పుస్తక సమీక్ష: ప్యాసా - -సిరాశ్రీ

Pyasa Book Review

పుస్తకం: ప్యాసా
రచన: తనికెళ్ల భరణి
వెల: 100/-
ప్రతులకు:http://kinige.com/book/Pyasa

"కవిత్వం ముందా, ఛందస్సు ముందా?" అనే ప్రశ్న "కోడి ముందా, గుడ్డు ముందా?" అనే ప్రశ్నంత కష్టమైనది కాదు. కవిత్వమే ముందు అని కామన్ సెన్స్ తో చెప్పొచ్చు. నాలుగు రోజుల క్రితం భరణి గారు "ప్యాసా" అనే టైటిల్ తో ఒక రుబాయీల పుస్తకం విడుదల చేసారు. "రుబాయీ" అనగానే ఆ ఛందస్సు గురించి ఆలోచన మెదిలింది. నాలుగు పంక్తులు... అన్నీ సమ మాత్రల్లో ఉండడం. 1,2,4 పంక్తులు ఒక అంత్యప్రాస, 3 వ పంక్తి వేరే అంత్యప్రాస ఉండడం. చూస్తే అలా లేదు. తేటగీతి నడకలో సాగింది. పోనీ పూర్తిగా తేటగీతా, అంటే అదీ కాదు. పర్శియన్ రుబాయీల్లోని భావం, తేటగీతి తెలుగు నడక కలిసి కొత్త తరహాలో ఉంది. పైన చెప్పినట్టు ఛందస్సు కన్నా కవిత్వం ముందని స్ఫురించి, ఆస్వాదించడం మొదలు పెట్టాను.

ఇరానీ చాయ్ తాగుతూ ఇద్దరు తెలుగువాళ్లు ముచ్చటించుకున్నట్లు, రంజాన్ ఖీర్ తింటూ తెలుగు పద్యాలు చదువుతున్నట్టు, చార్మినార్ దగ్గర నిలబడి పెద్దబాలశిక్ష చదువుతున్నట్టు, ఒక ద్వివేణీ సంగమంలా అనిపించింది. కవిత్వం ఛందస్సు కోరల్లో పడి ఇరుక్కోకుండా సహజసిధ్ధమైన ధోరణితో కవిత్వాన్ని ప్రసవించడంతో ఒక కొత్త చదస్సుకు నాంది పలికింది ఈ "ప్యాసా". ఈ ప్రక్రియకి రుబాయి అని కాకుండా వేరే పేరు పెట్టుండాల్సింది. "భరణి గీతి" అంటే బాగుండేదేమో. ఎందుకంటే ఇందులో గానయోగ్యమైన నడక ఉంది.

ఇక కవిత్వాంశాల్లోకి వెళ్దాం.

కాల్పనిక కవిత్వం కన్నా స్వానుభవంలోంచి పుట్టే కవిత్వంలో గుండె చప్పుడు వినిపిస్తుంది. తల్లి కొట్టే దెబ్బ తినకుండా బాల్యం దాటదు, ప్రేయసి విరహం దెబ్బ తగలకుండా జీవితం దాటదు. నొప్పిలో తేడాలు ఉండొచ్చు కాని ఎవరూ విరహ గాయానికి అతీతులు కాదు. దానికి వయసుతో నిమిత్తం లేదు. స్వానుభవాలకి కాస్తంత కాల్పనిక అలంకారం తోడయ్యి ఈ "ప్యాసా" గుండెల్ని తోడుతుంది.

"నాదు లేత గులాబి గుండె కోసి
నీదు పాదాలపైన పడ...వేసినాను
కుసుమ సుకుమారమైనట్టి మనసు నీది
రేకులొకటొకటి తెంపి చంపేసినావు" అనడంలో ప్రేయసి సున్నితత్వాన్ని నిరశించలేక, ఆమె చేసిన పనిని ఆమోదించలేక ఒకానొక బరువైన భావం వ్యక్తమయ్యింది. ఇది కల్పనలో స్ఫురించే భావన కాదు.

ఇది చూడండి...అలాంటిదే.

"నీవు సౌందర్య సరోవరమ్ము సుమ్ము
నేను దాహార్తితో లోన దూకినాను
ఊపిరాడని కౌగిళ్ల నలిపివేసి
భ్రమలలో ముంచి...శవముగా తేల్చినావు". ప్రేయసి బాహ్య సౌందర్యానికి, అంతఃసౌందర్యానికి మధ్యన ఉన్న గోడ ఎలా కనపడుతూదో. .

"కళ్లు నీలాలు...చీకట్లు గమ్మివేయు
పళ్లు వజ్రాలు వెలుగులు జిమ్మి వేయు
ఏవి అధరాలొ~ పగడాలొ తెలియలేము
హృదయమొక్కటె...పరమ పాషాణమయ్యె"

ఈ చిరు పుస్తకంలో ఉన్నవి మొత్తం 26 చరణాలు మాత్రమే. ఇంతకంటే ఎక్కువ ఉదహరించడం భావ్యం కాదు. చిన్న పుస్తకం కాబట్టి 10 నిమిషాల్లో చదివేయొచ్చు. రెండో సారి చదివినప్పుడు చదివే కళ్లకు, ఆస్వాదించే గుండెకు అనుసంధానం ఏర్పడుతుంది. ఇక మూడో సారి చదివితే కళ్లు, గుండె, ఆత్మ మూడూ అనుసంధానం అవుతాయి. సున్నితత్వంతో కూడిన భావ కవిత్వం ఈ కాలంలో ఔట్ డేటెడ్. ఏదైనా హార్డ్ హిట్టింగా ఉంటే తప్ప బుర్రకెక్కని రోజులు. సినీ ప్రముఖులుగా, సినీ గ్లామర్ ఉన్న కవిగా శ్రీ తనికెళ్ల భరణి ఈ "ప్యాసా" విడుదలచేయడం మళ్ళీ కొత్త సీసాలో పాత ద్రాక్షరసంలా అనిపించింది. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్రబాబు ఈ పుస్తకాన్ని రంగులతో నింపిన తీరు అమోఘం.

షార్ట్ కట్ లో చెప్పాలంటే, ఈ పుస్తకానికి శ్రీ ప్రకాష్ రాజ్ రాసిన తొలిపలుకులు చాలు.

"ఫిర్‌వహీ షామ్... వహీ గమ్... వహీ తన్హాయీ... విరహాన్ని ఏకాంతాన్ని, హృదయాన్ని కోసిన ఆ గాయాన్ని, ఆ తీపినొప్పిని భరణి అంత ప్రేమగా ఎవరూ ప్రేమించలేదు. మనం ప్రేమించిన క్షణం గడిచిపోయిన క్షణం కాదు, తలచుకొన్నప్పుడల్లా కాలాన్ని గెలిచి, మళ్ళీమళ్ళీ బతికే క్షణం. "నువ్వు జీవించాలంటే ప్రేమలో పడిచావు" అని ప్యాసాతో నన్ను శపించాడు జీవనోన్ముఖుడు భరణి."

అదీ సంగతి.

దాహమేస్తే నీళ్లు తాగుతాం. కానీ దాహం రుచిని ఆస్వాదించగలమా? "ప్యాసా" చదివండి. ఆస్వాదిస్తారు.

-సిరాశ్రీ 

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు