స్వతంత్ర భారతం లో స్వేచ్ఛాజీవనం ఆస్వాదిస్తున్న నేటితరానికి ఒకనాటి భరతమాత కన్నీటి గాథలు తెలియవు .స్వతంత్రం కోసం తపించి తపించి తమ జీవితాలను వుద్యమాలలో కారాగారాలలో గడిపిన యెందరో యెందరో మహనీయులు కొందరు స్వతంత్రభారతాన్ని చూసారు మరికొందరు చూడలేకపోయారు .ముఖ్యం గా తెలుగుమహిళలు ఆనాటి వుద్యమాలల్లో. చురుకుగా పాల్గొన్నారు సమాజాన్ని వుత్తేజితులని చేసారు . శ్రీమతి జయంతి సూరమ్మ గారు తనజీవన పయనం లో అందరికీ భావస్ఫూర్తిని కలిగించారు .
సూరమ్మ గారు శ్రీకాకుళం జిల్లా కపట అగ్రహారం లో 1887 లో జన్మించారు .శ్రీ కొండూరు సీతారామయ్య ,శ్రీమతి నరసమ్మ గార్ల అయిదవ సంతానం .ఆ రోజుల్లో బాల్యవివాహాలు చాలా సాధారణం . సూరమ్మ గారి 8 వ యేట ఆమె వివాహం బరంపురం వాస్తవ్యువులు జయంతి వెంకటనారాయణ గారి తో జరిగింది .రెండు కుటుంబాలు శ్రోత్రీయ బ్రాహ్మణకుటుంబాలు .19 సంవత్సరాల వయసులో వెంకటనారాయణ గారు బ్రహ్మసమాజ ప్రభావితులయ్యారు ..పెద్దవాళ్లు అంగీకరించలేదు .అయినా ఆ దంపతులు బ్రహ్మమతం స్వీకరించారు .
రాజమండ్రి లో శ్రీ కందుకూరివీరేశలింగం పంతులు గారు నడుపుతున్న వితంతు శరణాలయం లో వెంకటనారాయణ గారు ఉపాధ్యాయునిగా చేరారు .అక్కడ శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడుగారి పరిచయం వారికి కలిగింది .కొంతకాలం ఆ దంపతులు రాజమండ్రి లో తమ సేవలు చేసారు .
తరువాత ఆ దంపతులు. కలకత్తా వెళ్లారు ..అక్కడ పండిత శివనాథ శాస్త్రి గారి సాధన ఆశ్రమం లో శిక్షణ పొందారు .కాకినాడ వచ్చారు .పిఠాపురం రాజావారు స్థాపించిన ,బ్రహ్మమందిరం ,అనాథశరణాలయం నిర్వహించే కార్యక్రమాల్లో తమవంతు సాయం అందించారు ..ప్రచార కార్యక్రమాల్లో ప్రజలను ప్రభావితం చేసారు ..బ్రహ్మమత ప్రచారములయ్యారు .మద్రాసు వెళ్లారు .
మద్రాసులో రాత్రిపాఠశాలలు నిర్వహించారు .రాజా రామ్మోహనరాయ్ సేవాసంస్థ ద్వారా ఆశ్రమం నడిపారు .అక్కడ డాక్టర్ శ్రీమతి. ముత్తులక్ష్మి గారి తో సూరమ్మ గారికి పరిచయం యేర్పడింది.స్వతంత్రభారత విమోచన భావాలకు అంకురార్పణ జరిగింది .1917 లో జరిగిన. కాంగ్రెస్ సభలకు సూరమ్మగారు వెళ్లారు ..ఒకవైపు బ్రహ్మసమాజ సమావేశాలు ,మరోవైపు జాతీయ వుద్యమ సభలూ సమావేశాలకుసూరమ్మగారు తప్పనిసరిగా హాజరు అయ్యేవారు ..అందరిలో భావ చైతన్యం కలిగించడం ,చుట్టుప్రక్కలవారి కష్టసుఖాలను వినడం పరిష్కారాలు వెదకడం సూరమ్మగారి దినచర్య అయ్యింది
పిల్లల చదువులకోసం సూరమ్మ గారు బరంపురం చేరారు .గాంధీగారు బరంపురం లో సభ నిర్వహించారు ..వెంకటనారాయణ సూరమ్మ దంపతులు ఖద్దరు వస్త్రాలు ధరించి జోలెపట్టుకుని విరాళాలు సేకరించారు .అది చూసిన గాంధీగారు వారి వివరాలు సేకరించారు .ఆ దంపతులు వుద్యమాలలో వుత్తేజం నింపుతూ ,బహిరంగ సభలూ సమావేశాలు నిర్వహిస్తూ ,హిందీ ,తెలుగు ,ఒరియా భాషలో దేశభక్తి గేయాలు ఆలపిస్తూ వాడవాడలా తిరిగేవారు .
విదేశీ వస్త్ర బహిష్కరణ ,విదేశీ చదువుల బహిష్కరణ మొదలయ్యింది .సూరమ్మగారు తమ పిల్లలకు హిందీ నేర్పించారు .నూలువడకడం నేర్పారు .కల్లు మానమని వాడవాడలా ప్రచారం చేసారు .దేశ సేవలో ప్రధాన భూమిక నిర్వహించారు .
1930 జూన్ నెలలో ఉప్పుసత్యాగ్రహావుద్యమం లో అరెస్టయ్యారు .రాయవెల్లూరు కారాగారం లో కఠిన శిక్ష అనుభవించారు .1930 డిసెంబర్ శిక్ష ముగిసి వచ్చినా జాతీయ వుద్యమాలు మానలేదు .1932 లో మళ్లీ అరెస్ట్ అయ్యారు ..ఒకసంవత్సరం కఠిన శిక్ష పడింది .జొన్నరొట్టెలు ,అంబలి వాళ్ల భోజనం .ఉప్పులేని భోజనం .కన్ననూరు కారాగారం లో అక్కడి భాష కూడా తెలియదు .అయినా మహిళలందరూ ఒకకట్టుగా వుండి ,కష్టాలు అనుభవించి శిక్ష భరించి బయటకు వచ్చారు ..కాశీనాథుని నాగేశ్వర రావు పంతులుగారు విడుదల అయిన మహిళలు అందరికీ మద్రాస్ లో తన యింటికి తీసుకెళ్లి ఆతిఫ్హ్యమిచ్చారు .
సూరమ్మగారు బరంపురం చేరుకున్నారు .
సూరమ్మగారు చదువుకోలేకపోయినా తన పిల్లలను బాగాచదివించారు .సభ్యత ,సంస్కారం ,క్రమశిక్షణలు నేర్పారు .పిల్లలు కూడా దేశసేవలో తరించారు ..
స్వతంత్రభారతావనిని సూరమ్మగారు అనుభవించారు .స్వేచ్ఛావాయువులు పీల్చారు.1969 ఫిబ్రవరి 10 తేదీ పరమపదించారు .ఆవిడకుమారుడు శ్రీ ధర్మతేజ గారు సూరమ్మగారి పేరు మీద ఆంధ్రమహిళా సభకు లక్ష రూపాయలు విరాళం యిచ్చారు ..ఆంధ్రమహిళా సభలో ఒక వార్డుకు “జయంతి. సూరమ్మగారి వార్డ్ “గా పేరు పెట్టారు ..ఆవిడ చిరునవ్వుల ఫోటో అక్కడ మనకు కనిపిస్తుంది .
ఈ తరం యువత ఆ తరం వారి జీవితాలను తెలుసుకుంటే మన గతమెంత గణనీయమైనదో విశదమవుతుంది .