శ్రీ స్వామి వివేకానంద - సుధారాణి మన్నె

swami vivekananda

స్వామీజీ చికాగో మహాసభ కు దేశవిదేశాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రతినిధులు అక్కడ చేరారు. వివేకానంద వారందరిలోకెల్లా చిన్నవాడు. అతను మాట్లాడే వంతు వచ్చేసరికి గుండె వేగం హెచ్చింది. అందరు సభ్యుల దగ్గరా ఉన్నట్లు ఆయన దగ్గర ముందుగా తయారు చేసిన ఉపన్యాసం లేదు. అతని ప్రసంగాన్ని చివరలో ఉంచమని అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశాడు. ఉపన్యసించడానికి ముందు గురువైన రామకృష్ణులవారినీ, మనస్పూర్తిగా ప్రార్థించాడు.

అమెరికా దేశపు ప్రియ సహోదరులారా! అని స్వామీజీ తన మృధు మధుర కంఠస్వరంతో అనగానే సభ మూడు నిమిషాలపాటు చప్పట్లతో దద్దరిల్లింది. శబ్దం ఆగిన తరువాత తన ప్రసంగాన్ని ఆరంభించాడు. అక్కడున్న ప్రతీ ప్రతినిధి స్వామీజీ ప్రసంగాన్ని ప్రశంసించారు. వార్తాపత్రికలు ఆయన వ్యాసాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. అక్కడి ప్రజలకు ఆయన ఆరాధ్యుడయ్యాడు. ఆయన మాట్లాడడానికి లేచాడంటే చాలు, చెవులు చిల్లులుపడే శబ్దంతో చప్పట్లు దద్దరిల్లేవి. కొన్ని సంస్థలు సభ జరుగుతున్నపుడు మధ్యలోనే తమ సంస్థకు ఆహ్వానించేవి. అనతి కాలంలోనే స్వామీజీకి ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. ఎక్కడికి వెళ్ళినా స్వామీజీ తన ప్రసంగంలో భారతదేశపు విలువల్ని చాలా సేపు వివరించేవాడు. చరిత్ర అయినా, సామాజిక శాస్త్రం అయినా, తత్వశాస్త్రం అయినా, సాహిత్యమైనా ఎటువంటి తడబాటు లేకుండా ఉపన్యసించేవాడు. కొత్త అవతారం, హిందూ మతాన్ని చక్కగా తెలుపగల నైపుణ్యం, వికాసవంతమైన వ్యక్తిత్వం, ఈ మూడు గుణాలతో ఆయన అందరి హృదయాలను గెలవగలిగాడు. వాదనలలో ఆయనను గెలవగలిగిన వారు లేరు. ఆయన ఆంగ్ల నైపుణ్యం అపారం. అటువంటి మనిషి యుగానికి ఒకరే పుడతారు. ఆయనను సజీవంగా చూస్తూ ఆయన బోధనలను వినడం నిజంగా మనం చేసుకున్న పుణ్యం అని ఒక పత్రిక వ్యాఖ్యానించింది.

స్వామీజీ కృషి వల్ల ఒక్క అమెరికాలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ భారతదేశం పట్ల గౌరవం ఏర్పడింది. ఆయన ఎక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినా జనం గుమికూడి ఎంతో ఓపికగా ఎదురుచూసేవారు. ఉపన్యాసం అయిపోయిన తరువాత ఆయన్ని తమ ఇళ్ళకు ఆహ్వానించి ఆదరించేవారు. ఇంగ్లాండు నుంచి కూడా ఆయనకు ఆహ్వానం లభించింది. ఆయనకు అక్కడ ఘనస్వాగతం లభించింది. వార్తాపత్రికలు ఆయనను ఘనతను, వాగ్ధాటిని శ్లాఘించాయి. ఎంతోమంది ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యులు సిస్టర్ నివేదిత గా మార్పు చెందిన మార్గరెట్ నోబుల్. తరువాత ఆమె భారతదేశానికి వచ్చి ఇక్కడే ఉండిపోవడం జరిగింది.

నాలుగు సంవత్సరాల పాటు విదేశీ పర్యటన తరువాత స్వామీజీ తిరిగి భారతదేశానికి విచ్చేశాడు. ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన కీర్తి దశదిశలా వ్యాపించిపోయింది. జనవరి 15, 1897 ఆయన కొలంబోలో దిగగానే ఆయనకు చక్రవర్తికి లభించినంత స్వాగతం లభించింది. మద్రాసుకు చేరుకొనేటప్పటికి ఆయన అభిమానులు రథం మీద లాగుతూ ఊరేగించారు. లెక్కలేనన్ని పూలమాలలు, సందేశాలు లభించాయి. ఎక్కడికి వెళ్ళినా తమ గురువు చెప్పిన సందేశాన్ని వ్యాప్తి చేశాడు. ఆయన దగ్గరకు మార్గదర్శకత్వం కోసం వచ్చేవారికి ఆధ్యాత్మిక విలువల యొక్క ప్రాధాన్యాన్ని బోధించేవాడు. వివేకానందుడు గొప్ప తాత్వికుడు. అతని ముఖ్య బోధనల ప్రకారం అద్వైత వేదంతము తత్త్వ శాస్త్రములో నే కాకుండా, సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగ పడుతుంది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో 'జీవుడే దేవుడు' అనేది అతని మంత్రముగా మారింది. 'దరిద్ర నారాయణ సేవ' (పేదవారి సేవ తో భగవంతుని సేవ) అనే పదాన్ని ప్రతిపాదించాడు. "విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్ప వారని తక్కువ వారని ఎలా అనుకుంటాము?" అనే ప్రశ్న తనకు తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్షము సమయములో కలిగే దివ్యజ్యోతి లో కలిసి పోతాయని తెలుసుకున్నాడు. అప్పుడు పుట్టే ప్రేమ నుండి, తమలోని బ్రహ్మాన్ని తెలుసుకోలేని మనుష్యులను ఆదుకునే సత్ప్రవర్తన పుడుతుంది. అందరు తనవారనుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు. వ్యక్తిగత మోక్షము పై వ్యామోహము ను కూడా వదిలివేసి, ఇతరులను బంధవిముక్తులను చెయ్యడమే మనిషికి జ్ఞానోదయము అని నమ్మిన మనిషి. రామకృష్ణా మిషన్ (రామకృష్ణా మఠము)ను "వ్యక్తి మోక్షమునకు, ప్రపంచ హితమునకు"  అనే నినాదము మీద స్థాపించాడు.

సిద్ధాంతాలు, పిడివాదాలు, సంప్రదాయాలు, దేవాలయాలు మున్నగువాటిని గురించి ఆలోచించకు. మనిషి హృదయంలో దీపిస్తూన్న ఆత్మ వస్తువుతో సరిపోల్చితే అవి ఎందుకూ కొరగావు. ఆ వస్తువే ఆధ్యాత్మిక శక్తి. మొదట ఈ శక్తిని సముపార్జించండి. ఇతర ధర్మాలను నిందించవద్దు. ప్రతి మతంలోను, ప్రతి సిద్ధాంతంలోను, ఎంతోకొంత మంచి వుంటుంది. సోదర ప్రేమ గురించి ప్రసంగాలుమాని, ఆ ప్రేమను కార్యరూపంలో ప్రదర్శించండి. త్యాగ, సాక్షాత్కారాలను పొందినవాడే ప్రపంచంలోని సర్వమతాలలోని ఏకత్వాన్ని దర్శించగలడు. వ్యర్థ వాదాలకు ఆస్కారం లేదని గ్రహింపగలడు. అపుడే మానవాళికి సహాయం చేయగలడు. వాస్తవానికి అన్ని మతాలు ఒకే సనాతన ధర్మంయొక్క అంశాలు.