డిజిటల్ యుగం మన జీవితాలను మార్చేసింది. బ్యాంకింగ్, గుర్తింపులు, సంభాషణలు అన్నీ స్క్రీన్లకు పరిమితమయ్యాయి. ఈ సాంకేతిక మార్పు మనకు సౌకర్యాన్ని ఇచ్చినప్పటికీ, అదే వేగంతో కొత్త రకమైన నేరాలకు తలుపు తెరిచింది. ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్న అత్యంత నూతన మరియు క్రూరమైన మోసం “డిజిటల్ అరెస్ట్”. ప్రజలను భయపెట్టి, బెదిరించి, మోసపెట్టే ఈ పద్ధతి పూర్తిగా కృత్రిమం. నిజానికి ‘డిజిటల్ అరెస్ట్’ అనే పదం భారతీయ చట్టంలో ఎక్కడా లేదు, అరెస్ట్ అనేది ఎల్లప్పుడూ భౌతిక ప్రక్రియ, చట్టపరమైన అధికారులతో, నోటీసులతో మాత్రమే జరుగుతుంది. కానీ సైబర్ నేరగాళ్లు ఈ బూటకపు పదాన్ని రూపొందించి, భయాన్ని భారీ లాభాలుగా మార్చుకుంటున్నారు.
ఈ మోసం మొదలయ్యేది ఒక సాధారణ ఫోన్ కాల్‌తో. కాల్ ఎత్తగానే గంభీర స్వరం వినిపిస్తుంది: “మేము సీబీఐ/సైబర్ క్రైమ్/ఎన్‌సీబీ/ఆర్బీఐ నుండి మాట్లాడుతున్నాం”. వారు బాధితునిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. “మీ ఆధార్ నంబర్ మనీలాండరింగ్‌లో ఉపయోగించబడింది”, “మీపై మాదకద్రవ్యాల రవాణాలో భాగస్వామ్యం ఆరోపణ ఉంది”, “మీ ఫోన్ నుంచి అనైతిక సైట్లకు యాక్సెస్ జరిగింది” వంటి పదాలు ఏ సాధారణ వ్యక్తినైనా ఒక్క క్షణంలో లోకంలేని స్థితికి నెడతాయి. భయమే ఇక్కడ ప్రధాన ఆయుధం.
తర్వాత వీడియో కాల్‌కు మార్చి, దుస్తులు వేసుకున్న నకిలీ అధికారులను చూపించి నమ్మబలుకుతారు. నకిలీ ఎఫ్‌ఐఆర్‌లు, ప్రభుత్వ గుర్తింపు పత్రాలు, డిజిటల్ సీల్‌లు — ఇవన్నీ ప్రకాషవంతమైన దృశ్య నాటకం లా ముందుంచి, “మీపై విచారణ జరుగుతున్నందున, మీరు మా కస్టడీలో ఉన్నారు. దీనినే డిజిటల్ అరెస్ట్ అంటారు” అని చెప్పడం ద్వారా మానసిక ఒత్తిడిని చివరి అంచుకు తీసుకువెళ్తారు. ఆ తరువాత బాధితుని ఫోన్ లేదా కంప్యూటర్లో AnyDesk వంటి రిమోట్ యాక్సెస్ యాప్ ఇన్‌స్టాల్ చేయమని ఒత్తిడి చేస్తారు. “దర్యాప్తు కోసం మీ పరికరాలను పరిశీలించాలి” అనే పేరు మీద, వారు బాధితుడి బ్యాంక్ ఖాతాలు, UPI యాప్‌లు, పాస్‌వర్డ్‌లు అన్నీ పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. చివరకు “ఆరోపణ నుంచి బయటపడాలంటే వెంటనే జరిమానా చెల్లించాలి” అని డిమాండ్ చేస్తారు. గంటల వ్యవధిలో వందలలక్షలు, కోట్ల రూపాయలు అజ్ఞాత ఖాతాల్లోకి బదిలీ అవుతాయి.
ఇందులో అత్యంత ఆందోళనకరమైన అంశం ఏమిటంటే, ఈ మోసానికి బలవుతున్నవారు ఎక్కువగా చదువుకున్న, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు. ఐటీ ఉద్యోగులు, ఇంజనీర్లు, వైద్యులు, ప్రొఫెషనల్స్ — వీరే ఎక్కువగా లక్ష్యంగా మారుతున్నారు. సాంకేతికంగా తెలివైన వారే అయినప్పటికీ, తీవ్రమైన నేరారోపణలు, పరువు పోతుందనే భయం, కుటుంబంపై ప్రభావం వంటి భావోద్వేగ ఒత్తిడి మనసును క్షణాల్లో నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది.
ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్న పని కాదు. దర్యాప్తులు సూచిస్తున్నట్లు, ఈ నేర జాలం భారతదేశం బయట, ముఖ్యంగా చైనా మరియు ఆగ్నేయాసియా దేశాల్లోని అక్రమ కాల్ సెంటర్ల నుండి నడపబడుతోంది. అక్కడ శిక్షణ పొందిన మోసగాళ్లు స్క్రిప్టుల ఆధారంగా మాట్లాడుతారు. ప్రతి పరిస్థితికి ముందే సిద్ధమైన సమాధానాలు, మనోభావాలను అర్థం చేసుకుని వాడే పద్దతులు, మనిషి నిర్ణయ శక్తిని నియంత్రించే మానసిక నైపుణ్యం — ఇవన్నీ దీనిని సాధారణ నేరం నుండి ఒక ప్రణాళికాబద్ధమైన మోస పరిశ్రమగా మార్చేశాయి.
ఈ నేపథ్యంలో ప్రజలు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఒక్కటే: చట్టబద్ధ సంస్థలు ఎప్పుడూ ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేయవు. ఎవరూ వాట్సాప్ ద్వారా ఎఫ్‌ఐఆర్ పంపరు. ఎవరూ డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయమని అడగరు. అనుమానాస్పద కాల్ వచ్చిన వెంటనే కాల్ కట్ చేయడం, వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చేయకుండా జాగ్రత్తగా ఉండడం, కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం — ఇవే మొదటి రక్షణ. మరియు మోసానికి గురైందని గ్రహించిన వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలి.
డిజిటల్ శకం మనకు వేగం, సౌకర్యం, అవకాశాలను ఇచ్చింది. కానీ భయం మన మీద ఆధిపత్యం సాధిస్తే, అదే సాంకేతికత మనను బానిసలుగా మార్చేస్తుంది. అందుకే అప్రమత్తతే నిజమైన రక్షణ. జాగ్రత్తగా ఆలోచించే మనసే ఈ నూతన మోసాలపై మనకు ఉన్న అత్యంత ప్రభావవంతమైన ఆయుధం.
(ఈ వ్యాసం నాకు వున్న పరిమిత సైబర్ పరిజ్ఞానం మరియు వివిధ పత్రికలలో లభించిన సమాచారం అనుసరించి రాయడం జరిగింది- రచయిత)

