
పొరుగింటి ఆండాళమ్మ ఏడువేలు ఖరీదుచేసే గద్వాలు చీరని రెండొందలకే కొన్న విషయం తెలుసుకుని, ఆశపడి, భర్త అప్పలాచారి అల్లా ఆఫీసుకెళ్ళగానే, గబగబా యూట్యూబ్ గాలించి , చౌకగా చీరలమ్మే షాపులేవో తెలుసుకొని తనూ షాపింగ్ కు బయల్దేరింది ఇరుగింటి పుల్లాయమ్మ. ఒకటి అనుకొని మూడు చీరెలు - కారు చౌకగా కొని, ' భలే ఛాన్సులే .. లకీ ఛాన్సులే .. ' అని పాడుకొంటూ సంతో షంగా బయటికొచ్చి చూస్తే, షాపు ముందు తన స్కూటీ లేదు. చెమటలు పట్టినై. చుట్టు ప్రక్కల షాపు వాళ్ళని వాకబుచేస్తే, అక్కడ వాహనాలు పార్కు చెయ్యకూడదనీ, బండిని పోలీసులు తీసుకెళ్ళారనీ, జరిమానాకట్టి తెచ్చుకోవాలనీ చెప్పారు. చేసేదిలేక ఆటో చేసుకొని కొంప చేరింది. మీటరు వంద మీద మరో పది వదిలింది. ఇంట్లోకి అడుగు పెట్టేసరికి, పదేళ్ళ చిన్న కుంక బంగారంలాంటి డిన్నర్ ప్లేట్లు పింగాణీవి ఇంచక్కా చక్కలు ముక్కలు చేసి పెట్టాడు. బండి విడిపించుకోవటానికి మళ్ళీ అటో పట్టుకొని వెళ్ళి, అక్కడింకో వెయ్యి రూపాయలు జరిమానా కట్టి హతవిధీ అంటూ ఇంటికి చేరింది నీరసంగా. ' కారుచౌకకు ఆశపడితే ఇల్లా అయిందేమిరా ' అంటూ బేరుమంది చివరికి పుల్లాయమ్మ.
***