క్రాంతదర్శి - టీవీయస్. శాస్త్రి

Krantadarsi

కలం పట్టిన ప్రతివాడు కవి కాలేడు.తెలుగులో వ్రాయటం వచ్చినంత మాత్రాన తెలుగులో రచనలను చేయటం తేలిక అవుతుందని భావించే వారికి నాదొక సలహా! మీరు చిన్నప్పుడు చదువుకున్న 'ఆవు' వ్యాసాన్ని ,మీ సొంత భాషలో మళ్ళీ వ్రాయండి. పైన నేను చెప్పిన తరగతికి చెందినవారు ఒక నాలుగు వాక్యాలను మించి వ్రాయలేరు. అవి కూడా--ఆవు పాలిస్తుంది,గడ్డిమేస్తుంది ... ఇలాంటి వాక్యాలనే వ్రాయగలరేమో! అంతకన్నా విభిన్నంగా ఆవును గురించి వారు ఆలోచించలేరు.

వ్రాయటానికి భాషతో పరిచయం ఉన్నంత మాత్రాన సరిపోదు. భావావేశం ఉండాలి. దానిని మనం గూగుల్ నుండి మనం పొందలేము. భావుకత అనేదాన్ని మనంతట మనమే అభివృద్ధి చేసుకోవాలి! కొన్ని వందల పుస్తకాలను, మరికొన్ని వందల వ్యాసాలను వ్రాసిన రచయితలను చూస్తుంటే , వారిలో ఎంత భావుకత ఉన్నదో అనిపిస్తుంది. భావుకత లేకుండా వ్రాసేవి వాక్యాలు మాత్రమే అవుతాయి. భావుకతో వ్రాసిన ఒక్క వాక్యం కావ్యంగా ప్రసిద్ధి చెందుతుంది. మహాకవి శ్రీశ్రీ వ్రాసిన 'మహాప్రస్థానం'ఈ కోవకే చెందుతుంది.కేవలం 150 పేజీలు లేని ఒక గ్రంధం వ్రాసి మహాకవి అనిపించుకున్నాడని ఆయన మీద మిగిలిన కొంతమంది కవుల దుగ్ధ. 

పుంఖానుపుంఖాలుగా శతకోటి పుటలతో వాక్యాలను వ్రాయబడిన గ్రంధాలకు ఈ ప్రశస్తి  రాకపోవటానికి కారణం, వాటిలో భావుకత లేకపోవటమే! 'ఆత్మ' లోపించటమే!అటువంటి రచనలను వ్రాసినా,వ్రాయకపోయినా ఒకటే! కొందరు వ్రాయకపోతే ఉండలేరు.నేనుకూడా ఆ కోవకు చెందినవాడినే! వ్రాయాలన్న దాహార్తి ఎంతకాలానికీ తీరటం లేదు నాకు.అలా అని ఏదిబడితే అది వ్రాయలేను. KCR మీదో,చంద్రబాబు మీదో,సోనియా మీదో జగన్ మీదో నేను వ్రాయలేను. అసలు వారిని గురించి వ్రాయవలసిన, తెలుసుకోదగిన గొప్ప విషయాలు ఏవీ లేవని నా భావం. మరికొంతమంది, కొన్ని విషయాలను చెప్పి వాటిమీద వ్రాయమని కోరుతుంటారు. అలా అని ఏ రచయిత వ్రాయడు,వ్రాయలేడు. ఒకవేళ వ్రాసినా వాటిలో 'ఆత్మ' ఉండదు. ఆయా విషయాల మీద రచయితకు ఒక సదభిప్రాయం ఉంటేనే, సరైన రచనలు చేయగలడు. మనం కోరుకున్నవి వ్రాయలేని వాడొక రచయితా! అని మనం అనుకోవచ్చు. రచయితకు  స్వేఛ్ఛ ఉంటేనే మంచి రచనలు చేయగలడు. ఇదంతా చెబుతుంటే,నాకొక విషయం గురించి చెప్పాలనిపిస్తుంది. శ్రీ బన్ను గారు నన్ను C.P. బ్రౌన్ గారి మీద ఒక వ్యాసం వ్రాయమని కోరారు.వారు కోరిన ఒక రెండు గంటలలోనే, నేను ఆ వ్యాసాన్ని వ్రాసి,వారికి పంపటం,దానిని వారు ప్రచురించటం జరిగిపోయింది. ఆ వ్యాసానికి అనూహ్యమైన స్పందన లభించింది.దానికి కారణాలు-- C.P. బ్రౌన్ గారి మీద నాకున్న సదభిప్రాయం, అటువంటి మహానుభావుడి గురించి అంతవరకూ వ్రాయలేదనే బాధ!

ఈ రెండు కారణాల వల్లే ఆ వ్యాసాన్ని వ్రాయగలిగాను. అయితే ,వ్రాయటానికి ప్రేరణ కావాలి. అటువంటి ప్రేరణే బన్ను గారిచ్చింది. ఇదంతా ఒక ఎత్తైతే,మనం వ్రాసినదానికి న్యాయం చేసే సంపాదకులు దొరకటం గొప్ప అదృష్టం.కాకతాళీయంగా మారిన కొందరు 'సంపాద'కులు రచయితలు  పంపిన రచనలకు అంటకత్తెర వేసి ప్రచురించుతారు.ఈ మధ్య నేనొక పత్రికకు విలక్షణ గాయకుడు శ్రీ పి.బి. శ్రీనివాస్ గారిని గురించి ఒక వ్యాసం వ్రాసాను. పత్రికలో నా పేరుతప్ప మిగిలినది చాలా వరకు క్షవరం చేయబడింది.నాకు క్షవరం చేస్తే చేసారు,ఇబ్బంది లేదు --ఆ గాయకుడికి అన్యాయం చేసారని నా బాధ!ఇదే విషయాన్ని ఆ పత్రిక వారికి తెలియచేసాను. చాలామంది feedback పంపమని కోరుతారు. కొంతమంది దృష్టిలో feedback అంటే పొగడ్తలు మాత్రమే! వారి శ్రేయస్సు దృష్ట్యా మనమిచ్చే సలహాలు వారికి రుచించవు.

ప్రస్తుతం కొంతమందికి feedback ఇవ్వటం మానేసాను!వారి ఊహాలోకాల్లో వారు ఆనందంగా ఉంటే వారిని మనమెందుకు disturb చేయాలనిపించింది. మంచి రచనలను చేయాలంటే,మంచి రచనలను చదవాలి. ఈ మధ్య యండమూరి వీరేంద్రనాద్ గారు ఒక పత్రికలో వ్రాస్తూ ప్రస్తుతం ఆయన శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు వ్రాసిన 'కాశీయాత్ర' ను చదువుతున్నాని తెలియచేసారు.జీవిత పాఠశాలలో నిరంతర విద్యార్ధులుగా ఉన్నంత కాలమే,మనం మంచి రచనలను చెయ్యగలం! అన్నీ మాకు తెలుసనుకున్న నాడు మనం వ్రాసే రచనలలో 'ఆత్మ' నశించి శవమే మిగులుతుంది.అటువంటి శవాలను మోసే పత్రికలు  కూడా ఉండటం విశేషం!

వాటి అంతిమ లక్ష్యం మంచి సాహిత్యాన్ని,రచనలను పాతిపెట్టటమేమో! వ్రాస్తున్న కొద్దీ  మంచి రచయితలో నిరంతర అన్వేషణ ప్రారంభమౌతుంది. ఆ అన్వేషణే కొంతమందిని మహాకవులుగా మారుస్తుంది.ఎవరి తృప్తి కోసమో, రచయిత వ్రాయలేడు. అతని తృప్తి కోసమే వ్రాస్తాడు. నా దృష్టిలో వృత్తి రచయితలు చాలా తక్కువ,ప్రవృత్తి రచయితలే ఎక్కువమంది.రచయితలను ఆదరించి,అభిమానించే పత్రికలెంత ముఖ్యమో,ఆస్వాదించే పాఠకులూ అంతే ముఖ్యం. పాఠకుల సుస్పందనే రచయితలకు ప్రాణం,ప్రణవం!కొన్ని జీవిత వాస్తవాలకు అక్షర రూపం ఇచ్చి ,అనుభవాలతో నిండిన అనుభూతులను ముందు ముందు వ్రాయాలనిపిస్తుంది! అయితే,ఆ స్థాయికి నేనెదగాలి!
 

కలం పట్టిన ప్రతివాడూ 'చలం' కాలేడు,
ఆదర్శాలు చెప్పేవాడు అభ్యుదయవాది కాలేడు ,
ఖద్దరు తొడిగిన ప్రతివాడూ గాంధీ కాలేడు,
కళ్ళున్న ప్రతివాడూ క్రాంతదర్శి కాలేడు!