ని దర్శించి, తాను కూడా మార్గ కవితకు దర్శకత్వం వహించిన శ్రీశ్రీ ప్రాచీన సాహిత్య పాండిత్యం ఎంతను చెప్పగలం? అనంతం!!!

మరిన్ని వ్యాసాలు

కేదారనాధ్ .
కేదారనాధ్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
బదరీనాధ్ .
బదరీనాధ్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.