పుస్తక సమీక్ష: వేదశాస్త్రాల సంక్షిప్త పరిచయం - సిరాశ్రీ

vedasaastrala samkshipta parichayam

పుస్తకం: వేదశాస్త్రాల సంక్షిప్త పరిచయం
రచన: డా. రేమెళ్ళ అవధానులు
వెల: రూ 10/-
ప్రతులకు: శ్రీ వేద భారతి, హెచ్ బ్లాక్, మధురానగర్, హైద్రాబాద్- 38, (040-23812577, 9849459316)

వేదాలు ఎన్ని అంటే "నాలుగు" అని చెప్పి ఊరుకోవడం, మహా అయితే వాటి పేర్లు చెప్పడం తప్ప నేటి తరంలో చాలామందికి వేదాల పట్ల పెద్దగా అవగాహనలేనివాళ్లే ఉన్నారు. అలా అని వేదాల గురించి తెలుసుకునే ఆసక్తి లేదని కాదు...ఆసక్తిగా చెప్పే వాళ్లు లేక. ఒకవేళ చెప్పినా చెప్పే విషయంలో క్లుప్తత లోపించడం, పుస్తకాలుగా ఉన్నా వేల పేజీలతో ఉండడం మొదలైన కారణాలు వేద విజ్ఞానం పట్ల అవగాహన పెంచుకోవాలనుకునే వారికి అవరోధాలుగా ఉంటున్నాయి.

వేద విజ్ఞానం పట్ల జిజ్ఞాస ఉన్నవారు వేలల్లో ఉన్నారు. అందుకు నిదర్శనం ఈ "వేదశాస్త్రాల సంక్షిప్త పరిచయం" అనే పుస్తకం పునర్ముద్రణలు జరుపుకుంటూ రెండేళ్లల్లో 15000 కాపీలుగా మార్కెట్లోకి రావడం. ఇది కేవలం 70 పేజీల్లో ప్రశ్న జవాబుల రూపంలో ఉన్న చిన్న పొత్తం.

వేదం అంటే ఏమిటి? దానికి ఆగమం, నిగమం, ఆమ్నాయం, స్వాధ్యాయం మొదలైన పేర్లు ఎలా వచ్చాయి?

ఏ వేదాన్ని ఎవరు ప్రచారం చేసారు?

మంత్రం అంటే ఏమిటి?

బీజాక్షరం అంటే ఏమిటి?

గాయత్రి మంత్రం అర్థం ఏమిటి?

బ్రాహ్మణాలు, అరణ్యకాలు అంటే ఏమిటి?

ఇంగ్లీషులో "స్టీం" (ఆవిరి) అనే పదం సంస్కృతం లో అదే అర్థంలో ఎక్కడ ఉంది?

అమీబా గురించి అనమీవా పేరుతో కృష్ణ యజుర్వేదంలో అక్కడ చెప్పబడింది?

సిరంజ్ (సూది మందు) గురించి ఏ వేదంలో వివరించబడి ఉంది?

హైడ్రోజన్ కు చెందిన ఐసోటొప్స్ ను సూచించే మంత్రం ఏది?

బృహత్ సమ్హితలో భూకంపాలను ముందుగానే గుర్తించే శాస్త్రం ఎలా ఉంది? ..... మొదలైన ఎన్నో విశెషాలపై ఆసక్తి కలిగించి, తత్ సంబంధమైన ఇతర పుస్తకాలు చదివించేలా చేసే శక్తి ఈ చిన్న పుస్తకంలో ఉంది.

ఈ పుస్తకం వేదాల రుచి చూపించి ఊరిస్తుంది. కనీసం జెనెరల్ నాలెడ్జ్ పేరుతోనైనా ఈ పుస్తకాన్ని విద్యార్థులచేత చదివిస్తే బాగుంటుందనిపించింది. సనాతన ధర్మానికి సంబంధించిన కనీస ప్రాధమిక పరిజ్ఞానం, పరిభాష ఇది చదివితే లభిస్తాయి. డా. రేమెళ్ల అవధానులు చేసిన ఈ కృషి అభినందనీయం.

ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పుస్తకం వెల తక్కువ, విలువ ఎక్కువ! ఇక మీ ఇష్టం.

మరిన్ని వ్యాసాలు

ఫతేపూర్ సిక్రి.
ఫతేపూర్ సిక్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Taj Mahal - Wonders of the world
తాజ్ మహల్
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మొధెరా సూర్య దేవాలయం.
మొధెరా సూర్య దేవాలయం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
హవామెహల్ .
హవామెహల్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Cine geethala rachayitrulu
సినీ గీతాల రచయిత్రులు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Social media lo nakilee profile patla apramattata
సోషల్ మీడియాలో అప్రమత్తత
- సి.హెచ్.ప్రతాప్