నవజీవనం - బుద్ధవరవు కామేశ్వరరావు

new life

 "ఏంటమ్మా, ఇలా చీకటి పడినతర్వాత వచ్చేవు? అల్లుడు గారు రాలేదా? ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడినిగా, బైక్ వేసుకుని " ఆదుర్దాగా అడిగాడు ఉమాపతి. "ఇంక , ఆయన గురించి నన్ను ఇంక ఏమీ అడక్కండి నాన్నా. ఆయన రారు. దయచేసి, మీరు కూడా ఆయనకు ఫోన్ చేసి, నా గురించి ఏమీ అడక్కండి. ఇప్పటికే నా బుర్ర పాడైపోయింది" ఉక్రోషంగా చెప్పింది ఉష. "సరేనమ్మా ! ఏమీ ఆలోచించకుండా పడుకో, తీరిగ్గా పొద్దున్న మాట్లాడు కుందాం" అంటూ కూతురికి సర్దిచెప్పి గదిలోకి పంపించాడు ఉమాపతి. పక్కనే ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కూకట్ పల్లి నుంచి ఇంత రాత్రి వేళ తమ కూతురు ఎందుకు వచ్చేసినట్టు చెప్మా? సుందరం, ఇదీ ఏమైనా గొడవపడ్డారా అని ఆలోచిస్తూ, ఆ రాత్రంతా జాగరం చేసాడు ఉమాపతి. ***** ***** ***** ****** "ఏరా సుందరం! కారణం చెప్పకుండా, ఉన్నపళంగా రాత్రికి రాత్రి బయలుదేరి రమ్మన్నావు? అసలు ఏం జరిగింది? ఔనూ, కోడలు పిల్ల ఉష కనబడదేం?" ఏదో అనుమానం వచ్చి అడిగింది, రాత్రి ఊరు నుంచి బయలుదేరి, రాత్రంతా ప్రయాణం చేసి, ఉదయమే కూకట్ పల్లిలో ఉన్న కొడుకు ఇంటికి వచ్చిన సుధ. "రాత్రి నాతో గొడవ పడి, ఇంక జన్మలో తిరిగి రానని చెప్పి, అది వాళ్ళ పుట్టింటికి పోయింది" కోపంగా చెప్పాడు సుందరం. "అయ్యో అయ్యో , పెళ్లి అయ్యి ఆరు నెలలు కాలేదు. అప్పుడే విడిపోవడం ఏమిట్రా? అసలు ఏం జరిగిందో చెప్పి తగలడు" విసుగ్గా అడిగింది సుధ. "అది మొదటి నుంచి అంతేనమ్మా. కాపురం పెట్టిన మొదటి రోజుల్లో ఓ సారి స్కూటర్ మీద సినిమాకి వెళ్లాము. ఈలోగా ఎదురుగా మా ఆఫీసులో పనిచేస్తున్న అమ్మాయి కనబడింది. ఆ అమ్మాయిని చూసి చేయి ఊపడంలో, స్కూటర్ బేలన్స్ తప్పి కిందపడి పోయాము. అంతే ఇంక అప్పటినుండి నేను అమ్మాయిలు అంటే పడిచస్తానని రోజూ సాధించడమే. ఆఖరికి పనిఅమ్మాయిని కూడా మాన్పించేసింది" "అంతే కదా ! ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా పోట్లాట పెట్టుకుంటార్రా ఎవరైనా? సరదాగా తీసుకోవాలి కానీ. సరేకానీ నిన్న రాత్రి ఏం జరిగిందో అది చెప్పి చావు" అంటూ కసురుకుంది సుధ. "నిన్న రాత్రి దోసెలు వేసిందమ్మా! అవి సరిగ్గా రాకపోవడంతో, మా ఆఫీసు టైపిస్ట్ రాధ గారు దగ్గర ఓ రెండు రోజులు ట్రైనింగ్ తీసుకో, ఆవిడ ఎంత చక్కగా వేస్తారో దోసెలు అన్నా అంతే. కోపంగా బట్టలు సర్దుకుని వాళ్ళ పుట్టింటికి మియాపూర్ వెళ్లి పోయింది" "అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటా వురా?" "నేను నిన్ననే చిన్నమావయ్య కి ఫోన్ చెసా ! ఓ నాలుగు రోజుల్లో రమ్మని?" "ఎందుకు? కొంపతీసి వాడి కూతుర్ని చేసుకుంటావా ఏమిటి?" "కాదు. చిన్న మావయ్య లాయర్ కదా! విడాకులకు అప్లై చేద్దామని" "రామ రామ. ఆవేం అప్రాచ్యపు మాటలురా అంట్లవెధవా?" అంటూ చెవులు మూసుకుంది సుధ. ***** ***** ***** ***** సుందరం ఆఫీసుకు వెళ్లగానే, వియ్యంకుడు ఉమాపతికి ఫోన్ చేసి, జరిగిన విషయం అంతా చెప్పి, "సరేకానీ, అన్నయ్య గారూ! ఇంతకీ ఈ విషయం గురించి మీ అమ్మాయి ఏం చెప్పింది?" ఆత్రంగా అడిగింది సుధ. "ఇవే కారణాలు చెప్పిందమ్మా. కానీ ఒకటే తేడా! మీ అబ్బాయి లాయర్ని రమ్మన్నాడు. మా అమ్మాయి ఈ పెళ్లి కుదిర్చి, వివాహం జరిపించిన పేరన్న పంతులు గారిని రమ్మంది" చెప్పాడు ఉమాపతి. "ఇలాంటి చిన్న చిన్న గొడవలకే విడిపోవడం ఏమిటండీ విడ్డూరంగా! ఆ లెక్కన, మీ బావగారిని పాపం ఆయన చనిపోయే వరకూ ఇలాగే సాధిస్తూనే ఉండేదాన్ని. అలాగని విడిపోయామా? ముఫై ఏళ్లు సంసారం చేయలేదూ?" జీవితసత్యం చెప్పింది సుధ. "ఔనమ్మా! నేనూ ఇలాగే మీ ఒదినని, అది చనిపోయేవరకూ ఏదో వంకన అలా పీడిస్తూనే ఉండేవాడిని. ఇప్పుడు అనిపిస్తోంది, పాపం అప్పుడు ఎంత బాధపడి ఉంటుందో అని. మీరన్నట్టు ఈ తరం వాళ్లకి ఓపిక తక్కువ. ఉత్సాహం ఎక్కువ" చెప్పాడు ఉమాపతి. "సరే అన్నయ్య గారూ! ఈ నాలుగు రోజులు ఊరుకుందాం. ఆ తరువాత నేను మా కోడలుకి నచ్చచెప్పుకుంటాను. మీరు మీ అల్లుడుకి హితబోధ చేయండి" "అలాగేనమ్మా,అంతా మంచే జరుగుతుంది. కంగారు పడకండి" అంటూ ఫోన్ పెట్టేసాడు ఉమాపతి. ***** ***** ***** ***** నాలుగు రోజుల తర్వాత వచ్చిన సుధ తమ్ముడు లాయర్ విశ్వనాథంతో మాట్లాడుతున్నారు సుధ మరియు సుందరం. ఈలోగా టీవీఒన్ ఛానల్లో, "ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో, ఏదో ఆలోచిస్తూ షాపు నుంచి బయటకు వచ్చిన ఒక యువతి చూసుకోకుండా రోడ్డు దాటడంతో పక్క నుంచి వస్తున్న బస్ కింద పడింది. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను జనజీవన్ ఆసుపత్రిలో చేర్పించారు. యువతి మియాపూర్ కు చెందినదిగా భావిస్తున్నారు". వార్త చూసిన వెంటనే, "అమ్మా! ఆ అమ్మాయి ఉష. అనుమానం లేదు. తను షాపింగ్ కు అక్కడకే వెళ్తుంది. పాపం నా గురించే ఆలోచిస్తూ వెళ్లి బస్సు కింద పడిపోయి ఉంటుంది. నేను వెళ్తున్నాను. మీరు వెనకాల రండి" అన్నాడు హడావుడిగా సుందరం. "ఇంకేం కాగల కార్యం గంధర్వులు తీర్చేరన్నమాట"అన్నాడు విశ్వనాధం. "మావయ్యా! ఇలాంటి పరిస్థితుల్లో అవేం మాటలు మావయ్యా!" అంటూ అక్కడనుండి వేగంగా కదిలాడు సుందరం. "పిచ్చి వెధవ,ఏదీ తట్టుకోలేడు. సరేరా! ఈలోగా వంటిల్లు సర్దుకుని వస్తా. ఓ అరగంటలో బయలుదేరుదాం" తమ్ముడితో చెప్పి పనిలో పడింది సుధ. ***** ***** ***** ***** సరిగ్గా అదే సమయానికి, టీవీ టూ ఛానల్లో వార్తలు చూస్తూ మాట్లాడు కుంటున్నారు ఉమాపతి, పేరన్న పంతులు, ఉషలు. ఈ లోగా, ఆ ఛానల్లో "ఇప్పుడే అందిన వార్త. కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం. అన్యమనస్కంగా స్కూటర్ నడుపుతున్న కూకట్ పల్లి కి చెందిన ఓ యువకుడిని వెనకనుంచి వచ్చిన ఓ లారీ గుద్దుకోవడంతో, తీవ్రగాయల వలన విషమ పరిస్థితుల్లో ఉన్న అతడిని సుఖజీవన్ ఆసుపత్రిలో చేర్చారు. వివరాలు తెలియాల్సి ఉంది". ఈ వార్తను చూసిన ఉష, "నాన్నా! ఆ వ్యక్తి ఆయనే అయ్యుంటారు. ఆయన ఆఫీస్ నుంచి రోజూ అదే మార్గంలో వస్తారు. బహుశా పాపం, నా గురించే ఆలోచిస్తూ స్కూటర్ నడుపుతున్నట్టు న్నారు. నేను వెళ్తున్నాను. మీరు వెనకాల రండి" హడావుడిగా చెప్పింది ఉష. "నువ్వెందుకమ్మా వెళ్లడం. అతనికి తగిన శాస్తి జరిగింది. మనకు అడ్డు తొలగింది. వచ్చే సంవత్సరం..." అంటూ ఏదో చెప్పబోతున్న పేరన్న గారితో, "పంతులు గారూ, ఏమిటా పిచ్చి కూతలు. నాన్నా ముగ్గురం వెళ్లకూడదు కాబట్టి, నేను ముందు వెళ్తాను. మీరు వెనకాల రండి" అని చెప్పి రాకెట్ లా దూసుకుపోయిన ఉషని చూసి "ఔరా! ఏమి ఈ మార్పు?" అంటూ అయోమయంగా, తెల్లబోయి చూసారు ఉమాపతి, పేరన్నలు. ***** ***** ***** ***** ఓ అరగంట తరువాత, ఛానెల్ త్రీ టీవీలో.. "బిగ్ బ్రేకింగ్ న్యూస్. వై జంక్షన్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో, ఓ జంట గాయాలు పాలయ్యారు. వీరిద్దరూ ఎదురెదురుగా ఉన్న జనజీవన్ , సుఖజీవన్ ఆసుపత్రుల నుంచి బయటకు వచ్చి కలుసుకుంటున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వీరిరువురూ భార్యాభర్తలుగా తెలుస్తోంది. వీరిని ప్రాధమిక చికిత్స కోసం దగ్గరలో ఉన్న నవజీవన్ ఆసుపత్రిలో చేర్పించారు. మిగతా వివరాలు కొద్ది సేపట్లో.." అనుకోకుండా అదే టీవీ చూస్తున్న మియాపూర్ లోని ఉమాపతి, పేరన్న పంతులు, కూకట్ పల్లి లోని సుధ, విశ్వనాధం లు "వాళ్లు మనవాళ్లేనర్రోయ్" అంటూ బయటకు పరుగులెత్తారు జంధ్యాల వారి సినిమాల్లో క్లైమాక్స్ సీన్ లో పరుగులెత్తే పాత్రధారులలాగ. ***** ***** ***** ***** "అసలేం జరిగింది, మీరిద్దరూ భార్యా భర్తలేనా?" అడిగింది ఆసుపత్రి నర్సు, పక్క పక్కనే ఉన్న బెడ్స్ మీద ఉన్న సుందరం, ఉషలకు ఇంజక్షన్ చేస్తూ. "ఇందాకా వచ్చిన టీవీ వార్తలు చూసి, ఆ ప్రమాదంలో గాయపడింది నేను అని ఆయన, అలాగే ఇంకో ప్రమాదంలో గాయపడింది ఆయనే అని నేను అనుకుని ఆదుర్దాగా ఎదురెదురుగా ఉన్న ఆసుపత్రులకు వచ్చాం. తర్వాత కాదు అని తెలుసుకొని ఆనందంగా బయటకు వచ్చేము. అంతే ఒకరినొకరు చూసుకుని ఆనందం పట్టలేక దగ్గరకు వద్దామనుకున్న సమయంలో ఓ కారు గుద్దేసింది" జరిగింది చెప్పింది ఉష. "సరే అసలు ఆ ఆసుపత్రులకు విడివిడిగా ఎందుకు వెళ్లారు?" అడిగింది నర్సు రాజ్యం. మొత్తం ఈ ఆరు నెలలుగా జరిగిన విషయాలు చెప్పాడు సుందరం, సిగ్గుపడుతూ. "బాగానే వుంది, ఇలాంటి చిన్న విషయాలను ఇంత సీరియస్ గా తీసుకుంటారా? ఎవరైనా?" ఆశ్చర్యంగా అడిగింది రాజ్యం. "పేషెంట్లతో ఆ కబుర్లేంటి? డ్యూటీ అయిపోయింది కదా! ఇంటికి వెళ్లు. పిల్లలు ఎదురు చూస్తున్నారు నీకోసం" అంటూ రాజ్యం మీద కేకలు వేస్తున్నాడు అప్పుడే డ్యూటీకి వచ్చిన కాంపౌండర్ వెంకట్రావు. "ఏం లేదు మావా! వీళ్ళ కథ వింటున్నా" అంటూ తను విన్న కథ మొత్తం చెప్పింది రాజ్యం. "ఔనా! చూడండి బాబూ! భార్యాభర్తలు బియ్యం, నీళ్లు లాంటి వారు. రెండూ సమపాళ్లలో ఉంటేనే అన్నం బాగుంటుంది. అలాగే మనం కూడా మన హద్దుల్లో ఉంటేనే జీవితం బాగుంటుంది. అలాగే మనం ఉత్తి అన్నం తినలేము కదా? చప్పగా ఉంటుంది కాబట్టి రుచి కోసం ఏదో కూరో, పులుసో కొంచెం ఎలా వేసుకుంటామో, అలాగే ఈ అలకలు, చిరుకోపాలు లాంటివి లేకపోతే మన జీవితం కూడా చప్పగానే ఉంటుంది. అందుకే వాటిని సీరియస్ గా తీసుకోకుండా, రెండు రోజుల తర్వాత ఎవరో ఒకరు తగ్గాలి........" చెబుతున్నాడు వెంకట్రావు. "ఏమండీ, మీరు ఈ కాంపౌండర్ కాక ముందు కేటరింగ్ చేసేవారా?" అనుమానంగా అడిగింది ఉష. "లేదమ్మా! మా మావగారు అంటే ఈ రాజ్యం వాళ్ల నాన్న ఆ పనిచేసేవాడు. ఇలాంటి వన్నీ ఆయనే చెప్పేవాడు. నేను ఆయన వద్ద సహాయకుడుగా ఉండేవాడిని. అప్పుడే ఈ రాక్షసి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇరవై ఏళ్ళ నుంచి మేము తగువులాడుకోని రోజు లేదంటే నమ్ముతారా?" అని చెప్పి, "ఇంకా ఏం చూస్తావ్ సినిమా? అటూఇటూ దిక్కులు చూడకుండా ఇంటికి వెళ్లు" రాజ్యానికి చెప్పాడు భర్త వెంకట్రావు. "ఒట్టి అనుమానపు పురుగు అమ్మా! అందరూ నన్ను సిస్టర్ అని పిలుస్తారని, కావాలనే నాకు ఈ నర్సు ట్రైనింగ్ ఇప్పించాడు" భర్తను ఉడికిస్తూ చెప్పింది రాజ్యం. "ఔను. నువ్వు అంతేగా! అందరూ నన్ను అన్నా అని పిలుస్తారనేగా ఇక్కడ కాంపౌండర్ గా ఉద్యోగం ఇప్పించావు" రాజ్యాన్ని దెప్పిపొడిచాడు వెంకట్రావు. "సర్లే! నే వెళ్తున్నా కానీ, ఆ అమ్మాయితో ఎక్కువ మాట్లాడకు...ఆ సుందరంగారికి అనుమానం వస్తుంది" అంటూ ఉష వంక చూస్తూ చెప్పింది రాజ్యం. ***** ***** ***** ***** "ఇదిగో, పిల్లలూ! ఆ వెంకట్రావు రాజ్యాల కథ విన్నారు కాబట్టి, మేము వాళ్లకంటే సీనియర్లం. మీరు వింటానంటే మా కథ కూడా చెబుతాను" అన్నారు ఓ పేషెంట్ బెడ్ పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్న ఓ డెబ్భై ఏళ్ల తాతగారు, బోడిగుండు తడుముకుంటూ. "అయ్యో, వింటాం చెప్పండి తాతగారూ" అన్నారు ఉష సుందరాలు ముక్తకంఠంతో. "చూడు బాబూ! ఈవిడ మా ఆవిడ. మా ఏభై ఏళ్ల సంసార జీవితంలో మేము కొట్టుకోకుండా‌, తిట్టుకోకుండా ఒక్క రోజు కూడా లేము. అలాగని ఇలాంటి చిన్న చిన్న గొడవలకే విడిపోదామని ఎప్పుడూ అనుకోలేదు. హాయిగా మనవళ్ల వివాహాలు కూడా చూసేము. అంతెందుకు నిన్న ఉదయం సాంబారులో ఉప్పు ఎక్కవయ్యింది. నేను ఊరుకోకుండా," ఆ పక్కింటి మణెమ్మ గారు చూడు సాంబారు ఎంత బాగా చేస్తారో" అన్నా. వెంటనే, "ఆ సాంబార్ ఆవిడ ఇచ్చిందే" అంటూ అప్పడాలకర్రతో గుండుమీద రెండు బాదింది" అన్నారు గుండుమీద ఉన్న బుడిపెను తడుముకుంటూ. "అయ్యో,అలాగా! ఔనూ? మరి రెండు బుడిపెలు ఉండాలి కదా? ఒకటే ఉందేమిటి? అయినా కానీ బెడ్ మీద ఉండాల్సింది మీరు కదా? ఆవిడ ఉన్నారేమిటీ?" ఆశ్చర్యంగా అడిగింది ఉష. "అది నేను చెబుతానమ్మా! ఆయన అలా అనగానే, పాపిష్టి దాన్ని అప్పడాలకర్రతో ఆయనను కొట్టడానికి వచ్చేను. ఒకటి గురి తప్పలేదు కానీ, రెండవ దెబ్బనుంచి తప్పించుకోవడానికి ఆయన పరుగు పెట్టారు. నేను కూడా ఆయన వెంటబడడంలో చూసుకోకుండా అరటి తొక్క మీద కాలు వేసా. ఇదిగో కాలు విరిగింది. కట్టు వేసారు" అని మంగళసూత్రం కళ్లకు అద్దుకుంటూ చెప్పారు మామ్మగారు. "ఏమనుకోకోయ్ సుందరం, ఈ కాలం పిల్లలకు బొర్ర మీద ఉన్న శ్రద్ధ బుర్రమీద లేదోయ్. ఆ మానసిక పరిపక్వత లేకపోవడం వల్లనే చిన్న చిన్న విషయాలకే విడాకులు, ఆత్మహత్యలు దాకా పోతున్నారు. మరి మా చిన్న తనంలో ఇంతంత చదువులు లేవు కానీ మాకు ధైర్యంగా ఉండడం ఎలాగో నేర్పారు. అందుకే మా కాలంలో విడాకులు, ఆత్మహత్యలు అంటే ఏమిటో ఎరగము" అన్నారు తాతగారు. తాతగారు, బామ్మగారు చెప్పిన మాటలు విని, నవ్వుకుంటూ ఒకరి చేతి నొకరు ఆప్యాయంగా నొక్కుకున్నారు ఉష‌, సుందరం దంపతులు. గుమ్మం వద్ద నిలబడి, ఈ సంభాషణలు అన్నీ విని, నవ్వకుంటూ లోపలికి వచ్చేరు సుధ, విశ్వనాధం, పేరన్న, ఉమాపతి. "ఇంతకీ మా అవసరం ఉందా? లేకపోతే వెళ్లి పొమ్మంటారా?" ముక్తకంఠంతో అడిగారు లాయర్ విశ్వనాధం, పేరన్న పంతులు. "అవసరం లేదు. మీరిక వెళ్లవచ్చు" అన్నాడు సుందరం నవ్వుతూ. "నో...పంతులు గారూ మీరు ఉండండి" గట్టిగా అరిచింది ఉష. "ఏమిటి ఉషా? అప్పుడే మొదలెట్టేసావ్? ఎడ్డెమంటే తెడ్డెమని. ఇప్పుడు ఆయన ఎందుకు?" ఉడికిపోతూ అడిగాడు సుందరం. "ఎందుకంటే, కొన్ని నెలల్లో పుట్టబోయే మన బిడ్డకు నామకరణం చేయవలసింది ఆయనేగామరి" సుందరం వంక చూస్తూ సిగ్గు పడుతూ చెప్పింది ఉష. "ఇంకేం మరి శుభం. ఈ ఆసుపత్రి సాక్షిగా ఈ రోజు నుంచి పాత విషయాలు మరచి పోయి, నవజీవనం సాగించండి" అన్నారు పేరన్న పంతులు. "ఔనౌను. ఇంక అలకలు మానేసి, పుట్టబోయే బిడ్డకు గిలకలు కొనడం గురించి ఆలోచించండి" అన్నాడు కేసుల కంటే ప్రాశలు అంటే ఇష్టపడే విశ్వనాధం. "హేమిటో, ఆ బ్రహ్మ దేవుడు లీలలు. ఎప్పుడు గీతలు గీస్తాడో తెలియదు. ఎప్పుడు రాతలు రాస్తాడో తేలియదు" అనుకుంటూ ఓ చేత్తో తలమీద బుడిపెను, ఇంకో చేత్తో భార్య కాలును రాసుకుంటూ గొణుక్కున్నారు తాతగారు. ***** ** *శుభం* ** *****

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు